రక్షణ మంత్రిత్వ శాఖ
సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (ఎస్‌ఎఫ్‌డీఆర్) సాంకేతికతను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్‌డీఓ
నాడు పోస్టు చేయడమైనది:
03 FEB 2026 5:15PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఫిబ్రవరి 03, 2026 ఉదయం 10:45 గంటలకు ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (ఎస్‌ఎఫ్‌డీఆర్) సాంకేతికతను విజయవంతంగా ప్రయోగించింది. ఈ విజయవంతమైన ప్రదర్శన ద్వారా దీర్ఘశ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను అభివృద్ధి చేసే సాంకేతికత గల అగ్రశ్రేణి దేశాల జాబితాలో భారత్ చేరటమే కాక, ఈ సాంకేతికత ద్వారా శత్రువులపై వ్యూహాత్మక ఆధిపత్యం సాధించే సామర్థ్యం భారత్‌కు లభించింది.
గ్రౌండ్ బూస్టర్ మోటార్ సహాయంతో ఈ వ్యవస్థ నిర్దేశిత మాక్ నంబర్ వేగాన్ని అందుకున్న తర్వాత.. నాజిల్-లెస్ బూస్టర్, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ సహా అన్ని ఉప-వ్యవస్థలు ఆశించిన స్థాయిలో అత్యుత్తమంగా పనిచేశాయి. బంగాళాఖాతం తీరం వెంబడి చాందీపూర్‌లో ఐటీఆర్ ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన క్షిపణి డేటా ఆధారంగా ఈ వ్యవస్థ పనితీరుని విజయవంతంగా నిర్ధారించారు. రక్షణ పరిశోధనా, అభివృద్ధి లాబొరేటరీ (డీఆర్‌డీఎల్), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (హెచ్‌ఈఎంఆర్‌ఎల్), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), ఐటీఆర్ వంటి డీఆర్‌డీఓకు చెందిన వివిధ ప్రయోగశాలల సీనియర్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు.
ఎస్ఎఫ్‌డీఆర్ సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించినందుకు డీఆర్‌డీఓ, పారిశ్రామిక వర్గాలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
విజయవంతంగా జరిగిన క్షిపణి ప్రయోగంలో భాగస్వాములైన బృందాలను రక్షణ విభాగం ఆర్ అండ్ డీ కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు.
***
(రిలీజ్ ఐడి: 2222826)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17