రైల్వే మంత్రిత్వ శాఖ
నిర్వహణ పనితీరు, భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులకు భారతీయ రైల్వే ఆమోదం
ఇంధన, ఖనిజ, సిమెంట్ కారిడార్‌ను బలోపేతం చేసేందుకు జార్ఖండ్‌లోని బార్బెండా-దమ్రుఘుటు డబ్లింగ్, దమ్రుఘుటు-బొకారో స్టీల్ సిటీ మధ్య 3,4వ లైన్ల నిర్మాణానికి ఆమోదం
భద్రత, రైళ్ల రాకపోకల సంఖ్యను పెంచడానికి ఉత్తర రైల్వే పరిధిలోని 34 రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు
అంబాలా–జలంధర్ విభాగంలో రద్దీని తగ్గించడానికి సరుకు రవాణా కదలికలను సులభతరం చేయడానికి రాజపురా బైపాస్ లైన్‌కు ఆమోదం
కేరళలోని కీలక మార్గంలో ప్రయాణీకుల, సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అలప్పుజ-అంబలపుజ డబ్లింగ్ ప్రాజెక్టు
ప్రయాణీకుల, సరుకు రైళ్ల నిలిపివేతను తగ్గించడానికి, జంక్షన్ల వద్ద రద్దీని తగ్గించడానికి పాలక్కాడ్ బైపాస్ ప్రాజెక్టు
తమిళనాడులోని చెన్నై–కోయంబత్తూర్–పోదనూర్ కారిడార్‌ను అధిక సామర్థ్యం కలిగిన నాలుగు లైన్ల మార్గంగా మార్చేందుకు ఇరుగూర్–పోదనూర్ డబ్లింగ్ పనులకు శ్రీకారం
నాడు పోస్టు చేయడమైనది:
09 FEB 2026 4:30PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా రైల్వే రద్దీని తగ్గించడం, లైన్ సామర్థ్యాన్ని పెంచడం, భద్రతా వ్యవస్థలను మెరుగుపరచడం, ప్రయాణీకుల, సరుకు రవాణాను మరింత వేగంగా, విశ్వసనీయంగా మార్చే లక్ష్యంతో భారతీయ రైల్వే సమగ్రమైన రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాలు దక్షిణ, ఉత్తర, ఆగ్నేయ రైల్వేల పరిధిలో ఉన్నాయి. వీటిలో లైన్ డబ్లింగ్, మూడు, నాలుగు లైన్లు, బైపాస్ కారిడార్లు, అధునాతన ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి.
బార్బెండా–దమ్రుఘుటు డబ్లింగ్, దమ్రుఘుటు–బొకారో స్టీల్ సిటీ 3, 4వ లైన్లు: రూ. 815.32 కోట్లు
జార్ఖండ్‌లోని బార్బెండా–దమ్రుఘుటు డబ్లింగ్, దమ్రుఘుటు–బొకారో స్టీల్ సిటీ మధ్య 3,4వ రైల్వే లైన్ల నిర్మాణాలు, ఆగ్నేయ రైల్వే పరిధిలో చేపట్టనున్న కీలక సామర్థ్య విస్తరణ ప్రాజెక్టులు. ఇవి దేశ ఇంధన, ఖనిజ, సిమెంట్ కారిడార్‌కు కీలకంగా నిలుస్తాయి. ప్రస్తుతం ఈ లైన్ 108 శాతం సామర్థ్య వినియోగంతో పనిచేస్తోంది. దీనివల్ల రైళ్లు 90-150 నిమిషాల పాటు నిలిచిపోతున్నాయి. ప్రతిరోజూ ఈ మార్గంలో 78 రైళ్లు (38 ప్రయాణీకుల, 40 సరుకు రవాణా రైళ్లు) నడుస్తున్నాయి. అలాగే ఏడాదికి సరుకు రవాణా సామర్థ్యం 35.22 మిలియన్ టన్నులుగా ఉంది. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే 2028–29 నాటికి వినియోగం 132 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కేంద్ర బొగ్గు గనులు, సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డిపో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డిపో, బొకారో స్టీల్ సిటీ పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానాన్ని బలపరుస్తుంది. ఈ విస్తరణ ద్వారా ఇంధన సరాఫరా వ్యవస్థ, పారిశ్రామిక ఉత్పత్తి, జాతీయ సరఫరా వ్యవస్థల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
హై-డెన్సిటీ నెట్‌వర్క్ (హెచ్‌డీఎన్), అత్యధికంగా వినియోగించే నెట్‌వర్క్ (హెచ్‌యూఎన్) మార్గాల్లో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్: రూ. 421.41 కోట్లు
రైల్వే భద్రతను, కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్న ఉత్తర రైల్వే మార్గాల్లోని 34 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (ఈఐ) వ్యవస్థను అమలు చేయడానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఢిల్లీ డివిజన్‌లోని 21 స్టేషన్లకు రూ. 292.24 కోట్లు, అంబాలా డివిజన్‌లోని 13 స్టేషన్లకు రూ. 129.17 కోట్లు కేటాయించింది.
ఈ ఆధునీకరణ ద్వారా రైళ్ల రాకపోకలు వేగంగా, సురక్షితంగా సాగుతాయి. సిగ్నలింగ్ వ్యవస్థల విశ్వసనీయత పెరుగుతుంది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో మరిన్ని రైళ్లను నడపడానికి వీలవుతుంది. అలాగే ఆధునిక రైలు రక్షణ వ్యవస్థలతో సమన్వయం మరింత మెరుగుపడుతుంది.
రాజ్‌పురా బైపాస్ లైన్, ఉత్తర రైల్వే: రూ. 411.96 కోట్లు
ఉత్తర రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే అంబాలా-జలంధర్ విభాగంలో సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడానికి రాజ్‌పురా బైపాస్ లైన్ నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా న్యూ శంభూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ) స్టేషన్ నుంచి రాజ్‌పురా–బటిండా లైన్‌లోని కౌలి స్టేషన్ వరకు రైలు అనుసంధానం ఏర్పడుతుంది. దీంతో సరుకు రైళ్లు రద్దీగా ఉండే రాజ్‌పురా యార్డ్‌ను దాటుకుని వెళ్లగలుగుతాయి. ఇది సరుకు రవాణాను సులభతరం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న రైలు లైను మార్గాలపై ఒత్తిడి తగ్గుతుంది. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ అవసరాలను సమర్థంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా డీఎఫ్‌సీతో మెరుగైన అనుసంధానం కల్పించి, ఈ ప్రాంతంలో ప్రయాణికుల, సరుకు రవాణా మరింత నమ్మకంగా, సజావుగా సాగేందుకు దోహదపడుతుంది.
ఆలప్పుజా-అంబలపుజా రైల్వే లైన్ డబ్లింగ్ (12.66 కి.మీ): రూ. 324.16 కోట్లు
ఎర్నాకులం-తురవూరు-కాయంకుళం మార్గంలో ఉన్న కీలకమైన సింగిల్ లైన్ అడ్డంకిని తొలగించడానికి ఈ వ్యూహాత్మక ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. ఇది పూర్తయిన తర్వాత ప్రతి దిశలో రోజుకు 9 అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపడానికి వీలవుతుంది. ఏడాదికి 2.88 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. రైల్వేకు ఏడాదికి రూ. 3.23 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు నిలిపివేత తగ్గి, కార్యకలాపాల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
ఈ కారిడార్‌లో మిగిలి ఉన్న చివరి సింగిల్ లైన్ విభాగాన్ని పూర్తి చేయడం ద్వారా రైళ్ల రాకపోకలు నిరంతరాయంగా, సాఫీగా సాగుతాయి. ఇది కేరళలో అంతరాష్ట్ర సరుకు రవాణాను బలోపేతం చేయడమే కాకుండా, ప్రధాన జంక్షన్ల వద్ద రద్దీని తగ్గించి, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వేగవంతమైన, నమ్మదగిన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
పాలక్కాడ్ టౌన్–పార్లీ బైపాస్ లైన్ (1.80 కి.మీ):రూ. 163.57 కోట్లు
కేరళలోని పాలక్కాడ్ జంక్షన్ వద్ద అనేక రైళ్లకు అవసరమైన ఇంజిన్ దిశ మార్చే ప్రక్రియను తొలగించడం ద్వారా పాలక్కాడ్ బైపాస్ ప్రాజెక్టు తక్షణ కార్యాచరణ, ప్రయాణికుల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రాజెక్టు అమలుతో ప్యాసింజర్ రైళ్ల నిలిపివేత సమయం సగటున 40-44 నిమిషాలు, సరుకు రవాణా రైళ్ల నిలిపివేత సమయం ప్రతి రైలుకు 120 నిమిషాల వరకు తగ్గుతుంది. పాలక్కాడ్ జంక్షన్ నుంచి భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే మరిన్ని ప్యాసింజర్ సర్వీసులకు ఇది మద్దతుగా నిలుస్తుంది.
రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం ద్వారా షోరనూర్, తిరువనంతపురం, పొల్లాచ్చి మార్గాల్లో రైళ్ల సమయపాలన గణనీయంగా మెరుగుపడుతుంది.దక్షిణ రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటైన పాలక్కాడ్‌లో రద్దీని ఇది తగ్గి వేగవంతమైన రైలు రాకపోకలకు మార్గం ఏర్పడుతుంది.
ఇరుగూర్–పోదనూర్ డబ్లింగ్ (10.77 కి.మీ): రూ. 277.42 కోట్లు
తమిళనాడుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి పనుల్లో ఒకటిగా చెన్నై–తిరువనంతపురం కారిడార్‌లో కీలక ఇరుగూర్–పోదనూర్ విభాగాన్ని డబ్లింగ్ చేయడానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు అమలుతో రోజుకు అదనంగా 15 ప్రయాణికుల రైళ్లు నడిపే అవకాశం ఏర్పడుతుంది. అలాగే సంవత్సరానికి 3.12 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. దీని ద్వారా వార్షిక నికర ఆదాయం రూ. 11.77 కోట్లు పెరుగుతుందని అంచనా.
ప్రస్తుతం ఈ విభాగంలో లైన్ సామర్థ్య వినియోగం 60 శాతంగా ఉంది. అయితే ఈ విస్తరణ పూర్తయిన తర్వాత 2027–28 నాటికి ఇది 131 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. ఇది ఈ ప్రాజెక్టు అత్యవసరాన్ని తెలుపుతుంది. ఇప్పటికే సమీప విభాగాల్లో ఇప్పటికే పూర్తయిన లేదా జరుగుతున్నలేదా అమలులో ఉన్న నాలుగు లైన్ల విస్తరణ పనులతో కలిపి ఇరుగూర్–పోదనూర్ డబ్లింగ్ పూర్తయితే మొత్తం చెన్నై–కోయంబత్తూర్–పోదనూర్ మార్గం ఒక అధిక సామర్థ్యంతో కూడిన నాలుగు లైన్ల కారిడార్‌గా మారనుంది. ఇది కోయంబత్తూర్ వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు ప్రత్యక్ష లాభం చేకూర్చడమే కాకుండా.. పోదనూర్ టెర్మినల్‌లో కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉత్తరాది ప్రాంతాలకు కొత్త రైలు సేవలను ప్రారంభించడానికి తోడ్పడుతుంది.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడానికి భారతీయ రైల్వే పూర్తిగా సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ ఆమోదాలు పునరుద్ఘాటిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో సహకారం అందితే ఈ ప్రాజెక్టులు వేగవంతమైన ప్రయాణాలకు, అధిక సరుకు రవాణా సామర్థ్యానికి, మెరుగైన భద్రతకు, స్థిరమైన ఆర్థిక వృద్ధికి దారితీస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2225834)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5