రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
బస్సుల్లో భద్రతా ప్రమాణాలు - అగ్నిప్రమాద సంఘటనలు
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 8:16PM by PIB Hyderabad
జైసల్మేర్ - జోధ్‌పూర్, కర్నూలు - బెంగళూరు మార్గాల్లో స్లీపర్ బస్సుల్లో జరిగిన ప్రాణ నష్ట అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989, రూల్ 62 ప్రకారం, బస్సుల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ తనిఖీ సమయంలో ఏఐఎస్:052, ఏఐఎస్:119 ప్రమాణాలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జైసల్మేర్ - జోధ్‌పూర్ మార్గంలో జరిగిన స్లీపర్ బస్సు అగ్నిప్రమాదంలో పలు లోపాలను గుర్తించారు. అనుమతించిన పరిమితి కంటే బస్సు పొడవు ఎక్కువగా ఉంది. అత్యవసర ద్వారాల పరిమాణం కనీస నిబంధనల ప్రకారం లేదు. ప్రయాణికుల సీట్లు అత్యవసర ద్వారానికి వెళ్లే దారిని అడ్డుకునేలా ఉన్నాయి. రెండు ఉండాల్సిన చోట ఒకే రూఫ్ హ్యాచ్ ఉంది. పైకప్పుపై సామాగ్రి మోసే క్యారియర్‌కు నిచ్చెన ఏర్పాటు చేశారు. బస్సులో డ్రైవర్ క్యాబిన్ విభజించి ఉంది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు (సీఎంవీఆర్) 1989 ప్రకారం ఉండాల్సిన 'ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్' అమర్చలేదు.రాష్ట్ర ప్రభుత్వ స్థానిక రవాణా అధికారులు వాహన ధృవీకరణ సమయంలోనే ఇటువంటి లోపాలను గుర్తించి ఉండాల్సింది.
ఫిబ్రవరి 6, 2026 నాటికి నమోదైన మొత్తం స్లీపర్ కోచ్‌ల సంఖ్య 49,616. ఇప్పటి వరకు మొత్తం 886 బస్సు బాడీ బిల్డర్లకు గుర్తింపు లభించింది.
కర్నూలు - బెంగళూరు మార్గంలో జరిగిన స్లీపర్ బస్సు అగ్నిప్రమాదంలో, ఆ బస్సు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కేవలం "సీటింగ్ కెపాసిటీ" (కూర్చునే సామర్థ్యం)ని మాత్రమే సూచించినట్లు గుర్తించారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ జైరామ్ గడ్కరీ ఈ రోజు రాజ్యసభలో ఒక రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలను వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2226718)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11