మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉమీద్ కేంద్ర పోర్టల్ లో సర్వే, వక్ఫ్ ప్రాపర్టీ లీజు పేరుతో రెండు కొత్త మాడ్యూళ్లను ప్రారంభించిన మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 31 JAN 2026 1:13PM by PIB Hyderabad

ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం, అభివృద్ధి (ఉమీద్) కేంద్ర పోర్టల్ ద్వారా పారదర్శకమైన, ప్రజానుకూలమైన, జవాబుదారీతనంతో కూడిన వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతర ప్రయత్నాలను చేపడుతోంది. దీనిలో భాగంగా.. ఈ పోర్టల్లో సర్వే, వక్ఫ్ ప్రాపర్టీ లీజు పేరుతో రెండు అదనపు మాడ్యూళ్లను 2026 జనవరి 30న ప్రారంభించింది.

మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ ఈ కొత్త మాడ్యూళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వక్ఫ్ ఆస్తుల సర్వేకు సంబంధించిన సమాచార సేకరణ, నిర్వహణ, నవీకరణల కోసం అవసరమైన సమగ్ర డిజిటల్ విధానాన్ని పోర్టల్లోని సర్వే మాడ్యూల్ అందిస్తుంది.

పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల లీజుకు సంబంధించిన మొత్తం సమాచార నిర్వహణను సులభతరం చేయడానికి వక్ఫ్ ప్రాపర్టీ లీజ్ మేనేజ్మెంట్ మాడ్యూల్ రూపుదిద్దుకుంది. ఇది లీజు సమాచారం, లీజు వ్యవధి, లీజు మొత్తం, తదితర ముఖ్యమైన వివరాలను నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా నమోదు చేయడానికి, పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా వక్ఫ్ ఆస్తుల లీజు విధానంలో జవాబుదారీతనాన్ని, పర్యవేక్షణను బలోపేతం చేస్తుంది.

వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో సామర్థ్యాన్ని, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి డిజిటల్ పాలనా పద్ధతులను ఉపయోగించుకొనేందుకు మంత్రిత్వ శాఖ చేపడుతున్న నిరంతర ప్రయత్నాలను ఈ ప్రారంభం ప్రతిబింబిస్తుంది.

ఈ మాడ్యూళ్లను విస్తృతంగా అమలయ్యేలా చూడాలని, అర్హులైన లబ్ధిదారుల్లో అవగాహనను పెంపొందించాలని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులకు డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ సూచించారు.

ఉమీద్ కేంద్ర పోర్టల్‌ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెణ్ రిజిజు 2025 జూన్ 6న ప్రారంభించారు. ఇది ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం, అభివృద్ధి చట్టం - 1995 ప్రకారం వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసే, ధ్రువీకరించే, పర్యవేక్షించే డిజిటల్ వేదికగా పనిచేస్తుంది.

విస్తృతమైన పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, ప్రజా భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ప్రాథమిక మార్పును తీసుకురావడమే ఈ పోర్టల్ లక్ష్యం.

అన్ని వక్ఫ్ ఆస్తులకు జియో ట్యాగింగ్ ద్వారా సమగ్ర డిజిటల్ జాబితాను రూపొందించడం, సకాలంలో, సమర్థంగా ప్రతిస్పందనను అందించేలా ఆన్లైన్ ఫిర్యాదు పరిష్కార యంత్రాంగం, పారదర్శకమైన లీజు, వినియోగ ట్రాకింగు, జీఐఎస్ మ్యాపింగ్ ఏకీకరణ, ఇతర ఈ-గవర్నెన్స్ సాధనాలు, ఇతర ముఖ్యమైన ఫీచర్లు దీనిలో ఉన్నాయి. అలాగే ధ్రువీకరించిన రికార్డులు, నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సమర్థంగా చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కలసి పనిచేస్తోంది.

 

****


(రిలీజ్ ఐడి: 2221291) సందర్శకుల సూచీ సంఖ్య : : 68
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Malayalam