ఉప రాష్ట్రపతి సచివాలయం
‘సనాతన ధర్మంపై అటల్ దృక్కోణం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి
· “అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం ఒక వ్యక్తి కాదు… ఒక వ్యవస్థ”
· “వాజ్‌పేయి హయాం నాటి పోఖ్రాన్ అణు పరీక్షలు ఆత్మవిశ్వాస భరిత.. పునరుజ్జీవన భారత్‌ను ప్రపంచానికి
ప్రదర్శించాయి”
· “భారత్ ప్రగతి పరుగుకు అటల్ బిహారీ వాజ్‌పేయి సుపరిపాలన వారసత్వం స్ఫూర్తినిస్తూనే ఉంది”
నాడు పోస్టు చేయడమైనది:
23 DEC 2025 7:13PM by PIB Hyderabad
రాజస్థాన్ శాసనసభ స్పీకర్ శ్రీ వాసుదేవ్ దేవనాని రచించిన ‘సనాతన ధర్మంపై అటల్ దృక్కోణం’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఇవాళ న్యూఢిల్లీలోని ఉప రాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితను ప్రశంసిస్తూ- ఈ పుస్తకాన్ని సమయోచిత, కీలక రచనగా అభివర్ణించారు. ప్రత్యేకించి... దేశ పూర్వ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి నిర్వహించుకుంటున్న తరుణంలో ఈ పుస్తకం మరింత ప్రాధాన్యం సంతరించుకున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం ఒక వ్యక్తి కాదని.. ఒక వ్యవస్థ అని అభివర్ణిస్తూ- సిద్ధాంతాలు, విలువలపై నిలువెత్తు నిబద్ధతకు ఆయన జీవితం, నాయకత్వం ప్రతిబింబమని ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
శ్రీ వాజ్‌పేయితో తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ- ఆయన ప్రధానమంత్రిగా ఉన్నపుడు 12వ, 13వ లోక్‌సభల సభ్యుడిగా ఎంతో నేర్చుకునే అవకాశం లభించిందని ఉప రాష్ట్రపతి అన్నారు. అలాగే జనసంఘ్ రోజులలో ఆయనతో తనకుగల మధుర స్మృతులను పంచుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు కోయంబత్తూరులో శ్రీ వాజ్‌పేయి కోసం ఒక పెద్ద బహిరంగ సభను నిర్వహించానని, అటువంటి ఎన్నో అనుభవాలు తనపై ప్రగాఢ, శాశ్వత ముద్ర వేశాయని తెలిపారు.

దేశాన్ని ప్రగతి పథంలో నడిపే దిశగా శ్రీ వాజ్‌పేయి కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ దూరదృష్టి గల ఆయన నాయకత్వం భారత్‌ను అనేక రంగాలలో వినూత్నంగా మార్చివేసిందని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ శక్తి’ కింద 1998 మే నెలలో వాజ్‌పేయి నాయకత్వాన నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతం కావడాన్ని ఉప రాష్ట్రపతి గుర్తుచేశారు. ఆనాటి ఆయన నిర్ణయాత్మక నాయకత్వం ప్రపంచ వేదికపై భారత్ ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పాన్ని శక్తిమంతంగా ప్రదర్శించిందని పేర్కొన్నారు. అటల్ జీ స్ఫూర్తిదాయక నినాదం “జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్” దేశ శక్తిసామర్థ్యాలపై ఆయన సమగ్ర దృక్పథాన్ని ప్రతిబింబించిందని గుర్తుచేసుకున్నారు.
ప్రాంతీయ ఆకాంక్షలపై ఆయనకుగల లోతైన అవగాహన, వికేంద్రీకృత-ప్రతిస్పందనాత్మక పాలన అవసరం ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటులో శ్రీ వాజ్‌పేయి దార్శనికత తిరుగులేనిదని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు. అలాగే, సమ్మిళిత వృద్ధితోపాటు అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం దిశగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం శ్రీ వాజ్‌పేయి నిబద్ధతను మరింతగా చాటుతుందని పేర్కొన్నారు. జార్ఖండ్ ఏర్పడిన రెండు దశాబ్దాల తర్వాత ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా స్వీయానుభవాన్ని పంచుకుంటూ- శ్రీ వాజ్‌పేయి దార్శనిక నిర్ణయాల దీర్ఘకాలిక ప్రయోజనాలను అక్కడ ప్రత్యక్షంగా చూశానని వ్యాఖ్యానించారు.
శ్రీ వాజ్‌పేయి సుపరిపాలనకు ఎనలేని ప్రాధాన్యమిచ్చేవారని, అందుకే ఆయన జయంతిని నేడు ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నామని ఉప రాష్ట్రపతి అన్నారు. దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, విద్యుత్ రంగంలో సంస్కరణలు వంటి చారిత్రక కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.


ఈ కార్యక్రమంలో కేంద్ర రహదారి రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి, రాజస్థాన్ శాసనసభ స్పీకర్- పుస్తక రచయిత శ్రీ వాసుదేవ్ దేవనాని తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2207957)
సందర్శకుల సూచీ సంఖ్య : : 31