లోక్‌సభ సచివాలయం
లక్నోలో 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు (ఏఐపీఓసీ) ప్రారంభం
రాష్ట్ర శాసనసభల ప్రిసైడింగ్ అధికారులనుద్దేశించి లోక్సభ స్పీకర్ ప్రసంగం
సదస్సు విజయవంతం కావాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
ప్రిసైడింగ్ అధికారి శైలి పార్టీ రాజకీయాలకు అతీతంగా.. పూర్తి నిష్పాక్షికంగా ఉండటమే కాదు… ఆ విధంగా కనిపించాలి: లోక్సభ స్పీకర్
“శాసనసభల కార్యకలాపాల కోసం నిర్దిష్ట… సముచిత సమయం కేటాయించడం అవశ్యం”
“సభ ఎంత ఎక్కువ కాలం సమావేశమైతే అంతటి అర్థవంతమైన.. ముమ్మర.. ఫలితాధారిత చర్చలకు వీలుంటుంది”
प्रविष्टि तिथि:
19 JAN 2026 9:44PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు (ఏఐపీఓసీ) ఇవాళ ప్రారంభమైంది. మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రధాన ప్రసంగం చేశారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలు, 6 శాసన మండళ్ల ప్రిసైడింగ్ అధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
సదస్సులో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులందరినీ ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షల సందేశాన్ని ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ సతీష్ మహానా చదివి వినిపించారు.
ప్రిసైడింగ్ అధికారులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారి వ్యవహార శైలి పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండాలని శ్రీ బిర్లా తన ఉపన్యాసంలో స్పష్టం చేశారు. ప్రిసైడింగ్ అధికారుల వైఖరి నిష్పాక్షికంగా ఉండటమేగాక ఆ విధంగా కనిపించడం అవశ్యమని ఆయన పేర్కొన్నారు.
శాసనసభ ద్వారానే ప్రజల ఆకాంక్షలు, సమస్యలు పరిష్కారాల దిశగా ప్రభుత్వానికి చేరుతాయని శ్రీ బిర్లా వివరించారు. అయితే, శాసనసభల కార్యకలాపాలకు కేటాయించే సమయం తగ్గిపోవడం అందరికీ ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు. రాష్ట్ర శాసనసభల కార్యకలాపాలకు నిర్దిష్ట, సముచిత సమయం కేటాయించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. సభ ఎంత ఎక్కువ కాలం పనిచేస్తే- అంతటి అర్థవంతమైన, నిర్దిష్ట, ఫలితాధారిత చర్చలు సాధ్యమవుతాయని ఆయన చెప్పారు.
ఆధునిక సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికతలు సహా సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉన్న ఈ యుగంలో ప్రజా ప్రతినిధుల ప్రవర్తన నిరంతరం ప్రజల దృష్టిలోనే ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ఇది పార్లమెంటరీ మర్యాద, క్రమశిక్షణ అనుసరణకు మరింతగా తోడ్పడుతుందని శ్రీ బిర్లా పేర్కొన్నారు. నేటి సాంకేతిక శకంలో అన్ని వైపుల నుంచీ ప్రవహించే సమాచార స్రవంతి సభ విశ్వసనీయత కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడం గొప్ప సామూహిక బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య సంస్థల మధ్య సహకారానికి అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు వంటి వేదికలు దోహదం చేయడమే కాకుండా పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేస్తాయన్నారు. అంతేగాక పాలనను మరింత సమర్థంగా మలుస్తాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విధానాలు, సంక్షేమ చర్యలలో సామరస్యం దిశగానూ ఇలాంటి సదస్సులు సహాయపడతాయని చెప్పారు.
సభలోని సభ్యులందరికీ… ముఖ్యంగా కొత్త, యువ సభ్యులకు తగిన అవకాశమివ్వడం ప్రిసైడింగ్ అధికారుల కర్తవ్యమని శ్రీ బిర్లా స్పష్టం చేశారు. తద్వారా ప్రజల సమస్యలు, ఆందోళనలను లేవనెత్తడానికి శాసనసభ అత్యంత ప్రభావశీల వేదిక కాగలదని తెలిపారు.
సదస్సులో భాగంగా శాసన ప్రక్రియలలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, శాసనసభ్యుల సామర్థ్య వికాసం, ప్రజల పట్ల శాసనసభ జవాబుదారీతనం వంటి కీలకాంశాలపై రాబోయే రెండు రోజుల ప్లీనరీ సమావేశాలలో సమగ్ర చర్చలు సాగుతాయని ఆయన వెల్లడించారు.
ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సుకు ఉత్తరప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగోసారి. ఇంతకు ముందు 1961 డిసెంబరు, 1985 అక్టోబరు, 2015 జనవరి-ఫిబ్రవరి నెలల మధ్యకాలంలో ఈ సదస్సులను నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఇప్పడు నిర్వహిస్తున్న 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు జనవరి 21న లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ముగింపు ప్రసంగంతో సమాప్తమవుతుంది. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో కూడా ప్రసంగిస్తారు.
***
(रिलीज़ आईडी: 2216405)
आगंतुक पटल : 4