రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశానికి రైల్వేశాఖ కొత్త ఏడాది కానుక: గువహటి-హౌరా మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు

प्रविष्टि तिथि: 01 JAN 2026 5:03PM by PIB Hyderabad

కొత్త ఏడాది సందర్భంగా రైల్వేశాఖ దేశానికి ఓ కానుక ప్రకటించింది. ఈ మేరకు గువహటి-హౌరా మార్గంలో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలును ప్రారంభిస్తామని రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ రోజు న్యూఢిల్లీలోని రైల్‌ భవన్‌లో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ- ముందుగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన, కొత్త రైలు గురించి ప్రకటన చేశారు. అస్సాంలోని గువహటి నుంచి పశ్చిమబెంగాల్‌లోని హౌరా మధ్య  నడిచే ఈ రైలును గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెలలోనే ప్రారంభిస్తారని చెప్పారు. ఈ రైలుకు సంబంధించి ప్రయోగాత్మక పరీక్షలు, ధ్రువీకరణ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. రైల్వేల చరిత్రలోనేగాక దేశానికి, ప్రయాణికులకు కూడా ఇదొక కీలక ఘట్టమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది మన రైల్వేలకు కీలక సంస్కరణల సంవత్సరమని, ఇందులో భాగంగా అనేక ప్రయాణిక ప్రాధాన్య కార్యక్రమాలను అమలు చేస్తామని వెల్లడించారు.

తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెట్టడం ద్వారా అస్సాంలోని కామరూప్ మెట్రోపాలిటన్, బొంగైగావ్, సహా పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్, జల్పాయ్‌గురి, మాల్దా, ముర్షిదాబాద్, పూర్వ బర్ధమాన్, హుగ్లీ, హౌరా జిల్లాలు లబ్ధి పొందుతాయి. ఈ రైలులో 823 మంది ప్రయాణించే వీలుండగా, 11 త్రీ-టైర్, 4 టూ-టైర్, 1 ఫస్ట్ క్లాస్ వంతున మొత్తం 16 ఏసీ కోచ్‌లు ఉంటాయి.

ఈ బోగీలన్నిటినీ సరికొత్త సస్పెన్షన్‌ వ్యవస్థతో రూపొందించినట్లు శ్రీ అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. మొత్తం మీద డిజైన్ పారామితులను మరింత ఉన్నత స్థాయికి చేర్చామని చెప్పారు. ఇంటీరియర్స్, నిచ్చెనలు ఎర్గోనామిక్ డిజైన్‌తో ఉంటాయన్నారు. భద్రత-రక్షణ కోసం ప్రత్యేక పారామితులను నిర్దేశించారు.

వందే భారత్ స్లీపర్ రైలు అధిక నాణ్యతతో, రాత్రి ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా సాగేలా రూపొందిందని ఆయన వివరించారు. ఇది ప్రారంభ స్థానం నుంచి సాయంత్రం బయలుదేరి మరునాటి ఉదయం గమ్యానికి చేరేలా ప్రయాణ వేళలు నిర్ణయిస్తామని చెప్పారు.

వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులు ప్రత్యేక ప్రాంతీయ వంటకాల రుచులను ఆస్వాదించవచ్చు. గువహటి నుంచి బయల్దేరే రైలులో అస్సామీ పాకశైలి వంటకాలు, తిరిగి కోల్‌కతా నుంచి  బయల్దేరినపుడు సంప్రదాయ బెంగాలీ వంటకాలను రుచి చూడవచ్చు. మొత్తం మీద ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా, సాంస్కృతికంగా, విశిష్ట భోజనానుభవాన్నిస్తాయి.

వందేభారత్‌ స్లీపర్‌ రైలు విశిష్టతలు:

·         180 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమీ-హై-స్పీడ్ రైలు.

·         మెరుగైన కుషనింగ్‌, ఎర్గోనామిక్‌ బెర్తులు.

·         కదలికలో ఇబ్బంది కలగకుండా వెస్టిబ్యూల్స్‌తో ఆటోమేటిక్ తలుపులు.

·         మరింత సస్పెన్షన్, శబ్దం తగ్గింపు ద్వారా మెరుగైన ప్రయాణానుభవం.

·         ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థ అమరిక.

·         అత్యున్నత పరిశుభ్రత నిర్వహణకు క్రిమిసంహారక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం.

·         అత్యధునాతన నియంత్రణ-భద్రత వ్యవస్థలతో డ్రైవర్ క్యాబ్.

·         ఏరోడైనమిక్ బాహ్య రూపం, బోగీలకు ఆటోమేటిక్ తలుపులు.

·         దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.

·         అత్యవసర స్థితిలో ప్రయాణికులు, రైలు మేనేజర్/లోకో పైలట్ మధ్య సమాచార ప్రదానం కోసం ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ యూనిట్

·         అన్ని కోచ్‌లలోనూ సీసీటీవీలు.

·         అగ్ని ప్రమాద ముప్పును పసిగట్టేందుకు ఎలక్ట్రిక్‌ కేబినెట్లు, మరుగుదొడ్లలో ఏరోసోల్ ఆధారిత అగ్ని గుర్తింపు, ఆర్పివేత వ్యవస్థ.

భారతీయ రైల్వేల్లో ఓ నవశకానికి తొలి వందే భారత్ స్లీపర్ రైలు నాంది పలుకుతుంది. ఆధునిక సదుపాయాలతో రాత్రివేళ ప్రయాణం వేగంగా, సౌకర్యవంతంగా సాగుతుంది. సురక్షిత, వేగవంతమైన, సౌకర్యవంతమైన, సాంస్కృతిక సుసంపన్న ప్రయాణ అనుభవాన్నిస్తుంది. ప్రయాణిక ప్రాధాన్య సేవలు, సాంకేతిక ఆవిష్కరణలు, ప్రాంతీయ అనుసంధానంపై రైల్వేల దూరదృష్టిని ప్రస్ఫుటం చేస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2210608) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Tamil , Kannada