కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం (సి-డాట్)కు స్కోచ్ పురస్కారం - 2025... సెల్ బ్రాడ్‌కాస్ట్ సొల్యూషన్‌కు గాను 104వ స్కోచ్ సదస్సు సందర్భంగా అవార్డు
విపత్తులు, అత్యవసర సమయాల్లో నిర్దేశిత భౌగోళిక ప్రాంతాల్లో సెల్ ఫోన్ నెట్‌వర్క్‌ల ద్వారా మొబైల్ ఫోన్లకు సమాచారాన్ని అందించే హెచ్చరిక వేదిక ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ సొల్యూషన్’... ఆస్తి నష్ట నివారణతోపాటు ప్రాణాలకు రక్షణ
प्रविष्टि तिथि:
19 JAN 2026 3:16PM by PIB Hyderabad
సెల్ బ్రాడ్‌కాస్ట్ సొల్యూషన్ (సీబీఎస్)కు గాను భారత ప్రభుత్వ ప్రధాన టెలికాం పరిశోధన, అభివృద్ధి కేంద్రమైన టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రానికి (సీ-డాట్) ‘స్కోచ్ పురస్కారం -2025’ లభించింది. ‘వికసిత భారత్ కోసం వనరుల సమీకరణ (రిసోర్సింగ్ వికసిత భారత్)’ ఇతివృత్తంతో చేపట్టిన 104వ స్కోచ్ సదస్సులో భాగంగా ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా వ్యక్తులు, ప్రాజెక్టులు, ప్రభుత్వ- ప్రైవేటు సంస్థలకు.. నిర్వహణ, అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేసినందుకు గాను స్కోచ్ పురస్కారాన్ని అందిస్తారు. ఆర్థిక, సాంకేతిక, ఆరోగ్య, విద్యా రంగాలతోపాటు క్షేత్రస్థాయి కృషికి.. ముఖ్యంగా ప్రజలు, దేశంపై విశేష, సానుకూల ప్రభావాన్ని చూపే చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తారు.
సి-డాట్ సెల్ బ్రాడ్‌కాస్ట్ సొల్యూషన్ ఒక విపత్తు నిరోధక, అత్యవసర వేదిక. విపత్తు హెచ్చరిక సంస్థలు- వాతావరణానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ), వరదలకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సునామీలు/ సముద్ర సంబంధిత సంఘటనల కోసం భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్కోయిస్), కొండచరియలు విరిగిపడడానికి సంబంధించి రక్షణ భౌగోళిక సమాచార పరిశోధన సంస్థ (డీజీఆర్ఈ), అడవిలో కార్చిచ్చులకు సంబంధించి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ), సమాచార ప్రసార సందేశాలను చేరవేయడం కోసం అన్ని మొబైల్ ఆపరేటర్లు, హెచ్చరికలూ విపత్తు నిర్వహణకు ఆమోదం కోసం రాష్ట్ర- జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థలను ఒకే ఏకీకృత సమగ్ర వేదికపైకి సి-డాట్ చేరుస్తుంది. ప్రభావిత ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్‌లకు సెల్యులార్ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రాణ రక్షక అత్యవసర సమాచారాన్ని దాదాపు ఎప్పటికప్పుడు చేరవేసేందుకు అవసరమైన పూర్తిస్థాయి మార్గాలను.. ఈ ఏకీకృత వేదిక అందిస్తుంది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో రూపొందించిన స్వయంచాలక వ్యవస్థ ఇది. భౌగోళికంగా నిర్దేశించిన ప్రాంతాల్లో వివిధ రకాల విపత్తులకు సంబంధించి 21 భాషల్లో హెచ్చరికలను జారీ చేసేలా దీన్ని రూపొందించారు. విపత్తు ముప్పును తగ్గించడంతోపాటు మొత్తంగా నిర్వహణ చర్యల సామర్థ్యాన్ని ఇది గణనీయంగా మెరుగుపరిచింది. ఐక్యరాజ్యసమితి ‘అందరికీ ముందస్తు హెచ్చరికలు, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) వారి ‘ఉమ్మడి హెచ్చరిక ప్రొటోకాల్ (సీఏపీ)’ ‘కాల్ టు యాక్షన్’ వంటి అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడమే కాకుండా.. విపత్తులను తట్టుకోవడంలో దేశ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
ఈ సందర్భంగా సి-డాట్ సీఈవో డాక్టర్ రాజ్ కుమార్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ‘‘ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు- 2025ను గెలుచుకోవడం గౌరవంగా భావిస్తున్నాం. ప్రజాసేవ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్న సి-డాట్ లక్ష్యానికి లభించిన అర్థవంతమైన గుర్తింపు ఇది. దేశంలోని మారుమూల, దుర్బల ప్రాంతాలకు కూడా ఈ సాంకేతికత చేరుకోగలదు. మా సెల్ బ్రాడ్‌కాస్ట్ సొల్యూషన్.. విపత్తుల బారిన పడిన ప్రజలకు ఆయా ప్రాంతాల వారీగా సకాలంలో సమాచారాన్ని చేరవేయడం ద్వారా ప్రజా భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ప్రాణ రక్షక డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం, విపత్తు ముప్పును తగ్గించేలా దోహదపడడం, అందరికీ సకాలంలో భద్రతా సమాచారాన్ని అందించాలన్న భారత దీర్ఘకాల లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఈ పురస్కారం మాకు స్ఫూర్తినిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వినూత్న సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్‌ను చేర్చడంలో సి-డాట్ కీలక పాత్ర పోషించింది. గౌరవ ప్రధానమంత్రి ‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లింది. సాంకేతిక రంగంలో ఉన్నతిని సాధించాలన్న మా దృఢ సంకల్పాన్నీ, నిరంతర కృషినీ ఈ పురస్కారం చాటుతోంది.
సి-డాట్ అనేది కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే టెలికాం సాంకేతిక పరిజ్ఞాన రంగంలోని ఒక ప్రతిష్ఠాత్మక పరిశోధన, అభివృద్ధి కేంద్రం. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ఊతమిచ్చేలా.. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సి-డాట్ అత్యంత కీలక పాత్ర పోషించింది. 5జీ, 6జీ, క్వాంటం, కృత్రిమ మేధ, సైబర్ భద్రత వంటి భవిష్యత్ సాంకేతికతలపై ప్రస్తుతం ఇది పనిచేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2216401)
आगंतुक पटल : 9