|
ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఈటీ నౌ’ అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
· “ఈ దశాబ్దంలో అనేక అవరోధాల నడుమ బలమైన పనితీరు.. ప్రజాస్వామ్య బలోపేతానికి సాగిన కృషి ఫలితంగా భారత్ అసాధారణ ప్రగతి సాధించింది” · “ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత దశాబ్దంలో భారత్ సంస్కరణల ఎక్స్ ప్రెస్‌లో దూసుకెళ్తోంది” · “వ్యయంపై దృష్టితో మాత్రమే కాకుండా ఫలితాలు ప్రాతిపదికగా మేం బడ్జెట్‌ను రూపొందించాం” · “గత దశాబ్దంలో సాంకేతికత.. ఆవిష్కరణలను ప్రధాన వృద్ధి చోదకాలుగా పరిగణించాం” · “నేటి భారత్ ఆత్మవిశ్వాసంతో.. ప్రపంచ పోటీతత్వంతో సాగుతోంది కాబట్టే ఇప్పుడు మనం ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం”
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2026 9:31PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభమైన ‘ఈటీ నౌ’ (ET Now) అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సదస్సుకు హాజరైన వారందరికీ తొలుత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సదస్సు ఇతివృత్తం “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు”ను ప్రస్తావిస్తూ- ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత దశాబ్దంలో అసాధారణ అవరోధాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. వీటిలో మహమ్మారి కరోనా సహా ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం వంటివి ప్రపంచ సమతౌల్యాన్ని అతలాకుతలం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి సంక్షోభాలే ఒక దేశ వాస్తవ శక్తిసామర్థ్యాలను తేటతెల్లం చేస్తాయని చెప్పారు. ఇలాంటి అవరోధాలెన్నో ఎదురైనా, ఒక దశాబ్ద కాలంలో బలమైన పనితీరు, ప్రజాస్వామ్య బలోపేతానికి సాగిన కృషి ఫలితంగా భారత్ అద్భుత ప్రగతి సాధించిందని సగర్వంగా ప్రకటించారు. గత దశాబ్దారంభంలో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ 11వ స్థానంలో ఉండేదని, గందరగోళ పరిస్థితుల నడుమ పతనం తప్పదేమోన్న ఆందోళన దోబూలాడేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. కానీ, గడ్డు కాలాన్ని అధిగమిస్తూ నేడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా శరవేగంతో పురోగమిస్తున్నదని చెప్పారు. ఈ పరిణమాశీల శతాబ్దానికి భారత్ కీలక మూలస్తంభంగా నిలుస్తుందని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఆ మేరకు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ వాటా 16 శాతానికిపైగా ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అంతేగాక ఏటికేడు ఈ వాటా పెరుగుతూనే ఉంటుందన్న ఆశాభావం వెలిబుచ్చారు. అంతర్జాతీయ వృద్ధికి సారథ్యం వహిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకంగా ఆవిర్భవించగలదని ఆయన స్పష్టం చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ కొత్త అంతర్జాతీయ క్రమం ఉద్భవించినా, 7 దశాబ్దాల తర్వాత ఆ కూర్పు విచ్ఛిన్నమవుతూ, ప్రపంచం సరికొత్త క్రమం దిశగా సాగుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇందుకు కారణమేమిటని ప్రశ్నిస్తూనే- మునుపటి వ్యవస్థ ‘అన్నిటికీ ఒకే మూస’ విధానంలో అది ఏర్పాటు కావడమేనని వివరణ కూడా ఇచ్చారు. ఆ మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేంద్రకంగా బలమైన, విశ్వసనీయ సరఫరా వ్యవస్థలలో దేశాలను తమవంతు పాత్ర పోషించేవిగా మాత్రమే పరిగణించారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విధానం నేడు ఔచిత్యం కోల్పోవడంతో దీనికి సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. అందుకే, తమదైన పునరుత్థాన సామర్థ్యం సంతరించుకోవాల్సిన అవసరాన్ని ప్రతి దేశం గ్రహిస్తున్నదని ఉద్ఘాటించారు.
అయితే, ప్రపంచం దీనిపై చర్చించుకుంటున్న నేపథ్యంలో 2015లోనే భారత్ తన విధానంలో ఈ అంశాన్ని ఒక భాగం చేసిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఆ మేరకు దశాబ్దం కిందట ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేసిన సమయంలో దాని వ్యవస్థాపక పత్రం భారత్ దార్శనికతను స్పష్టంగా నిర్దేశించిందని ఆయన చెప్పారు. తదనుగుణంగా విదేశీ అభివృద్ధి నమూనా దిగుమతి చేసుకోవడం కాకుండా తనదైన ప్రగతి పద్ధతులకు భారత్ రూపకల్పన చేసుకుంటోందని తెలిపారు. స్వీయ అవసరాలు, ప్రయోజనాలకు తగిన నిర్ణయాలు తీసుకునే విశ్వాసాన్ని ఈ విధానం దేశానికి ఇచ్చిందని స్పష్టం చేశారు. గత దశాబ్దంలో అడ్డంకులెన్నో ఎదురైనా భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడకుండా, మరింత బలంతో ముందడుగు వేస్తుండటానికి ఇదే ప్రధాన కారణమని వివరించారు.
“ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత దశాబ్దంలో భారత్ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లో దూసుకెళ్తోంది” అని ప్రధానమంత్రి అభివర్ణించారు. సంస్కరణలు తప్పనిసరి తద్దినంలా కాకుండా విశ్వాసం, నిబద్ధతతో అమలు కావడమే వాటి వాస్తవిక బలమని ఆయన ఉద్ఘాటించారు. దేశంలో 2014కు ముందు సంక్షోభం లేదా తప్పనిసరి పరిస్థితుల్లోనే సంస్కరణలు చేపట్టడాన్ని నిపుణులు, ఆర్థికవేత్తలు కూడా చూశారని పేర్కొంటూ కొన్నిటిని ఉదాహరించారు. ఆ మేరకు 1991లో దేశం దివాలా తీసి, బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడినపుడు సంస్కరణలు వచ్చాయన్నారు. ఇది మునుపటి ప్రభుత్వాలు అనుసరించిన విధానమని, గత్యంతరం కానరాని పరిస్థితుల్లోనే సంస్కరణలను ప్రవేశపెట్టాయని ఆయన గుర్తు చేశారు. ముంబైపై 26/11 నాటి ఉగ్రవాద దాడి తర్వాత ‘ఎన్‌ఐఏ (NIA) ఏర్పాటైందని, గ్రిడ్ వైఫల్యంతో విద్యుత్ రంగంలో సంస్కరణలు వచ్చాయని అన్నారు. ద్రవ్యోల్బణం విజృంభించి గిరిజన ప్రాంతాల్లో ఆకలి మంటలు రేగినపుడు ఆహార భద్రత చట్టం తెచ్చినప్పటికీ, అరకొరగా అమలు చేశారని శ్రీ మోదీ గుర్తుచేశారు. విధిలేని పరిస్థితుల నుంచి పుట్టిన సంస్కరణలు ఏనాడూ దేశానికి సరైన ఫలితాలివ్వ లేదని ప్రధానమంత్రి చెప్పారు.
అయితే, గత 11 సంవత్సరాలుగా విధానం-ప్రక్రియ-అమలు సహా ప్రవర్తనాపూర్వక సంస్కరణలు కృతనిశ్చయంతో అమలయ్యాయని ఆయన సగర్వంగా ప్రకటించారు. విధానాలు మారినా, మానసిక ధోరణిలోమార్పు రాకపోతే సంస్కరణలు కాగితాలకే పరిమితం కాగలవన్నారు. కాబట్టి, తన ప్రభుత్వం వ్యవస్థను ఆమూలాగ్రం మార్చేందుకు కృషి చేసిందని తెలిపారు. మంత్రిమండలికి సమాచారం (కేబినెట్ నోట్స్) ఇవ్వడాన్ని ఉదాహరిస్తూ విధాన సంస్కరణల గురించి శ్రీ మోదీ వివరించారు, లోగడ ఈ సమాచారం సిద్ధం చేయడానికి వారాలు లేదా నెలలు పట్టేదని, పర్యవసానంగా ప్రగతి మందగించిందని గుర్తుచేశారు. అందుకే, తన ప్రభుత్వం నిర్ణయాల అమలుకు సాంకేతికతను వినియోగిస్తూ నిర్దిష్ట గడువును నిర్దేశిస్తున్నదని తెలిపారు. దీనివల్ల జాప్యానికి తావులేకుండా వివిధ శాఖల మధ్య ఫైళ్లు శరవేగంతో సాగడంతో నేడు సత్ఫలితాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
రైల్వే ఓవర్-బ్రిడ్జి ఆమోదాలను ఉటంకిస్తూ- గతంలో అనేక అనుమతులు అవసరమయ్యేవని, వాటికోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని శ్రీ మోదీ అన్నారు. ఇటువంటి అనుమతులు-ఆమోదాలను నేడు క్రమబద్ధీకరించడం వల్ల మౌలిక సదుపాయాల కల్పన వేగం పుంజుకున్నదని చెప్పారు. అలాగే దేశ సరిహద్దులలో మౌలిక సదుపాయాలకు సంబంధించి లోగడ సాదాసీదా రహదారి నిర్మాణానికీ స్థానికంగా నిర్ణయానికి వీలుడేందని కాదని, కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాల్సి వచ్చేదని తెలిపారు. కానీ, 2014 తర్వాత తన ప్రభుత్వం స్థానిక పాలన సంస్థలకు అధికారం దఖలు పరచడంతో సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పన వేగంగా సాగిందని ఆయన వివరించారు.
భారత సంస్కరణలలో ఒకటైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ‘యూపీఐ’ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇది కేవలం ఒక అనువర్తనం కాదని, విధానం-ప్రక్రియ-పనితీరు సమ్మేళనానికి నిదర్శనమని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సేవలను, ఆర్థిక ప్రయోజనాలను ఎన్నడూ పొందని పౌరులకు ‘యూపీఐ’ వాటిని చేరువ చేసిందని గుర్తుచేశారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ చెల్లింపు వ్యవస్థ, జన్‌ధన్-ఆధార్-మొబైల్ త్రయం అనివార్య పరిస్థితుల వల్ల కాకుండా నిబద్ధత నుంచి ఉద్భవించాయని చెప్పారు. లోగడ నిర్లక్ష్యానికి గురైన పౌరులకూ ఆ సేవలు అందాలనే దృక్పథంతో తీసుకున్న దృఢ నిశ్చయానికి ఇవన్నీ ఉదాహరణలని శ్రీ మోదీ స్పష్టం చేశారు. తన ప్రభుత్వం ఇప్పటికీ అదే పథంలో ముందడుగు వేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
ఈ నవ్య దృక్పథం ప్రస్తుత బడ్జెట్‌లోనూ ప్రతిబింబించిందని ప్రధానమంత్రి చెప్పారు. బడ్జెట్ విషయంలో లోగడ వ్యయం గురించి మాత్రమే చర్చ సాగేదని, ఫలితాల మాట ప్రస్తావనకు వచ్చేది కాదని గుర్తుచేశారు. దేనికెఎన్ని నిధులు కేటాయించారు.. ఏది చౌక లేదా ఖరీదైనదిగా మారింది.. ఎన్ని కొత్త రైళ్లను ప్రకటించారు! వంటి అంశాలపై చర్చకు బడ్జెట్ పరిమితమయ్యేదని పేర్కొన్నారు. అయితే, తన ప్రభుత్వం వ్యయ కేంద్రకంగానే కాకుండా ఫలిత ఆధారితంగానూ బడ్జెట్ రూపాన్ని మార్చిందని చెప్పారు. ఆ మేరకు 2014కు బాహ్య రుణాల అంశం బడ్జెట్ మీద చర్చను ప్రభావితం చేయగా, ఇప్పుడు సంస్కరణలపై దృష్టి మళ్లడాన్ని కీలక మార్పుగా శ్రీ మోదీ వివరించారు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ- భావితరం జీఎస్‌టీ, ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు, ఆర్టికల్ 370 రద్దు, ముమ్మారు తలాక్ నిషేధ చట్టం, నారీ శక్తి వందన్ అధినియం వంటివాటిని ఆయన ఉదాహరించారు. బడ్జెట్‌లో లేదా దానితో నిమిత్తం లేకుండా ప్రకటించినా సంస్కరణల ఎక్స్ ప్రెస్ వేగం సదా పెరుగుతూనే ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు గత సంవత్సరం ఓడరేవులు, సముద్ర రంగంలో సంస్కరణలు అమలు చేశామన్నారు. నౌకానిర్మాణ పరిశ్రమ కోసం చర్యలు తీసుకున్నామని, జన్ విశ్వాస్ చట్టం కింద సంస్కరణలు అమలు ఊపందుకున్నదని, ఇంధన భద్రత కోసం ‘శాంతి’ చట్టం ప్రవేశపెట్టామని చెప్పారు. అలాగే, కార్మిక చట్ట సంస్కరణల అమలు, భారతీయ న్యాయ సంహిత, వక్ఫ్ చట్టంలో సంస్కరణలు, గ్రామీణ ఉపాధి కల్పన కోసం కొత్త వికసిత భారత్ జీ రామ్ జీ చట్టం తెచ్చామని ఆయన ఒక పెద్ద జాబితాను ఏకరవు పెట్టారు. ఏడాది పొడవునా ఇలాంటి అనేక సంస్కరణలను స్థిరంగా అమలు చేశామని పేర్కొన్నారు.
ఈ ఏడాది బడ్జెట్ సంస్కరణల ఎక్స్ ప్రెస్ వేగాన్ని మరింత పెంచుతూ- కీలకమైన మూలధన వ్యయం, సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమ మునుపటి బడ్జెట్ల తరహాలోనే మౌలిక సదుపాయాల వ్యయాన్ని దాదాపు రూ.17 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. బహుళ రంగాల్లో సామర్థ్యం, ఉత్పాదకత, ఉపాధి సృష్టి పెంపులో మూలధన వ్యయం బహుగుణ ప్రభావాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో 5 విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌ల నిర్మాణం సహా 2, 3 అంచెల్లోని నగరాల కోసం నగర ఆర్థిక ప్రాంతాల ఏర్పాటు, 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణం తదితరాలపై బడ్జెట్ ప్రకటనలను ఆయన ఉటంకించారు. ఇవన్నీ దేశ పురోగమనంతోపాటు యువతరం ఉజ్వల భవితకు నిజమైన పెట్టుబడులని అభివర్ణించారు.
గత దశాబ్దంలో అంకుర, హ్యాకథాన్ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా సాంకేతికత-ఆవిష్కరణలు వృద్ధికి ప్రధాన చోదకాలుగా గుర్తింపు పొందాయన్నారు. దేశంలో ఇప్పుడు 2 లక్షలకుపైగా అంకుర సంస్థలు విభిన్న రంగాలలో పనిచేస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. వ్యవస్థాపనలో చొరవను ప్రభుత్వం ప్రోత్సహించిందని, ప్రత్యక్ష ఫలితాల ఆధారిత ఆవిష్కరణలకు గుర్తింపు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాథమ్యాలన్నిటినీ ప్రస్తుత బడ్జెట్ మరింత బలోపేతం చేస్తుందని.. ముఖ్యంగా బయోఫార్మా, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ వంటి రంగాలకు గణనీయ కేటాయింపులు చేసిందని వివరించారు.
దేశ ఆర్థిక సామర్థ్యం ఇనుమడించే కొద్దీ, రాష్ట్రాలకూ తమ ప్రభుత్వం సాధికారతనిచ్చిందని ప్రధానమంత్రి ప్రకటించారు. సంబంధిత గణాంకాలను ఉటంకిస్తూ... 2004-2014 మధ్య పన్నుల పంపిణీ కింద రాష్ట్రాలకు దాదాపు రూ.18 లక్షల కోట్లు లభించగా, 2014-2025 మధ్య ఇప్పటికే రూ.84 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాదాపు రూ.14 లక్షల కోట్లతో తమ హయాంలో రాష్ట్రాలకు అందిన పన్నుల వాటా రమారమి రూ.100 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో అభివృద్ధి పనులను నిరాఘాటంగా పూర్తిచేయడానికి ఈ నిధులు తోడ్పడతాయని చెప్పారు.
భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ, విశ్లేషణ సాగుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అయితే, 2014కు ఇలాంటివి ఎందుకు సాధ్యం కాలేదనే అంశంపై ఆయనొక కీలక దృక్కోణాన్ని ప్రస్తావించారు. దేశంలో ఇదే తరహా ప్రభుత్వ వ్యవస్థ, యువశక్తి ఆనాడు కూడా ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలతో సమగ్ర వాణిజ్య ఒప్పందాలు ఎందుకు ఏర్పరచుకోలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ దార్శనికత, విధానాలు, సంకల్పం వంటివి అందుకు అవసరమని, ఆ మేరకు భారత్ సామర్థ్యం మెరుగుపడిందని వివరించారు. విధాన స్తంభన, కుంభకోణాల ఫలితంగా ‘బలహీన పంచకం’లో ఒకటిగా మన ఆర్థిక వ్యవస్థపై ముద్ర పడటంతో భారత్‌ను ఏ దేశమూ విశ్వసించలేదని ఆయన ఉద్ఘాటించారు. తయారీ రంగంలో పరిస్థితుల రీత్యా 2014కు ముందు, భారత్ బలహీన దేశంగా ఉండేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల వల్ల అవి మన మార్కెట్‌ను గుప్పిట పట్టి, తమ ఉత్పత్తులతో దేశాన్ని ముంచెత్తుతాయనే భయం మునుపటి ప్రభుత్వాలలో ఉండేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. నిస్పృహ నిండిన ఆనాటి వాతావరణం నడుమ ప్రభుత్వం కేవలం 4 సమగ్ర వాణిజ్య ఒప్పందాలు మాత్రమే కుదుర్చుకోగలిగిందని చెప్పారు. తద్విరుద్ధంగా గత దశాబ్దంలో భారత్ విభిన్న రంగాల్లో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నదని ప్రకటించారు. నేటి భారత్ ఆత్మవిశ్వాసంతో, ప్రపంచ పోటీతత్వంతో సాగుతోందని, ఆ మేరకు గత 11 ఏళ్లుగా బలమైన తయారీ వ్యవస్థను రూపొందించుకున్నదని ప్రధానమంత్రి వివరించారు. ఈ సామర్థ్యం, సాధికారతలే ప్రపంచ విశ్వాసాన్ని చూరగొన్నాయని, ‘వికసిత భారత్’ దిశగా ప్రస్థానానికి కీలక స్తంభమైన వాణిజ్య విధానంలో వినూత్న పరిణామానికి ప్రాతిపదిక ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.
ప్రగతి పయనంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యానికి ప్రభుత్వం పూర్తి అవగాహనతో కృషి చేస్తోందని, ఇందులో భాగంగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిస్తున్నతని శ్రీ మోదీ చెప్పారు. మునుపటి ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమంపై ప్రకటనలకు పరిమితమయ్యాయని పేర్కొన్నారు. అయితే, వారి సమస్యలపై తమ ప్రభుత్వ వాస్తవిక అవగాహనకు నిదర్శనంగా భారతీయ సంకేత భాషను సంస్థాగతీకరించిందని ఆయన ఉద్ఘాటించారు. తటస్థ లింగ సమాజం చాలా కాలంపాటు హక్కుల కోసం పోరాడిన నేపథ్యంలో తమ ప్రభుత్వం వారికి గౌరవం, రక్షణ కల్పిస్తూ చట్టం తెచ్చిందని పేర్కొన్నారు. ఇక గత దశాబ్దంలో లక్షలాది మహిళలు ముమ్మారు తలాక్ సంప్రదాయం నుంచి విముక్తులయ్యారని చెప్పారు. అంతేకాకుండా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ధోరణిలోనూ ఎంతో మార్పు వచ్చిందని, ఇప్పుడు మరింత అవగాహనతో పనిచేస్తున్నదని, ఉచిత రేషన్ పంపిణీ వంటి పథకాల అమలులో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని అపహాస్యం చేస్తున్నాయని విమర్శిస్తూ- దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరిక విముక్తులయ్యారని గుర్తుచేశారు. నవ్య మధ్యతరగతిలో చేరిన వీరంతా తిరిగి పేదరికంలోకి జారిపోకుండా ఉచిత రేషన్ పథకం జాగ్రత్త వహిస్తుందని వివరించారు. ఈ పథకం అమలులో భాగంగా ప్రభుత్వం రూ.లక్షల కోట్ల వ్యయంతో పేదలు, నవ్య మధ్యతరగతి పౌరులకు ఎనలేని మద్దతునిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆలోచన దృక్పథంలో వ్యత్యాసాన్ని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ- 2047 నాటికి వికసిత భారత్ గురించి మాట్లాడటం ఏమిటని, ఇది అనిశ్చితమని కూడా వ్యాఖ్యానిస్తున్నారని గుర్తుచేశారు. అయితే, స్వాతంత్ర్య సమరయోధులు ఆనాడు ఇదే తరహాలో ఆలోచించి ఉంటే, పరాయి పాలన నుంచి భారత్ ఎన్నటికీ విముక్తమయ్యేది కాదన్నారు. దేశమే ప్రధానమైనప్పుడు ప్రతి నిర్ణయం, ప్రతి విధానం దేశం కోసమే తీసుకోగలమని ఆయన స్పష్టం చేశారు. ఆ మేరకు దేశ ప్రగతి కోసం నిర్విరామ కృషి చేయాలనే ప్రభుత్వ దార్శనికత విస్పష్టంగా ఉందన్నారు. నేటి తరం 2047 వరకు ఉంటుందా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా దేశం, భవిష్యత్తరాలు కొనసాగుతాయని చెప్పారు. అందుకే, దేశ భవిష్యత్తు ఉజ్వలం, సురక్షితంగా కొనసాగేలా వర్తమానం తననుతాను అంకితం చేసుకోవడం నేటి ప్రథమ కర్తవ్యమని ఆయన విశదీకరించారు.
మొత్తం మీద ప్రపంచం ఇకపై అవరోధాలతో సహజీవనానికి సిద్ధం కావాలని, వాటి స్వభావం మరింత ముదురుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, వ్యవస్థలు వేగంగా పరిణామం చెందుతాయని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) ఫలితంగా ఇప్పటికే వస్తున్న మార్పులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో ఏఐ మరిన్ని విప్లవాత్మక మార్పులు తేవడం తథ్యమైనప్పటికీ, భారత్ అందుకు సంసిద్ధంగా ఉందని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రపంచ దేశాలు, సాంకేతిక అగ్రగాముల భాగస్వామ్యంతో ‘అంతర్జాతీయ ఏఐ ప్రభావ శిఖరాగ్ర సదస్సు’ను భారత్ నిర్వహించనున్నదని శ్రీ మోదీ ప్రకటించారు. మెరుగైన ప్రపంచాన్ని రూపుదిద్దడం కోసం సంయుక్త కృషి కొనసాగుతుందని చెప్పారు. చివరగా- ఈ విశ్వాసంతో ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2228201)
|