|
వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
‘డిజిటల్ న్యాయ విధానంతో సమర్థ.. సత్వర పరిష్కారం’ ఇతివృత్తంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం-2025 నిర్వహణ
· కీలక డిజిటల్.. నియంత్రణ.. అవగాహన కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహార-ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి · డిజిటల్ న్యాయ విధానం సత్వర అమలుతో 2025లో 1.4 లక్షలకు పైగా వినియోగదారు కేసుల పరిష్కారం · దేశవ్యాప్తంగా 2025లో వినియోగదారులకు డిజిటల్ న్యాయ ప్రదానం.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 90 వేలకుపైగా ఆన్‌లైన్ విచారణలు సహా 30 రంగాల్లో ₹42.6 కోట్ల నగదు వాపసు..
నాడు పోస్టు చేయడమైనది:
24 DEC 2025 5:42PM by PIB Hyderabad
కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహార-ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇవాళ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం-2025ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు న్యాయ ప్రదానంపై డిజిటల్ సంస్కరణలు, డేటా ఆధారిత ఫిర్యాదుల పరిష్కారం సహా బలమైన నియంత్రణలతో ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించడాన్ని “డిజిటల్ న్యాయ విధానంతో సమర్థ-సత్వర పరిష్కారం” ఇతివృత్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. వినియోగదారుల రక్షణ చట్టం-2019కి అనుగుణంగా పెండింగ్ కేసుల తగ్గింపు, పారదర్శకత పెంపు సహా న్యాయం పొందే అవకాశాల మెరుగుకు మంత్రిత్వ శాఖ నిరంతర కృషిని చాటిచెప్పింది.
ఈ సందర్భంగా పారదర్శక, సాంకేతికత ఆధారిత, ప్రతిస్పందనాత్మక వినియోగదారు రక్షణావరణ వ్యవస్థపై ప్రభుత్వ నిబద్ధతను బలోపేతం చేస్తూ, అధిక ప్రభావ వినియోగదారు కేంద్రక డిజిటల్, నియంత్రణ, అవగాహన కార్యక్రమాల శ్రేణిని మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.
అనంతరం శ్రీ ప్రహ్లాద్ జోషి ప్రారంభోపన్యాసం చేస్తూ- “వినియోగదారులకు సకాలంలో, ప్రతిస్పందనాత్మకంగా, అందుబాటులో ఉండే విధంగా చూడాలన్న మా దృఢ సంకల్పాన్ని ‘డిజిటల్ న్యాయ విధానం ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం’ ఇతివృత్తం ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి డిసెంబరు నాటికి 1.4 లక్షలకు పైగా కేసులు పరిష్కృతమయ్యాయి. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా 90 వేలకు పైగా కేసుల విచారణ పూర్తయింది. వినియోగదారులకు సాంకేతికత ఆధారిత న్యాయ ప్రదానం ప్రభావం పెరుగుతుండటాన్ని ఇది నిదర్శనం” అని ప్రముఖంగా వివరించారు.
మంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- “వ్యాజ్యాలకు ముందస్తు ఫిర్యాదు పరిష్కార యంత్రాంగంగా జాతీయ వినియోగదారుల సహాయ కేంద్రం ఆవిర్భవించింది. ఈ మేరకు 2025 ఏప్రిల్-డిసెంబరు మధ్య మొత్తం 30 రంగాల్లో 63,800కు పైగా వాపసు సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం ₹42.6 కోట్ల నగదు వాపసు చేశారు. అనైతిక వ్యాపార పద్ధతుల నుంచి వినియోగదారుల రక్షణ కోసం కేంద్రీయ వినియోగదారు రక్షణ ప్రాధికార సంస్థ ‘450 క్లాస్ యాక్షన్ నోటీసులు’ జారీ చేసి, ₹2.13 కోట్లకు పైగా జరిమానా విధించింది. ఈ మేరకు డిజిటల్ మార్కెట్లలో తప్పుదారి పట్టించే ప్రకటనలు, వంచన పద్ధతులకు పాల్పడటంపై ఆయా సంస్థల మీద చర్యలు తీసుకుంది. ‘వినియోగదారే దేవుడు’ (గ్రాహక్ దేవో భవ) సూత్రం ప్రాతిపదికన వారి రక్షణ కేంద్రకంగా మా పరిపాలన సాగుతోంది. ప్రతి వినియోగదారుకూ న్యాయమైన, సురక్షిత, విశ్వసనీయ మార్కెట్లకు భరోసా ఇస్తుంది” అని స్పష్టం చేశారు.
వినియోగదారు వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్.వర్మ మాట్లాడుతూ- “భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న వినియోగదారులు దేశాన్ని బలోపేతం చేయడంలో బలమైన శక్తిగా నిలుస్తున్నారు. ‘డిజిటల్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల అమలు వల్ల వినియోగదారులకు సమాచార సౌలభ్యం కలగడంతో అవగాహన, హక్కుల దిశగా వారికి సాధికారత లభించింది. చిన్న విక్రేతల నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించే స్థానిక మార్కెట్లదాకా, ‘సబ్ కా సాథ్.. సబ్‌కా వికాస్’ స్ఫూర్తి ప్రతిబింబిస్తూ, సాంకేతికతను వేగంగా అనుసరించే దేశంగా భారత్ నిరూపితమైంది. ‘వినియోగదారులారా చైతన్యం పొందండి’ (జాగో గ్రాహక్ జాగో) వంటి కార్యక్రమం నిరంతర కొనసాగుతుండటం వల్ల తమ సమస్యలకు ఎక్కడ పరిష్కారం లభిస్తుందో వారికి బాగా అవగతం అవుతోంది” అని విశదీకరించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా చేపట్టిన కీలక సంస్థాగత సమన్వయం, ప్రకటనలు, ప్రారంభోత్సవాల వివరాలిలా ఉన్నాయి:
ఎ. సహకారం.. సౌలభ్యం విస్తరణ దిశగా వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు
· పరీక్ష, పరిశోధన, నాణ్యతకు భరోసాలో సహకార విస్తృతి లక్ష్యంగా “నేషనల్ టెస్ట్ హౌస్ (ఎన్‌టీహెచ్)-డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎంఎస్‌ఆర్‌డీఈ), డీఆర్‌డీవోల మధ్య అవగాహన ఒప్పందం.
· సౌలభ్య విస్తరణ, రవాణా మద్దతు, సేవా ప్రదాన విస్తృతి లక్ష్యంగా “నేషనల్ టెస్ట్ హౌస్, ఇండియా పోస్ట్” మధ్య అవగాహన ఒప్పందం.
· సహకార చిల్లర వ్యాప్యార కార్యకలాపాలు, వినియోగదారుల సౌలభ్యం బలోపేతం దిశగా “కేంద్రీయ భండార్, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా” (ఎన్సీసీఎఫ్) మధ్య అవగాహన ఒప్పందం.
బి. డిజిటల్ కార్యక్రమాలు
· డేటా ఆధారిత ఫిర్యాదుల పరిష్కారం, వినియోగదారుల రక్షణ బలోపేతం దిశగా ఐఐటీ- కాన్పూర్‌తో సంయక్తంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత జాతీయ వినియోగదారుల సహాయ కేంద్రం (ఎన్సీహెచ్) డాష్‌బోర్డ్ ప్రారంభం.
· రిపేరబిలిటీ ఇండెక్స్ లోగోను గౌరవనీయ మంత్రి ఆవిష్కరించారు. సుస్థిర వినియోగం, మరమ్మతు కోరే హక్కును ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే ఈ భావనను రూపొందించడం కోసం వినియోగదారుల చట్టంపై ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ పీఠం, ‘మైగవ్’ (MyGov) దేశవ్యాప్త పోటీ నిర్వహించాయి.
· వినియోగదారులకు అవగాహనపై జాతీయ క్విజ్ పోటీ ప్రారంభం- వినియోగదారుల హక్కులు, ఫిర్యాదు పరిష్కార విధానాలతో పౌరులు మమేకమయ్యేలా ‘మైగవ్’ వేదికగా నిర్వహించే ఈ పోటీ 2026 మార్చి 15 వరకూ కొనసాగుతుంది.
· పరీక్షా మౌలిక సదుపాయాల డిజిటల్ ఆధునికీకరణ కోసం గువహటిలోని నేషనల్ టెస్ట్ హౌస్ (ఈశాన్య)లో ప్రయోగశాలల డేటా సమీకరణ వ్యవస్థ ప్రారంభమైంది.
సి. లీగల్ మెట్రాలజీ చట్రం కింద నియంత్రణా సంస్కరణలు
· ‘జీఏటీసీ’ నియమాల సంస్కరణలు- ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్ర నియమాలలో ప్రధాన సంస్కరణలకు ప్రాధాన్యం
· కోల్‌కతాలోని నేషనల్ టెస్ట్ హౌస్ ద్వారా తొలి ‘జీఏటీసీ’ ధ్రువీకరణ పత్రం జారీ.
· నియంత్రణ సమ్మతి బలోపేతం దిశగా ‘ఎవిడెన్షియల్ బ్రీత్ అనలైజర్’ల కోసం నిబంధనల ప్రకటన.
· వినియోగదారుల రక్షణ లక్ష్యంగా బంగారం, విలువైన లోహాల కచ్చితమైన పరిమాణాల నిర్ధారణలో భాగంగా అధిక కచ్చితత్వంతో బరువు తూకం కార్యక్రమాలకు భరోసా.
డి. ప్రమాణాలు-నాణ్యతకు భరోసా
· అవగాహన ఒప్పంద భాగస్వామ్య సంస్థల విద్యార్థుల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జాతీయ స్థాయి ఆన్‌లైన్ క్విజ్ ప్రారంభం.
· వినియోగదారు ప్రాధాన్య రంగాల కోసం 5 కొత్త భారతీయ ప్రమాణాల ఆవిష్కరణ.
ఇ. వినియోగదారులలో అవగాహన.. చైతన్యం
· ‘జాగో గ్రాహక్ జాగో’ కింద ‘మెటా’ సహకారంతో ‘సాధికారత గల వినియోగదారు కండి’ ప్రచార కార్యక్రమం ప్రారంభం.
· ‘జాగో గ్రాహక్ జాగో’ కింద ‘స్మార్ట్ కన్స్యూమర్ ఛాలెంజ్’ పేరిట ఆటల ద్వారా అవగాహన కార్యక్రమం
· దేశవ్యాప్తంగా వినియోగదారుల అవగాహన, పారదర్శక మార్కెట్ విధానాలను ప్రోత్సహించేందుకు భారత వినియోగదారుల సమాఖ్య ద్వారా ‘వినియోగదారుల అవగాహన భారత యాత్ర’ ఆన్‌లైన్ మార్గంలో ప్రారంభం.
ఎఫ్. ప్రచురణలు… సమాచార వనరుల ఆవిష్కరణ
· ఇ-బుక్: “కోచింగ్ అండ్ కన్స్యూమర్ రైట్స్” రాంచీలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా సహకారంతో రూపొందిన ఈ పుస్తకం తప్పుదోవ పట్టించే కోచింగ్ ఇనిస్టిట్యూట్ల ప్రకటనలపై కేంద్రీయ వినియోగదారు రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) చేపట్టిన చర్యలను వివరిస్తుంది. తద్వారా ఈ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది.
· ఇ-బుక్: గడచిన ఐదేళ్లలో కీలక పర్యవేక్షణ చర్యలు, విధాన కార్యక్రమాలను ప్రముఖంగా వివరించే ఈ పుస్తకం “సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ: ఎ విజువల్ క్రానికల్ ఆఫ్ కన్స్యూమర్ రైట్స్ ఇన్ ఇండియా (జూలై 2020– ఆగస్టు 2025)’ పేరిట బెంగళూరులోని ‘ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ’ సహకారంతో రూపొందింది.
· ఇ-డైజెస్ట్ ఆఫ్ జడ్జిమెంట్స్: సుప్రీంకోర్టు, హైకోర్టు, ‘ఎన్‌సీడీఆర్‌సీ' తీర్పుల ఏకీకృత సూచనపత్రం రూపంలో ఢిల్లీలోని ‘ఎన్‌ఎల్‌యూ’ దీన్ని రూపొందించింది.
· ఎన్‌ఎల్‌యూ ఢిల్లీ పీఠం సమాచార దర్శిని: వినియోగదారులు, నియంత్రణ సంస్థలు, విధాన రూపకర్తలు, వ్యాపారాల కోసం సంక్షిప్త సారాంశంతో 2024లో ‘సీసీపీఏ’ ఇచ్చిన కీలక తీర్పుల సంకలనంగా ఇది ఆవిష్కృతమైంది. ఇవన్నీ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి.
వినియోగదారు వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి నిధి ఖారే సంధానకర్తగా తొలిపలుకులతో అందరినీ ఈ కార్యక్రమానికి స్వాగతించారు. ఈ సందర్భంగా- “ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత సద్వినియోగానికి మేం కృషి చేశాం. మనమంతా అనుసంధానమై పనిచేయడం ద్వారా వినియోగదారులు న్యాయం కోరే విధానాన్ని ఈ సాంకేతికతలు పూర్తిగా వినూత్నం చేశాయి. ఇందులో భాగంగా జాతీయ వినియోగదారుల సహాయ కేంద్రం ఏకీకృత వ్యవస్థ తరహాలో పనిచేసేలా ఉన్నత స్థాయిని అందుకుంది. ఈ మేరకు ఆన్‌లైన్ విచారణను విప్లవాత్మకంగా మార్చడం కోసం కృత్రిమ మేధ ఉపకరణాలతో దీనికి సాధికారత సమకూరింది. అందువల్ల వినియోగదారులు ఎక్కడి నుంచయినా ఫిర్యాదు చేయవచ్చు… విచారణలో పాల్గొనవచ్చు. అదే సమయంలో ఏ ఒక్క వినియోగదారు వెనుకబడకుండా చూసుకునేలా మానవ ప్రమేయం కూడా కొనసాగుతుంది. మొత్తంమీద మనం నిష్పాక్షిక, సమాన, భవిష్యత్ సంసిద్ధ వ్యవస్థను రూపొందిస్తాం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీఆర్‌సీ సభ్యులు, రాష్ట్ర-జిల్లా వినియోగదారు కమిషన్ల అధ్యక్షులు-సభ్యులు, బీఐఎస్, ఎన్‌టీహెచ్, లీగల్ మెట్రాలజీ సహా ఇతర ప్రభుత్వ సంస్థల సీనియర్ అధికారులు, రాష్ట్రాలు, విద్యా-వినియోగదారు-న్యాయ-పారిశ్రామిక సంస్థల ముఖ్య కార్యదర్శులు, ఇ-కామర్స్ వేదికల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రారంభ కార్యక్రమం అనంతరం మూడు కీలకాంశాలపై సాంకేతిక సదస్సులను కూడా నిర్వహించారు:
1. వ్యాజ్యాల ముందస్తు పరిశీలన యంత్త్రాంగం ద్వారా వినియోగదారు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతం.
2. ఈ-జాగృతి… వినియోగదారులకు న్యాయ ప్రదానం రూపాంతరీకరణ.
3. డిజిటల్ మార్కెట్లలో అనుచిత వాణిజ్య పద్ధతులు, తప్పుదోవ పట్టించే విధానాల నిరోధం
భారత వినియోగదారుల రక్షణ చట్రానికి నాంది పలికిన వినియోగదారుల రక్షణ చట్టం-1986 సంస్మరణ దిశగా ఏటా డిసెంబరు 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహణ ఆనవాయితీ కొనసాగుతోంది. చట్టాల అమలు, నియంత్రణ, సంస్థాగత యంత్రాంగాల నిరంతరం బలోపేతం ద్వారా వినియోగదారుల ప్రయోజన పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ వేడుక పునరుద్ఘాటిస్తుంది. అటుపైన ఆధునికీకరించిన వినియోగదారుల రక్షణ చట్టం-2019 సాంకేతికత చోదిత ఫిర్యాదుల పరిష్కారం, ఆధునిక అమలు ఉపకరణాలు, మెరుగైన నియంత్రణ-పర్యవేక్షణలతో ఈ చట్రాన్ని మరింత పటిష్ఠం చేసింది.
జాతీయ వినియోగదారుల దినోత్సవం-2025 నేపథ్యంలో సంస్థాగత సంస్కరణలు, డిజిటల్ ఆవిష్కరణలు, భాగస్వాముల సహకారం ద్వారా వినియోగదారు హక్కుల ప్రభావశీల రక్షణపై కేంద్ర మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2208437)
|