రక్షణ మంత్రిత్వ శాఖ
తేలికపాటి మిలిటరీ ట్యాంకు విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో... కదులుతున్న లక్ష్యంపై దాడి చేయగల సమర్థత
प्रविष्टि तिथि:
12 JAN 2026 1:39PM by PIB Hyderabad
ప్రయోగానంతరం వెనక్కు తిరిగి చూడనక్కరలేని మూడో తరం మిలిటరీ ట్యాంకు విధ్వంసక నిర్దేశక క్షిపణి (ఎంపీఏటీజీఎం)ని డీఆర్డీవో పరిధిలోని డీఆర్డీఎల్ (హైదరాబాద్) 2026 జనవరి 11న విజయవంతంగా పరీక్షించింది. కదులుతున్న లక్ష్యం ఉపరితలంపై దాడి చేసే సమర్థత ఉన్న ఈ క్షిపణిని చేతుల్లో మోసుకెళ్లొచ్చు. మహారాష్ట్ర అహల్యా నగర్‌లోని కేకే రేంజెస్ ఈ ప్రయోగానికి వేదికైంది.
దేశీయంగా రూపొందించిన ఎంపీఏటీజీఎంలో- ఉష్ణాన్ని గుర్తించి లక్ష్యం దిశగా నడిపే పరికరం (ఐఐఆర్), పూర్తి విద్యుత్ నియంత్రిత చాలక వ్యవస్థ, ఫైర్ కంట్రోల్ వ్యవస్థ, వరుస వార్హెడ్లు, చోదక వ్యవస్థ, అత్యున్నత వీక్షణ వ్యవస్థ వంటి అత్యాధునిక దేశీయ సాంకేతికతలు ఉన్నాయి. డీఆర్డీవో సోదర ప్రయోగశాలలైన హైదరాబాద్‌లోని రీసెర్చి సెంటర్ ఇమారత్, ఛండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ పరిశోధన ప్రయోగశాల, పూణెలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ, డెహ్రాడూన్‌లోని పరికరాల పరిశోధన, అభివృద్ధి సంస్థ వీటిని అభివృద్ధి చేశాయి.
లక్ష్యాలుగా ఉన్న మిలిటరీ ట్యాంకులను అనుసరించగలిగేలా.. ఉష్ణ ఆధారిత లక్ష్యఛేదన వ్యవస్థను (థర్మల్ టార్గెట్ సిస్టమ్) జోద్‌పూర్‌లోని రక్షణ ప్రయోగశాల అభివృద్ధి చేసింది. ఐఐఆర్ సీకర్‌ను పగలూ, రాత్రీ యుద్ధ కార్యకలాపాలను నిర్వహించగల పూర్తి సామర్థ్యంతో రూపొందించారు. ఆధునిక ప్రధాన యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ వార్‌హెడ్‌లకు ఉంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ ఆయుధ వ్యవస్థ రూపకల్పన- ఉత్పత్తి భాగస్వాములు (డీసీపీపీ)గా ఉన్నాయి. ట్రైపాడ్ లేదా సైనిక శకటాల ప్రయోగ వేదిక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు.
ఈ పరీక్షను విజయవంతం చేసిన డీఆర్డీవో, డీసీపీపీ భాగస్వాములు, సంబంధిత వ్యవస్థలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఆత్మనిర్భర భారత్ దిశగా కీలక ముందడుగుగా ఆయన దీనిని అభివర్ణించారు.
రక్షణ పరిశోధన- అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ వారిని అభినందించారు. పరీక్ష విజయవంతంగా పూర్తయిందని, ఈ ఆయుధ వ్యవస్థను భారత సైన్యంలో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని ఆయన తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2215029)
आगंतुक पटल : 61