మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
బాల్య వివాహ రహిత దేశంగా భారత్‌ను మార్చాలన్న లక్ష్యంతో చేపట్టిన బాల వివాహ ముక్త భారత్.. 6 కోట్లకు పైగా పౌరులకు చేరువైన అవగాహనా కార్యక్రమాలు
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోర్టల్‌లో 28 లక్షలకు పైగా ప్రతిజ్ఞలు నమోదు
దేశవ్యాప్తంగా విశేష సామాజిక స్పందన, క్రియాశీల భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2026 1:26PM by PIB Hyderabad
బాల్య వివాహ రహిత దేశంగా భారతదేశాన్ని మార్చాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 27 నవంబర్ 2024న 'బాల వివాహ ముక్త భారత్' జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'వికసిత్ భారత్' విజన్ ను సాకారం చేసే క్రమంలో 'ప్రభుత్వం, సమాజం కలిసికట్టుగా' పనిచేస్తూ, బాలికలు, మహిళల్లో విద్య, నైపుణ్యం, వ్యాపార సామర్థ్యాలను పెంపొందించటం అత్యంత కీలకం. బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పించటం, తల్లిదండ్రులు, కుటుంబాలు, సమాజాన్ని ఇందులో భాగస్వాములను చేయటం, బాల్య వివాహ నిరోధక అధికారుల (సీఎంపీఓలు) పాత్రను, సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయటం, సకాలంలో బాల్య వివాహాల సమాచారం అందించేలా ప్రోత్సహించటం, బడి మానేసిన, బాల్య వివాహాల ముప్పున్న అమ్మాయిలను గుర్తించి.. చదువు, నైపుణ్య శిక్షణ, సాధికారత అందేలా చూడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలు.
ఈ కార్యక్రమం విజయవంతం కావటంతో ప్రయత్నాలను మరింత పెంచుతూ, 4 డిసెంబర్ 2025న బాల వివాహ ముక్త భారత్ ద్వారా 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి, అన్ని వర్గాల వారిని క్రమబద్ధమైన, నిర్ణీత కాలపరిమితితో ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బాల్య వివాహ నిరోధక అధికారుల (సీఎంపీఓలు) వివరాలను బీవీఎంబీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయటంతో పాటు వివిధ సంస్థలు, సమాజంలోని ప్రముఖ నాయకులు, సేవా సంస్థలకు చేరువ కావటంపై ఈ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం దృష్టి సారిస్తుంది.
ఈ ప్రచార కార్యక్రమాన్ని దశలవారీగా, నిర్దేశిత అంశాల ఆధారంగా అమలు చేస్తారు. మొదటి దశ (27 నవంబర్ 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు) లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చర్చా పోటీలు, వ్యాసరచన పోటీలు, ప్రతిజ్ఞా ఈవెంట్లు వంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. రెండో దశ (1 జనవరి 2026 నుంచి 31 జనవరి 2026 వరకు)లో మతపరమైన సంస్థలు, వివాహ అనుబంధ సేవలందించే దేవాలయాలు, మసీదులు, క్యాటరింగ్ చేసేవారు, టెంట్‌హౌజ్‌లు, డీజే నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ, బాల్య వివాహాలను తగ్గించేలా ఐఈసీ సామాగ్రిని ప్రదర్శిస్తారు. మూడో దశ (1 ఫిబ్రవరి 2026 నుంచి 8 మార్చి 2026)లో గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులను చైతన్యపరుస్తూ, వాటి పరిధిలోని ప్రాంతాలను బాల్య వివాహ రహిత ప్రాంతాలుగా ప్రకటించి, తీర్మానం చేసేలా ప్రోత్సహిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2223203)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12