ఆర్థిక మంత్రిత్వ శాఖ
సహకార బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను, పాలనను బలోపేతం చేయటానికి, డిజిటల్ సేవలను అందించేందుకు ఆర్బీఐ చర్యలు
జనవరి 19, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా, సహకార సంఘాలకు తిరిగి రుణాలు ఇచ్చేందుకు ఎన్‌సీడీసీకి బ్యాంకులు మంజూరు చేసే రుణాలను సంబంధిత విభాగాల ద్వారా ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించే వెసులుబాటు
సంస్కరణల్లో భాగంగా సవరించిన ప్రాధాన్యతా రంగ రుణ నిబంధనల ప్రకారం, ఎన్‌సీడీసీ ద్వారా సహకార సంఘాలకు మరింత సులభంగా రుణ సదుపాయం
గ్రామీణ సహకార బ్యాంకులకు సాంకేతిక సేవలందించేందుకు ఉమ్మడి సేవా సంస్థగా 'సహకార్ సారథి' ఏర్పాటు
प्रविष्टि तिथि:
10 FEB 2026 4:26PM by PIB Hyderabad
భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జనవరి 19, 2026 నుంచి సహకార సంఘాలకు తిరిగి అప్పులు ఇవ్వటం కోసం ఎన్‌సీడీసీకి బ్యాంకులు మంజూరు చేసే రుణాలను, సంబంధిత విభాగాల ద్వారా ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించేందుకు అర్హత ఉంటుంది.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, స్థానిక ప్రాంత బ్యాంకులకు మినహా మిగిలిన బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ రుణాలు ప్రాధాన్యతా రంగ రుణాల మాస్టర్ డైరెక్షన్-2025లో పేర్కొన్న లక్ష్యాలు, కార్యకలాపాలకు ఉద్దేశించినవి.
సహకార మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలోని చట్టబద్ధమైన సంస్థ అయిన జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ), సహకార సంఘాలకు ఆర్థిక సహాయాన్ని అందించటమే కాక, సహకార ఉద్యమ వృద్ధిని వేగవంతం చేయటంలో సహకరిస్తుంది.
సహకార బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచటానికి, పాలనను బలోపేతం చేయటానికి, డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించటానికి భారత ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పలు చర్యలు చేపట్టాయి. డిపాజిట్ల భద్రతను పెంచటం, రుణ సదుపాయాలను మెరుగుపరచటం, విశ్వసనీయంగా నిబంధనలను అమలు చేయటం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వాటిలో కొన్ని:
-
పట్టణ సహకార బ్యాంకులు (యూసీబీలు) కొత్త శాఖలను ప్రారంభించటానికి అనుమతి
-
పట్టణ సహకార బ్యాంకుల మొత్తం రుణాలు, అడ్వాన్సుల్లో గృహ రుణాల పరిమితి 10% నుంచి 25%కి పెంపు
-
సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీ కాలాన్ని 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతూ బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణ
-
సహకార బ్యాంకులను ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏఈపీఎస్)లో చేర్చటానికి వసూలు చేసే లైసెన్సింగ్ ఫీజు తగ్గింపు
-
పట్టణ సహకార బ్యాంకులకు సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు, కార్యాచరణ మద్దతును అందించటానికి సమన్వయ సంస్థగా నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌యూసీఎఫ్‌డీసీ) సంస్థ, డిపాజిట్లను స్వీకరించని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)గా ఏర్పాటు
-
గ్రామీణ సహకార బ్యాంకులకు సాంకేతిక సేవలందించేందుకు సహకార్ సారథి భాగస్వామ్య సేవల సంస్థ (ఎస్ఎస్ఈ) స్థాపన
-
సమన్వయ అంబుడ్స్‌మన్ పథకంలో గ్రామీణ సహకార బ్యాంకులను చేర్చిన ఆర్బీఐ
-
అన్ని సహకార బ్యాంకుల్లోని ప్రతి డిపాజిటరుకు గరిష్ఠంగా రూ.5,00,000 వరకు (అసలు, వడ్డీ కలిపి) భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ)
ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఇవాళ రాజ్యసభలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2226123)
आगंतुक पटल : 74