ప్రధాన మంత్రి కార్యాలయం
‘వ్యవసాయం, సహకార సంఘాలు’ అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
24 FEB 2023 12:20PM by PIB Hyderabad
బడ్జెట్‌కు సంబంధించిన ఈ కీలకమైన వెబినార్‌కు మీ అందరికీ సాదర స్వాగతం. గత 8, 9 సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా బడ్జెట్‌లో వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాం. గత కొన్ని సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు వార్తాపత్రికలను గమనిస్తే.. ప్రతి బడ్జెట్‌ను 'గావ్, గరీబ్ ఔర్ కిసాన్ వాలా బడ్జెట్' (గ్రామాలు, పేదలు, రైతుల కోసం బడ్జెట్) అని పిలవడాన్ని మీరు చూసే ఉంటారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2014లో వ్యవసాయ బడ్జెట్ రూ. 25 వేల కోట్ల కంటే తక్కువగా ఉండేది. కానీ నేడు దేశ వ్యవసాయ బడ్జెట్ రూ. 1 లక్షా 25 వేల కోట్ల కంటే ఎక్కువగా ఉంది.
మిత్రులారా,
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు మన వ్యవసాయ రంగం కొరతతోనే కొట్టుమిట్టాడింది. ఆహార భద్రత కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ మన రైతులు మనల్ని ఆహార విషయంలో స్వయం సమృద్ధిగా మార్చడమే కాకుండా, నేడు ఎగుమతులు చేసే స్థాయికి తీసుకెళ్లారు. వారి కృషి వల్లే నేడు భారత్ రకరకాల వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. మన రైతులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను సులభంగా చేరుకునేలా మేం మార్గం సుగుమం చేశాం. అయితే స్వయం సమృద్ధి అయినా లేదా ఎగుమతులు అయినా.. మన లక్ష్యం కేవలం వరి, గోధుమలకే పరిమితం కాకూడదని మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. 2021-22లో పప్పుధాన్యాల దిగుమతి కోసం మనం రూ. 17 వేల కోట్లు ఖర్చు చేశాం. విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల దిగుమతికి రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశాం. 2021-22లో వంట నూనెల దిగుమతి కోసం ఏకంగా రూ. 1.5 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఈ ఉత్పత్తుల దిగుమతి కోసం సుమారు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అంటే ఈ డబ్బు దేశం దాటి బయటకు వెళ్లిపోయింది. ఒకవేళ మనం ఈ రంగాల్లో కూడా స్వయంసమృద్ధి సాధిస్తే ఈ డబ్బు మన రైతులకే చేరుతుంది. గత కొన్ని ఏళ్లుగా బడ్జెట్‌లో ఈ రంగాలను ముందుకు తీసుకెళ్లేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నాం. మేం కనీస మద్దతు ధరను పెంచాం. పప్పుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించాం. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల సంఖ్యను పెంచాం. వీటితో పాటు వంట నూనెల విషయంలో పూర్తి స్వయంసమృద్ధి సాధించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి.
వ్యవసాయ రంగానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించనంత వరకు దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించలేదు. నేడు దేశంలో అనేక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మన ఉత్సాహవంతులైన యువత అందులో చురుకుగా పాల్గొంటున్నారు. కానీ వ్యవసాయం రంగ ప్రాముఖ్యత, అందులో ముందుకు సాగేందుకు ఉన్న అవకాశాలు తెలిసినప్పటికీ, యువత భాగస్వామ్యం ఈ రంగంలో తక్కువగా ఉంది. ప్రైవేటు ఆవిష్కరణలు, పెట్టుబడులు ఇప్పటికీ ఈ రంగానికి దూరంగానే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేయడానికి ఈ ఏడాది బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశాం. వ్యవసాయ రంగంలో అందరికీ అందుబాటులో ఉండే ఉచిత సాంకేతిక వేదికలను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సహిస్తున్నాం. నేడు మనందరం ఉపయోగిస్తున్న యూపీఐ తరహాలోనే, వ్యవసాయం కోసం ఒక ఓపెన్ డిజిటల్ వేదికను తీసుకువచ్చాం. నేడు డిజిటల్ లావాదేవీల్లో ఎలా విప్లవం వచ్చిందో అదే విధంగా వ్యవసాయ, సాంకేతిక రంగంలో కూడా పెట్టుబడులు, ఆవిష్కరణలకు అపారమైన అవకాశాలు ఏర్పడతాయి. రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి అవకాశం కలుగుతుంది. పంటలను పెద్ద మార్కెట్లకు చేరవేసే సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. సాంకేతికత ద్వారా బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి, సరైన సమయంలో, సరైన వ్యక్తికి, సరైన సలహా అందించడానికి అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో ల్యాబ్‌లు ఉన్నట్లే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు నేల పరీక్షా కేంద్రాలను యువత ఏర్పాటు చేయవచ్చు. పంట అంచనా వేయడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల గురించి ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం అందించవచ్చు. మన యువత ప్రభుత్వం, రైతులకు మధ్య సమాచార వారధిగా మారవచ్చు. ఏ పంటలు వేస్తే ఎక్కువ లాభం వస్తుందో రైతులకు వివరిస్తూ, వారి ఆదాయం పెరగడంలో సాయపడవచ్చు. ఈ రంగంలో చురుగ్గా పాల్గొనడం ద్వారా యువత రైతులకు సహాయం చేయడమే కాకుండా, తాము కూడా ఆర్థికంగా ఎదిగే గొప్ప అవకాశం ఏర్పడుతుంది.
మిత్రులారా,
ఈ ఏడాది బడ్జెట్‌లో మరో ముఖ్యమైన ప్రకటన చేశాం. అగ్రి-టెక్ అంకుర సంస్థల వృద్ధిని వేగవంతం చేసేందుకు ఆర్థిక నిధిని ఏర్పాటు చేయబోతున్నాం. మనం కేవలం డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాకుండా, మీ కోసం నిధుల మార్గాలను కూడా సృష్టిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన యువ పారిశ్రామికవేత్తలు ఉత్సాహంతో ముందుకు సాగి తమ లక్ష్యాలను సాధించాల్సిన సమయం ఆసన్నమైంది. 9 ఏళ్ల క్రితం మన దేశంలో వ్యవసాయ అంకుర సంస్థలు నామమాత్రంగానే ఉండేవని చెప్పాలి. కానీ నేడు 3000 కంటే ఎక్కువ అగ్రి స్టార్టప్‌లు ఉన్నాయి. అయినప్పటికీ మనం ఇంకా వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా,
భారత్ చేసిన ప్రతిపాదన మేరకు ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారని మీ అందరికీ తెలుసు. చిరుధాన్యాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం అంటే మన చిన్న రైతుల ఉత్పత్తుల కోసం ప్రపంచ మార్కెట్ సిద్ధమవుతోందని అర్థం. మన దేశం ఈ బడ్జెట్‌లోనే తృణధాన్యాలకు 'శ్రీ అన్న' అనే గుర్తింపును ఇచ్చింది. నేడు 'శ్రీ అన్న'ను ప్రోత్సహిస్తున్న తీరు మన చిన్న రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ రంగంలో కూడా అంకుర సంస్థలు వృద్ధి చెందే అవకాశాలు పెరిగాయి. తద్వారా మన రైతులు ప్రపంచ మార్కెట్‌ను సులభంగా చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది.
మిత్రులారా,
భారత సహకార రంగంలో ఒక కొత్త విప్లవం చోటు చేసుకుంటోంది. ఇప్పటివరకు ఇది దేశంలోని కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు దీనిని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాం. ఈ బడ్జెట్‌లో సహకార రంగానికి గణనీయమైన పన్ను ప్రయోజనాలు కల్పించాం. తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే సహకార సంఘాలు తక్కువ పన్ను రేటు ప్రయోజనాన్ని పొందుతాయి. ఈ సహకార సంఘాలు రూ. 3 కోట్ల వరకు నగదు ఉపసంహరణ చేసినా దానిపై టీడీఎస్ విధించరు. గతంలో ఇతర కంపెనీలతో పోలిస్తే తమపై వివక్ష చూపిస్తున్నారనే భావన సహకార రంగంలో ఉండేది. ఈ బడ్జెట్‌లో ఆ అన్యాయాన్ని తొలగించాం. ఒక ముఖ్యమైన నిర్ణయం ప్రకారం 2016-17 కంటే ముందు చక్కెర సహకార సంఘాలు చేసిన చెల్లింపులపై పన్ను మినహాయింపు ఇచ్చాం. దీనివల్ల చక్కెర సహకార సంఘాలకు సుమారు రూ. 10,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుంది.
మిత్రులారా,
సహకార సంఘాలు ఇంకా అందుబాటులోకి రాని ప్రాంతాల్లో పాడి పరిశ్రమ, మత్స్య రంగానికి సంబంధించిన సహకార సంఘాలు ఏర్పడటం వల్ల చిన్న రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా మత్స్య రంగంలో ఉన్నవారికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. గత 8, 9 ఏళ్లలో దేశంలో చేపల ఉత్పత్తి సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. 2014 కంటే ముందు ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తిని పెంచడానికి దాదాపు ముప్పై ఏళ్లు పట్టేది. ఈ ఏడాది బడ్జెట్‌లో పీఎం మత్స్య సంపద యోజన కింద రూ. 6,000 కోట్లతో ఒక కొత్త ఉప విభాగాన్ని ప్రకటించాం. ఈ నిధులు మత్స్య రంగం వ్యవస్థతో పాటు మార్కెట్లను బలోపేతం చేస్తాయి. దీనివల్ల మత్స్యకారులు, చిన్న పారిశ్రామికవేత్తలకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మిత్రులారా,
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రసాయన ఆధారిత వ్యవసాయాన్ని తగ్గించడానికి కూడా వేగంగా కృషి చేస్తున్నాం. ఈ దిశలో పీఎం-ప్రణామ్ యోజన, గోవర్ధన్ యోజనలు ఎంతగానో దోహదపడతాయి. మనమందరం ఒక బృందంగా ఈ విషయాలను ముందుకు తీసుకెళ్తామని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు జరుగుతున్న ఈ వెబినార్‌కు నేను మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీలాంటి వాటాదారులందరూ కలిసి మీ బలాన్ని, మీ సంకల్పాన్ని ఈ బడ్జెట్ నిబంధనలతో ఏకమవ్వడం ద్వారా.. ఈ బడ్జెట్ ప్రయోజనాలను వీలైనంత త్వరగా గరిష్ట సంఖ్యలో ప్రజలకు ఎలా చేరవేయాలో మార్గాలను అన్వేషిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని, మత్స్య పరిశ్రమను ఆశించిన స్థాయికి తీసుకెళ్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ వెబినార్‌లో లోతుగా ఆలోచించి, వినూత్నమైన ఆలోచనలను పంచుకుని, రాబోయే ఏడాదికి సంబంధించి ఒక సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేస్తారని ఆశిస్తున్నాను.
మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
***
(रिलीज़ आईडी: 2209696)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam