|
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఆకాశమే హద్దుగా ‘వింగ్స్ ఇండియా-2026’: ఆసియాలోనే అతిపెద్ద ప్రపంచ విమానయాన భవిష్యద్దార్శనిక పౌర విమానయాన ప్రదర్శన
“భారతీయ విమానయానం: డిజైన్ నుంచి విస్తరణ.. తయారీ నుంచి నిర్వహణ.. సార్వజనీనత నుంచి ఆవిష్కరణ.. భద్రత నుంచి సుస్థిరత వరకూ భవిష్యత్తుకు మార్గం సుగమం” ఇతివృత్తంగా కార్యక్రమం
प्रविष्टि तिथि:
17 JAN 2026 3:48PM by PIB Hyderabad
ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం ‘వింగ్స్ ఇండియా-2026’ పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు నేతృత్వాన ఘనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దేశవిదేశాల నుంచి హాజరవుతున్న ఉన్నత స్థాయి ప్రముఖుల సమక్షంలో జనవరి 28న వైభవోపేతంగా మొదలయ్యే ఈ ప్రపంచ విమానయాన ప్రదర్శన 31వ తేదీ వరకూ 4 రోజులపాటు కొనసాగుతుంది.
“భారతీయ విమానయానం: డిజైన్ నుంచి విస్తరణ.. తయారీ నుంచి నిర్వహణ.. సార్వజనీనత నుంచి ఆవిష్కరణ.. భద్రత నుంచి సుస్థిరత వరకూ భవిష్యత్తుకు మార్గం సుగమం” ఇతివృత్తంగా సాగే ‘వింగ్స్ ఇండియా-2026’లో శరవేగంగా విస్తరిస్తున్న భారత విమానయాన రంగం భవిష్యత్తు, దాని అంతర్జాతీయ ప్రాచుర్యం ప్రస్ఫుటం అవుతాయి. దీంతోపాటు తయారీ, సేవలు, ఆవిష్కరణ, సుస్థిర విమానయాన సమగ్ర సేవల కీలక కూడలిగా ఎదగాలనే దృక్కోణాన్ని ప్రముఖంగా చాటుతుంది.
విమానయానానికి అత్యున్నత ప్రపంచ వేదిక
వింగ్స్ ఇండియా-2026 ఒక విస్తృత అంతర్జాతీయ ప్రదర్శన.. ఇందులో వివిధ రకాల విమానాలను చూడవచ్చు. దీంతోపాటు ఆకాశ విహారం, గగనంలో విమాన విన్యాసాలను కూడా తిలకించవచ్చు. అలాగే, ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం, ‘సీఈఓ’ల రౌండ్‌టేబుల్ సదస్సులు, ‘బి2బి’ (బిజినెస్ టు బిజినెస్) భేటీలు, విమానయాన సిబ్బంది ఎంపిక, అవార్డుల వేడుక, ఉత్సాహభరిత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు, భాగస్వాములు ఇందులో పాలుపంచుకుంటారు. తద్వారా ప్రపంచంలోనే అగ్రశ్రేణి విమానయాన వేదికగా ఈ కార్యక్రమ స్థాయి ఇనుమడిస్తుంది.
విమానయాన విలువ వ్యవస్థలోని ప్రసిద్ధ దేశవిదేశీ భాగస్వామ్య సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాయి. ఈ మేరకు విమానయాన సంస్థలు, విమానాలు, ఇంజిన్ తయారీదారులు, ‘ఎంఆర్‌ఓ’లు, విమానాశ్రయ నిర్మాణ సంస్థలు, ‘ఓఈఎం’లు, సాంకేతికత ప్రదాతలు, శిక్షణ సంస్థలు, సేవా ప్రదాతలు ఇందులో అంతర్భాగంగా ఉంటారు. భారత్ సహా అంతర్జాతీయంగా పౌర విమానయాన భవిష్యత్తును రూపుదిద్దగల ఆధునిక ధోరణులు, అవకాశాలు, సహకార మార్గాలపై ఈ కార్యక్రమంలో చర్చలుంటాయి. విధాన నిర్ణేతలు, అగ్ర పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు పాల్గొనే ఈ చర్చలన్నిటికీ ‘వింగ్స్ ఇండియా-2026 ఒక సమన్వయ వేదికగా మారుతుంది.
ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రపంచ ‘సీఈఓ’ల వేదిక, మంత్రివర్గ స్థాయి సమావేశాలతోపాటు 13 ఇతివృత్తాధారిత చర్చా గోష్ఠులుంటాయి. విమానాశ్రయాలు, విమానాల లీజింగ్, హెలికాప్టర్లు, ఎయిర్‌లైన్స్, పౌరవిమాన యానంలో మహిళలు, ‘ఎంఆర్‌ఓ’, విమానాల్లో సరకు రవాణా, వాణిజ్య విమానయానం, చిన్న విమానాలు, విమాన విడిభాగాల తయారీ, సుస్థిర విమాన ఇంధనం, పైలట్ శిక్షణ-నైపుణ్యాభివృద్ధి, అత్యాధునిక విమాన రవాణా, డ్రోన్స్ తదితర కీలక రంగాలు కూడా ఈ సదస్సు ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి.
బలమైన జాతీయ-అంతర్జాతీయ భాగస్వామ్యం
ఈ సదస్సులో మంత్రిత్వ స్థాయి విదేశీ ప్రతినిధులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, 20కిపైగా దేశాల నుంచి అధికారిక ప్రతినిధులు పాల్గొంటారు. విమానయాన రంగంలో అంతర్జాతీయ సహకారం, సంయుక్త కృషిని ఇది బలోపేతం చేస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ఇందులో చురుగ్గా పాల్గొంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానయాన చోదక వృద్ధి, పెట్టుబడి అవకాశాలు, మౌలిక సదుపాయాల పురోగమనాన్ని ఈ సదస్సు ప్రతిబింబిస్తుంది.
అద్భుత విమాన విన్యాసాలు.. ఆధునిక విమానాల ప్రదర్శన
వింగ్స్ ఇండియా-2026లో ఆకట్టుకునే ఆధునిక విమానాల ప్రదర్శనతోపాటు విమాన విహారం, గగనతల విన్యాసాలు కూడా ఉంటాయి. విస్తృత శ్రేణి విమానాలను ప్రతినిధులకు చూపడంతోపాటు భారత వైమానిక దళ ‘సూర్య కిరణ్’ విన్యాస బృందం ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో ఆకట్టుకోనుంది.
వివిధ రకాల ప్రదర్శనలు, ఆకర్షణీయ ఆతిథ్య గృహాలు (చాలెట్), ‘బి2బి-బి2జి’ సమావేశాలకు ఈ కార్యక్రమం ప్రత్యేక వేదికలను సమకూరుస్తుంది. వ్యాపార నెట్‌వర్కింగ్, భాగస్వామ్యాలు, పెట్టుబడి సంబంధిత చర్చలకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇక విమానయాన సిబ్బంది ఎంపిక కార్యక్రమం యువ నిపుణులతో పాటు విమానయాన వ్యవస్థలోగల ప్రతిభావంతులైన నిపుణులను ఈ రంగంలోని అగ్రగామి పారిశ్రామిక సంస్థలతో అనుసంధానిస్తుంది.
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పౌర విమానయాన ఆవిష్కరణ పోటీ నిర్వహిస్తారు. విద్యార్థులు, యువ నిపుణులలో ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, పరిశ్రమ-ఆధారిత ఆలోచనలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. అలాగే, ప్రపంచ విమానయానంలో వాస్తవిక సవాళ్లు-అవకాశాలను కూడా వారికి పరిచయం చేయడంలోనూ ఇది దోహదం చేస్తుంది.
సుసంపన్న భారత వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్సాహభరిత సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి. ప్రతినిధులు, సందర్శకులకు విమానయాన ప్రదర్శనల ఉల్లాసానికి ఒక వినూత్న ఆనందానుభూతిని ఈ ప్రదర్శనలు జోడిస్తాయి.
పౌర విమానయానంలో అత్యుత్తమ ప్రతిభకు, కృషికి గుర్తింపునిచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతిష్టాత్మక పురస్కార ప్రదానోత్సవం కూడా నిర్వహిస్తారు.
వింగ్స్ ఇండియా-2026 తన భారీ స్థాయి, వైవిధ్యం, వ్యూహాత్మక దృక్కోణం ద్వారా భారత విమానయాన వృద్ధి క్రమాన్ని ప్రదర్శించడంతోపాటు ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుంది. అలాగే, ఆవిష్కరణలకు సారథ్యం వహిస్తూ, పౌర విమానయాన రంగానికి భవిష్యత్ పథనిర్దేశం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2215719)
|