నౌకారవాణా మంత్రిత్వ శాఖ
వారణాసిలో భారత తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌక ప్రయాణికుల సేవలను ప్రారంభించిన సర్బానంద సోనోవాల్
నికర-సున్నా ఉద్గారాల జలరవాణా దిశగా మోదీ ప్రభుత్వ ప్రధాన ముందడుగు
గంగానదిపై హైడ్రోజన్-ఇంధనంతో సాగిన ప్రయాణికుల నౌక
50 సీట్ల సామర్థ్యంతో సున్నా-ఉద్గారాలు, దేశీయ 24-మీటర్ల క్లీన్ ప్రొపల్షన్ తో సాగే
తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాటమరాన్ నౌక
प्रविष्टि तिथि:
11 DEC 2025 5:22PM by PIB Hyderabad
పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో భారత్ మరో విజయ ప్రస్థానాన్ని అందుకుంది. ఈరోజు వారణాసిలోని నమో ఘాట్‌లో పూర్తి దేశీయ తొలి హైడ్రోజన్ ఆధారిత నౌక వాణిజ్య కార్యకలాపాలను కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు.
దేశ సముద్ర రంగంలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే పూర్తి స్వదేశీ సాంకేతికతను ఈ నౌక కలిగి ఉంది. ఇది తక్కువ ఉష్ణోగ్రత గల ప్రోటాన్ ఎక్స్‌చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తూ నిల్వ చేసిన హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో నీటిని మాత్రమే ఇది విడుదల చేస్తుంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చైతన్యవంతమైన, దార్శనిక నాయకత్వంలో భారత్ పరిశుద్ధమైన, సుస్థిరమైన, స్వయం-సమృద్ధి గల రవాణా వ్యవస్థ దిశగా పరివర్తనాత్మక మార్పును సాధిస్తోంది. మన తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌక ప్రారంభం... మేక్ ఇన్ ఇండియా పట్ల ప్రధానమంత్రి నిబద్ధతకు, అన్ని రంగాల్లో హరిత ఇంధన రవాణా వ్యవస్థ దిశగా వస్తున్న పరివర్తనకు ఒక చక్కని ఉదాహరణ. ఈ విజయం మన పవిత్ర గంగానదిని పునరుజ్జీవింపజేసే, సంరక్షించే విస్తృత లక్ష్యాన్నీ బలపరుస్తుంది. మన జలరవాణాలో హరిత సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నప్పుడు... ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాకుండా అభివృద్ధిని పర్యావరణ బాధ్యతతో కలిసి ఉండేలా మేం చూసుకుంటున్నాం. మన దేశానికి హరిత, సుసంపన్న సముద్ర భవిష్యత్తును నిర్మించాలనే ప్రధానమంత్రి అచంచలమైన సంకల్పాన్ని నేటి విజయం ప్రతిబింబిస్తుంది” అన్నారు.
ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజమాన్యంలో ఈ నౌకను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ నౌక నేటి నుంచీ తన సేవల్ని అందిస్తోంది. 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను చేరుకోవాలనే ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నౌక ప్రారంభం... దేశంలోని లోతట్టు జలమార్గాల్లో పరిశుద్ధ, సుస్థిర ఇంధనాలను అభివృద్ధి చేయు మంత్రిత్వ శాఖ ప్రయత్నాలకు మద్దతునిస్తుంది.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌక వాణిజ్య సేవల ప్రారంభం... పరిశుద్ధ, సుస్థిర సముద్ర రంగాన్ని నిర్మించే ప్రయత్నంలో కీలక ముందడుగును సూచిస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి సోనోవాల్‌ల నాయకత్వంలో ఐడబ్ల్యూఏఐ మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047లో భాగంగా అధునాతన పర్యావరణ సాంకేతికతలు, ప్రత్యామ్నాయ ఇంధనాల అమలును ప్రోత్సహిస్తోంది.
“ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌకను విజయవంతంగా ప్రారంభించడం... పరిశుద్ధ, సుస్థిర జలరవాణా దిశగా భారత పరివర్తనను వేగవంతం చేయడం పట్ల మంత్రిత్వ శాఖ లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ మార్గదర్శక నౌకను అందించిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ను, కఠినమైన పరీక్షల తర్వాత దీనిని వాణిజ్య సేవలలోకి తీసుకున్న ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని నేను అభినందిస్తున్నాను. 2070 నాటికి భారత్ నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలనే, అంతర్గత జల రవాణా రంగంలో అత్యాధునిక హరిత సాంకేతికతలను ఏకీకృతం చేయాలనే మా సంకల్పానికి ఈ విజయం నిదర్శనం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరివర్తనాత్మక మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్ మార్గనిర్దేశంలో దేశం కోసం ఆధునిక, ఇంధన-సమర్థ వినియోగం, పర్యావరణ బాధ్యతతో కూడిన సముద్ర రంగాన్ని స్థిరంగా రూపొందిస్తున్నాం” అని శ్రీ సోనోవాల్ పేర్కొన్నారు.
పట్టణ రవాణా కోసం 24 మీటర్ల కాటమరాన్‌గా రూపొందించిన ఈ నౌక ఎయిర్ కండిషన్ గల క్యాబిన్‌లో 50 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఇది 6.5 నాట్ల వేగంతో నడుస్తుంది. దీని హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీలు, సౌర శక్తిని మిళితం చేస్తుంది. ఒకే హైడ్రోజన్ ఫిల్‌పై ఎనిమిది గంటల వరకు పనిచేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ నౌకను ఇండియన్ షిప్పింగ్ రిజిస్టర్ ధ్రువీకరించింది.
పైలట్ నౌక ఎఫ్‌సీవీ పైలట్-01 కార్యకలాపాలను ప్రారంభించడం కోసం ఐడబ్ల్యూఏఐ, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, ఇన్‌ల్యాండ్ - కోస్టల్ షిప్పింగ్ లిమిటెడ్‌లు సాంకేతిక మద్దతు, కార్యకలాపాలు, పర్యవేక్షణకు సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో ఆర్థిక నిబంధనలు, భద్రతా విధానాలు, పర్యవేక్షణ విధానాలు, పైలట్ దశలో కాలానుగుణ తనిఖీలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.
వారణాసిలో ప్రారంభించిన హైడ్రోజన్ ఆధారిత నౌక పట్టణ జల రవాణాకు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో ప్రయాణికులు, యాత్రికులకు శబ్ద రహిత ప్రయాణం, ఉద్గారాలుగా నీటిని మాత్రమే అందిస్తూ పొగ, కాలుష్యం లేకుండా జలమార్గాల ద్వారా వేగవంతమైన ప్రయాణం, రహదారిపై రద్దీని తగ్గించడం వంటివి ఈ ప్రయోజనాల్లో భాగంగా ఉన్నాయి. ఇది స్థానికంగా పర్యాటకం, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు, హైడ్రోజన్-ఇంధనంతో నడిచే ప్రయాణికుల రవాణాను అమలు చేస్తున్న ప్రపంచంలోనే తొలి నగరంగా వారణాసిని నిలుపుతుందని భావిస్తున్నారు. సాంకేతికంగా, పూర్తిగా ఎయిర్ కండిషన్‌తో గల 50-సీట్ల ఈ నౌక నిల్వ చేసిన హైడ్రోజన్‌పై ఎనిమిది గంటల పాటు 7 నుంచి 9 నాట్ల వేగంతో నడుస్తుంది. సురక్షితమైన, సమర్థమైన కార్యకలాపాలను నిర్ధారిస్తూ స్వదేశీ, పర్యావరణ హితమైన సాంకేతికత ద్వారా పనిచేస్తుంది.
ఈ నౌక తన తొలి ప్రయాణంలో నమో ఘాట్ నుంచి లలితా ఘాట్ వరకు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. గంగా నదిపై హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ ప్రయాణికుల నౌక (జాతీయ జలమార్గాలు 1) వాణిజ్య కార్యకలాపాల ప్రారంభాన్ని సూచిస్తూ మంత్రులు, సీనియర్ అధికారులతో పాటు ఇతరులతో కూడిన పరివారాన్ని విజయవంతంగా తీసుకెళ్లింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయ మంత్రి (స్వతంత్ర) రవీంద్ర జైస్వాల్, రవాణా మంత్రి దయాశంకర్ సింగ్, సహాయ మంత్రి (స్వతంత్ర) డాక్టర్ దయాశంకర్ మిశ్రా 'దయాలు' వంటి ప్రముఖ నాయకులు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెంట ఉన్నారు. వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అశోక్ కుమార్ తివారీ, ఎమ్మెల్యేలు - అవధేష్ సింగ్, నీల్కాంత్ తివారీ, డాక్టర్ సునీల్ పటేల్, సౌరభ్ శ్రీవాస్తవ, అనిల్ రాజ్‌భర్, నీల్ రతన్ సింగ్, త్రిభువన్ రామ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఏఎస్, ఎమ్ఓపీఎస్డబ్ల్యూ కార్యదర్శి విజయ్ కుమార్... ఐడబ్ల్యూఏఐ చైర్మన్, ఐఏఎస్ సునీల్ పలివాల్... మంత్రిత్వ శాఖ, ఐడబ్ల్యూఏఐ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పలువురు సీనియర్ అధికారులూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కాటమరాన్‌లను ప్రవేశపెట్టిన తర్వాత... ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌకను ప్రారంభించడం దేశ అంతర్గత జల రవాణా వ్యవస్థను ఆధునికీకరించడం, పర్యావరణ హితం కోసం ఐడబ్ల్యూఏఐ దీర్ఘకాలిక ప్రణాళికను మరింత బలోపేతం చేస్తోంది.
****
(रिलीज़ आईडी: 2202668)
आगंतुक पटल : 10