మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లోక్‌సభలో ‘వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్-2025’ బిల్లును ప్రవేశపెట్టిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


· బలమైన నాణ్యత.. సమతూకంగల విద్యా ప్రమాణాలతో ఉన్నత విద్యలో ప్రతిభను ప్రోత్సహించేలా భారత ఉన్నత విద్యా సంస్థలకు సాధికారత కల్పించడమే లక్ష్యం

· ప్రగతిశీల ఉన్నత విద్యపై ‘ఎన్‌ఈపీ-2020’ దృక్కోణం మేరకు ప్రపంచ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా భారత ఉన్నత విద్యా సంస్థలను తీర్చిదిద్దడం ధ్యేయం

· ‘ప్రమాణాలు.. నియంత్రణ… గుర్తింపు’- 3 మండళ్లతో కూడిన అత్యున్నత సంస్థగా వికసిత భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌ను ప్రతిపాదిస్తూ బిల్లు

· ‘యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ’లు వికసిత భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌లో విలీనం

· ఉన్నత విద్యా సంస్థలకు బహుళ ఆమోద ప్రక్రియల స్థానంలో నిబంధనల అనుసరణను సరళం చేస్తూ ఏకీకృత నియంత్రణ చట్రం

· సార్వత్రిక సౌలభ్యం ద్వారా పారదర్శక.. విశ్వాసాధారిత నియంత్రణకు వీలుగా ముఖాముఖి రహిత.. సాంకేతిక పరిజ్ఞాన చోదక ఏక గవాక్ష వ్యవస్థ

· ఆవిష్కరణలను-విద్యా ప్రతిభను ప్రోత్సహించే అత్యుత్తమ పనితీరుగల ఉన్నత విద్యా సంస్థలకు స్వయంప్రతిపత్తి మెరుగుదల

· సౌలభ్య విస్తరణ.. ‘స్థూల నమోదు నిష్పత్తి’కి ఉత్తేజం.. ఉన్నత నైపుణ్యం సహా భవిష్యత్‌ సంసిద్ధ యువతను తీర్చిదిద్దే విద్యార్థి కేంద్రక.. సమగ్ర సంస్కరణలు

· విద్యార్థుల సమస్యలను సకాలంలో.. సమర్థంగా పరిష్కరించే బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం

· ఉన్నత విద్యా సంస్థల ద్వారా సరికొత్త అంశాల్లో సమగ్ర విద్యా లభ్యతతో స్వయంసమృద్ధ భారత్‌కు ప్రోత్సాహం

प्रविष्टि तिथि: 15 DEC 2025 8:56PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు లోక్‌సభలో ‘వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్-2025’ బిల్లును ప్రవేశపెట్టారు. సమర్థ, ప్రభావశీల సమన్వయం ద్వారా ప్రతిభకు పదును పెట్టి, ప్రమాణాలను నిర్దేశించేలా దేశంలోని ఉన్నత విద్యా సంస్థల (హెచ్‌ఈఐ)కు సాధికారత కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం.

దేశవ్యాప్త విస్తృత సంప్రదింపుల ప్రాతిపదికన జాతీయ విద్యా విధానం-2020 (ఎన్‌ఈపీ) రూపొందింది. ఉన్నత విద్యా నియంత్రణ వ్యవస్థలో సమూల మార్పులను ఇందులోని 18వ అధ్యాయం నిర్దేశిస్తోంది. ఇస్రో పూర్వ చైర్మన్‌, కీర్తిశేషులు డాక్టర్‌ శ్రీ కె.కస్తూరి రంగన్‌ జాతీయ విద్యా విధాన రూపకల్పన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన దార్శనిక నాయకత్వాన విద్యా స్వయంప్రతిపత్తి, బహుళ కోర్సులలో విద్య, పరిశోధన నైపుణ్యం, భారతీయ విలువలలోని ప్రాథమిక ప్రపంచ పోటీతత్వాన్ని స్పష్టం చేసే సమగ్ర, భవిష్యత్తు ఆధారిత దృక్కోణంతో ఈ విధానం రూపుదిద్దుకుంది. దీనికి అనుగుణంగా సునిశిత అధ్యయనం అనంతరం సార్వజనీన సంప్రదింపుల ప్రక్రియ ఆధారంగా ప్రపంచ ఉత్తమ పద్ధతులను సందర్భోచితంగా ఉన్నత విద్యాకు జోడిస్తూ ఈ బిల్లును సిద్ధం చేశారు. అలాగే జాతీయ ప్రాథమ్యాలకు పెద్దపీట వేస్తూ సమాన, సరళ, ఆవిష్కరణాధారిత విద్యా వ్యవస్థపై డాక్టర్ కస్తూరిరంగన్ దార్శనికతకు అనుగుణంగా ఇది రూపొందింది.

అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 12వ తేదీ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఆమోదించింది.

రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లోగల ‘యూనియన్ జాబితాలోని ఎంట్రీ 66’ నిబంధనల ప్రకారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నిబంధన “ఉన్నత విద్య లేదా పరిశోధన, శాస్త్ర, సాంకేతిక ఉన్నత విద్యా సంస్థలలో సమన్వయం, ఉన్నత ప్రమాణాల”ను నిర్దేశిస్తుంది.

వికసిత భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌ను అత్యున్నత సంస్థగా ప్రతిపాదిస్తూ- ఇందులో “ప్రమాణాలు, నియంత్రణ, గుర్తింపు” నిమిత్తం 3 మండళ్లు ఉంటాయని ఈ బిల్లు పేర్కొంటోంది. ఈ మేరకు వికసిత భారత్‌ శిక్షా వినియోగమాన్ పరిషత్ (నియంత్రణ మండలి), వికసిత భారత్‌ శిక్షా గుణ్వత్త పరిషత్ (గుర్తింపు మండలి), వికసిత భారత్‌ శిక్షా మానక్ పరిషత్ (ప్రమాణాల మండలి) ఏర్పాటవుతాయి. మరోవైపు “యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం-1956” (యూజీసీ), “ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యాక్ట్-1987” (ఏఐసీటీఈ), “నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్-1993” (ఎన్‌సీటీఈ)ల రద్దుకు ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. కొత్త చట్టం అమలులోకి వచ్చాక విద్యా మంత్రిత్వ శాఖ సహా “యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ”ల పరిధిలోని ఉన్నత విద్యా సంస్థలలో  ప్రమాణాల నిర్ణయాధికారం ‘వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్‌’కు దఖలు పడుతుంది. ‘ఎన్‌ఈపీ-2020’ నిర్దేశించిన మేరకు ‘కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్’ (సీఓఏ) ఒక ‘ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీ’ (పీఎస్‌ఎస్‌బీ)గా పనిచేస్తుంది. జాతీయ ప్రాధాన్యంగల సంస్థలకుగల ప్రస్తుత స్వయంప్రతిపత్తి స్థాయిని  ఈ బిల్లు సమర్థిస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంపూర్ణ ప్రగతితోపాటు మూడు మండళ్ల మధ్య సమన్వయానికి అధిష్ఠాన్ వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుంది. తదనుగుణంగా కనీస విద్యా ప్రమాణాల నిర్దేశం, ఏకీకరణకు ప్రమాణాల మండలి బాధ్యత వహిస్తుంది. ఈ ప్రమాణాల సమన్వయం, నిర్వహణను నియంత్రణ మండలి పర్యవేక్షిస్తుంది. ఇక బలమైన, విశ్వసనీయ గుర్తింపు వ్యవస్థను స్వతంత్ర గుర్తింపు ప్రాధికార సంస్థగా అక్రెడిటేషన్‌ మండలి వ్యవహరిస్తుంది.

ఉన్నత విద్యా సంస్థలన్నీ తమ పాలన, ఆర్థిక, విద్యా, సంస్థాగత పనితీరును నియంత్రణ మండలి పరిధిలోని సార్వత్రిక పోర్టల్‌ ద్వారా వెల్లడించడం తప్పనిసరి కాగా, ఆయా సంస్థలకు గుర్తింపు ఇవ్వడంలో ఇది ప్రాథమిక ఉపకరణంగా పనిచేస్తుంది. ఈ సమగ్ర విధానం పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం తదితరాలకు భరోసా ఇస్తుంది. అంతేకాకుండా ఉన్నత విద్యలో భాగస్వాముల కోసం వ్యవస్థల సరళీకరణపై ప్రభుత్వ నిబద్ధతను బలోపేతం చేస్తుంది.

అధిష్ఠాన్‌తోపాటు దీని పరిధిలోని మండళ్లలో సమతుల ప్రాతినిధ్యం, సమాచార ఆధారిత నిర్ణయాత్మకతకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ మేరకు దేశంలోని ప్రసిద్ధ విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, జాతీయ ప్రాముఖ్యంగల సంస్థల ప్రతినిధులు వీటిలో సభ్యులుగా ఉంటారు.

దేశవ్యాప్తంగా గల ఉన్నత విద్యాసంస్థలు ప్రస్తుతం వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనేక అనుమతులు, ఆమోదాలు పొందడంతో పాటు తనిఖీ ప్రక్రియను అనుసరించాల్సి వస్తోంది. దీనివల్ల   ఈ రంగంపై మితిమీరిన నియంత్రణ సహా నిబంధనల అనుసరణ పునరావృతమవుతోంది. అందుకే, ఉన్నత విద్యా సంస్థలన్నిటి పర్యవేక్షణకు ఏకైక సరళీకృత నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం అవశ్యం.

ఈ అవసరాలకు అనుగుణంగా ఏకీకృత, హేతుబద్ధ నియంత్రణ వ్యవస్థను అమలులోకి తెచ్చి, సంక్లిష్టతలను తొలగించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ దిశగా నియంత్రణ చట్రం యావత్తూ సాంకేతిక పరిజ్ఞానాధారిత, ముఖాముఖి రహిత, పరస్పర సమాచార ప్రధాన వ్యవస్థల ద్వారా ‘ఏకగవాక్షం’గా పనిచేస్తుంది. ఇది సార్వత్రిక సౌలభ్యం, విశ్వాసాధారిత నియంత్రణ సూత్రాల ఆధారంగా వ్యవహరిస్తుంది.

ఇందులో భాగంగా నియంత్రణ మండలి సమగ్ర సార్వత్రిక డిజిటల్ పోర్టల్‌ను నిర్వహిస్తుంది. దీనిద్వారా ఆర్థిక పారదర్శకత, పాలన విధానాలు, ఆర్థిక వనరులు, జమాఖర్చుల తనిఖీ (ఆడిట్‌), ఇతర ప్రక్రియలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యా కార్యక్రమాలు, విద్యా ఫలితాల సంబంధిత సమాచారాన్ని ఉన్నత విద్యా సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పోర్టల్‌లో ద్వారా సమర్పించే సమాచారం సదరు సంస్థకు గుర్తింపునివ్వడంలో ప్రాథమిక ఉపకరణం అవుతుంది. దీనివల్ల ఉన్నత విద్యావరణ వ్యవస్థ అంతటా పారదర్శకత, జవాబుదారీతనం, స్థిరత్వానికి భరోసా లభిస్తుంది.

ప్రతిపాదిత బిల్లు ప్రధాన లక్ష్యాలు:

1.    యువతరానికి సాధికారత

·         పారదర్శక, విద్యార్థి కేంద్రక వ్యవస్థలు నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశ సౌలభ్యం కల్పిస్తాయి. దీనివల్ల విద్యా లభ్యత మెరుగుపడటమే కాకుండా స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) పెరుగుతుంది.

·         ఈ సమగ్ర విద్యా విధానం విద్యార్థులలో విమర్శనాత్మక ధోరణి, సృజనాత్మకత, ఆవిష్కరణాత్మకతలను ప్రోత్సహిస్తూ విద్యా నైపుణ్యంపై దృష్టి సారిస్తుంది.

·         విద్యార్థులు విభిన్న కోర్సులను అభ్యసించడానికే కాకుండా నిరంతర నైపుణ్య పునశ్చరణ, నైపుణ్యాభివృద్ధి దిశగా అంతర-విభాగ, సరళ విద్యా చట్రాలు వీలు కల్పిస్తాయి.

·         పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపకనకు బలమైన ప్రాధాన్యం ఫలితంగా యువతరంలో సమస్యా పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత, స్వావలంబన కూడా బలోపేతమవుతాయి.

·         విద్యా నాణ్యత, మౌలిక సదుపాయాలు, పాలన సహా మొత్తంగా అభ్యసన అనుభవంపై నిర్మాణాత్మక అభిప్రాయం సేకరణ ద్వారా ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్, మూల్యాంకనానికి విద్యార్థులు చురుగ్గా తోడ్పడుతూ జవాబుదారీతనం, నిరంతర వృద్ధికి సహకరిస్తారు.

·         సముచిత, పారదర్శక, బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం విద్యార్థుల సమస్యలను సకాలంలో, సమర్థంగా పరిష్కరిస్తూ సంస్థాగత వ్యవస్థలపై నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది.

·         విజ్ఞానం, కర్తవ్యం, నైపుణ్యం, ప్రపంచ పోటీతత్వంతో జాతీయ-అంతర్జాతీయ స్థాయులలో అర్థవంతంగా సహకరించగల సమర్థ పౌరులను తీర్చిదిద్దడం ఈ బిల్లు లక్ష్యం.

2.     అంతర్జాతీయ ఉత్తమ విధానాల అనుసరణ

·         ఉన్నత విద్యలో అంతర్జాతీయ ఉత్తమ విధానాల అనుసరణతో భారత ఉన్నత విద్యా సంస్థల నాణ్యత, పోటీతత్వం, అంతర్జాతీయ విశ్వసనీయత ఇనుమడిస్తాయి.

·         దేశంలో ప్రపంచ ప్రమాణానుగుణ ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు సౌలభ్యం సహా దేశీయ ప్రతిభను చాటుతూ అంతర్జాతీయ విద్యార్థులు, అధ్యాపకులను ఆకర్షించే విజ్ఞాన కేంద్రంగా భారత్‌ నిలుస్తుంది.

3.     నియంత్రణా సంస్కరణలు

·         స్వతంత్ర మండళ్ల ద్వారా ప్రమాణాల నిర్దేశం, నియంత్రణ, గుర్తింపు సంబంధిత విస్పష్ట  క్రియాత్మక విభజన వల్ల వస్తుగత దృక్పథం, విశ్వసనీయత పెరగడంతోపాటు ఆసక్తుల ఘర్షణ తగ్గుతుంది.

·         సంస్థాగత కార్యక్రమాలు, విద్యా కోర్సుల ప్రదానంలో సారళ్యం, వైవిధ్యానికి వీలు కల్పిస్తూ ఏకరూప కనీస నాణ్యత ప్రమాణాలకు నియంత్రణ నిర్దేశిత సమన్వయ కొలమానాలు భరోసా ఇస్తాయి.

·         అన్ని ప్రక్రియలనూ సరళం చేయడంలో లక్ష్యం, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానాధారిత, ముఖాముఖి రహిత ఏకగవాక్ష వ్యవస్థలు సార్వత్రిక పరిశీలన హితంగా ఉంటూ విచక్షణను తగ్గించడమే కాకుండా సామర్థ్యం, జవాబుదారీతనాన్ని ఇనుమడింపజేస్తాయి.

·         సార్వత్రిక పరిశీలనాధారిత, ప్రతిస్పందనాత్మక, కనిష్ఠ నియంత్రణ సంస్థలు విధానపరమైన నిబంధనల అనుసరణకన్నా విద్యా నాణ్యతపై దృష్టి సారించేలా చేస్తాయి.

·         నాణ్యతను నిర్ధారించే యంత్రాంగాలను పారదర్శక, సుస్థిర గుర్తింపు చట్రం మరింత బలోపేతం చేస్తుంది.

·         అత్యుత్తమ పనితీరుగల ఉన్నత విద్యాసంస్థలు స్వతంత్ర, స్వయంపాలన వ్యవస్థలుగా పనిచేస్తూ ఆవిష్కరణలు, సామర్థ్యం, ఉన్నత ఫలితాలను సాధించేలా మరింత మెరుగైన స్వయంప్రతిపత్తి లభిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2204513) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Odia