కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తపాలా కార్యాలయం పొదుపు పథకాల డిజిటలైజేషన్
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 6:27PM by PIB Hyderabad
నేడు లోక్‌సభలో కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. దేశవ్యాప్తంగా 1.64 లక్షలకు పైగా ఉన్న తపాలా కార్యాలయాల వ్యవస్థ ద్వారా 45 కోట్లకు పైగా పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు(పీఓఎస్‌బీ) ఖాతాదారులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. పోస్టాఫీసు పొదుపు పథకాలను ఆధునీకరించడానికి, డిజిటలైజ్ చేయడానికి.. కేంద్రీకృత బ్యాంకింగ్ పరిష్కారంతో పాటు ఏటీఎంలు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌లో ఖాతా ప్రారంభించడం/మూసివేయడం, డిపాజిట్లు, తక్షణ బ్యాలెన్స్ విచారణ, ఎన్‌ఈఎఫ్‌టీ/ఆర్‌టీజీఎస్ ద్వారా నిధుల బదిలీ, ఐపీపీబీ–పీఓఎస్‌బీ అనుసంధానం వంటి డిజిటల్ సేవలను సీబీఎస్ వేదిక ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. పీఓఎస్‌బీ ఖాతాదారులకు అందిస్తున్న సౌకర్యాలతోపాటు ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు కూడా తన ఖాతాదారులకు పొదుపు, కరెంట్ ఖాతాలు, వర్చువల్ డెబిట్ కార్డులు, నగదు బదిలీ సేవలు, బిల్లు, యుటిలిటీ చెల్లింపులు, బీమా సేవాలు, పోస్టాఫీసు పొదుపు పథకాలకు ఆన్‌లైన్ చెల్లింపు వంటి సేవలను అందిస్తున్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ, ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్, 5 ఏళ్ల పిల్లల కోసం ఆధార్ నమోదు సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని పోస్టాఫీసులు ప్రస్తుతం డిజిటల్ వేదికపై పని చేస్తున్నాయి. ఈ సేవలన్నీ ప్రజలకు సౌలభ్యాన్ని, పారదర్శకతను, ఆర్థిక చేరికను పెంచడానికి దోహదపడుతున్నాయి.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జాతీయ పొదుపు ధ్రువీకరణ పత్రం, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాల్లో లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యాన్ని తపాలా శాఖ కల్పిస్తుంది. ఈ చర్యలు వినియోగదారుల సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు కార్యకలాపాలను సులభతరం చేశాయి.
***
(రిలీజ్ ఐడి: 2226708)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7