|
రైల్వే మంత్రిత్వ శాఖ
‘అమృత భారత్ స్టేషన్’ పథకం కింద శరవేగంగా 1,337 స్టేషన్ల పునరాభివృద్ధి
· రైళ్ల రాకపోలకు ఆటంకం లేకుండా భారీ స్థాయిలో స్టేషన్ల పునరాభివృద్ధి: రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ · ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో పునరాభివృద్ధి కోసం 15 స్టేషన్ల ఎంపిక · మెరుగైన ప్రవేశ సౌలభ్యం.. సరికొత్త ప్రయాణిక సౌకర్యాలు.. బహుళ రవాణా అనుసంధానం.. చక్కటి సమాచార వ్యవస్థలు సమకూర్చేలా స్టేషన్ల పునరాభివృద్ధి
प्रविष्टि तिथि:
10 DEC 2025 5:51PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వశాఖ దీర్ఘకాలిక దృక్పథంతో దేశవ్యాప్తంగా అమృత భారత్ స్టేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికింద స్టేషన్ల మెరుగు దిశగా బృహత్ ప్రణాళికల రూపకల్పన-దశల వారీగా పనులు నిర్వహణ చేపడుతుంది. బృహత్ ప్రణాళికలో పొందుపరచే అంశాలు కిందివిధంగా ఉన్నాయి:
· స్టేషన్‌కు రాకపోకలు సహా లోపలి సంచార ప్రాంతాల్లో సౌలభ్యం మెరుగుదల
· నగరంలో రెండువైపుల నుంచి స్టేషన్‌లో ప్రవేశించేలా ఏకీకరణ
· స్టేషన్ భవనాన్ని తీర్చిదిద్దడం
· వేచి ఉండే గదులు, మరుగుదొడ్లు, విరామ ఆసన ఏర్పాట్లు, నీటి సదుపాయం తదితరాల మెరుగుదల
· ప్రయాణిక రద్దీకి అనుగుణంగా విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి/ఎయిర్ కాన్‌కోర్స్
· లిఫ్టులు, ఎస్కలేటర్లు, ర్యాంపుల ఏర్పాటు
· ప్లాట్‌ఫామ్ సహా పైకప్పు మెరుగుదల
· ‘ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి’ వంటి పథకాల ద్వారా స్థానిక ఉత్పత్తుల కోసం కియోస్క్‌ల ఏర్పాటు
· పార్కింగ్ ప్రదేశాల సదుపాయం, బహుళ రవాణా ఏకీకరణ
· దివ్యాంగులకు అనువైన సౌకర్యాలు
· ప్రయాణిక సమాచార వ్యవస్థల మెరుగుదల
· ప్రతి స్టేషన్‌లోని అవసరాల మేరకు ఎగ్జిక్యూటివ్ లాంజ్, వ్యాపార సమావేశాలకు ప్రత్యేక స్థలాలు, పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దడం
వీటన్నిటితోపాటు సుస్థిర, పర్యావరణ హిత మార్గాల అనుసరణ, అవసరం మేరకు రాళ్ల వరుస రహిత పట్టాల ఏర్పాటు, సాధ్యాసాధ్యాలను బట్టి దశలవారీగా స్టేషన్‌లో దీర్ఘకాలికంగా నగర కేంద్రం సృష్టికి ఈ పథకం వీలు కల్పిస్తుంది.
ఈ పథకం కింద పునరాభివృద్ధి కోసం ఇప్పటిదాకా 1337 స్టేషన్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా సాగడంతో 155 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి.
జోనల్ రైల్వేలు, ప్రధాన నగరాల్లోగల స్టేషన్లు, పర్యాటక-యాత్రా ప్రాధాన్యంగల ప్రదేశాల నుంచి వచ్చే ప్రతిపాదనల ప్రాతిపదికన స్టేషన్లను ఎంపిక చేస్తారు.
అమృత భారత్ స్టేషన్ పథకం ప్రకారమే కాకుండా స్టేషన్ల అభివృద్ధి, ఉన్నతీకరణ, ఆధునికీకరణకు సాధారణంగా ‘ప్లాన్ హెడ్-53 వినియోగదారు సౌకర్యాల’ కింద నిధులు సమకూరుస్తారు. ఈ కేటాయింపులు, ఖర్చుల వివరాలను పనులవారీగా లేదా స్టేషన్ల వారీగా లేదా రాష్ట్రాల వారీగా కాకుండా జోనల్ రైల్వేల వారీగా నిర్వహిస్తారు. ఈ మేరకు ప్లాన్ హెడ్–53 కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో ₹12,118 కోట్ల నిధులు కేటాయించగా, ఇప్పటిదాకా ₹7,253 కోట్లు ఖర్చుచేశారు.
అమృత భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలు ప్రధానంగా బడ్జెట్ కేటాయింపుల ప్రాతిపదికన రూపొందించబడ్డాయి. అయితే, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి కోసం 15 స్టేషన్లను గుర్తించారు. ఈ అనుభవం ఆధారంగా ఈ పథకం కింద మరింత అభివృద్ధి సాధించగలమని అంచనా వేశారు.
స్టేషన్ల పునరాభివృద్ధి, ఆధునికీకరణ ప్రణాళిక-అమలులో భాగంగా వారసత్వ ప్రాధాన్యంగల వస్తు సామగ్రి సంరక్షణపైనా రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు కట్టడం/కళాఖండాల ఔచిత్తం, స్థితిని బట్టి ఆయా ప్రదేశాలకు తగిన చర్యలు తీసుకుంటుంది.
భారతీయ రైల్వేలలో స్టేషన్ల ఆధునికీకరణ సహా సాంకేతిక మెరుగుదల నిరంతరం సాగే ప్రక్రియ. తదనుగుణంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగ ప్రజాస్వామ్యీకరణకు రైల్వేలు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ మేరకు దేశవ్యాప్త సవాళ్లను దృష్టిలో ఉంచుకుని వాటి పరిష్కారంతోపాటు పౌరులకు ఆర్థిక, ఉపాధి అవకాశాల సృష్టిపై లక్ష్యనిర్దేశం చేసుకుంది.
అలాగే స్టేషన్ల అభివృద్ధి, పునరాభివృద్ధి, ఉన్నతీకరణ, ఆధునికీకరణ రైల్వేల్లో సదా కొనపాగుతుంటాయి. కాబట్టి, అవసరాలకు అనుగుణంగా చేపట్టే పనులు పరస్పర ప్రాధాన్యం, నిధుల లభ్యతకు లోబడి ఉంటాయి. ఆయా పనులకు ఆమోదం, అమలులో దిగువ కేటగిరీ స్టేషన్‌కన్నా ఉన్నత కేటగిరీ స్టేషన్‌కు ప్రాధాన్యం ఇస్తారు.
రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఉన్నతీకరణ కార్యక్రమాలు ప్రయాణికులు-రైళ్ల భద్రత వంటి సంక్లిష్ట స్వభావంగల అంశాలతో కూడినవి. కాబట్టి, వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి, వారసత్వం, వృక్షాల నరికివేత, విమానాశ్రయ ఆమోదం వంటి వివిధ చట్టబద్ధ అనుమతులు-ఆమోదాలు అవసరం. అలాగే ప్రజోపయోగ సదుపాయాల (నీటి సరఫరా, మురుగునీటి పారుదల, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, గ్యాస్ పైప్ లైన్లు, విద్యుత్తు-సిగ్నల్ కేబుళ్లు వంటి)ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వీటన్నిటి విషయంలో ఉల్లంఘనలు లేకుండా చూడటం, ప్రయాణిక రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రైళ్ల నిర్వహణ, రైలు పట్టాలు, హై వోల్టేజ్ విద్యుత్ లైన్ల సమీపంలో పనులవల్ల వేగ పరిమితులు వంటి బ్రౌన్‌ఫీల్డ్ సంబంధిత సమస్యలు కూడా పనుల వేగాన్ని, సమయాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల, ప్రస్తుత దశలో ఈ పనుల పూర్తికి ఎటువంటి గడువునూ సూచించలేం.
కేంద్ర సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికత, రైల్వే శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2201951)
|