యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలు 2026: దరఖాస్తుల సవరణ కోసం మూడు రోజుల 'కరెక్షన్ విండో'ను ప్రారంభించనున్న యూపీఎస్సీ

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 5:14PM by PIB Hyderabad

సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్‌ఈ)- 2026, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఓఎస్) పరీక్ష- 2026 కోసం సమర్పించిన దరఖాస్తులోని తప్పులను సరిదిద్దుకోవడానికి అభ్యర్థులకు ఒకసారి అందించే అవకాశంగా మూడు రోజుల ‘కరెక్షన్ విండో’ను ప్రారంభించాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) యోచిస్తోంది. దీని ద్వారా 'కామన్ అప్లికేషన్ ఫారమ్' , 'ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫారమ్'లలో అవసరమైన మార్పులు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. గత ఏడాది కూడా ఎన్‌డీఏ, ఎన్ఏ పరీక్ష (II) 2025, సీడీఎస్ పరీక్ష (II) 2025 అభ్యర్థుల కోసం ఇటువంటి సవరణ సదుపాయాన్ని కల్పించారు. 

యూపీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్ నాలుగు భాగాలను కలిగి ఉంటుంది. ఇవి హోం పేజీలో విడివిడి కార్డుల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఖాతాను సృష్టించుకోవటం, యూనివర్సల్ రిజిస్ట్రేషన్, కామన్ అప్లికేషన్ ఫారమ్.. ఈ మూడు భాగాలు అన్ని పరీక్షలకు సంబంధించిన సాధారణ సమాచారాన్ని కలిగి ఉంటాయి. అభ్యర్థులు వీటిని ఎప్పుడైనా నింపొచ్చు. నాలుగో భాగం పరీక్షలు. ఇది నిర్దిష్ట పరీక్షలకు సంబంధించిన మాడ్యూల్. దీనిలో పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, సంబంధిత దరఖాస్తులు, దరఖాస్తు స్థితి వంటి వివరాలు ఉంటాయి.

ఈ ‘కరెక్షన్ విండో’ గురించి యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. “దరఖాస్తు ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. పారదర్శకతో పాటు అభ్యర్థులకు అనుకూలంగా మార్చడానికి కమిషన్ కట్టుబడి ఉంది. దరఖాస్తును అంతిమంగా సమర్పించే కంటే ముందే అనేక స్థాయిల్లో తనిఖీలు ఉన్నప్పటికీ.. దరఖాస్తు ప్రక్రియకు ఉన్న సమగ్రతను కాపాడటానికి, అభ్యర్థుల వాస్తవ ఆందోళనలను పరిష్కరించడానికి ఒకసారి అవకాశంగా ఈ పరిమిత సవరణ సదుపాయాన్ని కల్పిస్తున్నాం” అని అన్నారు. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత మూడు రోజుల 'కరెక్షన్ విండో' ప్రారంభించనున్నాను. ఖచ్చితమైన తేదీలు, ఏయే వివరాలను సవరించుకోవడానికి అనుమతి ఉంటుందన్న అంశాలపై వివరణాత్మక సూచనలు త్వరలోనే కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు. 

పాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) మాడ్యూల్ స్థానంలో 2025 మే 28న కొత్త 'ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్'ను ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష- 2026, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష- 2026 దరఖాస్తులను ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారానే కమిషన్ స్వీకరిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2226707) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी