సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గువాహటిలో ఏకమైన ‘కమ్యూనిటీ రేడియో స్టేషన్లు.. క్షేత్రస్థాయి ప్రసారాల రెండు దశాబ్దాల వేడుక

प्रविष्टि तिथि: 10 DEC 2025 5:49PM by PIB Hyderabad

రెండు రోజుల ప్రాంతీయ కమ్యూనిటీ రేడియో సమ్మేళనం (తూర్పు) నేడు గువాహటిలో ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనం.. ‘‘దేశంలో కమ్యూనిటీ రేడియో 20 సంవత్సరాల వేడుక’’ అనే ఇతివృత్తంతో జరుగుతుంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి 65కి పైగా కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

సమావేశాన్ని ఉద్దేశించి ఐఐఎంసీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ గౌర్ మాట్లాడుతూ.. ఈ సమావేశం కోసం మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కావడం తమకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 550కి పైగా కమ్యూనిటీ రేడియో స్టేషన్లు పనిచేస్తున్నాయని, ఈశాన్య ప్రాంతం సహా మరిన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సున్నితమైన సమాచారాన్ని ప్రోత్సహించడం, అత్యవసర సమాచారాన్ని వ్యాప్తి చేయడం, మీడియా విద్య విద్యార్థులను పాల్గొనేలా చేయడం, జానపద సంప్రదాయాలను పరిరక్షించడం, కంటెంట్ అభివృద్ధిలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా అనుసంధానించడంలో కమ్యూనిటీ రేడియో వ్యవస్థ కీలక పాత్ర వహిస్తుందని డాక్టర్ గౌరి తెలిపారు. కమ్యూనిటీ రేడియో ద్వారా సమాజ ఆధారిత అభివృద్ధిని బలోపేతం చేయడానికి భాగస్వాములందరూ కలిసి పనిచేయాలని ఆమె కోరారు.

ఈ సమ్మేళనంలో ఐఐఎంసీ రిజిస్ట్రార్ శ్రీ ఎల్ మధు నాగ్ మాట్లాడుతూ.. దేశ రేడియో రంగంలో వచ్చిన కీలక పరివర్తనను ప్రస్తావించారు. ప్రధాన స్రవంతి ఎఫ్ ఎం ప్రసారాల నుంచి స్థానిక గళాలకు శక్తిమంతమైన వేదికగా కమ్యూనిటీ రేడియో ఆవిర్భవించిన తీరును ఆయన వివరించారు. రేడియో స్టేషన్లను బలోపేతం చేయడలో ప్రాథమిక ఆధారాల గురించి మాట్లాడుతూ.. కమ్యూనిటీ ఆధారిత కంటెంట్ రూపొందించడం, మెరుగైన సామర్థ్య నిర్మాణం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం ప్రాముఖ్యతను వెల్లడించారు. సృజనాత్మకంగా రూపొందించిన, స్థానికంగా పాతుకుపోయిన సమాచారం కమ్యూనిటీ రేడియో విజయానికి కేంద్రంగా ఉందని ఆయన గుర్తించారు.

 

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీఆర్ఎస్ డైరెక్టర్ శ్రీమతి శిల్పా రావు సమ్మేళనం లక్ష్యాల గురించి తెలియజేశారు. ఈశాన్య ప్రాంతంలో కమ్యూనిటీ రేడియో రంగాన్ని మరింత పెంచేందుకు, బలోపేతం చేసేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆ దిశగా మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల గురించి కూడా ఆమె వివరించారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ శ్రీ మహేంద్ర మీనా మాట్లాడుతూ.. కమ్యూనిటీ రేడియో స్టేషన్లు చివరి స్థాయి సమాచారానికి తప్పని సరిగా మారాయని వ్యాఖ్యానించారు. సీఆర్ స్టేషన్లు నిజమైన కమ్యూనిటీ గళాలను విస్తరింపజేస్తాయని, అత్యవసర పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల సమయంలో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం చేరుకోవడంలలో సహాయపడతాయని ఆయన అన్నారు. కమ్యూనిటీ రేడియో ఉద్యమానికి మంత్రిత్వ శాఖ నిరంతర మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు.

దేశ కమ్యూనిటీ రేడియో ఉద్యమం రెండు దశాబ్దాల సామూహిక వేడుకలో పాల్గొనేందుకు గువాహటి వచ్చిన వారందరికీ సమ్మేళనం కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్. సంగీత ప్రణవేంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతమంతా క్షేత్ర స్థాయి ప్రసారాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న సీఆర్ నిపుణులు, అభ్యాసకుల నిబద్ధతను ఆమె అభినందించారు.

 

సమ్మేళనంలో తొలి రోజు అనేక సాంకేతిక, ముఖాముఖి చర్చలు జరిగాయి. టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ డిప్యూటీ వైర్‌లెస్ సలహాదారు శ్రీ మనీష్ శీల్వంత్.. ట్రాన్స్ మిషన్ బర్తీ, సరళ్ సంచార్ వేదికలోకి మారడం, గురించి వివరించారు. డబ్ల్యూఓఎల్ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవడంపై మార్గదర్శకత్వం అందించారు.

 

లింగ ఆధారిత కార్యాక్రమాల ఔచిత్యంపై ప్రొఫెసర్ డాక్టర్ కాంచన్ కే మాలిక్ మాట్లాడుతూ.. కమ్యూనిటీ రేడియో స్టేషన్ కార్యక్రమాల్లో మహిళల కీలక పాత్ర వహిస్తున్నారని తెలిపారు. మొత్తం కంటెంట్ నిర్వహణ, ప్రసారంలో భాగస్వామ్య ప్రాముఖ్యత గురించి వివరించారు.

తూర్పు ప్రాంతంలో కమ్యూనిటీ రేడియోను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం అనే అంశంపై నిపుణుల చర్చ జరిగింది. దీనికి బిహార్, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి సీఆర్ఎస్ అభ్యాసకులు హాజరవ్వగా వీరికి సీఆర్ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ అమిత్ ద్వివేది నాయకత్వం వహించారు.

తొలి రోజు ‘‘స్వదేశీ భాషలు, సీఆర్ఎస్ ప్రోత్సాహం, పరిరక్షణ’’ పై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మైసూరులోని భారతీయ భాషల కేంద్రీయ సంస్థ ప్రొఫెసర్ ఉమా పప్పుస్వామి నేతృత్వం వహించారు. సీఆర్ఎస్ అత్యంత స్థానికం కాబట్టి దీని ద్వారా స్వదేశీ భాషలను ఉత్తమంగా సంరక్షించడమే కాకుండా ప్రోత్సహించవచ్చని ఆమె అన్నారు.

కమ్యూనిటీ ఆధారిత సమాచారంపై ఒడిశాలోని కోణార్క్‌లోని రేడియో నమస్కార్ డైరెక్టర్ శ్రీ ఎన్ఎస్ షా అన్సారీ నిర్వహించిన సమావేశంతో నేటి కార్యక్రమం ముగిసింది. కమ్యూనిటీ ఆధారిత సమాచారాన్ని రూపొందించేటప్పుడు అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులపై ఆయన మాట్లాడారు.

సమ్మేళనం కమ్యూనిటీ రేడియో నిపుణులు తమ అనుభవాలను పంచుకోవడానికి, ఆందోళనలను లేవనెత్తడానికి, వినూత్న విధానాలను అన్వేషించడానికి, తూర్పు, ఈశాన్య ప్రాంతంలోని క్షేత్ర స్థాయి ప్రసారాల భవిష్యత్తును సమిష్టిగా బలోపేతం చేయడానికి ఒక వేదికను అందిస్తుంది.

 

****


(रिलीज़ आईडी: 2202676) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese