రక్షణ మంత్రిత్వ శాఖ
జీఎస్ఎల్, ఇతర భారతీయ నౌకానిర్మాణ కేంద్రాలు నిర్మించిన నౌకలు భారత సార్వభౌమత్వానికి తేలియాడే ప్రతీకలు: రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్..
కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ భారతీయ తీర రక్షక దళంలో చేరడానికి ముందు కితాబిచ్చిన మంత్రి
‘‘రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఒక విలాసం కాదు.. అది వ్యూ హాత్మక అవసరం’’
‘‘ప్రత్యర్థులపై పైచేయి సాధించడంలో.. నౌకలకు అత్యాధునిక సామగ్రిని అందించడం, ఏఐ-ఆధారిత నిర్వహణ, సైబర్ రక్షణ వేదికలు.. ఇవి చాలా ముఖ్యం’’
‘‘భారత్ చురుకైన సముద్ర వాణిజ్య దేశం.. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుస్థిరత్వానికీ,సహకారానికీ, నియమపాలన ప్రధాన వ్యవస్థకూ పూచీ పడుతుంది’’
प्रविष्टि तिथि:
04 JAN 2026 8:36PM by PIB Hyderabad
‘‘గోవా షిప్‌యార్డు (జీఎస్ఎల్)సహా ఇతర భారతీయ నౌకానిర్మాణ కేంద్రాలు భారతీయ నౌకాదళానికీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ)కీ నిర్మించిన నౌకలు భారతీయ సార్వభౌమత్వానికి ప్రతీకలు.. ఇవి సముద్రంలో మన స్థానానికీ, సామర్థ్యానికీ, సంకల్పానికీ సాధికార ప్రాతినిధ్యం వహిస్తాయ’’ని కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కాలుష్య నియంత్రణ నౌక (పీసీవీ) ‘సముద్ర ప్రతాప్’ను ఐసీజీలోకి చేర్చుకునే ఘట్టానికి ముందు రోజున.. అంటే 2026 జనవరి 4న.. జీఎస్ఎల్‌ను మంత్రి సందర్శించారు. జీఎస్ఎల్ తీర్చిదిద్దిన రెండు పీసీవీల్లో ఒకటైన సముద్ర ప్రతాప్ సేవలను 2026 జనవరి 5న గోవాలో రక్షణ మంత్రి సమక్షంలో అధికారికంగా స్వీకరించనున్నారు.
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి ఒక విలాసం ఏమీ కాదనీ, అది వ్యూహాత్మక అవసరమనీ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్ణించారు. ఈ ఆవశ్యకతకు కార్యరూపాన్ని ఇచ్చినందుకు జీఎస్ఎల్ వంటి సంస్థలను మంత్రి ప్రశంసించారు. సామర్థ్యాలను జీఎస్ఎల్ నిరంతరం పెంచుతోందనీ, సాంకేతికతను సద్వినియోగపరుస్తోందనీ, స్వదేశీ డిజైనును దృఢతరం చేస్తోందనీ, దీంతో సాయుధ దళాలకు సమయానికి ఉపకరణాల సరఫరా సాధ్యపడుతోందనీ ఆయన అన్నారు. ఫలితంగా దేశం స్వయం సమృద్ధి సాధన దిశగా చకచకా అడుగులు వేయగలుగుతోందన్నారు.
ఈనాటి సంక్లిష్ట భద్రతా అనుబంధ వ్యవస్థలో భారతీయ షిప్‌యార్డులు కీలక పాత్రను పోషిస్తున్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. సముద్ర వాణిజ్య రంగంలో సాంప్రదాయిక సవాళ్లతో పాటు సాంప్రదాయేతర ముప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. ‘‘సముద్రంలో మత్తుపదార్థాల దొంగ రవాణా, చట్టానికి విరుద్ధంగా చేపల్ని వేటాడటం, మనుషుల్ని చట్టం కన్నుగప్పి తరలించడం, పర్యావరణ పరమైన నేరాలకు ఒడిగట్టడం, అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడటం వంటి అనేక సవాళ్లను మనం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో, నౌకానిర్మాణ కేంద్రాల భూమిక మరెంతో ముఖ్యంగా మారుతోంది. దేశ సముద్ర వాణిజ్య చరిత్ర, నౌకాదళ వారసత్వం, వ్యూహాత్మక దూరదృష్టి పరంగా కేంద్ర స్థానంలో నిలిచిన నగరంలో నెలకొన్న జీఎస్ఎల్, భారత రక్షణ అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఓ కీలక స్తంభం. సముద్ర వాణిజ్య రక్షణకు పూచీపడటంలో ప్రధాన బాధ్యతను నిర్వహిస్తోంది ఈ సంస్థ’’ అని మంత్రి అన్నారు.
ఓ నౌక.. ఉక్కు, యంత్ర సామాగ్రి, సాంకేతికతల మిశ్రమం మాత్రమే కాదు,, ప్రజల భరోసా, సాయుధ బలగాల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక కూడా అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఈ భరోసానూ, ఈ అంచనాలనూ జీఎస్ఎల్ సంవత్సరాల తరబడి నెరవేరుస్తూ వస్తోందని ఆయన అన్నారు.
ఒక చురుకైన సముద్ర వాణిజ్య ప్రధాన దేశంగా భారత్ పురోగమిస్తోందనీ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుస్థిరత్వం, సహకారం, నియమాలపై ఆధారపడ్డ వ్యవస్థకు పూచీపడటంలో మనం పోషించాల్సిన పాత్ర నిరంతరంగా సశక్తమవుతోందనీ రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. రాబోయే కాలంలో భారత్ ప్రపంచంలో తన విశ్వసనీయతను బలోపేతం చేసుకోవడంలో, జీఎస్ఎల్ వంటి సంస్థలు మరింత తోడ్పాటును అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘రక్షణ రంగంలో సాంకేతిక విజ్ఞానానికి ప్రాధాన్యం అంతకంతకూ పెరుగుతున్న విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా మనను మనం సన్నద్ధపరుచుకోవాలి. ప్రత్యర్థులపై పైచేయిని సాధించడానికి నౌకల్ని అత్యాధునిక ఉపకరణాలతో, కృత్రిమ మేధ సాయాన్ని తీసుకొంటూ విధులను నిర్వహించేవిగా, సైబర్ భద్రత వేదికలను సంతరించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ మార్పుల్లోనూ జీఎస్ఎల్ నాయకత్వ పాత్రను పోషిస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన అన్నారు.
బెల్జియమ్ కోసం అత్యున్నత సాంకేతికతతో ఒక తవ్వోడ (డ్రెడ్జరు)ను నిర్మించే దిశగా జీఎస్ఎల్ చేస్తున్న ప్రయత్నాలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మెచ్చుకున్నారు. భారత్‌ను స్వయంసమృద్ధి సహిత దేశంగా తీర్చిదిద్దడంతో పాటు, ఒక అచ్చమైన రక్షణ ఎగుమతిదారు దేశంగా కూడా మలచే లక్ష్యంతో రక్షణ రంగ ఎగుమతులపై మరింత దృష్టిని కేంద్రాకరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘‘2047వ సంవత్సరానికల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కరించాలన్న దార్శనికతను సాకారం చేయడానికి మనం బాగా కష్టపడి పనిచేయాలి, నిబద్ధతతో నిరంతర ప్రగతికి దీక్షాబద్ధులం కావాలి’’ అని ఆయన అన్నారు. జీఎస్ఎల్ వంటి సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం పూర్తి మద్దతును అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, ఐసీజీ డైరెక్టర్ జనరల్ శ్రీ పరమేశ్ శివమణి, జీఎస్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బ్రజేశ్ కుమార్ ఉపాధ్యాయ్‌లతో పాటు షిప్‌యార్డుకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2211537)
आगंतुक पटल : 11