రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

హైపర్‌సోనిక్‌ క్షిపణి కార్యక్రమం కోసం ‘డీఆర్‌డీవో’ నిర్వహించిన పూర్తిస్థాయి ‘యాక్టివ్‌లీ కూల్డ్ లాంగ్ డ్యూరేషన్ స్క్రామ్‌జెట్ ఇంజిన్ గ్రౌండ్ టెస్ట్‌’ విజయవంతం

प्रविष्टि तिथि: 09 JAN 2026 7:15PM by PIB Hyderabad

హైపర్‌సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పరిధిలోగల ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్‌  డెవలప్‌మెంట్ లేబొరేటరీ (డీఆర్‌డీఎల్‌) ఓ కొత్త విజయం సాధించింది. ఈ మేరకు ‘యాక్టివ్‌లీ కూల్డ్ స్క్రామ్‌జెట్ ఫుల్ స్కేల్ కంబస్టర్’పై విస్తృత ‘లాంగ్ డ్యురేషన్ గ్రౌండ్ టెస్ట్‌’ను విజయవంతంగా నిర్వహించింది. ఇవాళ తమ అత్యాధునిక స్క్రామ్‌జెట్ కనెక్ట్ పైప్ టెస్ట్ (ఎస్‌సీపీటీ) ప్రాంగణంలో ఈ ప్రయోగాన్ని 12 నిమిషాలకుపైగా వ్యవధిలో విజయవంతంగా నిర్వహించింది.

లోగడ 2025 ఏప్రిల్ 25న నిర్వహించిన ‘లాంగ్‌ టెస్ట్‌ సబ్‌స్కేల్’ పరీక్ష నేటి ప్రయోగానికి పునాది వేసింది. హైపర్‌సోనిక్ క్షిపణుల తయారీలో ఇదొక కీలక ఘట్టంగా నిలుస్తుంది. కంబస్టర్‌తోపాటు పరీక్షా సదుపాయానికి ‘డీఆర్‌డీఎల్‌’ రూపకల్పన, అభివృద్ధి బాధ్యతలు నిర్వర్తించగా, తయారీలో పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు పాలుపంచుకున్నాయి. ఈ ప్రయోగాత్మక పరీక్ష విజయం భారత్‌ను అధునాతన అంతరిక్ష సామర్థ్యం రీత్యా ప్రపంచంలో ముందువరుసన నిలిపింది.

హైపర్‌సోనిక్‌ క్రూజ్ క్షిపణి శబ్ద వేగానికి ఐదు రెట్లకుపైగా (గంటకు 6,100 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించగలదు. అత్యాధునిక ‘ఎయిర్‌బ్రీతింగ్‌’ సాంకేతికత వినియోగం ద్వారా ఈ అద్భుత విజయం సాధ్యమైంది. క్షిపణి దీర్ఘకాల ప్రయాణం కోసం సూపర్‌సోనిక్‌ దహన క్రియను ఇందులో ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ‘ఎస్‌సీపీటీ’లో నిర్వహించిన గ్రౌండ్‌ టెస్ట్‌ ద్వారా అత్యాధునిక స్క్రామ్‌జెట్ దహన యంత్రం రూపకల్పన, పరీక్ష కేంద్రం సామర్థ్యం కచ్చితంగా రుజువయ్యాయి.

‘ఫుల్ స్కేల్ యాక్టివ్‌లీ కూల్డ్ లాంగ్ డ్యురేషన్ స్క్రామ్‌జెట్ ఇంజిన్ గ్రౌండ్‌ టెస్ట్‌’ విజయవంతం కావడంపై ‘డీఆర్‌డీవో’తోపాటు పరిశ్రమ భాగస్వాములు, విద్యావేత్తలను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. దేశీయ హైపర్‌సోనిక్‌ క్రూజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి ఈ విజయం ఒక పటిష్ఠ పునాది వేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

రక్షణ పరిశోధన-అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ కూడా ఈ పరీక్షలో పాలుపంచుకున్న బృందాలను అభినందించారు.

***


(रिलीज़ आईडी: 2213677) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi