రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

జైపూర్‌లో ఘనంగా 78వ సైనిక దినోత్సవాన్ని నిర్వహించిన భారత సైన్యం

प्रविष्टि तिथि: 15 JAN 2026 5:47PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2026 జనవరి 15న 78వ సైనిక దినోత్సవం వేడుకలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. జైపూర్ కంటోన్మెంట్‌లోని 'ప్రేరణా స్థల్' వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ (సీఏఓఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది.. దేశం కోసం అత్యుతున్నత త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. దీనితోనే కవాతు ప్రారంభమైంది. భారత వైమానిక దళం, నౌకాదళం తరపున ఎయిర్ వైస్ మార్షల్ ఎం. బందోపాధ్యాయ, కమోడోర్ పీ. వర్మ కూడా అమరవీరులకు నివాళులర్పించారు. 

 

దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైనిక దినోత్సవ వేడుకలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం తర్వాత ఢిల్లీ వెలుపల దీనిని నిర్వహించటం ఇది నాలుగోసారి. మొట్టమొదటిసారిగా ఈ కవాతును ఆర్మీ కంటోన్మెంట్ వెలుపల చేపట్టారు. జైపూర్ నగర నడిబొడ్డున ఉన్న మహల్ రోడ్‌లో అక్షయ పాత్ర సర్కిల్ నుంచి ప్రారంభమైన కవాతు బాంబే ఆస్పత్రి వరకు కొనసాగింది. 2023 నుంచి బెంగళూరు, లక్నో, పుణెలలో ఈ కవాతును నిర్వహించారు. నైరుతి కమాండ్ మొదటిసారిగా ఈ కవాతుకు ఆతిథ్యం ఇచ్చింది.

 

సమీక్షాధికారిగా ఉన్న జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ అద్భుతమైన కవాతు సందర్భంగా సైనిక వందనం అందుకున్నారు. జైపూర్‌లోని మహల్ రోడ్‌లో జరిగిన ఈ కార్యక్రమం ఒక మంచి వేడుకతో ప్రారంభమైంది. ఇందులో దేశం కోసం ప్రాణాలర్పించిన ఐదుగురు వీర జవాన్ల కుటుంబ సభ్యులకు సైనికాధిపతి 'సేనా మెడల్' (మరణానంతరం) ప్రదానం చేశారు. 

 

ఉత్సాహంతో కూడిన లక్షకు పైగా ప్రేక్షకులు ఈ సైనిక దినోత్సవం కవాతును వీక్షించారు. వారి ఉద్వేగభరితమైన భాగస్వామ్యం భారత సైన్యానికి, ప్రజలకు మధ్య ఉన్న బలమైన నమ్మకం, గర్వాన్ని తెలియజేసింది. ప్రేక్షకుల భారీ స్పందన ఈ వేడుకలకు అపారమైన బలాన్ని ఇవ్వటమే కాకుండా సైనికుల పట్ల దేశానికి ఉన్న తిరుగులేని మద్దతును పునరుద్ఘాటించింది. భవిష్యత్తు యుద్ధ క్షేత్రం కోసం సైన్యం ఉపయోగిస్తున్న తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కవాతు ప్రదర్శించింది. సాంకేతిక పురోగతి ద్వారా దేశాన్ని రక్షించడంలో సంసిద్ధతను నిర్ధారిస్తూ స్వదేశీ పరిష్కారాలను వినియోగించుకోవడం, ప్రపంచ సైనిక పోకడల కంటే ముందుండటం సైన్యం నిరంతరం దృష్టి సారించటాన్ని ఇది ప్రధానంగా తెలియజేసింది. 

 

మద్రాస్ రెజిమెంటల్ సెంటర్, రాజపుత్ రెజిమెంటల్ సెంటర్, రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ, మిక్స్‌డ్ స్కౌట్స్, ఎన్‌సీసీ మహిళా కాంటింజెంట్‌లతో సహా ఏడు విశిష్ట మార్చింగ్ బృందాలతో 30కి పైగా విభాగాలు ఈ అద్భుతమైన మార్చ్-పాస్ట్‌లో పాల్గొన్నాయి. ఈ కవాతులో మొట్టమొదటిసారిగా 'రాజ్‌రిఫ్', 'సిక్కు ఎల్‌ఐ' నుంచి రెండు ప్రత్యేక 'భైరవ్ బెటాలియన్' బృందాలు పాల్గొన్నాయి. సరిహద్దుల్లో వేగవంతమైన, తీవ్ర ప్రభావం చూపే ఆపరేషన్ల కోసం రూపొందించిన ఆధునిక, చురుకైన, ప్రాణాంతక యుద్ధ సామర్థ్యాల దిశగా మారుతున్న భారత సైన్యం వ్యూహాత్మక ధోరణికి చిహ్నంగా ఇవి నిలిచాయి. ఆధునిక యుద్ధభూమిలో 'తెలివిగా పోరాడటం, వేగంగా దాడి చేయడం' అనే భారత్‌ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ ఈ భైరవ్ బెటాలియన్లు ఒక 'పరిమిత సంఖ్యలో ఉండి అత్యంత శక్తిమంతంగా పనిచేసే’ దళంగా నిలిచాయి. ఎల్‌సీహెచ్, ఏఎల్‌హెచ్, డబ్ల్యూఎస్ఐ, అపాచీ వంటి ఆర్మీ హెలికాప్టర్ల వైమానిక విన్యాసాలు ఈ కవాతు వైభవాన్ని మరింత పెంచాయి. 

రెండు సైన్యాల మధ్య ఉన్న లోతైన స్నేహం, పరస్పర నమ్మకం, ఉమ్మడి సైనిక సంప్రదాయాలను తెలియజేస్తూ నేపాల్ ఆర్మీ బ్యాండ్ కూడా ఈ కవాతులో పాల్గొంది. వారి భాగస్వామ్యం చిరకాల సాంస్కృతిక సంబంధాలు, సన్నిహిత సహకారాన్ని తెలియజేయటమే కాకుండా భారత్-నేపాల్ రక్షణ సంబంధాలను బలోపేతం చేసే సౌభ్రాతృత్వం, భాగస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది. సైనిక దినోత్సవం కవాతులో ఏడు సైనిక బ్యాండ్‌ల అద్భుత ప్రదర్శనలు ఉన్నాయి. ఈ సైనిక బ్యాండ్‌లలో సిక్కు రెజిమెంటల్ సెంటర్, డోగ్రా రెజిమెంటల్ సెంటర్, మరాఠా ఎల్ఐ రెజిమెంటల్ సెంటర్, బీఈజీ సెంటర్, ఆర్టిలరీ రెజిమెంటల్ సెంటర్, ఈఎంఈ సెంటర్, ఎన్‌సీసీ పురుషులు- మహిళల మిక్స్‌డ్ బృందాలు ఉన్నాయి.

 

భారత సైన్యం సాధిస్తున్న పురోగతి, ఆధునిక యుద్ధ తంత్ర సంసిద్ధతను చాటి చెబుతూ 78వ సైనిక దినోత్సవ కవాతులో వాహనాలపై అమర్చిన భారీ ఆయుధాలు, పరికరాలు, అత్యాధునిక సాంకేతికతల అద్భుత ప్రదర్శన కనువిందు చేసింది. దేశ రక్షణ విషయంలో భారత సైన్యాన్ని శక్తిమంతం చేసే అధునాతన ఆయుధాలు, సైనిక సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం ఈ ప్రదర్శన ద్వారా ప్రజలకు లభించింది. టీ-90 ట్యాంకులు, బీఎంపీ-2, అర్జున్ ట్యాంకులు వంటి భారీ యుద్ధ వాహనాలతో పాటు స్మెర్చ్, కే-9 వజ్ర, గ్రాడ్ బీఎం రాకెట్లు, ధనుష్, ఏటీఏజీఎస్, దివ్యాస్త్ర, యూఎల్‌ఆర్‌ఎస్ వంటి శక్తిమంతమైన ఆయుధాలను కలిగి ఉన్న సైన్యం పోరాట పటిమను ఈ కవాతు ప్రదర్శించింది. వీటితో పాటు నవీకరించిన షిల్కా, శక్తిబాన్ వంటి వాయు రక్షణ, దళాల రక్షణ సామర్థ్యాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. అన్ని ఉపరితలాలలపై నడిచే వాహనాలు, రోబోటిక్ మ్యూల్స్‌తో సైన్యానికి ఉన్న కదలిక వేగం- స్వయంప్రతిపత్తిని.. వాహన ఆధారిత ఇన్‌ఫాంట్రీ మోర్టార్ వ్యవస్థల ద్వారా వేగవంతమైన ఎదురుదాడి సామర్థ్యాన్ని ఇది ప్రముఖంగా చూపించింది. లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే మిలాన్ క్షిపణి లాంచర్లు వంటి ఆయుధాలు.. ప్రబల్ సీ-యూఏఎస్ (వాహనాలపై ఉండే, మానవుల కదిలించ గలిగే), గాలిలో లక్ష్యాలను చేధించగలిగే వ్యవస్థలు, డ్రోన్ జామింగ్, స్పూఫర్ వ్యవస్థలతో కూడిన తదుపరి తరం మానవరహిత సామర్థ్యాలను భైరవ్ బెటాలియన్లతో సహా ప్రదర్శించారు. భారీ వాహనాలపై అమర్చిన ఇతర డ్రోన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు స్విచ్ యూఏవీ, సంజయ్, ప్రళయ్, బాజ్ వంటి సాయుధ డ్రోన్లతో కూడిన ఆర్‌పీఏలు ఈ ప్రదర్శనలో భాగమయ్యాయి. ఆపరేషన్ సింధూర్‌లో ఉపయోగించిన బ్రహ్మోస్, పినాక, యూఎల్‌హెచ్ ఎం777, ఆకాష్ ఆయుధ వ్యవస్థ, మధ్యస్థ స్థాయి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, ఎల్-70 తుపాకులు, ప్రత్యేక మొబిలిటీ వాహనాలు (ఎస్ఎంవీ), క్విక్ రియాక్షన్ ఫోర్స్ వాహనాలు కూడా కవాతులో పాల్గొని ఆపరేషనల్ ప్రాముఖ్యతను చాటాయి.

 

అత్యున్నత నైపుణ్యం, బృంద స్ఫూర్తి, నియంత్రణను తెలియజేస్తూ సైనిక రైడర్లు నిర్వహించిన ద్విచక్రవాహనాల ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సైనికుల ఖచ్చితమైన విన్యాసాలు, క్రమశిక్షణతో కూడిన ఫార్మేషన్ల అబ్బురపరిచాయి. భద్రతా విధులు, సెర్చ్ ఆపరేషన్లు, మిషన్ మద్దతులో కీలక పాత్రను తెలియజేసేలా శిక్షణ పొందిన కుక్కలు విధేయత, కార్యాచరణ డ్రిల్స్‌తో కూడిన ఆర్మీ కెనైన్ ప్రదర్శన ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చింది. 

 

ఆపరేషన్ సింధూర్, సైన్యం 'దశాబ్దపు పరివర్తన' కార్యక్రమాలు, నూతన తరం పరికరాల శ్రేణిని ప్రముఖంగా ప్రదర్శిస్త్తూ సాంకేతికతను అందిపుచ్చుకోవడం, దేశ నిర్మాణంలో భారత సైన్యం పోషిస్తోన్న పాత్రను ఈ కవాతులోని ఇతివృత్తాంత శకటాలు ప్రముఖంగా తెలియజేశాయి. రాజస్థాన్ ప్రభుత్వ పక్షాన లలిత కళా అకాడమీ సమర్పించిన రెండో శకటం రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన ప్రాకృతిక దృశ్యాలను ప్రదర్శించింది. 

 

భారతదేశపు వైవిధ్యభరితమైన వారసత్వం, ప్రజలతో సైన్యానికి ఉన్న బలమైన బంధాన్ని తెలియజేస్తూ రాజస్థాన్ కళాకారులు ప్రదర్శించిన కల్బెలియా, గైర్ జానపద నృత్యాలతో పాటు మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన చెండ సాంస్కృతిక బృందం చేసిన అద్భుత ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా ఉత్సవాలకు గొప్ప ప్రాంతీయ శోభను అద్దాయి.

జైపూర్ సైనిక దినోత్సవ వేడుకల్లో మాట్లాడిన ఆర్మీ చీఫ్.. సైన్యానికి, ప్రజలకు మధ్య ఉన్న బలమైన బంధాన్ని గుర్తుచేశారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలను ఆయన గౌరవించారు. ఉద్భవిస్తున్న సవాళ్లకు అనుగుణంగా రూపొందించిన కొత్త వ్యవస్థలు, యూనిట్లతో భారత సైన్యం చురుకైన (ఏజిలిటీ) సాంకేతికత, స్వయంప్రతిపత్తితో కూడిన 'భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న' దళంగా మారుతోందని ఆయన ప్రధానంగా చెప్పారు. ఆత్మనిర్భరతను గురించి మాట్లాడిన ఆయన.. స్వదేశీకరణ అనేది ఇప్పుడు ఒక వ్యూహాత్మక అవసరమని పేర్కొన్నారు. దీనికి నిదర్శనంగా 'భారత్‌లో తయారీ' ఆయుధ వ్యవస్థలు, పరికరాలను ఇక్కడ ప్రదర్శించినట్లు తెలిపారు. ద్వంద్వ వినియోగ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలను సైన్యం బలోపేతం చేస్తోందని ఆయన అన్నారు. సాంకేతికత అనేది సైనికుడిని శక్తిమంతం చేయడానికి మాత్రమే కానీ అతని స్థానాన్ని భర్తీ చేయడానికి కాదని పునరుద్ఘాటించిన ఆయన.. సమాచార ప్రవాహం, నిర్ణయాత్మక ప్రక్రియను మెరుగుపరచడానికి రాబోయే సంవత్సరాల్లో నెట్‌వర్కింగ్, డేటా సెంట్రిసిటీపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. 

 

ఈ రోజు సాయంత్రం నిర్వహించబోయే 'శౌర్య సంధ్య' కార్యక్రమానికి భారత రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైన్యానికి చెందిన సీనియర్ ప్రముఖులు, ఇతర పౌర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు వీక్షిస్తారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి 'ఫస్ట్ డే కవర్'ను ఆవిష్కరించనున్నారు. దీనితో పాటు అనేక 'నమన్ కేంద్రాలను' వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆయన వీరమరణం పొందిన వీరుల కుటుంబ సభ్యులను కూడా సత్కరిస్తారు. శౌర్య సంధ్యలో భాగంగా ఆపరేషన్ సింధూర్‌ను పునరావిష్కరిస్తూ 1,000 డ్రోన్లతో నిర్వహించే అద్భుతమైన ప్రదర్శనతో పాటు సంప్రదాయ యుద్ధ కళలు అయిన కలరిపయట్టు, మల్ఖంబ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

***


(रिलीज़ आईडी: 2215133) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी