దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతాలు.. తమిళనాడు (విరుదునగర్), తెలంగాణ (వరంగల్), గుజరాత్ (నవసారి), కర్ణాటక (కలబురగి), మధ్యప్రదేశ్ (ధార్), ఉత్తరప్రదేశ్ (లక్నో), మహారాష్ట్ర (అమరావతి)లో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్ర) పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికోసం ఏడేళ్ల కాలానికి 2027-28 వరకు రూ.4,445 కోట్ల నిధులు కేటాయించింది. పీఎం మిత్ర పథకం ద్వారా ఒక్కో పార్కుకు సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడి వస్తుందని, తద్వారా 3 లక్షల మందికి ఉపాధి (ప్రత్యక్షంగా 1 లక్ష, పరోక్షంగా 2 లక్షల ఉద్యోగాలు) లభిస్తుందని అంచనా. పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఈ పార్కులను సమర్థవంతంగా అమలు చేయటానికి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిలో రాష్ట్రాలు, పెట్టుబడిదారులు, పొటెన్షియల్ పార్క్ డెవలపర్లతో సహా వివిధ వాటాదారులతో ప్రభుత్వం 200లకు పైగా సంప్రదింపులు జరిపింది.
ఈ పార్కుల గేట్ల నుంచి బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,160.17 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించి, ఇప్పటివరకు రూ.564.72 కోట్లు ఖర్చు చేశాయి. మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణలోని పీఎం మిత్ర పార్కుల కోసం రూ.7,145 కోట్ల విలువైన డీపీఆర్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మధ్యప్రదేశ్‌లో రూ.24,175 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 1,150 ఎకరాల భూమిని కేటాయించారు. తమిళనాడులో రూ.2,076 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 201 ఎకరాల భూమి కోసం ఇప్పటికే దరఖాస్తులు అందాయి. మహారాష్ట్రలో భూ కేటాయింపుల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. తెలంగాణలో ఇప్పటికే 540 ఎకరాల భూమిని కేటాయించగా, రూ.3,862 కోట్ల మేర పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. పీఎం మిత్ర పథకంలోని డెవలప్‌మెంట్ క్యాపిటల్ సపోర్ట్‌లో భాగంగా మొదటి విడత ద్వారా మధ్యప్రదేశ్, తమిళనాడుకు ఒక్కొక్క దానికి రూ.50 కోట్ల చొప్పున, మహారాష్ట్ర, తెలంగాణకు ఒక్కొక్క రాష్ట్రానికి రూ.30 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి.
తమిళనాడులోని విరుదునగర్ పీఎం మిత్ర పార్కుకు సంబంధించి 100% భూసేకరణ పూర్తయింది. పర్యావరణ అనుమతులతో సహా అవసరమైన అన్ని అనుమతులు లభించాయి. రూ.1,894 కోట్ల విలువైన ప్రాజెక్టు నివేదికకు ఆమోదం లభించగా, రూ.364 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను ఇప్పటికే కేటాయించారు. భూ కేటాయింపు విధానానికి ఆమోదం లభించిన తర్వాత, ఇప్పటివరకు 201 ఎకరాల భూమికి రూ.2,076 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో దరఖాస్తులు అందాయి.
కొత్తగా ఇతర పీఎం మిత్ర పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో లేవు.
ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి శ్రీ పబిత్రా మార్గరీటా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారమిచ్చారు.
***