ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశంలోకి బంగారం అక్రమ రవాణా: ముఠా గుట్టును రట్టు చేసిన డీఆర్ఐ
రూ. 40 కోట్లకు పైగా విలువైన బంగారం, రూ 2.9 కోట్ల నగదును స్వాధీనం
ఢిల్లీ, అగర్తలాలలో సోదాలు నిర్వహించి దుబాయ్, బంగ్లాదేశ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న
అంతర్జాతీయ బంగారం అక్రమ రవాణా ముఠాను పట్టుకున్న డీఆర్ఐ
प्रविष्टि तिथि:
07 JAN 2026 6:36PM by PIB Hyderabad
దేశ సరిహద్దుల ద్వారా జరుగుతున్న బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. ఢిల్లీ, అగర్తలాలో నిర్వహించిన సోదాల్లో... దుబాయ్, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ బంగారం అక్రమ రవాణా ముఠా గుట్టును ఛేదించింది. ఈ దాడుల్లో 29 కిలోలకుపైగా విదేశీ బంగారం, రూ. 2.90 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మకంగా అందిన సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించారు.
అందిన సమాచారం మేరకు.. జనవరి 6, 2025న ముఠాలోని కీలక సభ్యుడిని ఢిల్లీలో పట్టుకున్నారు. త్రిపురలోని అగర్తలా నుంచి రెండు పార్శిళ్లు ఢిల్లీలోని గోదాముకు వచ్చాయి. పరిశీలించగా, అందులో 15 కేజీల విదేశీ బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. రూ.20.73 కోట్ల విలువైన ఈ బంగారంపై విదేశాల్లో తయారైనట్లుగా ముద్రలు కూడా ఉన్నాయి. ఏకకాలంలో ఢిల్లీ, అగర్తలాల్లో దాడులు నిర్వహించగా, మరో 14.2 కేజీల విదేశీ బంగారం, రూ.2.9 కోట్ల విలువైన భారత, బంగ్లాదేశ్ నగదు కూడా దొరికాయి.
కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం సుమారు రూ. 40 కోట్ల విలువైన 29.2 కిలోల బంగారం, రూ.2.9 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అరెస్టు చేశారు.
త్రిపుర వద్ద ఉన్న భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా ఈ ముఠా దేశంలోకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తోందని దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా నిర్వాహకులు.. అగర్తలాలో అభరణాల దుకాణాలు నడుపుతున్న స్థానిక వ్యక్తుల సహకారంతో ఈ బంగారాన్ని దేశీయ కార్గో సేవల ద్వారా ఢిల్లీకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అక్రమ బంగారు రవాణాను అడ్డుకోవడం ద్వారా దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూ.. నాణ్యమైన, పారదర్శక వాణిజ్య వాతావరణాన్ని నిర్ధారించడంలో డీఆర్‌ఐ నిరంతరం కృషి చేస్తోంది.
(रिलीज़ आईडी: 2212268)
आगंतुक पटल : 17