ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 వేదికగా అత్యాధునిక సాంకేతిక రంగాలలో ఫిన్లాండ్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణ
ప్రపంచ భాగస్వాములతో కలిసి ఫిన్లాండ్, భారత్ దేశాలు దృఢత్వం కలిగిన సుస్థిర, మానవ కేంద్రిత సాంకేతిక పురోగతికి నాయకత్వం వహించగలవు: ఫిన్లాండ్ ప్రధాన మంత్రి పెటెరి ఓర్పో
డీప్-టెక్ పరిష్కారాల ఉమ్మడి ఆవిష్కరణలకు, వాటిని ప్రపంచవ్యాప్తంగా
అమలు చేయడానికి బలమైన పునాదిని అందిస్తున్న ఫిన్లాండ్-భారత్ దేశాల సమన్వయం
ఉమ్మడి నిబద్ధత, వాస్తవ ప్రపంచంపై చూపే ప్రభావం, దృఢత్వం కలిగిన
స్వయంప్రతిపత్తి గల డీప్-టెక్ సామర్థ్యాలపై దృష్టి సారించిన సదస్సు
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 3:29PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో నిర్వహించిన ‘సుస్థిర భవిష్యత్తు కోసం స్వయంప్రతిపత్తి గల డీప్ టెక్ నిర్మాణం’ అనే సెషన్.. కృత్రిమ మేధ, అంతరిక్ష రంగం, క్వాంటం కంప్యూటింగ్, తదుపరి తరం డిజిటల్ నెట్‌వర్క్‌లు వంటి అత్యాధునిక సాంకేతిక రంగాలలో ఫిన్లాండ్, భారత్ మధ్య విస్తరిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రధానంగా తెలియజేసింది. భారతదేశపు విస్తృత స్థాయి, నైపుణ్యాలు, అప్లికేషన్ వ్యవస్థతో పరిశోధన, ఇంజనీరింగ్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌లో ఫిన్లాండ్‌కు ఉన్న నైపుణ్యం తోడైతే డీప్-టెక్ పరిష్కారాల ఉమ్మడి ఆవిష్కరణలు, వాటిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడానికి ఒక బలమైన పునాది లభిస్తుందని ఈ చర్చ పేర్కొంది.
శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయడం.. వాటిని వాణిజ్యపరమైన, సామాజిక ఫలితాలుగా మార్చడంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనా మౌలిక సదుపాయాలు, బహిరంగ ఇన్నోవేషన్ ఫ్రేమ్‌వర్క్‌ల పాత్రను వక్తలు ప్రధానంగా చెప్పారు. సాంకేతిక సార్వభౌమాధికారాన్ని సుస్థిర అభివృద్ధి, చక్రీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పరిష్కారాలు, వాతావరణ చర్యలు, మానవ-కేంద్రిత డిజైన్‌తో ఈ చర్చ అనుసంధానించింది. దీర్ఘకాలిక దృఢత్వానికి అంతరిక్ష సాంకేతికతలు, అధునాతన అనుసంధానత, హైబ్రిడ్ కంప్యూటింగ్ అత్యంత కీలకమైన అంశాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఫిన్లాండ్ ప్రధాన మంత్రి పెటెరీ ఓర్పో మాట్లాడుతూ.. కంప్యూటింగ్ పవర్ కోసం డిమాండ్ పెరుగుతున్న కొద్దీ అటు విద్యాసంస్థలు, ఇటు వ్యాపార సంస్థలు రెండింటికీ సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యం అందుబాటులో ఉండేలా చూడటం చాలా కీలకమని పేర్కొన్నారు. ఫిన్లాండ్లో ఏఐ పరిశోధన, అప్లికేషన్లను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పెట్టుబడులు ఏకమవుతున్నాయని ఆయన చెప్పారు. ఫిన్లాండ్ ఆవిష్కరణా వ్యవస్థ దశాబ్దాలుగా ఉన్న బలమైన ప్రభుత్వ-ప్రైవేట్ విధానం, సహకారంపై నిర్మితమైందని ఆయన వెల్లడించారు. సుస్థిర, దృఢత్వం కలిగిన సాంకేతిక భవిష్యత్తును నిర్మించడానికి మనం మొత్తం విలువ గొలుసులు, వాటి సామాజిక ప్రభావాన్ని అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. వినూత్నమైన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సుస్థిర అభివృద్ధిని ఏఐ వేగవంతం చేయగలదని అన్నారు. ఇది చక్రీయ ఆర్థికవ్యవస్థకు సంబంధించిన పరిష్కారాలను ప్రోత్సహిస్తుందని.. వాతావరణ మార్పులు, కాలుష్యం, జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడంలో సహాయపడుతుందని.. తద్వారా అందరి సంక్షేమాన్ని మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ఫిన్లాండ్, భారత్.. దృఢత్వం, సుస్థిరత, మానవ-కేంద్రిత సాంకేతిక పురోగతిలో ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలుస్తాయని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.
నేటి ప్రపంచంలో దృఢత్వం కలిగిన సాంకేతికతను తయారుచేయటం అనేది మానవ-కేంద్రిత ఆవిష్కరణలు, బలమైన నైపుణ్యాలు, బాధ్యతాయుతమైన పరిపాలన కలిగిన వ్యక్తులతోనే ప్రారంభమవుతుందని ఫిన్లాండ్ పార్లమెంట్ సభ్యుడు టిమో హరక్కా అన్నారు. సాంకేతికత అనేది నమ్మదగినదిగా, నైతిక విలువలతో కూడినదిగా సమాజ ప్రయోజనం కోసం రూపొందించబడాలనే ఉమ్మడి దార్శనికతను భారత్, ఫిన్లాండ్లు పంచుకుంటున్నాయని ఆయన చెప్పారు. కృత్రిమ మేధ, అంతరిక్ష వ్యవస్థల నుంచి తదుపరి తరం అనుసంధానత, క్వాంటం సాంకేతికతల వరకు మనం ఓపెన్ స్టాండర్డ్స్, సురక్షితమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సహకారంపై పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే పోటీతత్వం, దృఢత్వం పెరుగుతాయన్న విషయాన్ని భారత్-ఫిన్లాండ్ భాగస్వామ్యం నిరూపిస్తోందని ఆయన అన్నారు. నిజమైన సాంకేతిక సార్వభౌమాధికారం అంటే ఒంటరిగా ఉండటం కాదని.. ప్రజలు, పృథ్వీ, పురోగతిని ఆవిష్కరణల కేంద్రంగా ఉంచి నమ్మకమైన భాగస్వాములతో కలిసి పనిచేయడమేనని ఆయన పేర్కొన్నారు.
ఈ సదస్సులో ఫిన్నిష్ ఇన్నోవేషన్ ఫండ్ సిత్రా అధ్యక్షులు అట్టే జాస్కెలాఇనెన్, రీఆర్బిట్ సీఈఓ - వ్యవస్థాపకులు సేతు సవేద సువనమ్, ఇన్ఫోసిస్ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏవీపీ- ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్ట్ మంజునాథ కుక్కురు, నోకియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్స్ అండ్ ఎకోసిస్టమ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాసి తోయ్వనెన్, సీఎస్సీ ఐటీ సెంటర్ ఫర్ సైన్స్‌కు చెందిన రీసెర్చ్ ఆర్గనైజేషన్ కొలాబరేషన్ అండ్ అకాడమిక్ పార్టనర్‌షిప్స్ డైరెక్టర్ మారి వాల్స్ పాల్గొన్నారు.
అంతర్జాతీయ సహకారం ద్వారా బహిరంగ, సురక్షిత, నమ్మదగిన సాంకేతిక వ్యవస్థలను నిర్మించాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ సెషన్ ప్రతిబింబించింది. పరిశోధనలను వాస్తవ ప్రపంచంలో ప్రభావం చూపే పరిష్కారాలుగా మార్చడం.. స్వయంప్రతిపత్తి, సుస్థిరమైన డీప్-టెక్ సామర్థ్యాల ద్వారా దీర్ఘకాలిక దృఢత్వాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.
(రిలీజ్ ఐడి: 2230007)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6