ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
01 JUL 2023 8:03PM by PIB Hyderabad
భారత్ మాతా కీ- జై!
భారత్ మాతా కీ- జై!
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్, కేంద్రమంత్రి వర్గ సహచరులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ, శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్, శ్రీమతి రేణుకా సింగ్ సరుతా జీ, డాక్టర్ భారతి పవార్, శ్రీ బిశ్వేశ్వర్ తుడు, పార్లమెంటు సభ్యులు శ్రీ వి.డి. శర్మ, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, శాసన సభ్యులు, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథులు, మమ్మల్ని ఆశీర్వదించటానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులారా!
జై సేవా, జై జోహార్. రాణి దుర్గావతి పవిత్ర భూమిపై ఇవాళ మీ అందరి మధ్య ఉండటం నా అదృష్టం. రాణి దుర్గావతికి నా హృదయపూర్వక నివాళులు. ఆమె స్ఫూర్తితోనే ఈరోజు 'సికిల్ సెల్ అనీమియా ముక్తి (నిర్మూలన) మిషన్' వంటి భారీ ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇవాళ మధ్యప్రదేశ్‌లోని కోటి మంది లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను కూడా అందిస్తాం. ఈ రెండు ప్రయత్నాల వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది గోండ్, భీల్, ఇతర గిరిజన వర్గాలే. ఈ సందర్భంగా మీ అందరికీ, మధ్యప్రదేశ్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
షాడోల్ గడ్డపై ఇవాళ దేశం ఒక గొప్ప సంకల్పానికి పూనుకుంటోంది. మన గిరిజన సోదరీసోదరుల సంక్షేమం కోసమే ఈ సంకల్పం. సికిల్ సెల్ అనీమియా నుంచి విముక్తి పొందడమే ఈ సంకల్పం. ఏటా సికిల్ సెల్ అనీమియా బారిన పడుతున్న 2.5 లక్షల మంది పిల్లల ప్రాణాలను, 2.5 లక్షల కుటుంబాలను కాపాడటమే ఈ సంకల్పం.
మిత్రులారా,
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని గిరిజన తెగలకు నేను దగ్గరుండి, చాలా కాలం గమనించాను. సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులు ఎంతో వేదన భరితం. దీనివల్ల నిరంతరం కీళ్ల నొప్పులు, వాపులు, శరీరంలో అలసటతో రోగులు ఇబ్బందిపడతారు. వెన్ను, కాళ్లు, ఛాతీలో భరించలేని నొప్పి, శ్వాస తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ దీర్ఘకాలిక బాధ, రోగుల ఇతర అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. కేవలం వ్యక్తులపైనే కాదు.. వారి కుటుంబాలపైనా ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది గాలి, నీరు, ఆహారం ద్వారా వ్యాపించదు. వంశపారపర్యంగా వచ్చే వ్యాధి. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధితో జన్మించిన పిల్లలు జీవితాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా సికిల్ సెల్ అనీమియా కేసుల్లో దాదాపు 50 శాతం కేసులు మన దేశంలోనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు, 70 ఏళ్లుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. దీని పరిష్కారానికి పటిష్టమైన ప్రణాళికను రూపొందించలేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో అత్యధికులు గిరిజన సామాజిక వర్గం వారే. గిరిజన సమాజం పట్ల గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా.. ఇది వారికి కనీసం ఒక సమస్యగా కూడా అనిపించలేదు. గిరిజన సమాజం ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్యను పరిష్కరించే బాధ్యతను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. మా దృష్టిలో గిరిజన సమాజం అంటే కేవలం ప్రభుత్వ గణాంకాలు మాత్రమే కాదు. అత్యంత సానుభూతి, భావోద్వేగంతో కూడిన అంశం. నేను గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. మన గవర్నర్ శ్రీ మంగుభాయ్, గిరిజన సమాజం కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడు. మంగుభాయ్, నేను కలిసి దాదాపు 50 ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్నాం. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు, గిరిజన కుటుంబాల్లో అవగాహన పెంచేందుకు మేం నిరంతరం కృషి చేశాం. నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక.. దీనికి సంబంధించి ఎన్నో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాను. నేను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జపాన్‌ను సందర్శించినప్పుడు, అక్కడ ఒక నోబెల్ బహుమతి గ్రహీతైన శాస్త్రవేత్తను కలిశాను. ఆయన సికిల్ సెల్ వ్యాధిపై ఎంతో పరిశోధన చేశారని తెలిసింది. సికిల్ సెల్ అనీమియా నివారణకు ఆయన సాయం కోరాను.
మిత్రులారా,
సికిల్ సెల్ అనీమియా నుంచి విముక్తికి చేపట్టిన ఈ ప్రచారం 'అమృత్ కాల్' ప్రధాన కర్తవ్యంగా మారుతుంది. మనం ఒక మిషన్‌లాగా కలిసి పనిచేస్తే, దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే నాటికి, అంటే 2047 వరకు మన గిరిజన కుటుంబాలను, ఈ దేశాన్ని సికిల్ సెల్ అనీమియా నుంచి విముక్తి చేయగలమని నమ్ముతున్నాను. ఇందుకోసం అందరం కలిసి బాధ్యతలను నెరవేర్చాలి. ప్రభుత్వం, ఆరోగ్య కార్యకర్తలు, గిరిజన సంఘాల సమన్వయంతో పనిచేయటం ఎంతో అవసరం. సికిల్ సెల్ అనీమియా బాధితులకు రక్తమార్పిడి అవసరమవుతుంది. వారి కోసం బ్లడ్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. చికిత్స కోసం 'బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్' సౌకర్యాలనూ విస్తరిస్తున్నారు. సికిల్ సెల్ అనీమియా బాధితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించటం ఎంత ముఖ్యమో మీకు తెలుసు. బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ఈ వ్యాధి ఉండవచ్చు. అలాంటి వారు తెలియకుండానే తమ పిల్లలకు ఈ వ్యాధిని సంక్రమింపజేస్తారు. అందుకే పరీక్షలు చేయించుకోవటం, స్క్రీనింగ్ ద్వారా వ్యాధి వాహకులను గుర్తించటం చాలా ముఖ్యం. పరీక్షలు చేయించుకోకపోతే, రోగికి చాలా కాలం వరకు వ్యాధి గురించి తెలియకపోవచ్చు. మన్‌సుఖ్ మాండవీయ ఇందాక చెప్పినట్లుగా చాలా కుటుంబాల్లో జాతకాలు కలపటం, పుట్టిన తేదీల ఆధారంగా కుండలీలను సరిచూడటం అలవాటు. పెళ్లికి ముందు వారు జాతకాలను సరిచూస్తారు. ఆయన చెప్పినట్లుగానే.. మీరు జాతకాలు చూసినా చూడకపోయినా, సికిల్ సెల్ స్క్రీనింగ్ రిపోర్టును, మీకు ఇస్తున్న కార్డును మాత్రం తప్పనిసరిగా సరిచూసుకోవాలి. ఆ తర్వాతే వివాహం విషయంలో ముందుకు సాగాలి.
మిత్రులారా,
ఒక తరం నుంచి మరో తరానికి ఈ వ్యాధి సంక్రమించకుండా అరికట్టవచ్చు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ వ్యాధి నిర్ధారణ ప్రచారంలో పాల్గొని, కార్డును పొంది, పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో సమాజం ఎంత ఎక్కువ బాధ్యత తీసుకుంటే, సికిల్ సెల్ అనీమియా నుంచి అంత సులభంగా విముక్తి పొందవచ్చు.
మిత్రులారా,
వ్యాధులు ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయవు. కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురైనా, మొత్తం కుటుంబం ప్రభావితమవుతుంది. ఒక వ్యక్తికి జబ్బు చేస్తే, ఆ కుటుంబమంతా పేదరికం, నిస్సహాయత ఊబిలో చిక్కుకుపోతుంది. నేను కూడా మీలాంటి సామాన్య కుటుంబం నుంచే వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నాను. అందువల్ల నేను, మీ సమస్యలను అర్థం చేసుకుని, మీ బాధను పంచుకోగలను. ఇలాంటి తీవ్రమైన వ్యాధుల నిర్మూలనకు మా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈ ప్రయత్నాల ఫలితంగానే దేశంలో క్షయ వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. 2025 నాటికి దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే దిశగా మేం అడుగులు వేస్తున్నాం.
మిత్రులారా,
మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, 2013లో 11,000 కాల-అజర్ కేసులుండేవి. ఇవాళ అవి వెయ్యి కంటే తక్కువ కేసులున్నాయి. 2013లో 10 లక్షలు ఉన్న మలేరియా కేసులు, 2022 నాటికి 2 లక్షల కంటే తక్కువయ్యాయి. 2013లో దాదాపు 1.25 లక్షల కుష్టు వ్యాధి కేసులుండగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 70 నుంచి 75 వేలకు తగ్గింది. గతంలో మెదడు వాపు వ్యాధి సృష్టించిన బీభత్సం మనకు తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిపోయింది. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు. వ్యాధుల వ్యాప్తి తగ్గినపుడు ప్రజలు.. బాధ, నొప్పి, వేదన, మరణాల నుంచి విముక్తి పొందుతారు.
అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్లారా,
వ్యాధుల భారాన్నే కాదు.. వాటి వల్ల కలిగే ఆర్థిక భారాన్ని కూడా తగ్గించాలన్నదే మా ప్రభుత్వ ప్రయత్నం. మేం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ యోజన, ప్రజలపై భారాన్ని తగ్గించింది. కేవలం మధ్యప్రదేశ్‌లోనే ఇవాళ కోటి మందికి ఆయుష్మాన్ కార్డులు అందించాం. పేదవాడు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే, ఈ కార్డు అతడి జేబులో 5 లక్షల రూపాయల ఏటీఎం కార్డులా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, ఇవాళ మీరందుకున్న ఈ కార్డు 5 లక్షల రూపాయల విలువైనది. ఈ కార్డు మీ దగ్గర ఉంటే, చికిత్స అందించటానికి ఎవరూ నిరాకరించరు. డబ్బులు కూడా అడగలేరు. మీరు ఇబ్బందుల్లో ఉండి, భారతదేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా మోదీ ఇచ్చిన ఈ గ్యారెంటీ కార్డును చూపిస్తే, మీకు ఖచ్చితంగా చికిత్స అందించాల్సిందే. ఈ ఆయుష్మాన్ కార్డు పేదల వైద్యం కోసం ఇచ్చే 5 లక్షల రూపాయల హామీ. ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ.
అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్లారా,
ఆయుష్మాన్ యోజన కింద దేశవ్యాప్తంగా సుమారు ఐదు కోట్ల మంది పేదలకు ఉచిత చికిత్స అందించాం. ఈ 'ఆయుష్మాన్ భారత్' కార్డు లేకపోతే పేద ప్రజలు వైద్యం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఊహించండి.. వారిలో ఎంతమంది జీవితంపై ఆశలు వదులుకునేవారో? చికిత్స కోసం ఎన్ని కుటుంబాలు ఇళ్లను, పొలాలను అమ్ముకోవాల్సి వచ్చేదో? మా ప్రభుత్వం ప్రతి కష్టకాలంలోనూ పేదలకు అండగా నిలిచింది. ఈ 5 లక్షల రూపాయల 'ఆయుష్మాన్ యోజన గ్యారెంటీ కార్డు' పేదలకు ఆందోళనను దూరం చేసే భరోసా. ఈ పథకం అమలులో పాలుపంచుకుంటున్న వారు ఒక్కసారి ఈ కార్డును చూడండి. దీనిపై 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అని రాసి ఉంటుంది. ఈ దేశంలో పేదవాడికి 5 లక్షల రూపాయల గ్యారెంటీని గతంలో ఎవరూ ఇవ్వలేదు. ఇది బీజేపీ ప్రభుత్వం. నేను మోదీ. మీకు 5 లక్షల రూపాయల భరోసా ఇచ్చే కార్డును అందిస్తున్నాం.
మిత్రులారా,
ఈ గ్యారెంటీలు, తప్పుడు హామీలు ఇచ్చే వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. సొంత గుర్తింపులేని వ్యక్తులే మీ ముందుకు వచ్చి గ్యారెంటీల పేరుతో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. వారి హామీల వెనకున్న లోపాలను గుర్తించండి. తప్పుడు హామీలతో మోసపూరిత చర్యల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి.
మిత్రులారా,
ఉచిత విద్యుత్ గ్యారెంటీ ఇస్తున్నారంటే, విద్యుత్ ధరలను పెంచుతారని అర్థం. ఉచిత ప్రయాణ గ్యారెంటీ ఇస్తున్నారంటే, ఆ రాష్ట్ర రవాణా వ్యవస్థను నాశనం చేయబోతున్నారని అర్థం. పెన్షన్లు పెంచుతామంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి అందవని అర్థం. చౌకగా పెట్రోల్ ఇస్తామనే గ్యారెంటీ వెనుక, పన్నులు పెంచి మీ జేబుల నుంచి డబ్బులు లాగేసే కుట్ర ఉంటుంది. ఉపాధి అవకాశాలను పెంచుతామని ఇచ్చే గ్యారెంటీ ద్వారా అక్కడి పరిశ్రమలను, వ్యాపారాలను దెబ్బతీసే విధానాలను తీసుకువస్తారు. కాంగ్రెస్ వంటి పార్టీలు ఇచ్చే గ్యారెంటీ అంటే అది పేదలను మోసం చేసే, హాని కలిగించే విధంగా ఉంటుంది. ఇది వారి ఆట. 70 ఏళ్లలో పేదలకు కడుపు నిండా భోజనం పెడతామని వారు గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్ గ్యారెంటీ లభిస్తోంది. 70 ఏళ్లలో పేదలకు తక్కువ ధరకు వైద్యం అందుతుందని వారు గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. కానీ ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 50 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్య బీమా లభించింది. 70 ఏళ్లలో మహిళలకు పొగ రహిత జీవనం కల్పించేందుకు వారు గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. ఉజ్వల యోజన ద్వారా దాదాపు 10 కోట్ల మంది మహిళలకు పొగ రహిత స్వచ్ఛమైన జీవితం గ్యారెంటీగా దక్కింది. 70 ఏళ్లలో పేదలు, తమ కాళ్ల మీద నిలబడేలా గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. ముద్రా యోజన ద్వారా 8.5 కోట్ల మంది ప్రజలకు గౌరవప్రదమైన స్వయం ఉపాధి గ్యారెంటీ లభించింది.
వారి గ్యారెంటీ అంటేనే ఏదో ఒక మోసం, కుట్ర దాగి ఉందని అర్థం. ఇవాళ ఏకమయ్యామని చెప్పుకుంటున్న వారి పాత ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారు ఎప్పుడూ ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఈ ప్రతిపక్షాల ఐక్యతకే ఎటువంటి గ్యారెంటీ లేదు. ఈ వారసత్వ పార్టీలు కేవలం కుటుంబ సంక్షేమానికే పనిచేశాయి. సామాన్య ప్రజల అభ్యున్నతికి వారి వద్ద ఎలాంటి గ్యారెంటీ లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. స్కాముల్లో శిక్ష అనుభవిస్తున్న వారు కూడా ఒకే వేదికపై కనిపిస్తున్నారు. దీనర్థం.. అవినీతి రహిత పాలనను అందించే గ్యారెంటీ వారి వద్ద లేదని. దేశానికి వ్యతిరేకంగా అందరూ ఒకే గొంతుకతో మాట్లాడుతున్నారు. దేశ వ్యతిరేక శక్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారంటే, ఉగ్రవాద రహిత భారతదేశాన్ని నిర్మిస్తామనే గ్యారెంటీ వారి వద్ద లేదు. వారు వాగ్దానాలు చేసి వెళ్లిపోతారు. కానీ ఆ పరిణామాలను అనుభవించాల్సింది మీరే. వారు గ్యారెంటీలు ఇస్తూ జేబులు నింపుకుంటారు. కానీ, నష్టపోయేది మీ పిల్లలు. వారి కుటుంబాలను ముందుకు తీసుకెళ్తారు. కానీ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి, కాంగ్రెస్‌తో సహా ఇటువంటి రాజకీయ పార్టీల విషయంలో, గ్యారెంటీల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి.
మిత్రులారా,
తప్పుడు గ్యారెంటీలు ఇచ్చేవారి వైఖరి ఎప్పుడూ గిరిజన సమాజాలకు వ్యతిరేకమే. గతంలో భాష విషయంలో గిరిజన యువతకు పెద్ద సవాలు ఎదురయ్యేది. ఇప్పుడు మాతృభాషలోనే విద్యను అభ్యసించే అవకాశాన్ని నూతన జాతీయ విద్యా విధానం కల్పిస్తోంది. తప్పుడు గ్యారెంటీలిచ్చేవాళ్లు ఈ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. మన గిరిజన సోదరీసోదరుల పిల్లలు వారి సొంత భాషలో విద్యనభ్యసించటం వారికి ఇష్టం లేదు. గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతులు, పేదల పిల్లలు అభివృద్ధిలోకి వస్తే, ఓటు బ్యాంకు రాజకీయాలు దెబ్బతింటాయని వారికి తెలుసు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల ప్రాముఖ్యత నాకు తెలుసు. అందుకే, మా ప్రభుత్వం 400లకు పైగా ఏకలవ్య పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు వసతితోపాటు విద్యను పొందే అవకాశాన్ని కల్పించింది. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే దాదాపు 24,000 మంది విద్యార్థులు ఇటువంటి పాఠశాలల్లో చదువుకుంటున్నారు.
మిత్రులారా,
గత ప్రభుత్వాలు గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. మేం గిరిజన వ్యవహారాలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, దానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాం. ఈ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ను మేం మూడు రెట్లు పెంచాం. గతంలో అడవులను, భూములను దోచుకున్న వారికి రక్షణ లభించేది. అటవీ హక్కుల చట్టం ద్వారా 20 లక్షలకు పైగా పట్టాలను మేం పంపిణీ చేశాం. ఎన్నో ఏళ్లుగా పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ చట్టం పెసా పేరుతో కొందరు రాజకీయంగా ఆటలాడారు. మేం ఈ పెసా చట్టాన్ని అమలు చేసి, గిరిజన సమాజానికి హక్కులను కల్పించాం. గతంలో గిరిజన సంప్రదాయాలను, వారి కళా నైపుణ్యాలను ఎగతాళి చేసేవారు. కానీ మేం 'ఆది మహోత్సవం' వంటి కార్యక్రమాలను ప్రారంభించి, వారి సంస్కృతికి గౌరవాన్ని తీసుకువచ్చాం.
మిత్రులారా,
గత తొమ్మిదేళ్లుగా గిరిజన ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, వారి ప్రతిష్ఠను పెంపొందించటానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతిని 'జన్‌జాతీయ గౌరవ్ దివస్' (జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం)గా జరుపుకుంటున్నాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గిరిజన స్వాతంత్ర్య సమరయోధులకు ప్రత్యేక మ్యూజియాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రయత్నాల నడుమ గత ప్రభుత్వాల తీరును మనం మర్చిపోకూడదు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన వారు గిరిజన సమాజం, పేదల పట్ల సున్నితత్వం లేకుండా, అగౌరవంగా వ్యవహరించారు. ఒక గిరిజన మహిళను దేశ రాష్ట్రపతిని చేయాలన్న చర్చ వచ్చినప్పుడు పలు పార్టీల వైఖరి ఎలా ఉందో మనం చూశాం. మధ్యప్రదేశ్ ప్రజలు కూడా వారి తీరును గమనించారు. షాడోల్ డివిజన్‌లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించినప్పుడు, వారు దానికి కుటుంబం పేరు పెట్టుకున్నారు. కానీ, ఛింద్వారా విశ్వవిద్యాలయానికి గొప్ప గోండ్ విప్లవకారుడైన రాజా శంకర్ షా పేరును శివరాజ్ సింగ్ జీ ప్రభుత్వం పెట్టింది. వారు తాంత్యా మామా వంటి వీరులను పూర్తిగా విస్మరించారు. కానీ మేం పాతాళపానీ రైల్వే స్టేషన్‌కు తాంత్యా మామా పేరు పెట్టాం. పేరుగాంచిన గోండ్ సామాజిక నాయకుడు శ్రీ దల్బీర్ సింగ్ జీ కుటుంబాన్ని కూడా వారు అగౌరవపరిచారు. ఆ లోటును భర్తీ చేసి, వారిని మేం గౌరవించాము. గిరిజన నాయకులను గౌరవించటమంచే అది మా గిరిజన యువతను, మీ అందరినీ గౌరవించడమే.
మిత్రులారా,
మనం ఈ ప్రయత్నాలను కొనసాగిస్తూ, వేగం పెంచాలి. మీ సహకారం, ఆశీస్సుల వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. మీ ఆశీస్సులు, రాణి దుర్గావతి స్ఫూర్తి మనల్ని నిరంతరం నడిపిస్తాయని నమ్ముతున్నా. అక్టోబర్ 5వ తేదీన రాణి దుర్గావతి 500వ జయంతి రాబోతోందని శివరాజ్ జీ ఇప్పుడే చెప్పారు. రాణి దుర్గావతి శౌర్యానికి సాక్ష్యంగా నిలిచిన ఈ పవిత్ర భూమిపై, మీ అందరి మధ్య నిలబడి ఇవాళ నేనొక ప్రకటన చేస్తున్నాను. రాణి దుర్గావతి 500వ జన్మదిన వేడుకలను భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంది. ఆమె జీవితం ఆధారంగా ఒక చలన చిత్రాన్ని నిర్మిస్తాం. ఆమె గౌరవార్థం ఒక వెండి నాణేన్ని, ఆమె చిత్రంతో తపాలా బిళ్లను విడుదల చేస్తాం. 500 ఏళ్ల కిందట జన్మించిన మన పూజ్యనీయ తల్లి స్ఫూర్తిని భారతదేశంలోని ప్రతి ఇంటికీ, ప్రపంచవ్యాప్తంగా చేరవేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
అభివృద్ధిలో మధ్యప్రదేశ్ నూతన శిఖరాలను అధిరోహిస్తుంది. మనమంతా కలిసి అభివృద్ధి చెందిన భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకుందాం. కాసేపట్లో ఇక్కడున్న కొన్ని గిరిజన కుటుంబాలను నేను కలవబోతున్నాను. వారితో మాట్లాడే అవకాశం ఇవాళ నాకు లభించనుంది. పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలివచ్చారు. సికిల్ సెల్ నిర్మూలన, ఆయుష్మాన్ కార్డు పంపిణీ భావితరాల సంక్షేమానికి నేను చేపట్టిన అతిపెద్ద ప్రచార కార్యక్రమాలు. దీనికి మీ మద్దతు ఎంతో అవసరం. సికిల్ సెల్ వ్యాధి నుంచి మన దేశం విముక్తి పొందాలి. మన గిరిజన కుటుంబాలను ఈ సంక్షోభం నుంచి రక్షించాలి. దీనికి మీ సహాయం, నా గిరిజన కుటుంబాల అండ కావాలి. ఇదే మీ అందరికీ నా విన్నపం. మీరు ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. మీ అందరికీ నా ధన్యవాదాలు!
భారత్ మాతా కీ- జై!
భారత్ మాతా కీ- జై!
భారత్ మాతా కీ- జై!
ధన్యవాదాలు!
(గమనిక: ఇది ప్రధానమంతి హిందీ ప్రసంగానికి స్వేచ్ఛానువాదం.)
***
(रिलीज़ आईडी: 2205633)
आगंतुक पटल : 36
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam