|
శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
“పైరోలిసిస్ ద్వారా బయో-బిటుమెన్” సాంకేతిక పరిజ్ఞాన బదిలీ విజయవంతం.. పరిశుభ్ర-కాలుష్య రహిత రహదారుల శకంలోకి భారత్
ఇది “పంట వ్యర్థాల నుంచి రహదారుల దాకా” పేరిట న్యూఢిల్లీలోని ‘సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ’ సహా డెహ్రాడూన్ లోని ‘సీఎస్ఐఆర్-ఐఐపీ’ల సంయుక్త ఆవిష్కరణ: డాక్టర్ జితేంద్ర సింగ్ “సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ.. ‘సీఎస్ఐఆర్-ఐఐపీ’ సృష్టించిన ఈ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కార్యక్రమం ఢిల్లీలో నిర్వహించాం” ఈ పరిజ్ఞానం ద్వారా తక్కువ వ్యయం.. దీర్ఘకాలం మన్నికతో రహదారుల నిర్మాణం సహా పర్యావరణ కాలుష్య ముప్పు నుంచి విముక్తి లభిస్తుంది” “భారత రహదారులు ఇప్పుడు శిలాజ ఇంధన పరాధీనత నుంచి జీవ-ఆధారిత.. పునరుత్పాదక.. వర్తుల ఆర్థిక పరిష్కారాల వైపు మళ్లుతున్నాయి” “స్వదేశీ బయో-బిటుమెన్‌కు మార్పుతో ఏటా ₹25–30 వేల కోట్ల విలువైన తారు దిగుమతుల తగ్గుదలతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది”
प्रविष्टि तिथि:
07 JAN 2026 5:00PM by PIB Hyderabad
భారత రహదారుల చరిత్రలో ఈ రోజు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దేశం ఇవాళ ‘పరిశుభ్ర, కాలుష్య రహిత రహదారుల’ శకంలో పాదం మోపింది. ఈ మేరకు న్యూఢిల్లీ నిర్వహించిన కార్యక్రమంలో “పైరోలిసిస్ ద్వారా బయో-బిటుమెన్: పంట వ్యర్థాల నుంచి రహదారుల దాకా” పేరిట రూపొందిన సాంకేతిక పరిజ్ఞాన బదిలీ పూర్తయింది. న్యూఢిల్లీలోని శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్)- కేంద్రీయ రహదారి పరిశోధన సంస్థ (సీఆర్‌ఆర్‌ఐ), డెహ్రాడూన్‌లోని ‘సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ)లు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా రూపొందించాయి.
కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ‘సీఎస్‌ఐఆర్’ ఉపాధ్యక్షుడు డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు.
ఈ పరిజ్ఞానంతో భారత రహదారులు ఇక శిలాజ ఇంధన పరాధీనత నుంచి జీవ-ఆధారిత, పునరుత్పాదక, వర్తుల ఆర్థిక పరిష్కారాలవైపు మళ్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ రోజును ఒక చారిత్రక ఘట్టంగా గుర్తుంచుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సాంకేతికతతో రహదారుల నిర్మాణ వ్యయం తగ్గడంతోపాటు అవి దీర్ఘకాలం మన్నుతాయి. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యం ముప్పు నుంచి కూడా రహదారులకు విముక్తి లభిస్తుంది.
దేశంలో శాస్త్ర విజ్ఞాన, ప్రభుత్వ, సామాజిక ఏకోన్ముఖ కృషికి ఈ ఆవిష్కరణ ఒక నిదర్శనమని ఆయన అభివర్ణించారు. ఇది వికసిత భారత్ సాకారం దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనల్లో రూపొందిన ఏకోన్ముఖ జాతి విధానానికి సూచిక.
పరిశుభ్రత, స్వయంసమృద్ధ భారత్, ఆర్థిక స్వావలంబన వంటి జాతీయ లక్ష్యాల సాధనకు శాస్త్రీయ పరిశోధనలు ప్రత్యక్షంగా ఎలా ఉపయోగపడతాయో బయో-బిటుమెన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రుజువు చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సమాచారం, విస్తరణ ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ, భాగస్వాములలో విస్తృత అవగాహన, అనుసరణ దిశగా ఆవిష్కరణలను విశదం చేయాలని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా ‘సీఎస్‌ఐఆర్’ పరిధిలోగల 37 ప్రయోగశాలలలో ప్రతి ఒక్కదానికీ స్ఫూర్తిదాయక విజయగాథలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే, దేశంలోని పౌరులు, పరిశ్రమలు, రాష్ట్రాలకు శాస్త్రవిజ్ఞాన వ్యాప్తికి గత దశాబ్దంలో బాటలు పడ్డాయని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ‘వ్యర్థం నుంచి అర్థం’ విధానాన్ని ప్రస్తావిస్తూ- బయో-బిటుమెన్ ఇందుకు ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ఇది ఏకకాలంలో పలు సవాళ్లను పరిష్కరిస్తుందని, పంట దుబ్బుల నిర్వహణ నుంచి పర్యావరణ పరిరక్షణ, దిగుమతుల తగ్గింపు దాకా అంశాలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. భారత్ ప్రస్తుతం తన బిటుమెన్ అవసరంలో దాదాపు 50 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నదని తెలిపారు. ఈ పరిస్థితుల నడుమ బయో-బిటుమెన్ వంటి ఆవిష్కరణలు దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ విదేశీ పరాధీనతను తగ్గిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
వ్యవసాయ వ్యర్థాల పైరోలైసిస్ ప్రక్రియ ద్వారా తయారుచేసిన బయో-బిటుమెన్‌ను పారిశ్రామిక-స్థాయిలో సాంకేతిక బదిలీ చేయడాన్ని ఈ కార్యక్రమం వెల్లడి చేసింది. ఈ మేరకు పంటకోత తర్వాత వరి గడ్డి సేకరణ, ప్యాలెటైజేషన్, బయో-ఆయిల్ ఉత్పత్తి దిశగా పైరోలైసిస్, తదనంతరం సంప్రదాయ బిటుమెన్‌తో కలపడం వంటివి ఈ ప్రక్రియలో భాగంగా ఉంటాయి. తద్వారా 20-30 శాతం సంప్రదాయ బిటుమెన్‌ను పనితీరుతో రాజీ పడకుండా సురక్షితంగా రూపొందించవచ్చని విస్తృత ప్రయోగశాల ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ సాంకేతికతను భౌతిక, భూగర్భ, రసాయన, యాంత్రిక లక్షణాలతో పరీక్షించారు. ఈ పరీక్షలలో రాటింగ్, పగుళ్లు, తేమ నష్టం, పునరుత్థాన మాడ్యులస్ వంటివి అంతర్భాగంగా ఉన్నాయి. మేఘాలయలోని జోరాబత్-షిల్లాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్‌హెచ్-40)పై బయో-బిటుమెన్ వినియోగంతో 100 మీటర్ల ప్రయోగాత్మక రహదారిని ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు. తద్వారా క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను నిర్ధారించే వీలుంటుంది. ఈ సాంకేతికతపై హక్కు కోసం పేటెంట్ దాఖలు చేయడంతోపాటు వాణిజ్యీకరణ దిశగా అనేక పరిశ్రమల భాగస్వామ్యానికి రంగం సిద్ధమైంది.
ఈ కార్యక్రమం సందర్భంగా ‘సీఎస్‌ఐఆర్’ బృందాన్ని మంత్రి అభినందించారు. బయో-బిటుమెన్ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్త కీలక పురోగమనంలో భాగమని ఆయన అభివర్ణించారు. ఈ ఆవిష్కరణ ఫలితంగా ఏటా ₹25–30 వేల కోట్ల విలువైన బిటుమెన్ దిగుమతులు తగ్గడమేగాక ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ-నిర్దిష్ట, వనరుల ఆధారిత పరిశోధనల విస్తృతికి పిలుపునిచ్చారు.
రహదారుల నిర్మాణంలో స్టీల్ స్లాగ్, ప్లాస్టిక్ వ్యర్థాలు, బయో-ఇంధనం వంటి ప్రత్యామ్నాయ పదార్థాల వినియోగంలో తన అనుభవాలను, ఆలోచనలను మంత్రి అందరితోనూ పంచుకున్నారు. నిదర్శానాధారిత సాంకేతికత, ఆర్థిక గిట్టుబాటు, ముడి పదార్థాల లభ్యత, మార్కెట్ సామర్థ్యం తదితరాల కలయికతో దీన్ని విజయవంతంగా భారీ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. జాతీయ రహదారి ప్రమాణాలతో బయో-బిటుమెన్ అనుసంధానానికి పూర్తి సంస్థాగత మద్దతుపై ఆయన హామీ ఇచ్చారు.
‘సీఎస్‌ఐఆర్’ డైరెక్టర్ జనరల్-‘డీఎస్‌ఐఆర్’ కార్యదర్శి ఎన్.కలైసెల్వి మాట్లాడుతూ- ఇది భారత శాస్త్రవిజ్ఞాన రంగానికి గర్వకారణ ఘట్టమని అభివర్ణించారు. ప్రపంచంలో కేవలం ఒక ఏడాదిలోనే బయో-బిటుమెన్ సాంకేతికతను పారిశ్రామిక-వాణిజ్య స్థాయికి తీసుకెళ్లిన తొలి దేశంగా భారత్ అవతరించిందని ఆమె పేర్కొన్నారు. బయోమాస్ పైరోలైసిస్ ప్రక్రియతో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. రోడ్లకు బయో-బైండర్, చౌక విమాన ఇంధనం, బయో-పురుగుమందు ముడిపదార్థాల తయారీతోపాటు బ్యాటరీలు, నీటి శుద్ధి, అధునాతన పదార్థాలకు అనువైన హై-గ్రేడ్ కర్బన ఉత్పత్తి తదితరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. తద్వారా ఈ ప్రక్రియ ఉద్గార రహితం, పొదుపు, భవిష్యత్ సంసిద్ధం కాగలదన్నారు. దేశవ్యాప్తంగా వినియోగాన్ని విస్తరించేందుకు బయో-బిటుమెన్ మిశ్రమాన్ని విధాన స్థాయిలో అమలు చేయాలని కూడా ఆమె ప్రతిపాదించారు.
ఈ కార్యక్రమంలో ‘సీఎస్‌ఐఆర్-సీఆర్ఆర్ఐ, సీఎస్ఐఆర్-ఐఐపీ’ బృందాల సీనియర్ సారథులు, మాజీ డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ భాగస్వాములు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. శాస్త్రవిజ్ఞాన, ప్రభుత్వ, పరిశ్రమ రంగాల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ఇది ప్రతిబింబించింది. సుస్థిర మౌలిక సదుపాయాలు, స్వదేశీ ఆవిష్కరణలు, జీవ-ఆధారిత ఆర్థిక భవిష్యత్తుపై భారత్ నిబద్ధతను ఈ సాంకేతికత బదిలీ కార్యక్రమం ప్రస్ఫుటం చేసింది. దేశాన్ని పరిశుభ్ర, కాలుష్య రహిత, స్వయంసమృద్ధ రహదారుల పథంలో దృఢంగా నిలిపింది.
***
(रिलीज़ आईडी: 2212266)
|