విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవ పరేడ్-2026లో ‘ప్రకాశ్ గంగ’ శకటాన్ని ప్రదర్శించనున్న విద్యుత్తు శాఖ

प्रविष्टि तिथि: 23 JAN 2026 1:02PM by PIB Hyderabad

ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో విద్యుత్తు మంత్రిత్వ శాఖ ‘‘ప్రకాశ్ గంగ: పవరింగ్ ఆత్మనిర్భర్ అండ్ వికసిత్ భారత్’’ శీర్షికతో వైభవోపేత శకటాన్ని ప్రదర్శించబోతోంది. విద్యుత్తు రంగంలో భారత్ పరివర్తన ప్రధాన ప్రస్థానాన్నీ, స్వచ్ఛమైన, మన్నికైన ఇంధన ఉత్పాదనలో భారత్ నాయకత్వాన్నీ ఈ శకటం చాటి చెప్పనుంది.

విద్యుచ్ఛక్తి సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని సాధించడం మొదలు, స్వచ్ఛ ఇంధన ఉత్పాదన రంగంలో ముందు నడుస్తున్న ప్రపంచ దేశాల్లో ఒకటిగా నిలుస్తున్న పరిణామ క్రమాన్ని ఈ శకటం తెలియజేస్తుంది. దీంతో పాటే స్వయంసమృద్ధ, వికసిత్ భారత్‌ను తీర్చిదిద్దేందుకు దేశం కనబరుస్తున్న నిబద్ధతను కూడా ఇది చాటి చెబుతుంది. ప్రకాశ్ గంగ ఇతివృత్తం కాంతి ప్రవాహ భావనను సంకేతిస్తుంది. అలాగే ఈ పద బంధం.. అంతర్ సంధానితమైన జాతీయ గ్రిడ్ గుండా విద్యుత్తు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండడాన్ని కూడా సూచిస్తుంది.

రోబో సాయంతో పనిచేసే స్మార్ట్ మీటర్ నమూనా ఈ శకటంలో ఓ ముఖ్య ఆకర్షణగా ఉంది. దీనికి తోడు విండ్ టర్బయిన్ జనరేటర్లను కూడా శకటంలో అమర్చారు. ఇవి డిజిటల్ సాంకేతికతలు, స్వయం చాలక యంత్ర విధానం, విద్యుత్తు సమర్థ నిర్వహణకు తోడ్పడే స్మార్ట్ సేవల ఏకీకరణకు అద్దం పడుతున్నాయి.
శకటంలో మధ్య భాగం ‘‘స్మార్ట్ పవర్, స్మార్టర్ హోం’’ భావనను తెలియజేస్తుంది. ఇంటి పై భాగంలో సౌర ఫలకాల ఏర్పాటు, దేశ పౌరులు ఒక్క విద్యుత్తు వినియోగదారులుగానే కాకుండా, విద్యుత్తు ఉత్పాదకులుగా కూడా నిలవాలని ఆశిస్తున్న ప్రభుత్వ ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. ఎత్తయిన ట్రాన్స్‌మిషన్ ఆకృతులు చివరి మైలు వరకూ సంధానాన్ని సూచిస్తుంటాయి. కాగా ఒక ఈవీ చార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రిక్ స్కూటర్.. స్వచ్ఛ గతిశీలతకూ, సుస్థిర రవాణాకూ దన్నుగా నిలిచే రవాణా అనుబంధ విస్తారిత వ్యవస్థకు ఊతాన్ని అందించడంలో విద్యుత్తు రంగం పోషిస్తున్న పాత్రను కళ్లకు కడతాయి.
శకటం వెనుక భాగంలో జలవిద్యుత్తు, పవన, జియోథర్మల్ పవర్ సంబంధిత ఇన్‌స్టాలేషన్ల ద్వారా భారత్ పునరుత్పాదక ఇంధన శక్తిని వివరించనున్నారు. ఇవన్నీ దేశంలో స్వచ్ఛ ఇంధన పాదముద్ర అంతకంతకూ విస్తరిస్తోందనడానికి ప్రతీకలు. ‘‘స్విచింగ్ ఆన్ ఇండియా’’గా పేర్కొంటున్న ఆకృతి.. ఉన్నత నియంత్రణ, పర్యవేక్షణ కేంద్రాలను స్ఫురింపచేస్తుంది. ఈ కేంద్రాలు గ్రిడ్ స్థిరత్వాన్ని, అంతరాయానికి చోటు ఇవ్వని విద్యుచ్ఛక్తి సరఫరాని తెలియజేస్తాయి.  
మెలికలు తిరిగినట్లున్న ఎలక్ట్రికల్ కేబుళ్ల చుట్టలను ఆధారంగా చేసుకొని నిర్మించిన ఈ శకటం భారత జాతీయ విద్యుత్తు గ్రిడ్ విస్తృతినీ, బలాన్నీ చాటుతుంది.. లక్షలాది ఇళ్లనూ, పరిశ్రమలనూ సంధానిస్తోంది ఈ జాతీయ విద్యుత్తు గ్రిడ్‌యే.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ శకటాన్ని తయారు చేసిన విద్యుత్తు మంత్రిత్వ శాఖ.. విశ్వసనీయమైన, చౌకైన, మన్నికైన కరెంటును అందించడం, ఆర్థిక అభివృద్ధికి చోదక శక్తిగా నిలవడం, ఇంధన భద్రతను పటిష్ఠపరచడంతో పాటు ‘వికసిత్ భారత్’ ఆశయ సాధనకు దన్నుగా కూడా నిలవాలన్న తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నది.

 

***


(रिलीज़ आईडी: 2217926) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil