భారత ఎన్నికల సంఘం
‘ఐఐసీడీఈఎమ్-2026’ సందర్బంగా ‘ఈసీఐఎన్ఈటీ డిజిటల్ వేదిక’ ప్రారంభం
प्रविष्टि तिथि:
22 JAN 2026 8:17PM by PIB Hyderabad
‘ఈసీఐఎన్ఈటీ’ని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ రోజు ప్రారంభించింది. ఇది ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు సేవల కోసం ఉద్దేశించిన ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్. దీనిని ‘ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐసీడీఈఎమ్)-2026’లో ప్రారంభించారు. ఐఐసీడీఈఎమ్‌ను మూడు రోజుల పాటు.. ఈ నెల 21 మొదలు 23 వరకు.. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్నారు.
ఈసీఐఎన్ఈటీని తీసుకురావాలని భారత ఎన్నికల సంఘం అధికారులు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధూ, డాక్టర్ వివేక్ జోషీలతో కలిసి ప్రధానాధికారి (సీఈసీ) శ్రీ జ్ఞానేశ్ కుమార్ సంకల్పించారు. ఈ వేదికను రూపొందించనున్నట్లు 2025 మే నెలలో ప్రకటించారు.
ఈ ప్లాట్‌ఫారం ప్రారంభ కార్యక్రమంలో సీఈసీ శ్రీ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, చట్ట నియమాల్ని తూచా తప్పక అనుసరిస్తూ ఈసీఐఎన్ఈటీని రూపొందించారనీ, ఇది 22 షెడ్యూల్డు భాషలతో పాటు ఇంగ్లిషులోనూ లభ్యమవుతోందని తెలిపారు. ప్రపంచంలో ఈఎంబీలన్నింటికీ ఆయా దేశాల చట్టాలు, భాషలకు అనుగుణంగా ఇదే విధమైన డిజిటల్ వేదికను అభివృద్ధి చేయడం కోసం కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
అధిక పారదర్శకత్వాన్ని తీసుకురావడంతో పాటు అన్ని విధుల పర్యవేక్షణలో ఈసీఐఎన్ఈటీ తోడ్పడుతుందనీ, ఈ కారణంగా ఇది ఈఎంబీపై నమ్మకాన్ని పెంపొందించే ఒక గొప్ప సాధనమనీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు వివరించారు. త్వరగా నిర్ణయాలు తీసుకొనేందుకు, సమాచారాన్ని చేరవేసేందేకు ఇది సహాయపడుతుందని ఆయన తెలిపారు.
సాంకేతికతతో పాటు డిజిటల్ నవకల్పనలను అవలంబించే విషయంలో ప్రపంచ దేశాల్లోని పద్ధతుల్ని నేర్చుకుని, వాటి ప్రయోజనాల్ని అందుకొనేందుకు అవకాశాల్ని ఈఎంబీలకు ఈ సమావేశం అందిస్తుందని ఈసీ డాక్టర్ వివేక్ జోషీ అన్నారు.
సమాచార సాంకేతికత డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీమా ఖన్నా ప్రసంగిస్తూ, ఈసీఐఎన్ఈటీ అందించే కీలక సేవల్లో సైబర్ భద్రత ఒకటని తెలిపారు. టెక్నాలజీ ఇప్పుడు సహాయక పాత్రను పోషించడానికే పరిమితం కాదనీ, అది వ్యూహాత్మకంగా తోడ్పాటును అందించే సాధనమనీ ఆమె అన్నారు. ఎన్నికల్లో పారదర్శకత, సామర్థ్యం, విశ్వసనీయతలతో పాటు ప్రజా విశ్వాసాన్ని ఈసీఐఎన్ఈటీ పెంచుతుందని కూడా వివరించారు.
ఈసీఐఎన్ఈటీ ప్రపంచంలో అతి పెద్ద ఎన్నికల సంబంధిత సేవల వేదికగా ఉంది.. ఇది భారత్ వంటి అన్నిటి కన్నా పెద్దదైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. ఎన్నికలకు సంబంధించిన సేవలన్నిటినీ ఒక చోటుకు చేర్చే వేదిక అని చెప్పవచ్చు. భారత ఎన్నికల సంఘానికి చెందిన 40కి పైగా యాప్‌లూ, పోర్టల్స్‌ను కలబోసి దీనిని రూపొందించారు.
ఈ వేదికను భారత రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, 1951లతో పాటు ఓటర్ల నమోదు నియమాలు-1960, ఎన్నికల నిర్వహణ నియమాలు-1961లను పూర్తిగా పాటిస్తూ అభివృద్ధి పరిచారు.
పౌరులనూ, అభ్యర్థులనూ, రాజకీయ పక్షాలనూ, ఎన్నికల అధికారులనూ ఐసీఐఎన్ఈటీ సంధానించడంతో పాటు ఓటరు నమోదు, ఓటర్ల జాబితా శోధన, దరఖాస్తును ట్రాక్ చేయడం, అభ్యర్థి గురించి తెలుసుకోవడం, ఎన్నికల అధికారులను సంప్రదించడం, బీఎల్‌ఓతో కాల్ బుక్ చేసుకోవడం, ఈ-ఈపీఐసీ డౌన్‌లోడ్ చేసుకోవడం, పోలింగ్ సరళి తెలుసుకోవడం, ఫిర్యాదుల పరిష్కారం తదితర కీలక సేవలను ఒకే సురక్షిత వేదిక మీద అందిస్తుంది.
కిందటి సంవత్సరం నిర్వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ లో బీటా వెర్షనును విజయవంతంగా అమలు చేశారు. దీంతో పౌరులకు మెరుగైన ఎన్నికల సంబంధిత సేవలను అందించడంతో పాటు, ఒకే బటన్‌ను క్లిక్ చేసి ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్నంతటినీ అందుబాటులోకి తీసుకురావడంలో ఎన్నికల సంఘానికి తోడ్పాటు లభించింది. దీనిని ప్రారంభించడానికి ముందు, అలాగే ఈ వేదికకు తుది రూపు ఇవ్వడానికి ముందు ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించారు.
బీటా వెర్షనును విడుదల చేసినప్పటి నుంచి, ఇంతవరకు 10 కోట్లకు పైగా నమోదు పత్రాలను ఈసీఐఎన్ఈటీ ప్రాసెస్ చేసింది. ఈ లెక్కన, ప్రతి రోజూ సగటున 2.7 లక్షల పత్రాల ప్రాసెసింగ్ పూర్తి అయింది. ఈ వేదికలో 11 లక్షల కన్నా ఎక్కువ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నమోదయ్యారు. ఎస్ఐఆర్‌ను చేపట్టింది మొదలు ఇప్పటి వరకూ ఈ వేదిక ద్వారా 150 కోట్లకు పైగా దస్తావేజుల డిజిటలీకరణను ముగించారు. క్షేత్ర స్థాయి అధికారుల పర్యవేక్షణకు గాను ఒక సులభమైన యంత్రాంగాన్ని కూడా ఈసీఐఎన్ఈటీ అందిస్తోంది.
****
(रिलीज़ आईडी: 2217930)
आगंतुक पटल : 6