సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సోమనాథ్‌ అనంత వారసత్వాన్ని.. దాని పునరుద్ధరణలో కుమారపాలుని పాత్రను వివరించే భద్రకాళి ఆలయ శాసనం


ప్రభాస్ పాటన్ పురావస్తు ఆధారాలు.. సోలంకి-యుగ వాస్తుశిల్పం అమూల్య వారసత్వ చిహ్నాలు

సోమనాథ్‌ శిలల్లో శౌర్యం ప్రతిధ్వనిస్తే... శాసనాలు సనాతన సంస్కృతిని చాటుతాయి

సోమనాథ్‌ చరిత్రను తెలిపే శాసనాలు.. భగ్నావశేషాల నిలయం ప్రభాస్ పాటన్ మ్యూజియం

प्रविष्टि तिथि: 11 JAN 2026 1:28PM by PIB Hyderabad

ప్రభాస్ పాటన్‌ ఓ పావన, సుసంపన్న గతాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. ఇక్కడి రాగి ఫలకాలు, శాసనాలు, స్మారక శిలలు ఈ పట్టణ వైభవం, వారసత్వం, అనంత శౌర్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.

ఈ పట్టణంతోపాటు సోమనాథ్ ఆలయ చరిత్రను వెల్లడించే శాసనాలు, ప్రామాణిక భగ్నావశేషాలు వంటివి ప్రభాస్ పటాన్‌ అంతటా మనకు దర్శనమిస్తాయి. క్రూర, హింసాత్మక దండయాత్రలలో  ధ్వంసమైన ఆలయ శాసనాలు, రాగి ఫలకాలు, భగ్నావశేషాలు వంటివి మనవారి మొక్కవోని శౌర్యం, బలం, భక్తికి చిహ్నాలుగా ప్రభాస్ పాటన్‌ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. ఈ మ్యూజియం ప్రస్తుతం అక్కడి ప్రాచీన సూర్య దేవాలయంలో ఉంది.

అటువంటి శాసనాల్లో ఒకదాన్ని ఈ మ్యూజియం సమీపాన భద్రకాళి వీధిలోని పాత రామాలయం పక్కన, సోంపుర బ్రాహ్మణుడు దీపక్‌భాయ్ దవే నివాస ప్రాంగణంలోని పురాతన భద్రకాళి ఆలయం గోడలో పొందుపరిచారు.

ప్రభాస్‌ పాటన్‌ మ్యూజికం సంరక్షకాధికారి శ్రీ తేజల్ పర్మార్ ఈ వివరాలు తెలిపారు. ఈ శాసనాన్ని క్రీస్తుశకం 1169 (వల్లభి సంవత్సరం 850-విక్రమ సంవత్సరం 1255)లో చెక్కారు. ఇది ప్రస్తుతం రాష్ట్ర పురావస్తు శాఖ సంరక్షణలో ఉందని, ఇది అన్హిల్‌వాడ్ పాటన్‌ మహారాజాధిరాజ కుమారపాలుని ఆధ్యాత్మిక గురువైన పరమ పశుపత ఆచార్య శ్రీమాన్ భవబృహస్పతి ప్రశంసా శాసనమని ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ ప్రాచీన-మధ్యయుగ చరిత్రను ఈ శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. నాలుగు యుగాలలో సోమనాథ్‌ మహాదేవుని ఆలయ నిర్మాణాన్ని ప్రస్తావిస్తుంది.

దీని ప్రకారం- సత్యయుగంలో చంద్రుడు (సోముడు) స్వర్ణంతో నిర్మించగా, త్రేతాయుగంలో రావణుడు వెండితో, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కొయ్యతో, కలియుగంలో భీమ్‌దేవ్ సోలంకి ప్రభువు అందమైన కళాకృతితో రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు.

వీటిలో నాలుగో ఆలయాన్ని అంతకుముందు నాటి అవశేషాలపై భీమ్‌దేవ్ సోలంకి నిర్మించినట్లు చరిత్ర ధ్రువీకరిస్తోంది. ఆ తర్వాత అదే ప్రదేశంలో 1169లో కుమారపాలుడు ఐదో ఆలయాన్ని నిర్మించాడు. సోలంకి ప్రభువుల పాలనలో ప్రభాస్‌ పాటన్‌ ఒక ఆధ్యాత్మిక, వాస్తుశిల్ప, సాహిత్య సంగమంగా అవతరించింది. అంతేగాక సిద్ధరాజ్ జయసింహుని న్యాయ నిబద్ధత, కుమారపాలుని భక్తిప్రపత్తులు సోమనాథ్‌ను గుజరాత్ స్వర్ణయుగ సగర్వ చిహ్నంగా నిలిపాయి.

పురాతన శిథిలాల వల్ల మాత్రమేగాక సనాతన ధర్మ ఆధ్యాత్మిక ప్రతిష్ఠ పరంగానూ ఈ పవిత్ర ప్రభాస్ పాటన్‌ వాసికెక్కింది. చారిత్రక భద్రకాళి శాసనం సోలంకి పాలకుల శౌర్యాన్ని, భావ బృహస్పతి వంటి పండితుల భక్తిని ప్రతిబింబిస్తుంది. కళ, వాస్తుశిల్పం, సాహిత్య సమ్మేళనమైన తన సుసంపన్న వారసత్వం ద్వారా ఈ నేల భవిష్యత్తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. మరోవైపు భక్తి, ఆత్మగౌరవాలకు ప్రభాస్‌ నిలయమని ఈ పట్టణ వారసత్వం, సమున్నత సోమనాథ్ ఆలయ శిఖరం లోకానికి ఘనంగా చాటుతున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2213635) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil