రక్షణ మంత్రిత్వ శాఖ
గణతంత్ర దినోత్సవం 2026: కర్తవ్యపథ్‌లో 'ఆపరేషన్ సింధూర్: సమైక్య విజయం' పేరుతో త్రివిధ దళాల శకటం ప్రదర్శన
प्रविष्टि तिथि:
23 JAN 2026 4:47PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ లో 26 జనవరి 2025న జరిగే 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సింధూర్: సమైక్య విజయం' పేరుతో త్రివిధ దళాల ఉమ్మడి శకటాన్ని ప్రదర్శించనున్నాయి. ఈ శకటం పరిణతి చెందిన దేశ సైనిక సిద్ధాంతానికి శక్తిమంతమైన, అధికారిక ప్రతిరూపంగా నిలవటమే కాక, కచ్చితత్వం, సమగ్రత, స్వదేశీ ఆధిపత్యం దిశగా భారతదేశ పరివర్తనను తెలియజేస్తుంది. దీనిద్వారా నిర్ణయాత్మక, సమన్వయంతో కూడిన, స్వావలంబన సైనిక శక్తి ఆరంభాన్ని భారత్ స్పష్టం చేస్తుంది.
పెరుగుతున్న ఆత్మనిర్భర్ భారత్ శక్తికి, వికసిత్ భారత్ @2047 దిశగా సాగుతున్న ప్రయాణానికి ప్రధానమంత్రి దార్శనికతతో సాగిన 'ఆపరేషన్ సింధూర్' నిదర్శనంగా నిలిచింది. స్వయంప్రతిపత్తి, సమన్వయం, తిరుగులేని రక్షణ సామర్థ్యమే లక్ష్యంగా భవిష్యత్ ఉంటుంది. త్రివిధ దళాల సమైక్య శక్తిని ఈ శకటం చైతన్యవంతంగా, క్రమపద్ధతిలో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
ప్రారంభ విభాగం సముద్రంలో భారత నౌకాదళం ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఇది సముద్రజలాలపై పట్టును నిరూపిస్తూ, శత్రువుల కార్యాచరణ స్వేచ్ఛను నిలువరించేలా ఉంటుంది. ఈ దృశ్యం భారత సైన్యానికున్న బలమైన సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. శత్రువుల ఆలోచనలను చిత్తు చేయటానికి 'ఎం777 అల్ట్రా-లైట్ హోవిట్జర్లు' కచ్చితమైన, సమర్థవంతమైన ఆయుధ శక్తిని ప్రదర్శిస్తాయి. వీటి వెనుక రక్షణ కవచంలా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇది భారత సమగ్ర వైమానిక రక్షణ కవచానికి, శత్రువులు ఛేదించలేని వైమానిక స్థితికి చిహ్నంగా నిలుస్తుంది.
భారత జాతీయ భద్రతా సిద్ధాంతంలో చోటుచేసుకున్న సరికొత్త మార్పులు.. వేగంగా స్పందించటం, పరిస్థితికి తగినట్లుగా బలగాలను మోహరించటం, కచ్చితత్వం వంటి వాటిని ఈ శకటం మధ్య భాగంలోని దాడి నేపథ్య రూపం ప్రతిబింబిస్తుంది. ఒక హెచ్ఏఆర్ఏపీ లోయిటరింగ్ మ్యూనిషన్ శత్రువుల వైమానిక రక్షణ రాడార్‌ను చిత్తుచేయటం ద్వారా మానవరహిత యుద్ధతంత్రంలో భారతదేశ పట్టును ప్రదర్శిస్తుంది. దీన్ని అనుసరిస్తూ స్కాల్ప్ క్షిపణులతో సన్నద్ధమైన రాఫెల్ విమానం, ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేయడాన్ని సూచిస్తుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగిస్తూ ఎస్‌యూ-30 ఎంకేఐ విమానం శత్రువుల కంచు కోటల్లాంటి విమాన షెల్టర్లను ధ్వంసం చేయడం, శత్రు భూభాగంలోకి వెళ్లి, అత్యంత వేగంగా, కచ్చితత్వంతో దాడి చేయగల భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.
భారతదేశ ఏకీకృత గగనతల రక్షణ వ్యవస్థ విస్తృత పరిధిని ప్రదర్శిస్తూ ఈ ఆపరేషన్ అత్యున్నత స్థాయికి చేరుకోవడాన్నిసూచిస్తుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అత్యంత సుదూర 350 కి.మీ లక్ష్యాన్ని ఛేదిస్తూ, ఎస్-400 వ్యవస్థ శత్రువుల వైమానిక ముందస్తు హెచ్చరిక వేదికను సమర్థవంతంగా నిర్వీర్యం చేయడాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశమే ముందుగా గుర్తించి, నిర్ణయించి, ముందుగానే నాశనం చేస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ఇది ప్రపంచానికి తెలియజేస్తుంది.
ఆపరేషన్ సింధూర్ లోని ప్రతి దశ.. సమన్వయాన్ని, ఏకీకరణను స్పష్టం చేయటంతో పాటు వివిధ రంగాల నుంచి సేకరించిన సమాచార అనుసంధానం, కచ్చితత్వంతో లక్ష్యాలను ఎంచుకోవటం, తక్కువ ప్రాణ, ఆస్తి నష్టంతో లక్ష్యాలను ఛేదించటం వంటివి ఇందులో కీలకమైనవి. ఉగ్రవాదం, రక్తపాతం కలిసి సాగవనే దేశ దృఢ సంకల్పాన్ని.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారు, ఆశ్రయమిచ్చేవారు తక్షణమే, కచ్చితమైన, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశాన్ని ప్రదర్శిస్తారు.
బ్రాండ్ ఇండియా డిఫెన్స్ సత్తాను చాటుతూ, స్వదేశీ రక్షణ వ్యవస్థలు ప్రపంచంతో పోటీ పడటమే కాక, ముందంజలో ఉన్నాయని ఈ శకటం స్పష్టం చేస్తుంది. త్రివిధ దళాల పరస్పర సహకారం, పౌర-సైనిక వనరుల కలయిక, కచ్చితమైన కార్యాచరణ సమన్వయం దేశ విశ్వసనీయ శక్తికి వెన్నెముకగా నిలిచాయని ఇది తెలియజేస్తుంది. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక స్పందన మాత్రమే కాదు.. త్రివిధ దళాల సమైక్య విజయమని, భారతదేశ కార్యాచరణ గుర్తింపు, విలక్షణమైన చిహ్నం అని చాటిచెప్పే వ్యూహాత్మక ప్రకటన ఇది.
(रिलीज़ आईडी: 2218088)
आगंतुक पटल : 4