రాజస్థాన్ ప్రాంతీయ కృత్రిమ మేధ ప్రభావ సదస్సును 2026 జనవరి 6న నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామిక వేత్తలు, అంకుర సంస్థలు, విద్యావేత్తలు పాల్గొని.. పాలన, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణ, శ్రామిక శక్తి అభివృద్ధిలో కృత్రిమ మేధ తీసుకొచ్చే మార్పులపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమాన్ని 2026 ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (భారత కృత్రిమ మేధ ప్రభావ సదస్సు) 2026’ కు సన్నాహకంగా ఏర్పాటు చేశారు.
ఈ సదస్సులో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ (వర్చువల్‌గా), ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద, రాజస్థాన్ ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి కర్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ పాల్గొన్నారు. వీరితోపాటు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ వాఖ, రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఇది భారతీయ కృత్రిమ మేధ ఆధారిత అభివృద్ధి ప్రయాణంలో రాజస్థాన్‌ను కీలక భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన సహకారాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘పారిశ్రామిక విప్లవం తీసుకువచ్చిన మార్పు, విద్యుత్, కంప్యూటర్లు, సెమీకండక్టర్లు, ఇంటర్నెట్, మొబైల్ సాంకేతికలు ప్రపంచాన్ని ఏ స్థాయిలో మార్చాయో, అదే స్థాయిలో ఇప్పుడు కృత్రిమ మేధ కూడా విప్లవాత్మక మార్పును తీసుకురాబోతుంది. సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించాలనే స్పష్టమైన లక్ష్యం ప్రధానమంత్రికి ఉంది . దీని ద్వారా కృత్రిమ మేధ ఆధారిత విజ్ఞానం కొద్ది మందికే పరిమితం కాకుండా, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సంస్థకు చేరాలనేదే ఆయన లక్ష్యం. ఇందుకు అనుగుణంగా నేడు కృత్రిమ మేధ నైపుణ్యాలలో 10 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీని ద్వారా భారత యువత ఈ కొత్త సాంకేతిక యుగానికి పూర్తిగా సిద్ధమవుతుంది” అని పేర్కొన్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద మాట్లాడుతూ.. “సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని(ప్రజాస్వామీకరణ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢంగా విశ్వసిస్తున్నారు. ఈ దార్శనికతతో వ్యవసాయం, ఆరోగ్య, విద్య, పర్యావరణం వంటి విభిన్న రంగాలలో కృత్రిమ మేధ వినియోగాన్ని విస్తరించేందుకు ‘ఇండియా ఏఐ మిషన్’ కింద ప్రభుత్వం రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంది. బాధ్యతాయుతమైన, సమగ్ర కృత్రిమ మేధ వినియోగం ద్వారా పౌరుల ఆదాయాలను పెంచడం, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా ఉత్పాదకతను పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం” అని ఆయన తెలిపారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ మాట్లాడుతూ.. ‘‘నేడు రాజస్థాన్ ఈ-గవర్నెన్స్, సమ్మిళితత్వాన్ని దాటి ముందుకు సాగుతోంది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో అగ్రగామిగా ఎదగడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోంది. కృత్రిమ మేధ మన దేశ ప్రయాణంలో తదుపరి కీలక దశను సూచిస్తుంది. ఈ దిశగా మరింత ముందుకు సాగుతూ, మేం ఏఐ, ఎంఎల్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ విధానం ద్వారా కృత్రిమ మేధ వ్యవస్థలు మరింత పారదర్శకంగా, న్యాయంగా, నైతికత సమగ్రత సూత్రాలకు బాధ్యతయుతంగా మారేలా చేస్తుంది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ వినయోగం ద్వారా ప్రజా సేవల అందజేతను మరింత వేగంగా, పారదర్శకంగా, పౌర కేంద్రీకృతంగా చేయవచ్చు. ఇది పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది’’ అని తెలిపారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి కృత్రిమ మేధ కార్యక్రమాలను ప్రకటించడం, ప్రారంభించడం ఈ సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి ఏఐ నేతృత్వంలోని ఆవిష్కరణలు, పాలనలో రాజస్థాన్‌ను ఒక కీలక కేంద్రంగా నిలబెట్టే దిశగా దోహదపడతాయి. సంబంధిత కార్యక్రమాలు కింది విధంగా ఉన్నాయి.
· ’’యువ ఏఐ ఫర్ ఆల్’’... మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియా ఏఐ మిషన్ నిర్వహిస్తున్న ఈ జాతీయ ఏఐ అక్షరాస్యత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో ప్రాథమిక కృత్రిమ మేధ అవగాహనను పెంపొందించడమే దీని లక్ష్యం. జాతీయ యువజన దినోత్సవం (జనవరి 12) సందర్భంగా నిర్వహించే ఈ ప్రచారం.. లక్షలాది మంది విద్యార్థులు స్వయంగా నేర్చుకునే విధంగా రూపొందించిన లఘు ఏఐ (ఏఐ 101) కోర్సును పూర్తి చేసేలా వారిని ప్రోత్సహిస్తుంది. వికసిత్ భారత్ దార్శనికతకు, సమ్మిళిత, ప్రజాస్వామ్య ఏఐ స్వీకరణకు అనుగుణంగా దేశవ్యాప్తంగా సమిష్టి కృత్రిమ మేధ అభ్యాస ఉద్యమాన్ని సృష్టించడమే దీని లక్ష్యం
· రాష్ట్రంలో పాలనను బలోపేతం చేయడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అత్యున్నత స్థాయి ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాజస్థాన్ ఏఐ/ఎంఎల్ విధానం 2026 ను ప్రారంభించారు. దీని ప్రారంభానంతరం రాజస్థాన్ ఏఐ పోర్టల్ ను కూడా ఆవిష్కరించారు.
· రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఐస్టార్ట్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ను ప్రారంభించారు.
· రాజస్థాన్ ఏవీజీసీ-ఎక్స్ ఆర్ వేదిక.. రాష్ట్రంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, విస్తరించిన రియాలిటీ రంగాలను బలోపేతం చేయడం లక్ష్యంగా రాజస్థాన్ ఏవీజీసీ-ఎక్స్ ఆర్ వేదికను ప్రారంభించారు. దేశీయ, రాజస్థాన్ ఏఐ దృక్పథాన్ని ప్రతిబింబించే ఏఐ నేపథ్య వీడియోను కూడా విడుదల చేశారు.
· సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తూ ఈ కార్యక్రమంలో ఏఐ పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, నైతిక రూపకల్పనలు, ఆవిష్కరణ వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లేందుకు గూగుల్, ఐఐటీ ఢిల్లీ, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, జోధ్‌పూర్, స్కిల్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (వాధ్వానీ ఫౌండేషన్) తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ప్రైమస్ పార్టనర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సమీర్ జైన్ నేతృత్వంలో ఇండియా ఏఐ మిషన్ సీఈఓ, మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, ఎన్ఐసీ డీజీ శ్రీ అభిషేక్ సింగ్, ఎన్ వీఐడీఐఏ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విశాల్ ధూపర్ ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. ఈ చర్చలో ఏఐ మౌలిక సదుపాయాలను ప్రజాస్వామ్యీకరించడం, ప్రభుత్వ-ప్రైవేటు సహకారాన్ని బలోపేతం చేయడం, విస్తృత స్థాయిలో ఆవిష్కరణలను ప్రారంభించడం, బాధ్యతాయుతమైన, విశ్వసనీయ ఏఐ కోసం ప్రభుత్వ రంగ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ.. ప్రపంచ భద్రతా సామాజిక వేదిక నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలను విశ్లేషించారు.
ఇండియా ఏఐ మిషన్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వివరాలు, ప్రాధాన్యతలను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ శాస్త్రవేత్త, ఇండియా ఏఐ మిషన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి కవితా భాటియా వివరించారు.
ఈ సదస్సులో ‘‘ ప్రపంచ ఏఐ, జాతీయ ఏఐ, ప్రాంతీయ ఏఐపై దృక్పథం” అనే అంశంపై ఒక కార్యక్రమం నిర్వహించారు. దీనిని ఐఐటీ జోధ్‌పూర్ ప్రొఫెసర్ శ్రీ అవినాష్ శర్మ అందించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ పరిశోధనా సంస్థలు ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన, సందర్భోచిత ఏఐ పరిష్కారాలను రూపొందించడంలో ఎలా కీలక పాత్ర పోషిస్తాయో వివరించారు.
పాలన, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, నైతికత, ఉపాధిలో వంటి రంగాల్లో ఏఐ వాస్తవ ప్రపంచ అనువర్తనాలపై నిపుణులు చర్చలు జరిపారు
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ముందు రాజస్థాన్ ప్రాంతీయ సదస్సు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రజా శ్రేయస్సు, సమగ్ర వృద్ధి, అన్ని ప్రాంతాలలో స్థిరమైన అభివృద్ధి కోసం కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించాలనే దేశ నిబద్ధతను బలోపేతం చేసింది.