మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళలు, బాలికల రక్షణ, భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం..
వారి భద్రత కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రయత్నాలకు మద్దతుగా అనేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2026 1:25PM by PIB Hyderabad
యాసిడ్ దాడుల నివారణ, నేరస్థులకు శిక్ష, బాధితుల రక్షణ, పునరావాసం కోసం ప్రభుత్వం ఒక సమగ్ర చట్టపరమైన, సంస్థాగత, విధానపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో అమలవుతుంది.
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం ‘పోలీసు’, ‘శాంతిభద్రతలు’ అనేవి రాష్ట్రాల పరిధిలోని అంశాలు. వీటికి అనుగుణంగా శాంతిభద్రతల నిర్వహణ, దర్యాప్తు, విచారణ, యాసిడ్ దాడి బాధితులతో సహా పౌరులందరికీ రక్షణ కల్పించే ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట నిబంధనల ప్రకారం ఇలాంటి నేరాలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది.
భారతీయ శిక్షాస్మృతి స్థానంలో జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) 2023 ప్రకారం.. యాసిడ్ దాడిని ఒక ప్రత్యేకమైన, తీవ్రమైన నేరంగా గుర్తించారు. బీఎన్ఎస్ సెక్షన్ 124(1) ప్రకారం, యాసిడ్ లేదా అలాంటి రసాయన పదార్థాన్ని ఉపయోగించి తీవ్రమైన గాయం కలిగించిన వారికి కనీసం పది సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. దీనిని యావజ్జీవ కారాగార శిక్ష వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. అంతేగాక జరిమానా కూడా విధిస్తారు. బాధితురాలి వైద్య ఖర్చులకు సరిపోయే విధంగా ఈ జరిమానా న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండాలని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. బీఎన్ఎస్ సెక్షన్ 124(2) యాసిడ్ దాడికి ప్రయత్నించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. ఇందుకు జరిమానాతో పాటు అయిదు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తారు. దీనిద్వారా ఒకవేళ నేరం తీవ్ర గాయానికి దారితీయకపోయినా.. నేరస్థుడిని కఠినంగా శిక్షించేలా, ఇతరులకు హెచ్చరికగా ఉండేలా ఈ చట్టం నిర్ధారిస్తుంది.
భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) 2023 లోని సెక్షన్ 396 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘బాధితుల నష్టపరిహార పథకాన్ని’ రూపొందించాలి. నేరం ఫలితంగా నష్టపోయిన లేదా గాయపడిన బాధితులకు లేదా వారిపై ఆధారపడిన వారికి నష్టపరిహారం అందించడం, పునరావాసం కోసం నిధులను సమకూర్చడం ఈ పథకం ఉద్దేశం. అంతేకాకుండా నేరస్థుడి నుంచి బాధితులకు అందే జరిమానాకు అదనంగా ఈ నష్టపరిహారం చెల్లించాలని సెక్షన్ నిబంధన తెలుపుతుంది. యాసిడ్ దాడుల కేసుల్లో త్వరితగతిన చర్యలు తీసుకోవడం, బాధితులకు చికిత్స, నష్టపరిహారం అందించడంపై ప్రస్తుతం బీఎన్ఎస్ గా మారిన భారతీయ శిక్షా స్మృతి నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 20 ఏప్రిల్ 2015న ఒక సమగ్రమైన సలహా పత్రాన్ని జారీ చేసింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలో బాధితుల నష్టపరిహార పథకాలను రూపొందించాయి. నిర్భయ నిధి కింద కేంద్ర బాధితుల పరిహార నిధి (సీవీసీఎఫ్) పథకం ద్వారా రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాల నష్టపరిహార పథకాలకు మద్దతుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 200 కోట్లను ఒకేసారి ఆర్థిక సహాయంగా విడుదల చేసింది.
నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూపీ(సీ) No. 565/2012) కేసులో సుప్రీంకోర్టు 11.05.2018న ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. లైంగిక దాడులు, ఇతర నేరాలకు గురైన మహిళా బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) సవరించిన పథకాన్ని రూపొందించింది. ఈ పథకం యాసిడ్ దాడుల కేసులకు కూడా వర్తిస్తుంది. దీనిని అమలు చేయాల్సిందిగా 18.05.2018న మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, 28.06.2018న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేశాయి.
అలాగే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా).. న్యాయ సేవాధికార సంస్థల చట్టం 1987 ప్రకారం నల్సా (యాసిడ్ దాడి బాధితులకు న్యాయ సేవలు) పథకం 2016ను రూపొందించింది. యాసిడ్ దాడి బాధితులకు వైద్య సౌకర్యాలు, పునరావాస సేవలను పొందేలా చేయడం, వారికి న్యాయ సహాయాన్ని బలోపేతం చేయడం వంటివి ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు.
యాసిడ్ అమ్మకాలను నియంత్రించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 30.08.2013 ‘మోడల్ పాయిజన్ రూల్స్’ (నమూనా విష నియమాలు) ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. వీటిని అనుసరించి ఆయా రాష్ట్రాల్లో యాసిడ్ విక్రయాలపై నియంత్రణ విధించాలని సూచించింది. యాసిడ్, రసాయనాల రిటైల్ విక్రయాలు ఖచ్చితంగా పై నియమాల ప్రకారమే జరుగుతున్నాయో లేదో సమీక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశిస్తూ.. 12.08.2021న మరో సలహా పత్రాన్ని జారీ చేసింది. తద్వారా ఈ రసాయనాలు నేరాలకు వినియోగించకుండా చూడటమే దీని లక్ష్యం. ఈ మార్గదర్శకాలు www.mha.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
మహిళలు, బాలికల రక్షణ, భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది. వారి భద్రతను నిర్ధారించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రయత్నాలకు మద్దతుగా, అదనపు తోడ్పాటును అందించడానికి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. మహిళల రక్షణ, భద్రత, సాధికారత కోసం ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ అనే ఒక సమగ్ర పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్ సీలు) విభాగాలు ఉన్నాయి. ఇందులో దాడులు లేదా ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు ఒకే చోట వైద్య సహాయం, మానసిక-సామాజిక కౌన్సెలింగ్, పోలీస్ సహాయం, న్యాయ సహాయం, 5 రోజుల వరకు తాత్కాలిక వసతి వంటి సమగ్ర సేవలను అందిస్తాయి. 24×7×365 మహిళా హెల్ప్‌లైన్ (181): ఏడాది పొడవునా 24 గంటల పాటు పనిచేసే ఈ టోల్-ఫ్రీ నంబర్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర, సాధారణ పరిస్థితుల్లో అవసరమైన మహిళలను సంబంధిత అధికారులతో అనుసంధానించి సేవలు అందిస్తుంది. డిసెంబర్ 31, 2025 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 96,37,805 మంది మహిళలకు దీని ద్వారా సహాయం అందింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల కోసం దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ అత్యవసర స్పందన సహాయ వ్యవస్థ-(ఈఆర్ఆర్ఎస్ఎస్-112)తోపాటు మొబైల్ యాప్ ఆధారిత వ్యవస్థ కూడా ఆపదలో ఉన్న మహిళలకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం సాధారణ, అత్యవసర సేవల కోసం మహిళా హెల్ప్‌లైన్ (181)ను కూడా ఈఆర్ఎస్ఎస్ తో (112)తో అనుసంధానించారు. నిర్భయ నిధి కింద అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, ఉన్న వాటిని బలోపేతం చేయడానికి కేంద్రం నిధులు సమకూర్చింది. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లలో 14,658 హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటయ్యాయి. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మిషన్ శక్తి కింద ‘సమర్థ్య’ అనే ఉప పథకాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో శక్తి సదన్ విభాగం యాసిడ్ దాడి బాధితులతో సహా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళలకు సహాయం, పునరావాసం కల్పిస్తుంది.
పోలీస్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ బ్యూరో(పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ) కూడా పలు కీలక చర్యలను చేపట్టింది. వీటిలో ప్రధానంగా దర్యాప్తు అధికారులు, విచారణ అధికారులు, వైద్య అధికారుల కోసం శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. పోలీసు స్టేషన్లలోని ‘మహిళా సహాయ కేంద్రాలు’ సజావుగా పనిచేసేలా చూడటానికి బీపీఆర్ అండ్ డీ ప్రామాణిక కార్యాచరణ విధానాలను కూడా రూపొందించింది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడం, వాటిని గుర్తించడం, బాధితులతో వ్యవహరించే సమయంలో పోలీసులు సరైన ప్రవర్తనా, వైఖరి నైపుణ్యాలను పొందేలా ఈ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. మహిళల భద్రతపై వెబినార్లు, పోలీసు సిబ్బందికి లింగ సమానత్వంపై సున్నితత్వంతో కూడిన అవగాహన కార్యక్రమాలను కూడా పీఆర్ అండ్ డీ నిర్వహించింది.
అంతేకాకుండా ప్రభుత్వం జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడబ్ల్యూ), రాష్ట్రాల్లోని దాని అనుబంధ సంస్థల ద్వారా సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఆడియో-విజువల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వంటి మార్గాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. మహిళల భద్రత, రక్షణ, చట్టాల్లోని వివిధ నిబంధనల గురించి ప్రజలను చైతన్యపరుస్తోంది. అంతేగాక మహిళా భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు,కేం ద్రపాలిత ప్రాంతాలకు సలహాలు జారీ చేస్తున్నాయి. నమోదైన ఫిర్యాదుల విషయంలో జాతీయ మహిళా కమిషన్ సంబంధిత భాగస్వాములతో.. ముఖ్యంగా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ కేసులను ఒక ముగింపుకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2223210)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11