దేశంలో అనధికార డిజిటల్ రుణ యాప్‌ల కార్యకలాపాలను అడ్డుకొనేందుకు భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)తో పాటు సంబంధిత నియంత్రణ సంస్థలు/భాగస్వాములతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రజల కోసం తన వెబ్‌సైట్లో ‘డిజిటల్ లెండింగ్ యాప్స్ (డీఎల్ఏ)’ డైరెక్టరీని 01.07.2025 నుంచి ఆర్బీఐ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో నియంత్రణ సంస్థలు (ఆర్ఈ) నిర్వహిస్తున్న అన్ని డీఎల్ఏలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆర్‌ఈతో డీఎల్ఏ అనుసంధానమై ఉందని వినియోగదారులు ధ్రువీకరించుకోవడంలో సహాయం చేయడమే ఈ డైరెక్టరీ లక్ష్యం.
అనధికార డిజిటల్ రుణ యాప్‌ను గుర్తించినప్పుడు.. దానికి సంబంధించిన సమాచారాన్ని బ్లాక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, 2000 లోని సెక్షన్ 69 ఏ ప్రకారం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ) మంత్రిత్వ శాఖ అధికారాన్ని కలిగి ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ప్రజలకు సమాచారం చేరకుండా నియంత్రించే పద్ధతి, భద్రతా చర్యలు) నియమాలు 2009 సూచించిన ప్రకారం ఈ చర్యను మంత్రిత్వ శాఖ చేపడుతుంది.
అలాగే, అనధికార రుణ యాప్‌ల దోపిడీ నుంచి పౌరులను రక్షించడానికి సమయానుగుణంగా పలు కార్యక్రమాలను ప్రభుత్వం, ఆర్బీఐ చేపడుతున్నాయి. అవి దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి.
1. భారతీయ రిజర్వ్ బ్యాంకు (డిజిటల్ రుణాలు) మార్గదర్శకాలు-2025ను ఆర్బీఐ 2025 మే 8న జారీ చేసింది. రికవరీ, డేటా గోప్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు సంబంధించిన వివరణాత్మక నిబంధనలను ఈ మార్గదర్శకాలు అందిస్తాయి. వీటిని ఆర్ఈలు నియమించిన రుణ సేవా ప్రొవైడర్ (ఎల్ఎస్‌పీ)లకు, డిజిటల్ రుణ యాప్‌లకు తప్పనిసరి చేసింది.
2. అనధికార రుణ యాప్‌ల కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించడానికి ప్రధాన ఇంటర్నెట్ మధ్యవర్తులు, మెసేజింగ్ వేదికలతో తరచూ సంప్రదింపులు జరపడం.
3. డిజిటల్ రుణ యాప్‌లను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) క్షుణ్నంగా విశ్లేషిస్తోంది. అక్రమ రుణ యాప్‌లపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in)ను, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 ను ఎంహెచ్ఏ ప్రారంభించింది.
4. చట్టవ్యతిరేకంగా సొమ్మును డిపాజిట్/వసూలు చేస్తున్న నిర్దిష్ట సంస్థపై ‘ఎస్ఏసీహెచ్ఈటీ’ పోర్టల్, అంతర నియంత్రణ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ (ఎస్ఎల్‌సీసీ) ద్వారా ప్రజలు ఫిర్యాదు చేసే వీలును బ్యాంకులు కల్పిస్తాయి.
5. సైబర్ నేరాలను నివారించడానికి సంక్షిప్త సందేశాలు, రేడియో ప్రకటనలు, ప్రచారం ద్వారా ఆర్బీఐ, బ్యాంకులు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అలాగే.. మోసాలు, ప్రమాద నివారణపై అవగాహన పెంచేలా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అవగాహన, శిక్షణ (ఈ-బీఏఏటీ) కార్యక్రమాలను ఆర్బీఐ నిర్వహిస్తోంది.