సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
పూర్తి అధికారిక మర్యాదలతో శ్రీలంక చేరిన భగవాన్ బుద్ధుని పవిత్ర దేవ్‌నీమొరీ అవశేషాలు
కొలంబోలోని గంగారామయా ఆలయంలో ప్రారంభమైన పవిత్ర అవశేషాల ప్రదర్శన
ఈ కార్యక్రమ నిర్వహణ భారత్, శ్రీలంకల మధ్య ప్రగాఢ నాగరికతా, ఆధ్యాత్మిక సంబంధాలకు ప్రతీక
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 11:13AM by PIB Hyderabad
భగవాన్ బుద్ధునికి చెందిన దేవ్‌నీమొరీ పవిత్ర అవశేషాలు శ్రీలంకకు చేరుకోవడం, అక్కడ వాటి ప్రదర్శనను నిర్వహించడం భారత్, శ్రీలంకల మధ్య గల ప్రగాఢ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నాగరికతా సంబంధాలకు ప్రతీకగా నిలవడంతో పాటు, రెండు దేశాల ఉమ్మడి బౌద్ధ వారసత్వంలో ఇమిడిపోయి ఉన్న చిరకాల సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుంది.
భారతీయ వైమానిక దళ ప్రత్యేక విమానంలో శ్రీలంక చేరిన పవిత్ర అవశేషాలకు భారత్-శ్రీలంక ప్రోటోకాల్‌కు అనుగుణంగా పూర్తి అధికార మర్యాదలను అందించారు. గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్వ్రత్, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవీల నాయకత్వంలో ఓ ఉన్నత స్థాయి భారతీయ ప్రతినిధి వర్గం పవిత్ర అవశేషాల వెంట వెళ్లింది. ఈ ప్రతినిధి వర్గంలో సీనియర్ బౌద్ధ భిక్షువులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఏప్రిల్లో అధికారిక పర్యటనకు శ్రీలంక వెళ్లినప్పుడు ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను విస్తరించుకోవడానికి భారత్ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. ఆ ప్రకటనకు తరువాయిగా చేపట్టిన చర్యే ఇప్పటి ప్రదర్శన. ప్రధానమంత్రి ఆ పర్యటనలో.. బౌద్ధ సంబంధాల వ్యాప్తికి 2020వ సంవత్సరంలో ప్రకటించిన 15 మిలియన్ అమెరికా డాలర్ల గ్రాంటుకు అదనంగా అనురాధపురాలో సేక్రెడ్ సిటీ కాంప్లెక్స్ ప్రాజెక్టు అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కూడా ప్రకటించారు.
దేవ్‌నీమొరీ పవిత్ర అవశేషాల ప్రదర్శనను కొలంబోలోని పావన గంగారామయా ఆలయంలో 2026 ఫిబ్రవరి 4న శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయకే.. గుజరాత్ గవర్నరు, గుజరాత్ ఉప ముఖ్యమంత్రిలతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగారామయా ఆలయం ముఖ్య ప్రతినిధి డాక్టర్ కిరిందే అసాజీ థెరో కూడా పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2223786)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3