ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంట్ బడ్జెటు సమావేశాలు మొదలైన సందర్భంగా ప్రధానమంత్రి వాఖ్యలు
प्रविष्टि तिथि:
29 JAN 2026 11:33AM by PIB Hyderabad
మిత్రులారా, మీకు శుభాకాంక్షలు.
నిన్న, గౌరవ రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పడమే కాకుండా, 140 కోట్ల మంది దేశ ప్రజల ఉమ్మడి కృషితో పాటు ఆకాంక్షలకు.. మరీ ముఖ్యంగా యువత ఆకాంక్షలకు నిర్దిష్ట వ్యాఖ్యానంగా ఉన్నది. ఆ ప్రసంగం చట్టసభల సభ్యులందరికీ మార్గదర్శకం కాగల అనేక ఆలోచనల్ని కూడా ఆవిష్కరించింది. సమావేశాల ఆరంభంలో, అదీనూ 2026 సంవత్సరం మొదలయ్యీ మొదలవక ముందే, గౌరవ రాష్ట్రపతి గారు సభలో పేర్కొన్న విషయాలు చాలా సరళ భాషలో దేశాధినేతగా చెప్పిన మాటలు. ఈ మాటలను పట్టి చూస్తే పార్లమెంటు గౌరవ సభ్యులంతా ఈ మాటల్ని గంభీరంగా లెక్క లోకి తీసుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను. నిజానికి, ఈ సమావేశాలు ఎంతో కీలకం. బడ్జెట్ సమావేశాలివి.
అప్పుడే 21వ శతాబ్దంలో నాలుగో వంతు గడిచిపోయింది. మనం ఇక రెండో పావు భాగాన్ని మొదలుపెడుతున్నాం. ఇది 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సాధించడానికి కీలకమైన 25 సంవత్సరాల కాలానికి నాంది పలుకుతున్నది. ప్రస్తుత బడ్జెటు ఈ శతాబ్దిలో రెండో పావు భాగానికి సంబంధించి మొదటి బడ్జెటు. అంతేకాదు, ఆర్థిక మంత్రి నిర్మల గారు పార్లమెంటులో వరుసగా తొమ్మిదో సారి బడ్జెటును సమర్పిస్తున్నారు. ఈ పనిని చేస్తున్న మొదటి మహిళా ఆర్థిక మంత్రి ఆమె. ఈ సందర్భం భారత పార్లమెంటరీ చరిత్రలో ఓ గౌరవప్రదమైన క్షణంగా నమోదు కాబోతోంది.
మిత్రులారా,
చాలా ఆశాజనకమైన సూచనతో ఈ సంవత్సరం మొదలైంది. ప్రస్తుతం ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న భారత్ పూర్తి ప్రపంచానికి ఒక ఆశాకిరణంగానూ, ఆకర్షణకేంద్రంగానూ మారింది. ఈ క్వార్టర్ ఆరంభంలో భారత్‌కీ, యూరోపియన్ యూనియన్‌కీ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. రాబోయే సూచనలు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయో, భావి కాలం భారత్ యువతకు ఎంత ఉజ్వలంగా ఉందో ప్రతిబింబిస్తోంది. ఇది ఆకాంక్షాత్మక భారత్‌కు ఉద్దేశించిన స్వేచ్ఛా వాణిజ్యం.. ఉత్సాహం ఉరకలు వేస్తున్న యువతకు ఉద్దేశించిన స్వేచ్ఛా వాణిజ్యం.. స్వయంసమృద్ధ భారత్‌కు ఉద్దేశించిన స్వేచ్ఛా వాణిజ్యం. ఈ అవకాశాన్ని ప్రత్యేకించి భారత తయారీ రంగ సంస్థలు వాటి సామర్థ్యాల్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకుంటాయని నేను నమ్ముతున్నాను.
దీనిని వర్ణిస్తున్న ప్రకారమే.. ఇలాంటి ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’.. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కొలిక్కివచ్చిన సందర్భంగా మన పారిశ్రామికవేత్తలూ, తయారీదారు సంస్థలూ ఒక పెద్ద మార్కెట్టు అందుబాటులోకి వచ్చిందనీ, తమ సరుకుల్ని చౌకగా అక్కడికి పంపుకోవచ్చనీ మాత్రమే ఆలోచిస్తూ సంతోషపడ కూడదనీ, దీనిని ఓ అవకాశంగా తీసుకోవాలనీ ఉత్పత్తిదారు సంస్థలకు నేను సూచనలు చేస్తున్నాను. ఇది ఒక అవకాశం.. మరి నాణ్యతపై శ్రద్ధ తీసుకోవడమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అంశం. ఇప్పుడు మార్కెట్టంటూ ఏర్పడింది కాబట్టి, మనం అత్యుత్తమ నాణ్యతతోనే ఆ మార్కెట్టు లోకి ప్రవేశించాలి.. తప్పదు. మనం అగ్ర శ్రేణి నాణ్యతతో వెళ్తే, యూరోపియన్ యూనియన్ లోని 27 దేశాలన్నింటిలో డబ్బును సంపాదించడంతో పాటు, ఆయా దేశాల ప్రజల మనసులను కూడా గెలుచుకోగలుగుతాం. దాని ప్రభావం.. నిజానికి, ఎంతో కాలం పాటు.. దశాబ్దాల తరబడి.. ఉంటుంది. కంపెనీల బ్రాండులు.. దేశ బ్రాండు సహా .. ఒక కొత్త గౌరవాన్ని సంపాదించి పెట్టగలుగుతాయి.
ఈ కారణంగా, 27 దేశాలతో కుదిరిన ఈ ఒప్పందం మన మత్స్యకారులకు, మన రైతులకు, మన యువతతో పాటు ప్రపంచంలో ఏ మూలనైనా పనిచేయడానికి ఉవ్విళ్లూరుతున్న సేవల రంగం వారికీ చాలా పెద్ద అవకాశాల్ని అందిస్తోందని చెప్పుకోవచ్చు. ఇది ఆత్మవిశ్వాసం తొణికిసలాడే, పోటీతత్వంతో వర్ధిల్లే, ఉత్పాదన ప్రధానమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా వేసిన కీలక అడుగు అని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
దేశ ప్రజల ధ్యాసంతా బడ్జెటు మీదే ఉండడం సహజమే. అయితే ఈ ప్రభుత్వం సంస్కరణల్ని తీసుకు రావడమే కాక, వాటిని ఆచరణలో పెడుతూ మార్పును తీసుకు వస్తున్న ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మనం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్నాం.. ఈ ఎక్స్‌ప్రెస్ చాలా వేగంగానూ ప్రయాణిస్తోంది . ఈ ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వేగాన్ని మరింత పెంచడానికి తమ వంతు సకారాత్మక శక్తిని జత చేస్తున్న పార్లమెంటులోని నా తోటి సభ్యులందరికీ కృతజ్ఞతలు. వారు జోడిస్తున్న శక్తితోనే, ఈ రైలు మరింతగా జోరందుకుంటోంది.
దేశం ఇప్పుడు చాలా కాలంగా పరిష్కారం కాకుండా మిగిలిన సమస్యల నుంచి బయటపడి, దీర్ఘకాలం పాటు ప్రభావాన్ని ప్రసరించగల పరిష్కారాల మార్గంలో పయనిస్తోంది. దీర్ఘకాలం పాటు ప్రభావాన్ని ప్రసరించగల పరిష్కారాలను ప్రవేశపెట్టిన పక్షంలో ఎలాంటి ఫలితాలు సిద్ధించగలవో అంచనా వేయడానికి వీలవుతుంది.. ఇది ప్రపంచ దేశాల్లో నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో దేశ ప్రగతే మన ధ్యేయంగా ఉంటుంది, అంతే కాక మన నిర్ణయాలన్నీ ప్రజలకు ప్రయోజనాల్ని చేకూర్చడమే ప్రధానంగా ఉంటాయి. మనం సాంకేతికతతో పోటీ పడదాం, సాంకేతికతను స్వీకరిద్దాం, సాంకేతికతకున్న అవకాశాలను గుర్తిద్దాం. అదే కాలంలో, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చే వ్యవస్థ వన్నె ఎంతమాత్రం తగ్గిపోనివ్వకుండా తగిన జాగ్రత్త చర్యల్ని తీసుకుందాం. ప్రయోజనాల్ని పరిరక్షించడానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటూ సాంకేతికత, మానవీయతల మేలికలయికతో ముందుకు ముందుకు సాగిపోదాం.
మా తప్పొప్పుల్ని ఎంచే సహచరులుండటం, వారికి మేం నచ్చొచ్చు లేదా నచ్చకపోవచ్చు.. ప్రజాస్వామ్యంలో సహజం. అయితే ఒకటి మాత్రం ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. అది.. వేర్వేరు పథకాల ప్రయోజనాల్ని సమాజం లోని చిట్టచివరి వ్యక్తికి కూడా అందించడం తన ప్రాధాన్యమని ఈ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.. అనేదే. పథకాలు దస్త్రాలకే పరిమితం కాకూడదని, వాటి లాభాలు ప్రజలకు చేరేటట్లు చూసే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణల్ని తీసుకువస్తూ, వాటిని రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా చేరవేసే సంప్రదాయం కొనసాగుతుంది.
భారతదేశ ప్రజాస్వామ్యంపైనా, భారత్‌లోని ప్రస్తుత జనాభా కూర్పు తీరుతెన్నులపైనా ప్రపంచం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రజాస్వామ్యానికి ఆలయం వంటి ఈ దేశం నుంచి మనం అంతర్జాతీయ సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.. అది, మన సామర్థ్యాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మనకున్న నిబద్ధతకూ
, ప్రజాస్వామ్య ప్రక్రియలను ఉపయోగించి మనం తీసుకున్న నిర్ణయాల పట్ల మనం చూపించే ఆదరణలకూ సంబంధించిన సందేశం. ఈ నిర్ణయాల్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తాయి, స్వీకరిస్తాయి.
దేశం మున్ముందుకు సాగిపోతున్న కాలం.. ఇది ఆటంకాల యుగమేమీ కాదు; ఇది పరిష్కారాలను సాధించే శకం. ప్రస్తుతం, భంగపరచడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం లేదు, పరిష్కారాన్ని కనుగొనడానికే పెద్దపీట వేస్తున్నాం. ఇది తీరికగా కూర్చొని, అవరోధాలను నిలబెట్టి మరీ ఏడ్చే కాలం కాదు, ఇది సాహసోపేతమైన కాలం, సమాధానాలను అందించగల నిర్ణయాలు తీసుకొని తీరాలని పట్టుబట్టిన కాలం. దేశానికి అత్యవసరమైన పరిష్కారాలను కనుగొనాల్సిన దశ.. దీనిని పరుగులు పెట్టించాల్సిందిగానూ, నిర్ణయాలు తీసుకోవడంలో మాకు శక్తిని అందించాల్సిందిగానూ, వివిధ పథకాల ప్రయోజనాల్ని సమాజంలో చిట్టచివరన నిలబడ్డ వ్యక్తికి కూడా అందించగలిగేలా చేయడంలో మీరు ముందుకు వచ్చి తోడ్పడవలసిందిగా పార్లమెంటు సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మీకు అనేకానేక ధన్యవాదాలు. మీకందరికీ శుభాకాంక్షలు.
***
(रिलीज़ आईडी: 2220174)
आगंतुक पटल : 6