ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

కృత్రిమ మేధ (ఏఐ) ఇకపై కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదు - జీవితంలోని ప్రతి రంగంలోనూ పని చేయడానికి అది ఒక అత్యవసర భాగం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


భారత తొలి ప్రభుత్వ యాజమాన్య సావరిన్ 'లార్జ్ లాంగ్వేజ్ మోడల్'ను ప్రశంసించిన కేంద్ర మంత్రి

బహుభాషా ఏఐ స్టాక్ కు రూపకల్పన : 'భారత్ జెన్' సెషన్‌లో 'హోల్-ఆఫ్-గవర్నమెంట్' నమూనాను
ప్రముఖంగా ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్

ఎన్ఎం- ఐసీపిఎస్ కింద రూ. 235 కోట్ల మద్దతు, ఇండియా ఏఐ మిషన్ కింద రూ.10,585 కోట్ల వ్యయంతో
మరింత బలోపేతం కానున్న భారత్ జెన్: కేంద్ర మంత్రి

22 భారతీయ భాషలలో, 17 బిలియన్ ప్రామాణికాలతో కూడిన పరమ్-2 టెక్స్ట్ ఫౌండేషన్ మోడల్‌తో సహా సరికొత్త భారత్-జెన్ మోడళ్లను ఆవిష్కరించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 7:23PM by PIB Hyderabad

భారత మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్య, సార్వభౌమ "లార్జ్ లాంగ్వేజ్ మోడల్" (ఎల్ఎల్ఎం),  బహుభాషా ఏఐ స్టాక్‌ను ప్రశంసిస్తూ, కేంద్ర సైన్స్, టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖ (స్వతంత్రహోదా), పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి అంతరిక్ష విభాగాల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన “భారత్-జెన్ మోడల్స్: విజన్ అండ్ టెక్నికల్ ఎగ్జిక్యూషన్ 2026” సెషన్‌లో ప్రసంగిస్తూ, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)  ఇకపై కేవలం ఒక ఐచ్ఛికం మాత్రమే కాదని, జీవితంలోని ప్రతి రంగంలో పని చేయడానికి అది ఒక అనివార్యమైన భాగమని శ్రీ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో భాగంగా ఇండియా ఏఐ మిషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై),  సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) సహకారంతో భారత్ జెన్ ఈ సెషన్‌ను నిర్వహించింది.

భారత్ జెన్ బృందాన్ని అభినందిస్తూ, సాంకేతిక స్వయంసమృద్ధి దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ సామాజిక, సాంస్కృతిక నేపథ్యం,  భాషా వైవిధ్యానికి అనుగుణంగా రూపొందించిన ప్రభుత్వ యాజమాన్యంలోని సార్వభౌమ బహుభాషా, మల్టీమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) చొరవగా భారత్ జెన్ ప్రత్యేకత కలిగివుందని ఆయన అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రసిద్ధి చెందినప్పటికీ, భారత్-జెన్  విశిష్టత దాని సార్వభౌమ, ప్రభుత్వ మద్దతు గల స్వభావంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది సాంకేతిక మార్పు ప్రారంభ దశలోనే ప్రభుత్వం తీసుకున్న చురుకైన విధానపరమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు

భారత్ జెన్  “సమగ్ర శాస్త్ర విజ్ఞానం, సమగ్ర ప్రభుత్వం, సమగ్ర దేశం” నమూనాకు నిదర్శనమని కేంద్ర మంత్రి అన్నారు. ఐఐటీ బాంబేలోని టీఐహెచ్  ఫౌండేషన్ ఫర్ ఐఓటీ, ఐఓఈ  నేతృత్వంలోని కన్సార్టియం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ఐఐఐటి హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మండి, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం ఇండోర్,  ఐఐటీ మద్రాస్ వంటి భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (ఎన్ఎం- ఐసీపిఎస్) ద్వారా డీఎస్టీ రూ. 235 కోట్ల నిధులతో మద్దతు ఇస్తుండగా, ఎంఈఐటీ వై  కింద రూ. 10,585 కోట్ల వ్యయంతో కూడిన ఇండియా ఏఐ మిషన్ ద్వారా దీనిని మరింత బలోపేతం చేశారు.

ఈ ప్రాజెక్ట్ సాంకేతిక ప్రాధాన్యతను వివరిస్తూ, భారత్ జెన్ టెక్స్ట్-ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, టెక్స్ట్-టు-స్పీచ్,  ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ వంటి స్పీచ్ టెక్నాలజీలు, డాక్యుమెంట్ విజన్-లాంగ్వేజ్ మోడల్స్‌తో సహా బహుళ ఏఐ పద్ధతులలో విస్తరించి ఉందని మంత్రి పేర్కొన్నారు. పాలన, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం న్యాయ వ్యవస్థల్లో, ముఖ్యంగా భాషా వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో సమ్మిళిత, భారత్-కేంద్రీకృత అనువర్తనాల కోసం భారత్ జెన్  ఫౌండేషన్ మోడల్స్ ను రూపొందించారని ఆయన పేర్కొన్నారు.

ఆయుర్వేదం కోసం 'ఆయుర్ పరమ్', వ్యవసాయం కోసం 'అగ్రి పరమ్', భారతీయ న్యాయ రంగం కోసం 'లీగల్ పరమ్' వంటి డొమైన్-నిర్దిష్ట మోడళ్లను భారత్ జెన్  ఇప్పటికే విడుదల చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  22 భారతీయ భాషలలో, 17 బిలియన్ ప్రామాణికాలతో కూడిన కూడిన పరమ్-2  టెక్స్ట్ ఫౌండేషన్ మోడల్, 12 భారతీయ భాషలలో శ్రుతం స్పీచ్-టు-టెక్స్ట్ మోడల్స్, 12 భాషలలో సూక్తం టెక్స్ట్-టు-స్పీచ్ మోడల్స్, సంక్లిష్టమైన భారతీయ పత్రాలను బహుభాషా పరంగా విశ్లేషించడానికి డాక్‌బోధ్ ఫ్రేమ్‌వర్క్ కింద పత్రం మోడల్స్‌తో సహా భారత్ జెన్ సరికొత్త మోడళ్లను గౌరవన ప్రధానమంత్రి ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.

భారతదేశ భాషా వైవిధ్యం 22 షెడ్యూల్డ్ భాషలకే పరిమితం కాదని మంత్రి స్పష్టం చేశారు. విస్తృతంగా మాట్లాడే ప్రాంతీయ భాషలు,  మాండలికాలను చేర్చడానికి డేటాసెట్‌లను నిరంతరం విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. శాస్త్రీయ పురోగతి అనేది పరిపాలనాపరమైన సరిహద్దులకు లోబడి ఉండకూడదని, ముఖ్యంగా డిజిటల్ ఆరోగ్యం,  ప్రజా సేవల పంపిణీ వంటి రంగాలలో వాస్తవ ప్రపంచ భాషా వైవిధ్యానికి అనుగుణంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

భారత్ జెన్ వ్యవస్థ విద్యాసంస్థలు, ప్రభుత్వం,  పరిశ్రమలను ఏకం చేస్తూ, ఉమ్మడి నిధుల యంత్రాంగం ద్వారా మద్దతు పొందుతుందని డాక్టర్ సింగ్ తెలియ చేశారు. ఈ చొరవ ఇప్పుడు సెక్షన్-8 కంపెనీగా, 'భారత్ జెన్ టెక్నాలజీ ఫౌండేషన్'  గా రూపాంతరం చెందిందని ఆయన పేర్కొన్నారు. ఇది జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు కల్పిస్తుందని, అలాగే 'భారత్ డేటా సాగర్' వంటి కార్యక్రమాల ద్వారా డేటా,  మోడల్ సార్వభౌమత్వాన్ని నిర్ధారిస్తుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఆలోచనా దృక్పథం మారాలని మంత్రి పిలుపునిచ్చారు. ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు విడివిడిగా కాకుండా, అందరూ కలిసికట్టుగా పనిచేసే విధానాలు అవసరమని ఆయన అన్నారు. సహాయక విధానాలు, ప్రారంభ దశలో నిధుల మద్దతు, ప్రైవేట్ భాగస్వామ్యానికి తలుపులు తెరవడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ప్రపంచ పురోగతితో సమానంగా భారత్ అడుగులు వేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

భారత్ జెన్ సీఈఓ  శ్రీ రిషి బాల్, ఐఐటీ బాంబే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ గణేష్ రామకృష్ణన్, ఐఐఐటి హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్. రవికిరణ్,  భారత్ జెన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అమోల్ గీతే కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు. ప్రాజెక్ట్ వ్యవస్థ,  డేటా ప్రయాణం, వినియోగానికి సిద్ధంగా ఉన్న వేదికలు, వివిధ రంగాలతో కుదుర్చుకున్న భాగస్వామ్యాల గురించి వారు వివరించారు. ఎన్ఎంఐసీపీఎస్ ఛైర్మన్ డాక్టర్ క్రిస్ గోపాలకృష్ణన్, ఎంఈఐటీవై  కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్, డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్,  ప్రధాన శాస్త్ర సలహాదారు (పీఎస్ఏ) ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్‌ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో భారత్ జెన్,  ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగిస్తూ, భారత్ జెన్  సార్వభౌమ సామర్థ్యం, సమష్టి అమలు, సమ్మిళిత రూపాన్ని కలుపుకుంటూ భారత ఏఐ ప్రయాణంలో ఒక కొత్త దశను సూచిస్తుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా, ఒక బలమైన జాతీయ ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2229563) సందర్శకుల సూచీ సంఖ్య : : 111
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada