ఆయుష్
ఎన్ఐఏ జైపూర్ స్వర్ణోత్సవం.. ఆయుర్వేదలో 50 సంవత్సరాల నాయకత్వానికి గుర్తుగా జైపూర్‌లో ఈ రోజు కీలక మౌలిక సదుపాయాలు, ప్రజా సంబంధ కార్యక్రమాలకు శ్రీకారం
భారత ప్రాచీన వైద్య విజ్ఞానానికీ, ఆధునిక శాస్త్రవిజ్ఞానానికీ వారధిలా నిలిచిన ఎన్ఐఏ: ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ
శక్తిమంతమైన ఆయుష్ సంస్థల దన్నుతో ప్రపంచంలో ఓ సంపూర్ణ వెల్‌నెస్ సెంటర్‌గా ఎదగాలన్నదే భారత్ ధ్యేయం: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్
ఆయుర్వేద విద్యలో, ఆరోగ్య సంరక్షణలో రాజస్థాన్ గౌరవాన్విత నాయకత్వానికి ప్రతీక జాతీయ ఆయుర్వేద సంస్థ: ఉప ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ చంద్ బైర్వా
కీలక మౌలిక సదుపాయాల్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, సహాయ మంత్రి.. ఎన్ఐఏ జైపూర్‌లో మొదటి పాడ్‌కాస్టులో పాల్గొన్న సహాయ మంత్రి
కొత్త ఓపీడీ బ్లాకు, అడ్వాన్స్‌డ్ ఓటీ, సిమ్యులేషన్ ల్యాబులతో పాటు ధన్వంతరి ఉపవన్ ప్రారంభం.. విద్య, పరిశోధన, రోగుల సంరక్షణకు దన్ను
విద్య, పరిశోధన, రోగుల సంరక్షణకు గ్లోబల్ సెంటరుగా తన పాత్రను పునరుద్ఘాటించిన జాతీయ ఆయుర్వేద సంస్థ
నాడు పోస్టు చేయడమైనది:
09 FEB 2026 2:17PM by PIB Hyderabad
ఆయుర్వేద విద్య, పరిశోధన, ఆరోగ్యసంరక్షణలకు భారత్‌లో ప్రధాన సంస్థ, జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ ఆయుర్వేద సంస్థ (ఎన్ఐఏ) ఈ రోజు స్వర్ణోత్సవాన్ని జరుపుకొంది. ఈ సంస్థ గత 50 ఏళ్లుగా ఆయుర్వేద రంగంలో ఉంటూ ప్రజారోగ్యానికి విశేష సేవలందిస్తోంది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి (స్వతంత్ర), ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, ఆయుష్ మంత్రి శ్రీ ప్రేమ్ చంద్ బైర్వాలతో పాటు ఆయుష్ శాఖ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
మొదట 1976లో ఓ ఆయుర్వేద కళాశాలగా ఏర్పాటు చేసినప్పటి నుంచీ, భారత ఆయుర్వేద రంగంలో విద్య, శిక్షణ, పరిశోధన, చేతిరాత ప్రతుల శాస్త్రీయ అధ్యయన రంగాలతో పాటు రోగులకు చెప్పుకోదగిన స్థాయిలో సంరక్షణ సేవల్ని అందిస్తూ, ఈ రంగంలో మొదటి ‘డీమ్డ్- టు- బి యూనివర్సిటీ’ స్థితికి ఎన్ఐఏ ఎదగడాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ ఎన్ఐఏ స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ సంస్థ భారత ప్రాచీన వైద్య విజ్ఞానానికీ, ఆధునిక విజ్ఞానశాస్త్రానికీ ప్రత్యక్ష సేతువుగా ఉందన్నారు. సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమంటే అది ఒక్క కాలం విషయంలోనే కాకుండా, ఆయుర్వేదం పట్ల అంకిత భావంతో కూడిన సేవ, పరిశోధన, ప్రజారోగ్యం పట్ల నిబద్దతల కొనసాగింపు కూడా అని ఆయన అన్నారు.
రాజస్థాన్ చారిత్రకంగా ఆయుర్వేద పురోగతికి తోడ్పడిందనీ, వైద్యం పరంగా జీవ వైవిధ్యాన్నీ, సాంప్రదాయిక జ్ఞాన వ్యవస్థల్నీ సమృద్ధం చేసిందనీ ముఖ్యమంత్రి తెలిపారు. ఆయుష్ వ్యవస్థలను బలోపేతం చేయడానికీ, ప్రజల మేలు కోరి ఆయుర్వేదాన్నీ, యోగానీ, సాంప్రదాయిక వైద్యాన్నీ ప్రధాన స్రవంతి ఆరోగ్యసంరక్షణ ప్రణాళికతో మిళితం చేయడానికీ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోందని ఆయన అన్నారు.
విద్యలో, పరిశోధనలో, రోగుల సంరక్షణలో ఎన్ఐఏ దేశానికే నాయకత్వం వహిస్తోందని శ్రీ భజన్ లాల్ శర్మ ప్రశంసించారు. దేశంలో ప్రతిష్ఠాత్మక ఆయుర్వేద సంస్థల్లో ఒకటిగా ఎన్ఐఏ నిలిచిందని ఆయన చెప్పారు. సంస్థలో మౌలిక సదుపాయాలను విస్తరించడానికీ, విద్య పరంగా శ్రేష్ఠత్వాన్ని సాధించడానికీ, రాబోయే కాలాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంస్థను అభివృద్ధి చేయడానికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సాయాన్నందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
స్వర్ణోత్సవం అంటే సంకల్పాలను పునర్నవీకరించుకొనే సందర్బమని ముఖ్యమంత్రి వర్ణించారు. ఎన్ఐఏను రాబోయే దశాబ్దాల్లో ఆయుర్వేద విద్య, పరిశోధనల్లో గ్లోబల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలంటే ఉమ్మడి కృషి ఎంతయినా అవసరమని ఆయన అన్నారు. సంస్థ వారసత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టడంలో అమూల్య తోడ్పాటును అందించిన బోధన సిబ్బందినీ, విద్యార్థుల్నీ, పరిశోధకుల్నీ, పూర్వ విద్యార్థుల్నీ ఆయన అభినందించారు.
ఎన్ఐఏ 50 సంవత్సరాల ప్రస్థానం ఈ ప్రాచీన విజ్ఞానశాస్త్రాన్ని తరాల తరబడి పరిరక్షించడంతో పాటు ముందుకు తీసుకుపోతున్న ఆయుర్వేద పండితుల, వైద్యుల, పరిశోధకుల తిరుగులేని నిబద్ధతకు అద్దం పడుతోందని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ అన్నారు. ఎన్ఐఏ భారత సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఓ కీలక సంస్థగా ఉందని ఆయన వర్ణించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఆయుష్ వ్యవస్థలు జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలో బలంగా మమేకమయ్యాయని శ్రీ జాదవ్ అన్నారు. కొత్తగా మూడు ఆయుర్వేద విషయాల అఖిల భారత సంస్థల ఏర్పాటు, జాంనగర్లో సాంప్రదాయిక వైద్యానికి సంబంధించిన డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ సెంటర్ స్థాయి పెంపు వంటి బడ్జెటులో ప్రకటించిన ముఖ్య నిర్ణయాలను గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ నిర్ణయాలు ఆయుర్వేద రంగ రూపురేఖల్ని గొప్పగా మారుస్తాయన్నారు.
ఆయుష్‌ను ఫలితాలపై ఆధారపడే, శాస్త్రీయంగా చెల్లుబాటయ్యే, ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా నిలపాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు. అడ్వాన్స్‌డ్ రీసర్చ్, డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలు, అంతర్జాతీయ సహకారం, రోగులపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం వంటి అంశాల్లో ఎన్ఐఏ వంటి సంస్థలు కీలక పాత్రను పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
రాజస్థాన్ ప్రభుత్వం నిరంతరంగా మద్దతు ఇస్తుండడాన్ని శ్రీ జాదవ్ ప్రశంసిస్తూ, సంస్థ విస్తరణకు భూమిని సమకూర్చడంతో పాటు మౌలిక సదుపాయాల పరంగానూ సహకారాన్ని అందించడాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎన్ఐఏ ప్రపంచంలోనే సంపూర్ణ వెల్‌నెస్ కూడళ్లలో ఒకటిగా నిలిచి, ‘‘హీల్ ఇన్ ఇండియా’’ దార్శనికతకు తన వంతుగా చెప్పుకోదగ్గ తోడ్పాటును అందించగలుగుతుందన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు.
ఎన్ఐఏ స్వర్ణోత్సవాలు ఒక్క రాజస్థాన్‌కే కాకుండా దేశానికే గర్వకారణమని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, ఆయుష్ మంత్రి శ్రీ ప్రేమ్ చంద్ బైర్వా అన్నారు. 1976లో ఓ ఆయుర్వేద కళాశాలగా ఉన్న సంస్థ జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపును పొందిన సంస్థ స్థితికి చేరుకోవడం ఈ సంస్థ విద్యారంగ ప్రావీణ్యాన్నీ, సేవాతత్పరతనీ ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంపొందింపచేయడానికి ఆయుర్వేద, యోగాలతో పాటు సాంప్రదాయిక వైద్యాన్ని కూడా పటిష్ఠపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ బైర్వా పునరుద్ఘాటించారు. ఎన్ఐఏను ఆయుర్వేద విద్య, పరిశోధన, రోగుల సంరక్షణలలో ప్రపంచ శ్రేణి కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాజస్థాన్ ప్రభుత్వం నిరంతరాయంగా పూర్తి మద్దతును అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
స్వర్ణోత్సవాల్లో భాగంగా అనేక ముఖ్య కార్యక్రమాలనీ, సదుపాయాలనీ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్‌లు ప్రారంభించారు. వీటిలో ‘ధన్వంతరి ఉపవన్’ ప్రారంభ కార్యక్రమం కూడా కలిసి ఉంది. ఔషధ మొక్కలతో కూడిన ఒక తోటయే ఈ ఉపవనం. దీని తరువాత చర్చా కార్యక్రమాల్ని చేపట్టారు. కేంద్ర సహాయ మంత్రి మార్గదర్శకత్వం వహించారు. ఒక కొత్త ఆపరేషన్ థియేటర్ బ్లాకునీ, అడ్వాన్స్‌డ్ సిమ్యులేషన్ ల్యాబొరేటరీనీ కేంద్ర మంత్రి ప్రారంభించారు. వీటితో సంస్థలో వైద్య చికిత్స సంబంధిత శిక్షణ, పరిశోధన సామర్థ్యం, రోగుల సురక్ష విశేషించి మెరుగవుతాయి.
అవుట్‌పేషెంట్ సేవల్ని విస్తరించి, రోగుల లభ్యతని మెరుగుపరిచే దృష్టితో కొత్త ఓపీడీ బ్లాకు ‘‘సుశ్రుత్ భవన్’’ను ప్రారంభించారు. దీనికి అదనంగా, ఎన్ఐఏ పాడ్‌కాస్ట్ స్టూడియో నుంచి ఒకటో ఆధికారిక పాడ్‌కాస్టును మొదలుపెట్టారు. డిజిటల్ అవుట్ రీచ్, అకాడమిక్ కమ్యూనికేషన్, ప్రజా సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యాలను కేంద్ర మంత్రి తొలి ఎపిసోడ్‌లో వివరించారు.
విద్య, పరిశోధన, రోగులను దయతో సంరక్షించడం ద్వారా ఆయుర్వేదాన్ని పరిరక్షిస్తూ రోజు రోజుకూ మును ముందుకు తీసుకుపోవడానికి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రధాన సంస్థగా ఎన్ఐఏ పోషిస్తున్న కీలక పాత్రను స్వర్ణోత్సవ ఘట్టం పునరుద్ఘాటించింది. ఆయుర్వేద జ్ఞానం, డిజిటల్ హెల్త్ ఇన్నొవేషన్‌లతో పాటు సాంప్రదాయిక వైద్యంలో ప్రపంచ కూడలి (గ్లోబల్ హబ్)గా సంస్థను నిలబెట్టాలని ఉత్సవ ముగింపు సమయంలో ఉమ్మడిగా సంకల్పం చెప్పుకొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2225550)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9