రక్షణ మంత్రిత్వ శాఖ
కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేసిన హెచ్-125 లైట్ యుటిలిటీ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని, ఫ్రెంచ్ అధ్యక్షుడు
భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో హెచ్-125 ఫైనల్ అసెంబ్లీ లైన్ కీలకమైన మైలు రాయి: రక్షణ మంత్రి
‘‘పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాల ద్వారా క్లిష్టమైన సాంకేతికత, అత్యాధునిక ఉత్పత్తులను తయారు చేయడంలో స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 10:16PM by PIB Hyderabad
ఎయిర్‌బస్ హెచ్-125 లైట్ యుటిలిటీ హెలికాప్టర్‌కి సంబంధించిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తుది అసెంబ్లీ లైన్‌ను 2026 ఫిబ్రవరి 17న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ముంబయి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇది కర్ణాటకలోని వేమగల్ వద్ద ఉంది. రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఫ్రెంచ్ సైనిక, మాజీ సైనిక ఉద్యోగుల వ్యవహారాల మంత్రి క్యాథరిన్ వౌట్రిన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కేఆర్ నాయుడు, కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి డాక్టర్ ఎంబీ పాటిల్ ఫైనల్ అసెంబ్లీ లైన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఓ మైలురాయిగా హెచ్-125 హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ‘‘ఫ్రాన్స్‌తో మా సహకారం అపరిమితమైనది. పరస్పర ప్రయోజనకరమైన మా భాగస్వామ్యానికి ఆకాశం కూడా హద్దు కాబోదు" అని ఆయన అన్నారు. భారత్‌లో సీ-295 రవాణా విమానాల తయారీ ఒప్పందం అనంతరం, హెచ్-125 కార్యక్రమం చేపట్టిన టీఏఎస్ఎల్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ సంస్థలను ఆయన అభినందించారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి తోడ్పడేలా, అంతర్జాతీయ పరికరాల తయారీ సంస్థలతో కలసి భారత్ పనిచేయగలదని చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.


2014 నుంచి భారతదేశ ఆర్థిక విధానానికి మూలాధారాలుగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఉన్నాయని రక్షణ మంత్రి వివరించారు. మిత్ర దేశాలతో పరస్పర ప్రయోజనాలను అందించే భాగస్వామ్యాల ద్వారా క్లిష్టమైన సాంకేతికతల్లో స్వయం సమృద్ధిని సాధించడంలోనూ, అత్యాధునిక ఉత్పత్తులను, పరికరాలను తయారు చేయడంలోనూ ప్రధానమంత్రి మోదీ సారథ్యంలోని ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తుందన్నారు.

హెచ్-125 కార్యక్రమానికి రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేసినట్లు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అలాగే దీని ద్వారా నైపుణ్యాలున్న యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో అసాధారణమైన విశ్వసనీయత, బహుళ ప్రయోజనాలు, అత్యుత్తమమైన పనితీరుకు హెచ్-125 హెలికాప్టర్లు పేరుగాంచాయన్నారు. "ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన, విశ్వసనీయమైన సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్లలో హెచ్-125 ఒకటి అని నిరూపితమైంది" అని ఆయన తెలియజేశారు.
దశాబ్దానికి పైగా కాలం నుంచి పెట్టుబడి నిబంధనల సరళీకరణతో పాటు.. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం లాంటి అనేక పథకాల ద్వారా కీలక రంగాల్లో మూలధన పెట్టుబడులతో పారిశ్రామిక ప్రగతి పథంలో భారత్ వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటును అందించడం, అంకుర సంస్థల వ్యవస్థను బలోపేతం చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలియజేశారు. ‘‘సమగ్ర పారిశ్రామిక అభివృద్ధిని సాధించడమే మా లక్ష్యం. ఇది మన దేశీయ అవసరాలను మాత్రమే కాకుండా, ఇతర దేశాల అవసరాలను కూడా తీరుస్తుంది’’ అని ఆయన అన్నారు.

ఆయుధ పరిశ్రమలను కార్పొరేట్ చేయడం, ఉదారవాద పెట్టుబడి పథకాలు, రక్షణ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో సహా రక్షణ పారిశ్రామిక వ్యవస్థలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన సంస్కరణల గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు. భారత రక్షణ ఉత్పత్తి గతంలో ఎక్కువగా ప్రభుత్వ రంగంపైనే ఆధారపడి ఉండేదని ఆయన అన్నారు. దీనికి భారీ పెట్టుబడి, దీర్ఘ కాలం ఎదురు చూడాల్సి రావడం తదితర కారణాలున్నాయని తెలిపారు. ఫలితంగా, ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రైవేట్ రంగం వాటా ఆశించిన స్థాయిలో ఉండేది కాదని వివరించారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుతం రక్షణ ఉత్పత్తిలో ప్రైవేట్ రంగం వాటా దాదాపు నాలుగో వంతుకు చేరుకుందని, రక్షణ ఎగుమతులు కూడా అనేక రెట్లు పెరిగాయన్నారు. ఇవి రక్షణ ఎగుమతుల్లో అగ్రగామి దేశాల సరసన భారత్‌ను నిలబెట్టాయని వివరించారు.
ఈ వృద్ధి మార్గం ఎంఎస్ఎంఈలకు, అనుబంధ రంగాలకు భారీ ప్రోత్సాహాన్ని అందించిందని, ప్రస్తుతం వీటి సంఖ్య 16,000 దాటిందని రక్షణ మంత్రి తెలిపారు. అలాగే భారతీయ ఎంఎస్ఎంఈల నుంచి విడి భాగాలను అనేక విదేశీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయని వెల్లడించారు. అర్థవంతమైన సాంకేతిక బదిలీ, ఇతర దేశాల భద్రతా అవసరాలను తీర్చేందుకు అత్యాధునిక పరిష్కారాలను అందించడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కంపెనీలను ఆయన ఆహ్వానించారు.
చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) శ్రీ సంజీవ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎత్తయిన ప్రాంతాల్లో చేపట్టే కీలకమైన కార్యకలాపాల్లో బహుళ ప్రయోజనాలు అందించేలా హెచ్125ఎంను రూపొందించారు. తక్కువ శబ్ధం, ఉష్ణ సంకేతాలను ఉపయోగించుకొని వ్యూహాత్మక అన్వేషణ, నిఘా అందించేలా దీనిని రూపొందించారు. ఇది ఎత్తయిన ప్రాంతాలకు రవాణా చేస్తుంది. మారుమూల సరిహద్దు అవుట్‌పోస్టులకు అవసరమైన వస్తువులను చేరవేస్తుంది. శోధన, రక్షణ, వైద్య తరలింపు కార్యకలాపాల్లో వేగంగా స్పందించే సాధనంగా పనిచేస్తుంది.
ఎవరెస్ట్ శిఖరంపై ల్యాండయిన ఏకైక హెలికాప్టర్‌గా హెచ్125 చరిత్ర సృష్టించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేలికపాటి యుటిలిటీ ఫ్లీట్‌ల కంటే ఎంతో మెరుగైన పనితీరును కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడుకున్న ఎత్తయిన, వేడి వాతావరణాల్లో పనిచేసే భారతీయ సైనికులకు ఇది కీలకమైన సేవలను అందిస్తుంది.
సీ295 మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ తర్వాత టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎయిర్ బస్ పారిశ్రామిక సహకారంలో కుదిరిన రెండో ప్రధాన ఒప్పందం ఇది. ఇది భారత్‌లో సమగ్ర సైనిక వైమానిక రంగాన్ని బలోపేతం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2229673)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3