ఆయుష్
ఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ శిఖరాగ్ర సదస్సు.. రెండో రోజున 16 దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు.. సాంప్రదాయిక వైద్యంలో ప్రపంచ స్థాయిలో భారత్ నాయకత్వం బలోపేతం
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోం ఘెబ్రెయెసస్‌తో కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ భేటీ..
సాంప్రదాయిక, పూరక, సమీకృత వైద్యాలను ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకుపోతున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి
పదహారు దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు.. ప్రపంచ శిఖరాగ్ర సదస్సు సందర్బంగా సాంప్రదాయిక వైద్యంలో భారత్ పాత్ర బలోపేతం
శిఖరాగ్ర సదస్సు 2వ, 3వ ప్లీనరీలతో పాటు సమాంతర కార్యక్రమాలు
లోతైన ఆలోచనలు పంచుకున్న ఆస్ట్రేలియా, మొరాకో, ఇరాన్, ఉగాండా, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా, యూకే, కొలంబియా, బ్రెజిల్, న్యూజిలాండ్, జర్మనీ, నేపాల్, దక్షిణ కొరియా, శ్రీలంక నిపుణులు
ఏఐఐఏ నాయకత్వంలోని సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు..
ఆయుర్వేద రంగంలో సహకారాన్ని పటిష్ఠపరుచుకోవడానికి ఉద్దేశించిన ఎంఓయూపై భారత్, క్యూబా సంతకాలు
డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సాంప్రదాయిక వైద్య వ్యూహం 2025-2034 లో భాగంగా
ఫలితాల ఆధారిత పెట్టుబడులు, పక్కా నియంత్రణ, పటిష్ఠ ఆరోగ్య వ్యవస్థ అవసరమని పిలుపునిచ్చిన ప్రపంచ నేతలు
పరిశోధన, పరిపాలనలతో పాటు సాంప్రదాయిక వైద్య రంగంలో ఫలితాలపై ఆధారపడిన మార్గాల అనుసరణ ముఖ్యమన్న డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ శిఖరాగ్ర సదస్సు సర్వసభ్య కార్యక్రమాలు
प्रविष्टि तिथि:
18 DEC 2025 8:26PM by PIB Hyderabad
సాంప్రదాయిక, పూరక, ఏకీకృత వైద్యాలను ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకు పోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నాయకత్వం వహిస్తున్నందుకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోం ఘెబ్రెయెసస్‌కు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయిక వైద్యంపై ఏర్పాటు చేసిన డబ్ల్యూహెచ్ఓ శిఖరాగ్ర సదస్సులో రెండో రోజు కార్యక్రమం సందర్బంగా డాక్టర్ ఘెబ్రెయెసస్‌ను కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ భారత్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమాన్ని 2025 డిసెంబరు 19న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు.
శిఖరాగ్ర సదస్సులో భాగంగా విజ్ఞానశాస్త్రం, పరిశోధన సంబంధిత పెట్టుబడి, నవకల్పన, సురక్ష, నియంత్రణ, ఆరోగ్య వ్యవస్థ ఏకీకరణ అంశాలపై నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి చర్చలు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా న్యాయబద్ధ, దృఢతర, ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేసే ఆరోగ్య రంగ అనుబంధ విస్తారిత వ్యవస్థ నిర్మాణంలో సాంప్రదాయిక వైద్యానిది కీలక పాత్ర అని ఈ శిఖరాగ్ర సదస్సు పునరుద్ఘాటించింది. ‘‘రెస్టోరింగ్ బ్యాలెన్స్: సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్-బీయింగ్’’ ఇతివృత్తం ప్రధానంగా సాగుతున్న కార్యక్రమాలు సరికొత్తగా ఆమోదించిన డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సాంప్రదాయిక వైద్య వ్యూహం 2025-2034 లక్ష్యాలతో సరిగ్గా సరితూగుతున్నాయి. దీంతో నిర్దేశించుకున్న ప్రణాళికను వివిధ దేశాలు, సముదాయాలు అమలు చేసేందుకు మార్గాన్ని సుగమం చేసినట్లయింది.

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్‌తో సమావేశం
నేపాల్, శ్రీలంక, మైక్రోనేషియా, మారిషస్, ఫిజీల ప్రతినిధి వర్గాలతో ద్వైపాక్షిక చర్చల్లో కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ పాల్గొన్నారు. మిగతా దేశాల ప్రతినిధి వర్గాలతో ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఆయుష్ శాఖ 16 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల్లో బ్రెజిల్, మలేషియా, నేపాల్, శ్రీలంక, మైక్రొనేషియా, మారిషస్, ఫిజీ, కెన్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మెక్సికో, వియత్నాం, భూటాన్, సూరినామ్, థాయిలాండ్, ఘనా, క్యూబాల ప్రతినిధి వర్గాలు పాలుపంచుకున్నాయి. సాంప్రదాయిక వైద్యంలో అంతర్జాతీయ సహకారాన్ని పటిష్ఠపరచడమెలాగన్న అంశంపై ఈ సమావేశాల్లో చర్చించారు.

ఫిజీతో ద్వైపాక్షిక సమావేశం

శ్రీలంకతో ద్వైపాక్షిక సమావేశం

మారిషస్‌తో ద్వైపాక్షిక సమావేశం

మైక్రోనేషియాతో ద్వైపాక్షిక సమావేశం

నేపాల్‌తో ద్వైపాక్షిక సమావేశం

ఇదే సందర్బంగా భారత్, క్యూబాల మధ్య ఆలిండియా ఆయర్వేద ఇనిస్టిట్యూట్ (ఏఐఐఏ) ప్రమేయంతో సంస్థల స్థాయి అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కూడా పొడిగించారు. ఆయుర్వేద పాఠ్యక్రమాన్ని విస్తరించడం, ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థల ఏకీకరణ, పంచకర్మ చికిత్స పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం, నియంత్రణకు సంబంధించి ఇప్పటితో పోలిస్తే మరింత ఎక్కువగా సహకరించుకోవడానికి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశారు.
శిఖరాగ్ర సదస్సు రెండో రోజున సర్వసభ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆస్ట్రేలియా, మొరాకో, ఇరాన్, ఉగాండా, కెనడా, స్విట్జర్లాండ్, యూఎస్ఏ, యూకే, కొలంబియా, బ్రెజిట్, భారత్, న్యూజిలాండ్, జర్మనీ, నేపాల్, కొరియా రిపబ్లిక్, శ్రీలంక నిపుణులు తమ ఆలోచనల్నీ, అనుభవాన్నీ పంచుకున్నారు. దీంతో, ప్రపంచ స్థాయిలో సాంప్రదాయిక వైద్యాన్ని ప్రపంచ దేశాల్లో మరింత ఎక్కువ మంది చెంతకు చేర్చడంపై లోతుగా చర్చించడానికి వీలు చిక్కింది.
‘సాంప్రదాయిక వైద్యం పురోగతిని విస్తరించడానికి సైన్సులో పెట్టుబడి పెట్టడం’ అంశంపై రెండో రోజు కార్యక్రమాలు సాగాయి. ‘‘సాంప్రదాయిక వైద్య ప్రగతికి ఊతమివ్వడానికి సైన్సులో పెట్టుబడి ముఖ్యం’’ అనే విషయంపై ప్రధానంగా చర్చించారు. ఈ చర్చలో.. సాంప్రదాయిక వైద్యాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి శాస్త్రీయ పరిశోధన పోషించాల్సిన పాత్రను పునరుద్ఘాటించారు. సాంప్రదాయిక వైద్యాన్ని ఫలితాల ఆధారిత ఆరోగ్య రంగంగా సుప్రతిష్ఠితం చేయడానికి నిరంతర పెట్టుబడులు, నవకల్పనలు, కార్యప్రణాళికల్లో పొందిక, అంతర్జాతీయ సహకారాలకు ఉన్న పాత్ర ప్రధానమని ఈ కార్యక్రమంలో చాటిచెప్పారు. చర్చల్లో.. వనరుల సమీకరణ, జాతీయ అంతర్జాతీయ స్థాయుల్లో ఆరోగ్య ప్రాథమ్యాల్లో పరిశీలనను ఏకీకరించడం, ప్రపంచ సాంప్రదాయిక వైద్య పరిశోధన అజెండా అమలును వేగవంతం చేయడం, మానవుల దీర్ఘకాలిక మనుగడతో పాటు అందరికీ ఆరోగ్య సేవలను విస్తరించడంలో సాంప్రదాయిక వైద్యానిది కీలక భూమిక అని తెలియజెప్పడంపై దృష్టిని కేంద్రీకరించారు.
‘డబ్ల్యూహెచ్ఓ సాంప్రదాయిక వైద్య పరిశోధన రోడ్‌మ్యాప్‌ను ప్రపంచ ఉద్యమంగా మార్చడం’ అనే ఇతివృత్తంపై సమాంతర కార్యక్రమం 2 ఎను నిర్వహించారు. దీనిలో డబ్ల్యూహెచ్ఓ సాంప్రదాయిక వైద్య పరిశోధన రోడ్‌మ్యాప్‌నకు కార్యాచరణ రూపాన్ని ఇవ్వడం, పరిశోధనలో సంక్లిష్టతలను తొలగించడం, జ్ఞాన వ్యవస్థలను వర్గీకరించడం, ప్రపంచ దేశాల్లో సామర్థ్యాలను పెంచడంపై దృష్టి సారించారు. వేర్వేరు ప్రాంతీయ అనుభవాల వెలుగులో సాగిన చర్చలో సాంప్రదాయ వైద్య పరిశోధన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో సమన్వయాన్ని ఎలా సాధించగలుగుతుందో, ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ చేపట్టే సంరక్షణకు అది ఎలా సహకరించగలదో, ఆరోగ్య వ్యవస్థ ఏకీకరణ, ఆర్థిక మూల్యాంకనంలో ఎటువంటి తోడ్పాటును అందించగలదో అనే అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.
‘రిసర్చ్ మెథడాలజీస్ అండ్ అప్లికేషన్స్’ ఇతివృత్తం ఆధారంగా సమాంతర కార్యక్రమం 2బీ ని నిర్వహించారు. దీనిలో సాంప్రదాయిక వైద్య జ్ఞానమీమాంసకు అనుగుణంగా పద్ధతి ప్రకారం సముచిత, నూతన పరిశోధన విధానాలను బేరీజు వేశారు. సంపూర్ణ వ్యవస్థలు, బహువిధాలైన రోగచికిత్స సంబంధిత పరీక్షలు, ట్రాన్స్‌డిసిప్లినరీ ప్రీక్లినికల్ డిజైన్లు, సోషల్ సైన్సు, ఇంప్లిమెంటేషన్ రిసర్చ్, వలసవాద విరుద్ధ స్వదేశీ పద్ధతులను పరిగణనలోకి తీసుకున్నారు. నైతిక ఆలోచనలు, తప్పు సమాచారాన్ని అందించడం, రుజువుకు విధానం, అభ్యాసం దశలను సంతరించడం వంటి అంశాల్ని కూడా చర్చించారు.
సమాంతర కార్యక్రమం 2సీకి ‘సైన్స్ ఆఫ్ వెల్-బీయింగ్.. ఎవిడెన్స్ ఫ్రం ట్రెడిషనల్ మెడిసిన్’ను ఇతివృత్తంగా ఎంచుకున్నారు. మానసిక స్వస్థత, నొప్పి నియంత్రణ, క్యాన్సర్ సంరక్షణ, స్వీయ సంరక్షణ, యాంటీబయటిక్ నిరోధం, దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండటం.. ఈ అంశాల్లో సాంప్రదాయిక వైద్యం అందించే తోడ్పాటుపై శాస్త్రీయ నిదర్శనాలను ఈ కార్యక్రమంలో తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. సాంప్రదాయిక వైద్య పద్ధతులను బయోమెడికల్ రిసర్చ్‌తో జోడించే విధానాలను పరీక్షించారు. జన సముదాయాల మధ్య సురక్షిత, న్యాయబద్ధ లభ్యతను విస్తృతం చేసేందుకు ఉన్న మార్గాలను గురించి తెలియజెప్పారు.
‘నవకల్పన నుంచి పెట్టుబడి వరకు.. విస్తృత స్థాయిలో, సమానత్వ సాధనకు సాంప్రదాయిక వైద్య ప్రణాళికను రూపొందించడం’ అంశంపై సమాంతర కార్యక్రమం 2డీని చేపట్టారు. సాంప్రదాయిక వైద్యంలో నవకల్పనలు స్థానిక పద్దతుల నుంచి ప్రపంచ స్థాయిలో అమలుపరచదగ్గ పరిష్కారాల వరకు ఎలా పయనించగలవో ఈ కార్యక్రమంలో తరచి చూశారు. ఆరోగ్య, ఆర్థిక పరిణామాలను మెరుగుపరుస్తూ సమానత, సురక్ష, స్థిరత్వాలకు పూచీపడటానికి అవసరమైన పరిపాలన సంబంధిత ఫ్రేంవర్కులు, ప్రమాణీకరణ కొలమానాలు, పెట్టుబడి మార్గాలను పరిశీలించారు.
సమాంతర కార్యక్రమం 2ఈ కి ‘ఇంపాక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆన్ హెల్త్.. రిస్టోరింగ్ బ్యాలెన్స్ ఫ్రం ఇండివిడ్యువల్ టు సోషల్ అండ్ ఇకోలాజికల్ వెల్ బీయింగ్’ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇందులో ధ్యానంపై ఇప్పుడిప్పుడే ఉనికిలోకి వస్తున్న న్యూరోసైంటిఫిక్, రోగచికిత్స సంబంధిత, ప్రజారోగ్య సంబంధిత నిదర్శనాలను గురించి చర్చించారు. మానసిక, శారీరక, సామాజిక సంక్షేమంపై దీని ప్రభావాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆరోగ్య వ్యవస్థలు, విద్య, పని ప్రదేశాలు, సాముదాయిక కార్యక్రమాల్లో ధ్యానానికి స్థానం కల్పించేందుకు ఉన్న అవకాశాలను చర్చలో పాలుపంచుకున్న వారు పరిశీలించారు. విధానపరమైన మార్గాలను, పరిశోధనలో లోటుపాట్లను, సహకారానికి ఉన్న అవకాశాలను కూడా వారు గుర్తించారు.
సర్వసభ్య కార్యక్రమం 3కు ‘రీఇమాజినింగ్ హెల్త్ సిస్టమ్స్ ఫర్ బ్యాలెన్స్, సేఫ్టీ, రిజిలియెన్స్’ ప్రధాన ఇతివృత్తం. దీనిలో సాంప్రదాయిక వైద్యాన్ని ఆరోగ్య వ్యవస్థల్లో సురక్షిత, ప్రభావవంతమైన పద్ధతిలో జతచేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సాంప్రదాయిక వైద్య వ్యూహం 2025–2034ను గురించి వివరించారు. ప్రాంతీయ అనుభవాలు.. ప్రత్యేకించి ఆగ్నేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల అనుభవాలు కూడా చర్చకు వచ్చాయి. వీటిలో సహాయక విధానాలు, పాలన సంబంధిత ఫ్రేంవర్కులు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణల ఏకీకరణను చాటిచెప్పారు. ఇందులో రోగి సురక్ష, నాణ్యతపరమైన హామీ, నియంత్రణ విధానాల్లో పొందిక, అంతర్జాతీయ సహకారాలను పటిష్ఠపరచడానికి ఐఆర్‌సీహెచ్ వంటి నెట్‌వర్కుల ద్వారా ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడం వంటివి ముఖ్యాంశాలుగా ఉన్నాయి.
సమాంతర కార్యక్రమం 3 ఏను ‘గ్లోబల్ ఫ్రేంవర్క్‌స్ అండ్ కంట్రీ ఇంప్లిమెంటేషన్’ ఇతివృత్తంగా నిర్వహించారు. ఏకీకరణ తాలూకు నాలుగు నమూనాలు.. ప్రజలే నాయకత్వం వహించే, ప్రాక్టీషనర్లు దారి చూపే, సమన్వయభరితమైన, మిశ్రిత.. నమూనాలను చాటిన ఒక కొత్త డబ్ల్యూహెచ్ఓ ఆలోచనల స్వరూపాన్ని ఈ కార్యక్రమంలో పరిశీలించారు. దేశాల అనుభవాలను ఆధారంగా చేసుకొని, కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వేర్వేరు దృష్టికోణాలు అందరికీ ఆరోగ్య సేవల లభ్యతను ఎలాగ ముందుకు తీసుకు పోతూ సేవల అందజేత, పరిపాలన, ఆర్థిక సహాయం, శ్రమశక్తి అభివృద్ధిలను బలోపేతం చేయగలుగుతాయో గుర్తించారు.
‘నాణ్యత, దక్షత, రోగి సురక్ష’ ఇతివృత్తంతో సమాంతర కార్యక్రమం 3బీని నిర్వహించారు. ప్రభావవంతమైన రీతిలో, ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసేటట్లు సాంప్రదాయిక వైద్యాన్ని జాతీయ ఆరోగ్య వ్యవస్థల్లో కలిపే ప్రక్రియలో విద్య, శిక్షణ, నైతిక ప్రమాణాలు, సౌకర్యాల గుర్తింపు, సురక్ష వ్యవస్థలు పోషించే పాత్ర ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.
‘సాంప్రదాయిక వైద్య ఉత్పాదనల నియంత్రణ’ ఇతివృత్తం ప్రధానంగా ఏర్పాటు చేసిన సమాంతర కార్యక్రమం 3సీలో.. సాంప్రదాయిక ఔషధ ఉత్పాదనల కోసం నియంత్రణ ఫ్రేంవర్కులకు సంబంధించి ప్రపంచవ్యాప్త చర్చను ముందుకు తీసుకువెళ్లారు. దీనిలో నాణ్యత, సురక్ష, ప్రభావం చూపడం, సమాన లభ్యత వంటి అంశాల్ని చర్చించారు. మార్కెటుకు అధికారాలు ఇవ్వడం, మార్కెటుకు చేరుకున్న తరువాతి అంచెలో పర్యవేక్షణ, సరిహద్దులకు అవతల వాణిజ్యం, డిజిటల్ హెల్త్ అప్లికేషన్తో పాటు సాంప్రదాయిక జ్ఞాన పరిరక్షణల వంటి అంశాలు చర్చల్లో భాగమయ్యాయి. ఈ అంశాలు ప్రపంచ సాంప్రదాయిక వైద్య వ్యూహం 2025-2034తో సరిపోలేవిగా ఉన్నాయి.
‘ప్రాక్టీసు, ప్రాక్టీషనర్లు, ఆరోగ్య వ్యవస్థ దృఢత్వంలో సాంప్రదాయిక వైద్యానికున్న ఔచిత్యం’ అంశంపై సమాంతర కార్యక్రమం 3డీని నిర్వహించారు. దీనిలో ప్రాక్టీషనర్ల నియంత్రణ, కనీస విద్యా ప్రమాణాలు, నైతికత, వృత్తిలో నిరంతరంగా పురోగతిని సాధిస్తూ ఉండడం.. ఈ విషయాలతో పాటే ఫలితాలపై ఆధారిత రోగచికిత్స అభ్యాసానికి సంబంధించిన మార్గదర్శకాల్ని రూపొందించడంపై శ్రద్ధ తీసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు సాంప్రదాయిక వైద్యం ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠతను ఎలా పెంచగలదో, క్రమబద్ధ పరిస్థితుల్లో సంరక్షణను ఏ విధంగా కొనసాగించగలదో, ప్రజారోగ్య పరంగా అత్యవసర స్థితులు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన సన్నాహక చర్యలను ఎలా బలోపేతం చేయగలదో అనే అంశాల్ని పరిశీలించారు.
శిఖరాగ్ర సదస్సులో రెండో రోజున నిర్వహించిన కార్యక్రమాలు సురక్షిత, న్యాయబద్ధ, దృఢ ఆరోగ్య వ్యవస్థల దిశగా ముందుకు పోతూ.. విజ్ఞాన ఆధారిత మాన్యత, పటిష్ఠ పరిపాలన, రోగి సురక్షలతో పాటు సాంప్రదాయిక వైద్యాన్ని న్యాయబద్ధంగా ఏకీకరించే అంశాల్లో ఉమ్మడి ప్రపంచ నిబద్ధతను బలోపేతం చేశాయి. ఈ చర్చలు పటిష్ఠ ఆరోగ్య వ్యవస్థలు, జీవవైవిధ్య సంరక్షణ, సమ్మిళిత అభివృద్ది సాధనకు కీలక తోడ్పాటును అందించేదిగా సాంప్రదాయిక వైద్యానికి కీలక స్థానాన్ని ఇచ్చాయి. శిఖరాగ్ర సదస్సులో చివరి రోజున, విధానపరమైన చర్చలకూ ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి నిబద్ధతకూ సంబంధించి బలమైన పునాదిని వేశారు.
***
(रिलीज़ आईडी: 2206629)
आगंतुक पटल : 5