రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్ల జాతీయ సదస్సును ప్రారంభించిన భారత రాష్ట్రపతి


అవకాశాల్లో సమానత్వ ఆదర్శాన్ని అనుసరించడం మాత్రమే కాదు.. ఫలితాల్లో సమానత్వ లక్ష్యాన్ని సాధించేందుకూ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కృషి చేయాలి


అభ్యర్థుల నిజాయితీ, సచ్ఛీలతకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

प्रविष्टि तिथि: 19 DEC 2025 12:34PM by PIB Hyderabad

తెలంగాణలోని హైదరాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్ల జాతీయ సదస్సును భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (2025 డిసెంబర్ 19) ప్రారంభించారు.

 

 

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఒక భాగాన్ని పూర్తిగా సేవలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లకే మన రాజ్యాంగ నిర్మాతలు కేటాయించారన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర, వాటి విధులకు రాజ్యాంగ నిర్మాతలు ఎంతటి ప్రాధాన్యమిచ్చినదీ దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.

 

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం.. హోదాలోనూ, అవకాశాల్లోనూ సమానత్వం అనే మన రాజ్యాంగ ఆదర్శాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధినిర్వహణలో అత్యంత కీలకమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పీఠిక, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అవకాశాల్లో సమానత్వమనే ప్రాథమిక హక్కు, ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడానికి ఒక సామాజిక వ్యవస్థను నెలకొల్పేలా ప్రభుత్వాన్ని నిర్దేశించే ఆదేశిక సూత్రం... ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. అవకాశాల్లో సమానత్వం అనే ఆదర్శాన్ని అనుసరించడం మాత్రమే కాకుండా.. ఫలితాల్లోనూ సమానత్వమనే లక్ష్యాన్ని సాధించడానికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. సమానత్వాన్ని, న్యాయాన్ని ప్రోత్సహిస్తూ.. మార్పులకు ప్రతినిధులుగా కమిషన్లు పనిచేస్తాయని వ్యాఖ్యానించారు.

 

 

‘శాశ్వత కార్యనిర్వాహక వర్గం’, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎంపిక చేసిన ప్రభుత్వోద్యోగుల ద్వారానే.. పాలన ప్రక్రియకు నిష్పాక్షికత, అవిచ్ఛిన్నత, స్థిరత్వం లభిస్తాయని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. సమగ్రత, సునిశితత్వం, శాశ్వత కార్యనిర్వాహక వర్గంగా సేవలందించగల సివిల్ సర్వెంట్ల సామర్థ్యం... జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రజాకేంద్రీకృత విధానాల అమలులో ఇవి అత్యంత ప్రధానమైనవన్నారు. తాము నియమించుకునే అభ్యర్థుల నిజాయితీకి, సమగ్రతకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆమె పేర్కొన్నారు. నిజాయితీ, చిత్తశుద్ధి అత్యంత ప్రధానమైనవని, వాటి విషయంలో రాజీపడడానికి వీల్లేదని అన్నారు. నైపుణ్యాలు, సామర్థ్యాల లేమిని అభ్యసన కార్యక్రమాలు, పలు ఇతర వ్యూహాల ద్వారా అధిగమించవచ్చనీ.. కానీ సమగ్రత లోపించడం వల్ల ఎదురయ్యే తీవ్రమైన సవాళ్లను అధిగమించడం సాధ్యం కాకపోవచ్చనీ ఆమె చెప్పారు.

 

అణగారిన, బలహీన వర్గాల వారి కోసం పనిచేయాలన్న ఆసక్తి... ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉండాలని రాష్ట్రపతి అన్నారు. మహిళల అవసరాలు, ఆకాంక్షల పట్ల మన ప్రభుత్వ ఉద్యోగులు మరింత సునిశితంగా వ్యవహరించాలన్నారు. లింగపరంగా వివక్ష చూపకుండా, సునిశితంగా వ్యవహరించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అత్యున్నత ప్రాధాన్యమివ్వాలన్నారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా, అపారమైన వైవిధ్యం కలిగిన దేశంగా ఉన్న భారత్‌కు అన్ని స్థాయుల్లో అత్యంత సమర్థమైన పాలనా వ్యవస్థలు అవసరమని రాష్ట్రపతి అన్నారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగానూ మనం ముందుకు సాగుతున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తమ బాధ్యతలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తాయనీ, సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసి, దిశానిర్దేశం చేసి, భవిష్యత్ సన్నద్ధంగా తీర్చిదిద్దుతాయని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి పూర్తి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

***


(रिलीज़ आईडी: 2206472) आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam