సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బూటక.. అవాస్తవ.. తప్పుదోవ పట్టించే సమాచారంతో పెరుగుతున్న ముప్పును ప్రభుత్వం గుర్తించింది

నాడు పోస్టు చేయడమైనది: 13 FEB 2026 4:57PM by PIB Hyderabad

దేశ పౌరులందరికీ వాక్ స్వాతంత్ర్యంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 హామీ ఇస్తోంది. అయితే, డిజిటల్ వేదికలపై బూటక.. అవాస్తవ.. తప్పుదోవ పట్టించే సమాచారంతో పెరుగుతున్న ముప్పు ఎలాంటిదో ప్రభుత్వానికీ తెలుసు.

అందుకే, “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు-డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు-2021 జారీ చేసింది. ఇందులో భాగమైన పార్ట్-III నిబంధనలు ‘ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్’ (OTT వేదికలు) ప్రచురణకర్తలకు వర్తిస్తుంది. ప్రస్తుతం అమలులోగల చట్టం కింద నిషేధిత కంటెంట్‌ను ప్రచురణకర్తలు ప్రసారం, ప్రచురణ చేయరాదని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

నిబంధనల షెడ్యూల్‌లోని సార్వత్రిక మార్గదర్శకాల ప్రాతిపదికన కంటెంట్‌ను వయో ఆధారిత వర్గీకరణ కింద 5 విభాగాలుగా విభజించాలి. దీని ప్రకారం ఓటీటీ వేదికలు బాలల వయసుకు తగని కంటెంట్‌ను పరిమితం చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని చట్టం నిర్దేశిస్తోంది. అలాగే ఇతరత్రా అంశాలు సహా వార్తలు-తాజా సమాచార ప్రచురణకర్తలు పాటించాల్సిన నైతిక నియమావళిని కూడా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం-1995 కింద నిర్దేశించిన ప్రోగ్రామ్ నిబంధనలకు, ప్రెస్ కౌన్సిల్ చట్టం-1978 కింద పాత్రికేయ ప్రవర్తన నియమావళికి కట్టుబడాల్సి ఉంటుంది. వీటి ప్రకారం బూటకపు, అవాస్తవ, తప్పుదోవ పట్టించే, అర్ధసత్యాలతో కూడిన సమాచారాన్ని ప్రచురణకర్తలు వ్యాప్తి చేయరాదని సదరు నిబంధనలు, నియమావళి స్పష్టీకరిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బూటకపు వార్తలను తనిఖీ నిమిత్తం సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పాత్రికేయ సమాచార సంస్థ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) కింద 2019 నవంబరులో ఒక ‘నిజనిర్ధారణ వ్యవస్థ’ (FCU) ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల అధీకృత వనరుల ద్వారా వార్తల ప్రామాణికతను ధ్రువీకరించుకున్న తర్వాత ఈ వ్యవస్థ తన సామాజిక మాధ్యమ వేదికలలో వాస్తవ సమాచారాన్ని వెల్లడిస్తుంది.

ప్రైవేట్ ఉపగ్రహ టీవీ ఛానెళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలు, ప్రకటనలన్నీ ‘కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టం-1995 కింద రూపొందించిన ‘కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రూల్స్-1994 నిర్దేశిత ప్రోగ్రామ్ కోడ్, అడ్వర్టైజింగ్ కోడ్‌లకు కట్టుబడి ఉండాలి. సదరు టీవీ ఛానెళ్ల కంటెంట్‌ నియంత్రణకు ఈ నిబంధనలలో విస్తృత శ్రేణి పారామితులు నిర్దేశితమయ్యాయి. అశ్లీల, అప్రతిష్టకర, ఉద్దేశపూర్వక బూటకపు, సంకేతాత్మక అవాస్తవాలు, అర్ధ సత్యాలతో కూడిన ఎలాంటి కార్యక్రమాన్నీ ప్రసారం చేయరాదని ప్రోగ్రామ్ కోడ్ స్పష్టం చేస్తోంది.

రాజ్యసభలో బీజేపీ సభ్యుడు శ్రీ తేజ్‌వీర్ సింగ్ ప్రశ్నకు సమాధానంగా సమాచార-ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2227842) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Malayalam