శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పరిశ్రమల సహకారంతో సాగే పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) ప్రాజెక్టులకు ఈ నెలాఖరు నుంచి నిధులు: డాక్టర్ జితేంద్ర సింగ్
ఆర్డీఐ కింద మొదటి ద్వితీయ శ్రేణి నిధుల నిర్వాహకులు (ఎస్ఎల్ఎఫ్ఎం)గా సాంకేతిక అభివృద్ధి బోర్డు (టీడీబీ), బయోటెక్నాలజీ పారిశ్రామిక పరిశోధన సహకార మండలికి (బీఐఆర్ఏసీ) ఆమోదం..
ప్రైవేటు రంగం నేతృత్వంలోని పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రూ. లక్ష కోట్లతో కార్యక్రమం
కేంద్ర శాస్త్ర, సాంకేతికతా శాఖ మంత్రి అధ్యక్షతన సైన్స్ కార్యదర్శుల సమావేశం.. ఆవిష్కరణ నిధులు, సంస్కరణలపై మంత్రి సమీక్ష
అంకుర సంస్థలను రంగాలవారీగా వర్గీకరించాలని విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖల యోచన
प्रविष्टि तिथि:
19 JAN 2026 5:22PM by PIB Hyderabad
2025 నవంబర్ 3న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా.. పరిశ్రమల సహకారంతో సాగే ప్రాజెక్టుల కోసం పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) నిధుల కేటాయింపు ఈ నెలాఖరులోగా ప్రారంభమవుతుంది. నిధుల కేటాయింపు ప్రక్రియ అమలు దశలోకి వచ్చింది. పరిశ్రమల సహకారం ఉన్న ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి రెండు ప్రభుత్వ రంగ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
కేంద్ర విజ్ఞానశాస్త్ర- సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖ (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయ, అణు ఇంధన, అంతరిక్ష, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో.. పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణల (ఆర్డీఐ) నిధి పథకాన్ని సమీక్షించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.
గతేడాది జూలై 1న కేంద్ర కేబినెట్ ఆమోదించిన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్డీఐ) పథకం పురోగతిపై డాక్టర్ జితేంద్ర సింగ్‌కు అధికారులు వివరించారు. ఈ పథకాన్ని నవంబర్ 3న అధికారికంగా ప్రారంభించారు. దీని అమలు మార్గదర్శకాలు, దరఖాస్తుల ఆహ్వానంతోపాటు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైటును ప్రధానమంత్రి ఆవిష్కరించారు. అత్యంత సవాలుతో కూడిన, గొప్ప ప్రభావాన్ని చూపే పరిశోధనలకు చేయూతనివ్వడంతోపాటు.. ప్రయోగశాలలు, అంకుర సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని పటిష్టం చేయడం ఈ పథకం లక్ష్యమని అధికారులు మంత్రికి వివరించారు.
ప్రైవేటు రంగ నేతృత్వంలోని పరిశోధనలు, ఆవిష్కరణలను ఉత్తేజితం చేయడానికి ఉద్దేశించిన రూ. 1 లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్డీఐ) నిధి కింద.. సాంకేతిక అభివృద్ధి బోర్డు (టీడీబీ), బయోటెక్నాలజీ పారిశ్రామిక పరిశోధన సహాయక మండలి (బీఐఆర్ఏసీ)లను మొదటి ద్వితీయ స్థాయి నిధి నిర్వాహకులుగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) ఆమోదించింది. ఆమోదం పొందిన అమలు ప్రణాళిక ప్రకారం.. వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశమున్న, వ్యూహాత్మక రంగాల ప్రాజెక్టులకు సాంకేతిక అభివృద్ధి బోర్డు (టీడీబీ) నిధి నిర్వాహక సంస్థగా వ్యవహరిస్తుంది. మరోవైపు బయోటెక్నాలజీ, దాని అనుబంధ రంగాలకు చెందిన కార్యక్రమాలను బీఐఆర్ఏసీ పర్యవేక్షిస్తుంది. రెండు సంస్థలూ 2026 జనవరి చివరి నాటికి తమ మొదటి ప్రతిపాదన ఆహ్వానాలను జారీ చేస్తాయని భావిస్తున్నారు. ఇది టీఆర్ఎల్-4 స్థాయిని దాటి పురోగమించిన ఆవిష్కరణ ఆధారిత ప్రాజెక్టులకు ఆర్డీఐ నిధులను త్వరితగతిన కేటాయించడానికి వీలు కల్పిస్తుంది.
ఇతర ద్వితీయ స్థాయి నిధి నిర్వాహకుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2026 జనవరి 31. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ స్ట్రక్చర్ (ఏఐఎఫ్), డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (డీఎఫ్ఐ), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఫోకస్డ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ల (ఎఫ్ఆర్వో) వంటి సంస్థలు నిధి నిర్వాహకులుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్‌డీఐ పథకం అధికారికంగా ప్రారంభమైన అనంతరం.. దాని అమలు మార్గదర్శకాలపై స్పష్టత కోరుతూ వివిధ భాగస్వాముల నుంచి పెద్ద సంఖ్యలో వినతులూ, సందేహాలూ వచ్చినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్‌కు అధికారులు తెలిపారు. వీటిని పరిశీలించి, పరిష్కరించిన అనంతరం ద్వితీయ స్థాయి నిధి నిర్వాహకులకు దరఖాస్తుల స్వీకరణ కోసం వెబ్ సైటును అందుబాటులోకి తెచ్చారు. కేబినెట్ నోట్‌లో పేర్కొన్నట్టుగా.. బయోటెక్నాలజీ పారిశ్రామిక పరిశోధన సహాయక మండలి (బీఐఆర్ఏసీ), సాంకేతిక అభివృద్ధి బోర్డు (టీడీబీ)లను ఈ పాత్రను చేపట్టేందుకు నామినేషన్ ప్రాతిపదికన ఆహ్వానించారు.
జనవరి 12న జరిగిన సమావేశంలో అనుసంధాన్ జాతీయ పరిశోధన సంస్థ (ఏఎన్ఆర్ఎఫ్) కార్యనిర్వాహక మండలి నిర్ణయానికి అనుగుణంగా.. సాధికార కార్యదర్శుల బృందం బీఐఆర్ఏసీ, టీడీబీలను ద్వితీయ స్థాయి నిధుల నిర్వాహకులుగా కూడా ఆమోదించిందని మంత్రికి అధికారులు వివరించారు. మొదటి త్రైమాసికంలో ఒక్కో సంస్థకూ రూ. 2,000 కోట్ల చొప్పున టీడీబీ, బీఐఆర్ఏసీలకు నిధులు అందుతాయి. దీంతో ఈ పథకం కింద ప్రారంభ కేటాయింపు రూ. 4,000 కోట్లకు చేరుతుంది. అంకుర సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల నుంచి ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం జనవరి నెలాఖరులోపు ఇవి దరఖాస్తులను ఆహ్వానించే అవకాశం ఉంది.
సమీక్షకు అధ్యక్షత వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఆర్‌డీఐ పథకాన్ని సకాలంలో అమలు చేయాల్సిన ఆవశ్యకతను, విజ్ఞాన శాస్త్ర విభాగాల మధ్య సన్నిహిత సమన్వయం ప్రాధాన్యాన్ని వివరించారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం వెచ్చించే ప్రభుత్వ నిధులు.. పరిశ్రమలకు, సమాజానికి స్పష్టమైన ప్రయోజనాలను అందించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రక్రియలను సరళీకరించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఇందులో భాగంగా పారదర్శకతను పెంచడానికి, దరఖాస్తుదారుల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి.. అభిప్రాయ సేకరణ ఆధారంగా అమలు మార్గదర్శకాలకు సవరణలు చేయడం వంటి అంశాలను ఆయన పరిశీలించారు.
విజ్ఞాన శాస్త్ర విభాగాల మధ్య మరింత సమన్వయం ఆవశ్యకమనీ, ఆర్డీఐ పథకం సహా కీలకమైన కార్యక్రమాలను సకాలంలో అమలు చేయాలనీ డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పరిశోధనలో చేసే ప్రభుత్వ పెట్టుబడి.. పరిశ్రమకూ, సమాజానికీ స్పష్టమైన ఫలితాలను అందించాలని పునరుద్ఘాటించారు. అది జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రక్రియల సరళీకరణ కోసం తీసుకుంటున్న చర్యలను కూడా మంత్రి సమీక్షించారు. ఇందులో భాగంగా.. పారదర్శకతను పెంచడానికి, భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి.. అభిప్రాయ సేకరణ ఆధారంగా అమలు మార్గదర్శకాలకు సవరణలు చేయడం వంటి అంశాలను ఆయన పరిశీలించారు.
పరిశోధన, అభివృద్ధిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఆర్డీఐ కీలక లక్ష్యమని ఈ చర్చల సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రయోగాత్మక పరిశోధనలను ప్రోత్సహించేలా.. ప్రభుత్వ పరిశోధన సంస్థలు, అంకుర సంస్థలు, పరిశ్రమల మధ్య పటిష్టమైన అనుసంధానాన్ని పెంపొందించడం ఈ పథకం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దీంతో శాస్త్రీయ ఆవిష్కరణలు మరింత సమర్థవంతంగా వాణిజ్యపరమైన, సామాజిక అంశాల సమన్వయంగా సాగుతాయన్నారు.
విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కె. సూద్ స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభోపన్యాసం చేశారు.
***
(रिलीज़ आईडी: 2216743)
आगंतुक पटल : 8