ప్రధాన మంత్రి కార్యాలయం
లక్నోలో 'రాష్ట్ర ప్రేరణ స్థల్' ప్రారంభోత్సవ విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 DEC 2025 8:26PM by PIB Hyderabad
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం, ఆదర్శాలను గౌరవిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మించిన 'రాష్ట్ర ప్రేరణ స్థల్' ప్రారంభోత్సవ విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేడు లక్నో ఒక కొత్త స్ఫూర్తికి సాక్షిగా మారుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. డిసెంబర్ 25న దేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి వేడుకలు ఉన్నాయని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ, భారతరత్న మహామన మదన్ మోహన్ మాలవీయ దేశ గుర్తింపు, ఐక్యత, ప్రతిష్ఠను కాపాడటానికి జీవితాలను అంకితం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అపారమైన కృషి ద్వారా ఈ ఇద్దరు మహనీయులు దేశ నిర్మాణంలో చెరగని ముద్ర వేశారని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులలో ఈ విధంగా పేర్కొన్నారు:
“నిస్వార్థ నాయకత్వం, సుపరిపాలన స్ఫూర్తిని రాష్ట్ర ప్రేరణ స్థల్‌లోని కమల పుష్ప ఆకారపు అత్యాధునిక మ్యూజియం సజీవంగా సాక్షాత్కరిస్తోంది. ఇది మన ప్రజా నాయకుల ఆదర్శాలను స్వీకరించి జీవితంలో అవలంబించేలా రాబోయే తరాలకు నిరంతరం ప్రేరణగా ఉంటుంది.”
“దేశంలోని గొప్ప వ్యక్తుల ఆదర్శాలు, విలువలు, దేశసేవ స్ఫూర్తి అనేవి నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశం చేస్తున్నాయని చెప్పడానికి లక్నోలోని నా కుటుంబ సభ్యుల ఉత్సాహం, ఉల్లాసమే నిదర్శనం.”
“భారతదేశానికి ఆత్మగౌరవం, ఐక్యత, సేవా మార్గాన్ని చూపిన ఆలోచనకు చిహ్నంగా రాష్ట్ర ప్రేరణ స్థల్ ఉంది. ఇక్కడ ఉన్న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలు.. మన ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం దేశ నిర్మాణానికి అంకితం కావాలనే సందేశాన్ని ఇస్తున్నాయి.”
“భారతదేశంలో ఆర్థిక స్వావలంబనకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పునాది వేశారు. ఆయన ప్రేరణతో నేడు మనం దానిని మరింత బలోపేతం చేయడానికి ఏ అవకాశాన్ని విడిచిపెట్టటం లేదు.”
“వరుసలో నిలబడిన చివరి వ్యక్తికి కూడా ప్రతి సౌకర్యం అందాలన్నది పండిట్ దీనదయాళ్ గారి దార్శనికత. ఈ రోజు మనం ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నప్పుడు ఆయన కన్న 'అంత్యోదయ' కల సాకారం అవుతోంది.“
“అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి అనేది సుపరిపాలన ఉత్సవాలను జరుపుకునే రోజు కూడా. భాజపా-ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సుపరిపాలన వారసత్వాన్ని నేడు మనం కొత్తగా విస్తరిస్తున్నాం.”
“కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజకీయంగా భాజపాను ఎప్పుడూ వివక్షతో చూశాయి. కానీ అందరినీ గౌరవించాలని భాజపా మాకు నేర్పింది. దీనికి ఒక్కటి కాదు చాలా ఉదాహరణలు ఉన్నాయి.”
“దేశంలోని గొప్ప వ్యక్తుల జీవితం, వారి ఆదర్శాలు, అమూల్యమైన వారసత్వానికి అంకితమైన ప్రేరణాత్మక స్మారక చిహ్నమే ఈ ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’. నేడు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా లక్నోలో దీనిని ప్రారంభించడం అనేది నాకు అపారమైన గౌరవాన్నిచ్చింది.. ఆత్మ సంతృప్తిని అందించింది.”
(रिलीज़ आईडी: 2208728)
आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam