ప్రధాన మంత్రి కార్యాలయం
ఒమన్ సుల్తాన్ తో ప్రధానమంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
18 DEC 2025 5:22PM by PIB Hyderabad
ఒమన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మస్కట్‌లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రాయల్ ప్యాలెస్ వద్ద ప్రధానమంత్రికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సాదర స్వాగతం పలికారు. అధికార లాంఛనాలతో కూడిన ఘనమైన స్వాగత కార్యక్రమం నిర్వహించారు.
ముఖాముఖి సమావేశంతో పాటు, ప్రతినిధుల స్థాయి సమావేశాల్లో కూడా ఇద్దరు నాయకులు పాల్గొన్నారు. భారత్, ఒమన్ దేశాల మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమగ్రంగా సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా వృద్ధి చెందుతున్న తీరును ప్రశంసించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని వారు పేర్కొన్నారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పై సంతకాలు చేయడాన్ని ఒక చారిత్రక మైలురాయిగా ఇరువురు నాయకులు స్వాగతించారు. ఇది వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని వారు ఆకాంక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ డాలర్ల స్థాయిని దాటడం, రెండు దేశాల మధ్య పెట్టుబడులు పెరుగుతుండడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఈపీఏ కారణంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, ఇరు దేశాల్లో విస్తృత అవకాశాలకు మార్గాలు ఏర్పడతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు.
దీర్ఘకాలిక ఇంధన ఒప్పందాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా కార్యక్రమాల ద్వారా ఇంధన సహకారాన్ని మరింత వేగవంతం చేసే అంశంపై నాయకులు చర్చించారు. అంతర్జాతీయ సౌర కూటమిలో ఒమన్ చేరడాన్ని ప్రధానమంత్రి అభినందించారు. అలాగే, విపత్తుల నిరోధక మౌలిక సదుపాయాల కూటమిలోనూ, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్‌లోనూ కూడా చేరాల్సిందిగా ఒమన్‌కు ఆహ్వానం పలికారు.
వ్యవసాయం, పశుపోషణ, రొయ్యల పరిశ్రమ, చిరుధాన్యాల సాగు రంగాల్లో సహకారం సహా వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం ద్వారా రెండు దేశాలు లాభపడవచ్చని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
విద్యారంగంలో సహకారం ప్రాముఖ్యతను గుర్తించిన ఇరువురు నాయకులు, బోధనా సిబ్బంది, పరిశోధకుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు ఉభయ దేశాలకు ప్రయోజనకరం అవుతాయని తెలిపారు.
ఆహార భద్రత, తయారీ రంగం, డిజిటల్ టెక్నాలజీలు, కీలక ఖనిజాలు, రవాణా, మానవ వనరుల అభివృద్ధి, అంతరిక్ష సహకారం వంటి రంగాలలో సహకరించుకునే అంశాలపై కూడా నాయకులు చర్చించారు.
ఆర్థిక సేవల రంగంపై చర్చించిన నాయకులు, యూపీఐ, ఒమన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల మధ్య సహకారం, రూపే కార్డు వినియోగం, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం వంటి అంశాలను ప్రస్తావించారు.
ఎరువులు, వ్యవసాయ పరిశోధన ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనం కలిగించే రంగాలుగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ రంగాలలో ముఖ్యంగా ఉమ్మడి పెట్టుబడుల ద్వారా, మరింత సహకారం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.
సముద్ర రంగం సహా రక్షణ, భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై తమ నిబద్ధతను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు.
ఒమన్‌లోని భారత ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న సహకారానికి గానూ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సముద్ర వారసత్వం, భాషా ప్రోత్సాహం, యువత మార్పిడి కార్యక్రమాలు, క్రీడా సంబంధాల రంగాలలో చేపట్టనున్న అనేక కొత్త ద్వైపాక్షిక కార్యక్రమాలు ప్రజల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలు పంచుకునే సుసంపన్న సాంస్కృతిక వారసత్వం గురించి కూడా వారు చర్చించారు. సముద్ర సంబంధ మ్యూజియాల మధ్య సహకారం, కళాఖండాలు, నైపుణ్యం మార్పిడి కార్యక్రమాల ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఒమన్ విజన్ 2040, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారతదేశ లక్ష్యం మధ్య ఉన్న సారూప్యాన్ని నాయకులు స్వాగతించారు. రెండు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో నాయకులు పరస్పరం మద్దతు ప్రకటించారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా నాయకులు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ప్రధానమంత్రి ఒమన్ పర్యటన సందర్భంగా, సీఈపీఏతో పాటు సముద్ర వారసత్వం, విద్య, వ్యవసాయం, సిరిధాన్యాల సాగు రంగాల్లో కూడా అవగాహన ఒప్పందాలు / ఏర్పాట్లపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి.
***
(रिलीज़ आईडी: 2206330)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam