ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు సభ్యులనుద్దేశించి సెంట్రల్ హాలులో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
19 SEP 2023 4:12PM by PIB Hyderabad
గౌరవనీయులైన ఉప రాష్ట్రపతి, స్పీకర్, వేదికపై ఉన్న ఇతర సీనియర్ ప్రముఖులు, 140 కోట్ల మంది పౌరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ నమస్కారాలు,
గణేశ్ చతుర్థి సందర్భంగా మీకు, దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన పార్లమెంటు భవనంలో ఉజ్వల భవిష్యత్తు వైపు సాగే కొత్త ప్రయాణాన్ని ఇవాళ సమిష్టిగా ప్రారంభించబోతున్నాం. నూతన భవనంలోకి వెళ్లేముందు, దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చాలన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తూ, అంకితభావం, దృఢ సంకల్పంతో దాన్ని సాధించేందుకు మనల్ని అంకితం చేసుకుందాం. గౌరవ సభ్యులారా, పార్లమెంటు భవనంలో ప్రత్యేకంగా సెంట్రల్ హాలు, మన భావోద్వేగాలతో నిండినది. ఇది మనలో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మన కర్తవ్యాలని ప్రోత్సహిస్తుంది. స్వాతంత్ర్యం రాకముందు గ్రంథాలయంగా ఉన్న ఈ విభాగం తర్వాత రాజ్యాంగ పరిషత్ సమావేశాలకు వేదికగా మారింది. ఆ సమావేశాల్లోనే మన రాజ్యాగం రూపుదిద్దుకుంది. ఇక్కడే బ్రిటీష్ ప్రభుత్వం భారత్‌కు అధికారాన్ని బదిలీ చేసింది. ఇందుకు సెంట్రల్ హాల్ సాక్షిగా నిలిచింది. భారత త్రివర్ణ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఈ సెంట్రల్ హాలులోనే ఆమోదించారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఎన్నో చారిత్రక సందర్భాల్లో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటానికి ఉభయ సభలు ఈ సెంట్రల్ హాల్‌లో చర్చించి, నిర్ణయాలు తీసుకున్నాయి.
ఈ సెంట్రల్ హాల్‌లో 1952 నుంచి ప్రపంచ వ్యాప్త దేశాలకు చెందిన 41 మంది దేశాధినేతలు గౌరవ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మన రాష్ట్రపతులు 86 సార్లు మాట్లాడారు. ఏడు దశాబ్దాలుగా అనేక చట్టాలు, సవరణలు, ఎన్నో అభివృద్ధి పనుల్లో బాధ్యతలను నిర్వహించిన వారు భాగమయ్యారు. లోక్‌సభ, రాజ్యసభ రెండూ కలిసి సుమారు 4,000 చట్టాలను ఆమోదించాయి. అత్యవసర సమయాల్లో, కట్న వ్యతిరేక చట్టం, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి సంబంధించిన చట్టాలను ఉమ్మడి సమావేశం ద్వారా ఆమోదించటానికి వ్యూహాలను కూడా రూపొందించాయి. ఈ చట్టాలన్నీ ఈ గదిలోనే ఉమ్మడిగా ఆమోదం పొందాయి. మనం ముస్లిం ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, షా బానో కేసు క్లిష్ట దశకు చేరుకున్నప్పుడు పొరపాట్లను సరిదిద్ది ఈ పార్లమెంటులోనే త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని ఆమోదించాం. ట్రాన్స్జెండర్లకు న్యాయం చేసేందుకు పార్లమెంటు చట్టాలను చేసింది. ఉద్యోగం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర సౌకర్యాలను వారు గౌరవప్రదంగా పొందేలా మేం కృషి చేశాం. దివ్యాంగ పౌరుల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, వారి ఉజ్వల భవిష్యత్తుకు చేసిన చట్టాలను కూడా మేం ఆమోదించాం. ఈ దశాబ్ద కాలంలో ఆర్టికల్ 370 విషయంలో సభ లోపల, బయట.. చర్చ, ఆందోళన, డిమాండ్, ఆగ్రహం వ్యక్తం చేయని రోజు లేదు. అదృష్టవశాత్తు మనం ఆర్టికల్ 370 నుంచి విముక్తిని పొందాం. ఇది వేర్పాటువాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా కీలక ముందడుగు. ఈ ప్రయత్నంలో గౌరవ పార్లమెంటు సభ్యుల పాత్ర ముఖ్యమైనది. జమ్మూకాశ్మీర్ కోసం కూడా ఈ సభలోనే రూపొందించిన, మన పూర్వీకులు అందించిన రాజ్యాంగం ఒక అమూల్యమైన పత్రం. అది జమ్మూకాశ్మీర్‌లో అమలైనప్పుడు ఈ నేలకి సెల్యూట్ చేయాలని నాకు అనిపిస్తుంది.
ఇవాళ జమ్మూకాశ్మీర్ శాంతి, అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. జమ్మూకాశ్మీర్ ప్రజలు నూతన ఉత్సాహం, పట్టుదల, సంకల్పంతో ముందుకు సాగే ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. పార్లమెంటు భవనంలో సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎంత కీలకమైనదో ఇది తెలియజేస్తుంది. గౌరవ సభ్యులారా.. నేను ఎర్రకోట నుంచి చెప్పినట్లుగా ఇదే సరైన సమయం. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే, భారత్ నూతనోత్తాజాన్ని సంతరించుకుందనే విషయం స్పష్టమవుతుంది. భారత్ నూతన ఉత్తేజంతో ఉంది. ఈ చైతన్యం, ఈ శక్తి, దేశంలోని కోట్లాది మంది ప్రజల కలలను సంకల్పాలుగా మార్చుతుంది. కష్టపడి పనిచేయటం ద‌్వారా ఆ సంకల్పాలను సాధించవచ్చు. దేశం పయనించే దిశలో ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయని నేను నమ్ముతున్నాను. మనం ఎంత వేగంగా ముందుకు సాగుతామో, అంతే త్వరగా ఫలితాలను పొందగలం.
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. కానీ, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. నాకు అందిన సమాచారం, ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులతో నా సంభాషణల ఆధారంగా, ధైర్యంగా చెప్పగలను. మనలో కొందరు నిరాశపడవచ్చు, కానీ ప్రపంచం మాత్రం నిశ్చింతగా ఉంది. భారత్ ఖచ్చితంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. భారత బ్యాంకింగ్ రంగం బలం కారణంగా ప్రపంచంలో మరోసారి సానుకూల చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. భారతదేశ పాలనా నమూనా, యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్), డిజిటల్ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా మెప్పు పొందుతున్నాయి. నేను ఈ విషయాన్ని జీ-20 సదస్సులో గమనించాను, బాలీలో కూడా చూశాను. సాంకేతిక ప్రపంచంలో భారతీయ యువత ముందుకు సాగుతున్న తీరు యావత్ ప్రపంచానికి కేవలం ఆసక్తి కలిగించే విషయం మాత్రమే కాదు, ఆకర్షణ, అంగీకారానికి కూడా కారణం. ఇప్పుడున్న కాలంలో మనమంతా అదృష్టవంతులమని చెప్పవచ్చు. ఈ అదృష్టకరమైన సమయంలో, కొన్ని బాధ్యతలను నెరవేర్చే అవకాశం మనకు లభించింది. గడచిన వెయ్యి ఏళ్లలో ఎన్నడూ లేనంత ఉన్నత స్థాయిలో ఇవాళ భారత ప్రజల ఆంకాంక్షలున్నాయి. బానిసత్వ సంకెళ్లు ఆ ఆకాంక్షలను అణచివేశాయి. ఆ భావనలను చిదిమివేశాయి. కానీ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడు కలలు కన్నాడు. సవాళ్లతో పోరాడాడు. ఈ స్థాయికి చేరుకున్నాక ఆగిపోవాలని కోరుకోవటం లేదు. అతను ఒక ఆకాంక్షపూర్వక సమాజంతో కలిసి నూతన లక్ష్యాలను నిర్దేశించుకోవాలనుకుంటున్నాడు. ఆకాంక్షపూర్వక సమాజం కలలను కన్నప్పుడు, సంకల్పాలను నిర్దేశించుకున్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా, కొత్త చట్టాలను రూపొందించటం, పాత చట్టాలను తొలగించటం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేసే ప్రత్యేక బాధ్యత మనపై ఉంది. పార్లమెంట్లో మనం రూపొందించే ప్రతి చట్టం, చేసే ప్రతి చర్చ, పార్లమెంట్ నుంచి వెళ్లే ప్రతి సంకేతం భారతీయ ఆకాంక్షలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా ఉండాలి. ఇది మన భావన, మన కర్తవ్యం. ప్రతి పౌరుడు మన నుంచి ఆశించేది ఇదే. మనం చేపట్టే ఏ సంస్కరణల్లోనైనా భారత ఆకాంక్షలు అత్యధిక ప్రాధాన్యతతో ఉండాలి. బాగా ఆలోచించి నేను ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాను. చిన్న కాన్వాస్‌పై ఎవరైనా పెద్ద చిత్రాన్ని గీయగలరా? చిన్న కాన్వాస్‌పై పెద్ద చిత్రాన్ని వేయలేనట్లుగా, మన ఆలోచనా పరిధిని విస్తరించలేకపోతే, అద్భుతమైన భారత్‌ను నిర్మించలేం. మనకు 75 ఏళ్ల అనుభవం ఉంది. మన పూర్వీకులు పాటించిన మార్గాల నుంచి ఎంతో నేర్చుకున్నాం. మనకు గొప్ప వారసత్వం ఉంది. ఈ వారసత్వం, సంకల్పంతో మన కలలు ఏకీభవిస్తే, ఆలోచనా పరిధి విస్తరిస్తే, మన కాన్వాస్‌ను పెద్దదిగా చేస్తే.. అప్పుడు మనం దివ్యమైన భారత్‌ను చిత్రించగలం. దాని ఆకృతిని గీయగలం. దానికి రంగులు అద్దగలం. మిత్రులారా, రాబోయే తరాలకు మా భారతి దివ్యత్వాన్ని అందించగలం.
'అమృత కాలం'లో రాబోయే 25 ఏళ్లు భారత్ పెద్ద ఎత్తున కృషి చేయాలి. చిన్న చిన్న సమస్యల గురించి ఆలోచించడం మానేసి, ముందుకు సాగాల్సిన సమయమిది. స్వావలంబన భారత్‌గా మార్చడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. ఈ ప్రయాణం మనతో పాటు ప్రతి ఒక్కరి నుంచీ మొదలవుతుంది. ఒకప్పుడు కొందరు నాతో ఇలా అనేవారు. మోదీ ఆత్మనిర్భరత గురించి మాట్లాడితే, అది బహుళ పాక్షికతకు సవాళ్లను సృష్టించవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇది సముచితం కాకపోవచ్చన్నారు. అయితే, ఐదేళ్లలోనే భారత స్వావలంబన నమూనాపై ప్రపంచంలో చర్చ ప్రారంభమైంది. రక్షణ, ఇంధన రంగాల్లో, వంట నూనెల్లో మనం స్వావలంబన సాధించాలని దేశంలో ఎవరు కోరుకోరు? భారత్ వ్యవసాయ ఆధారిత దేశమని మనం అంటాం. మరి ఈ దేశం వంట నూనెలను దిగుమతి చేసుకోవటం కొనసాగించాలా? ఆత్మనిర్భర భారత్ కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇది మనందరి ఉమ్మడి బాధ్యత, పార్టీలకు, దేనికైనా అతీతంగా, ఇది కీలకమైన అంశం. దేశం కోసం చేయవలసిన పని.
తయారీ రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారటానికి మనం చర్యలు చేపట్టాలి. 'జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్' మన లక్ష్యం కావాలని ఒకసారి ఎర్రకోట నుంచి చెప్పాను. మన ఉత్పత్తుల్లో ఎటువంటి లోపాలూ ఉండకూడదు. మన తయారీ ప్రక్రియలు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు చూపకూడదు. ప్రపంచ తయారీ రంగంలో ఈ 'జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్' విధానం కోసం మనం కృషి చేయాలి. మన డిజైనర్లు, ఇక్కడ తయారవుతున్న ఉత్పత్తులు, మన సాఫ్ట్వేర్, వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలు, ప్రతి రంగంలోనూ ప్రపంచ ప్రమాణాలను అధిగమించాలనే సంకల్పంతో మనం ఉండాలి. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా మన జెండాను గర్వంగా ఎగురవేయగలం. గ్రామంలోనో, రాష్ట్రంలోనో ఉత్తమంగా ఉండటం కాదు. నా గ్రామంలో, నా రాష్ట్రంలో ఉత్తమంగా ఉండటం సరిపోదు. మనం చేసే అత్యుత్తమ కృషి దేశానికి తక్కువ కావచ్చు. మన ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలి. ఈ స్ఫూర్తిని మనం పెంపొందించుకోవాలి. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంకుల్లో ఉండాలి. ఇకపై ఈ రంగంలో మనం వెనుకబడి ఉండాల్సిన పనిలేదు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించాం. ఇది స్వేచ్ఛాయుతంగా, ఏకాభిప్రాయంతో ఆమోదం పొందింది. దాని మద్దతుతో, మనం ముందుకు సాగాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో భాగం కావాలి. ఇటీవల జీ20 సదస్సులో ప్రపంచ నాయకులకు నలంద గురించి వివరించాను. సుమారు 1,500 ఏళ్ల కిందట ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం నా దేశంలో ఉందని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఆ చరిత్ర నుంచి మనం స్ఫూర్తిని పొందాలి. కానీ దాన్ని ఇప్పుడే సాధించాలి. ఇదే మన సంకల్పం.
ఇటీవల దేశ యువత క్రీడా ప్రపంచంలో ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంటోంది. దేశంలోని టైర్-2, టైర్-3 నగరాలు, గ్రామాల్లోని పేద కుటుంబాల నుంచి వచ్చిన యువతీయువకులు క్రీడా ప్రపంచంలో ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రతీ క్రీడా వేదికపై మన త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని దేశం కోరుకుంటోంది. ఆ లక్ష్యాన్ని మనం తప్పక సాధించాలి. మనం నాణ్యతపై దృష్టిని కేంద్రీకరించటం ద్వారా ప్రపంచ అంచనాలను మాత్రమే కాక, సాధారణ భారతీయుల మెరుగైన జీవన ప్రమాణాల ఆకాంక్షలనూ నెరవేర్చగలుగుతాం. ఇంతకుముందు చెప్పినట్లుగా, మన సమాజం ఆకాంక్ష పూరితమైన స్వభావంతో ఉన్న సమయంలో పనిచేయడం అదృష్టకరం. భారతదేశం ఒక యువ దేశం కావడం కూడా అదృష్టమే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మనది. అయితే అదృష్టం ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభాను కలిగి ఉన్నాం. యువ శక్తి, యువ సామర్థ్యం ఒక దేశానికి ఉండటం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. వారి సంకల్పం, ధైర్యంపై మనకు నమ్మకం ఉండటం వల్లే దేశ యువత ప్రపంచంలోనే ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇది నిజం కావాలి. ప్రపంచానికి నైపుణ్యంతో కూడిన మానవ వనరుల అవసరం ఇవాళ ఎంతగానో ఉంది. తనకు తాను సిద్ధం చేసుకుని, భారత్ ఆ అవసరాలను తీర్చి, ప్రపంచంలో తనదైన ముద్ర వేయగలదు. అందువల్ల ప్రపంచానికి ఎలాంటి మానవ శక్తి కావాలి? వారికి ఎలాంటి మానవ వనరులు అవసరం? వంటి నైపుణ్య మ్యాపింగ్ జరుగుతోంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిపై మనం దృష్టి సారిస్తున్నాం. దీనిపై మనం ఎంత ఎక్కువ దృష్టి పెడితే, మన యువత ప్రపంచ వేదికపై అంతగా రాణించగలదు. భారత్‌కు చెందిన వ్యక్తి ఎక్కడికి వెళ్లినా మంచితనం, సాధనల వారసత్వ ముద్రను వేస్తారు. ఈ సామర్థ్యం మనలో అంతర్లీనంగా ఉంది. మనకంటే ముందు వెళ్లినవారు ఇప్పటికే ఈ ప్రతిష్టను నెలకొల్పారు. మీరు గమనిస్తే, ఇటీవల ఒకేసారి దాదాపు 150 నర్సింగ్ కళాశాలలను తెరవాలని నిర్ణయించుకున్నాం. నర్సింగ్కు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు, కుమారులు ఈ రంగంలో నూతన శిఖరాలను చేరుకోగలరు. సులభంగా ప్రపంచ స్థాయిలో తమదైన ముద్ర వేయగలరు. ప్రపంచమంతటికీ ఈ అవసరం ఉంది. ఈ అవసరాన్ని తీర్చడం మానవ జాతిగా మన బాధ్యత, ఈ విషయంలో మనం వెనకడుగు వేయం. దేశంలో వైద్య కళాశాలల విస్తృత అవసరాలను మనం తీర్చటమే కాక, ప్రపంచ అవసరాలకు కూడా సహాయపడగలం. ప్రతి చిన్న అంశంపైనా దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగటం ముఖ్యం. భవిష్యత్తు కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలను మనం ఆలస్యం చేయలేం. రాజకీయ లాభనష్టాలకు మనం బంధీలం కాకూడదు. దేశ ఆకాంక్షల కోసం కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండాలి. విజయవంతమైన సౌర విద్యుత్ ఉద్యమం భవిష్యత్ తరాలకు శక్తి స్వాతంత్య్ర హామీనిస్తోంది. మారుతున్న సాంకేతికతతో పర్యావరణ ఆందోళనలను పరిష్కరిస్తూ, పరిష్కారాలను 'మిషన్ హైడ్రోజన్' అందిస్తుంది. మన ప్రాణానికి గుండె ఎంత అవసరమో, సాంకేతికతకు చిప్‌లు కూడా అంతే అవసరం. ఇందుకోసం సెమీకండక్టర్ అత్యంత కీలకం. ఆ దిశగా మనం ముందుకు సాగాలి. ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో మన పురోగతిని ఆపగలిగే అడ్డంకులు లేకుండా చూసుకోవటానికి విస్తృతంగా కృషి చేస్తున్నాం. భవిష్యత్ తరాలపై శ్రద్ధతో 'జల్ జీవన్ మిషన్' ద్వారా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లు నిర్మించాలనుకున్నాం. నీటి కొరత కారణంగా మన పిల్లలు, వారి పిల్లలు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని ఆశిస్తున్నాం. పోటీతత్వంతో కూడిన శక్తితో ప్రపంచ మార్కెట్లో మన ఉనికిని చాటుకోవటానికి, లాజిస్టిక్ వ్యవస్థను చౌకగా, సమర్థవంతంగా మార్చటానికి అనేక విధానాలను రూపొందిస్తున్నాం. జ్ఞానంతో కూడిన ఆవిష్కరణల ఆధారిత భారతాన్ని నిర్మించటమే ప్రస్తుతమున్న డిమాండ్. ప్రపంచంలో ముందంజలో ఉండేందుకు మార్గమిది. అందుకే, జాతీయ విద్యా విధానంతో పాటు సాంకేతికతను ప్రోత్సహించటానికి పరిశోధన, ఆవిష్కరణల కోసం ఒక చట్టాన్ని ఆమోదించాం. చంద్రయాన్-3 విజయం తర్వాత సైన్స్ పట్ల యువత ఆకర్షితులవుతున్నారు. మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. పరిశోధన, ఆవిష్కరణల్లో యువతరానికి అవకాశాలను కల్పించాలి. ఈ వ్యవస్థను సృష్టించటానికి మనం ఒక ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేశాం.
గౌరవ మిత్రులారా,
మన తొలి ప్రాధాన్యత సామాజిక న్యాయం. సామాజిక న్యాయం, సమతుల్యత, సమానత్వం, సమభావం లేకుండా మన ఇళ్లలోనూ ఆశించిన ఫలితాలను సాధించలేం. అయినప్పటికీ సామాజిక న్యాయం గురించిన చర్చ చాలా పరిమితంగా ఉంది. మనం దీన్ని మరింత సమగ్రంగా చూడాలి. పేదలకు సౌకర్యాలు కల్పించటం, సమాజంలోని అణగారిన వర్గాలకు సహాయం అందించటం సామాజిక న్యాయ ప్రక్రియలే. నివాస ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించటం ఒక రకమైన సామాజిక న్యాయమే. పిల్లల కోసం సమీప ప్రాంతాల్లోనే పాఠశాలలను ప్రారంభించినప్పుడు సామాజిక న్యాయం బలపడుతుంది. అవసరమైనప్పుడు ఉచితంగా వైద్యం లభించినప్పుడే సామాజిక న్యాయం నిజంగా విజయం సాధిస్తుంది. సమాజంలో సామాజిక న్యాయం ఎంత అవసరమో, జాతీయ వ్యవస్థలోనూ సామాజిక న్యాయం అంతే అవసరం. దేశంలో ఏ ప్రాంతమైన వెనుకబడి ఉండటం, అభివృద్ధి చెందకుండా ఉండటం సామాజిక న్యాయానికి వ్యతిరేకం. మన దేశ తూర్పు ప్రాంతంలో వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ అక్కడి యువత ఇతర ప్రాంతాల్లో ఉపాధిని వెతుక్కోవటం దురదృష్టకరం. ఈ పరిస్థితిని మనం మార్చాలి. సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయటానికి, దేశంలో అభివృద్ధి చెందని తూర్పు ప్రాంతాలను శక్తిమంతం చేయాలి. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఒక్క వేలు పక్షవాతానికి గురైనా ఆ శరీరం అనారోగ్యంతో ఉన్నట్లే. దేశంలోని మిగిలిన ప్రాంతాలు సుసంపన్నంగా ఉన్నప్పటికీ ఒక్క భాగం బలహీనంగా ఉన్నా, అది దేశానికి బలహీనతలాగే పరిగణిస్తారు. అందుకే మనం సమగ్ర అభివృద్ధిని సాధించే దిశగా ముందుకు సాగాలి. అది భారతదేశానికి తూర్పు ప్రాంతమైనా, ఈశాన్య ప్రాంతమైనా అక్కడా అభివృద్ధి జరగాలి. 100 ఆకాంక్షాత్మక జిల్లాలపై దృష్టి సారించినప్పుడు ఈ వ్యూహం విజయవంతమైంది. అక్కడ యువ అధికారులను నియమించి, ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాం. ప్రపంచం ఇవాళ ఈ నమూనాపై చర్చిస్తోంది. ఒకప్పుడు ఈ 100 జిల్లాలు వెనుకబడినవిగా, పురోగతి లేకుండా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ 100 జిల్లాలు తమ రాష్ట్ర సగటులను అధిగమించి, ఆయా రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, సామాజిక న్యాయం అనే భావనను బలోపేతం చేస్తూ 100 జిల్లాలను దాటి, ప్రాథమిక స్థాయిలోని 500 ఆకాంక్షాత్మక విభాగాలను గుర్తించి, అభివృద్ధి చేయనున్నాం. ఈ ఆకాంక్షాత్మక విభాగాలు దేశ అభివృద్ధికి కొత్త నమూనాగా మారతాయని విశ్వసిస్తున్నాను. దేశ అభివృద్ధికి నూతన శక్తి కేంద్రాలుగా మారే సామర్థ్యం వాటికుంది. ఆ దిశగా మనం ముందుకు సాగుతున్నాం.
గౌరవ పార్లమెంటు సభ్యులారా,
ఇవాళ ప్రపంచ దృష్టి భారత్‌పై ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో తటస్థ దేశంగా భారత్ ఉండేది. మనం ఆ కాలం నుంచి చాలా దూరం ప్రయాణించాం. అవసరాలు, ప్రయోజనాలు కూడా మారిపోయాయి. ఇవాళ ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ సమయంలో తటస్థంగా ఉండటమే మంచిదేమో కానీ ఇవాళ మనం ఒక విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ విధానాన్ని గుర్తించేందుకు మనం 'విశ్వ మిత్రుడు (ప్రపంచ స్నేహితుడు)'గా ముందుకు సాగుతున్నాం. మనం అంతర్జాతీయంగా స్నేహాన్ని పెంచుకుంటున్నాం. భారత్‌తో స్నేహం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ప్రపంచానికి భారత్ దూరంగా కాకుండా, మరింత చేరువలో ఉన్నట్లనిపిస్తోంది. ఒక విశ్వ మిత్రుడిగా ప్రపంచంలో మన పాత్రను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ విధానం వల్ల భారతదేశానికి మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రపంచానికి స్థిరమైన సరఫరా వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తోంది. ప్రస్తుతం ఇది ఎంతో అవసరం. జీ-20లో దక్షిణ దేశాల స్వరంగా భారత్ మారుతుండటం గొప్ప విజయం. జీ-20 శిఖరాగ్ర సదస్సులో నాటిన ఈ బీజం, పెద్ద మర్రి వృక్షంగా మారటాన్ని రాబోయే తరాలు చూస్తాయి. భవిష్యత్ తరాలు శతాబ్దాల తరబడి ఆ మర్రి చెట్టు నీడన గర్వంగా కూర్చునే పరిస్థితి ఉంటుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.
జీవ ఇంధన కూటమి అనే నూతన కార్యక్రమాన్ని జీ-20లో ప్రారంభించాం. ఇందులో మనం ప్రపంచానికి నాయకత్వం వహిస్తూ, దిశానిర్దేశం చేస్తున్నాం. అంతర్జాతీయంగా స్నేహపూర్వక దేశాలన్నీ జీవ ఇంధన కూటమిలో సభ్యత్వం తీసుకుంటున్నాయి. భారత నాయకత్వంలో ఒక గొప్ప ఉద్యమం రూపుదిద్దుకోనుంది. చిన్న ఖండాలతోనూ ఆర్థిక కారిడార్ల నిర్మాణానికి మనం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం.
గౌరవ మిత్రులు, ఉప రాష్ట్రపతి, స్పీకర్,
ఇవాళ మనం కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్తున్నాం. అక్కడ మన సీట్లను స్వీకరిస్తాం. గణేశ్ చతుర్థి రోజున ఈ కార్యక్రమం జరగటం నిజంగా శుభసూచకం. ఈ సందర్భంగా మీ ఇద్దరికీ నా విజ్ఞప్తి, సూచనను తెలియజేస్తున్నాను. మీరిద్దరూ దీనిపై ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. నా విజ్ఞప్తి, నా సూచన ఏంటంటే, మనం కొత్త సభలోకి వెళ్తున్నాం కాబట్టి దాని గౌరవం ఎప్పుడూ తగ్గకూడదు. అలాగే దీన్ని 'పాత పార్లమెంట్' అని పిలిచి, అలాగే వదిలేయకూడదు. మీ అంగీకారంతో దీన్ని 'సంవిధాన్ సదన్' అని పిలవాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇలా, ఇది మన జీవితంలో ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచిపోతుంది. ఒకప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో కూర్చున్న గొప్ప వ్యక్తులు, అప్పటి విశిష్ట మహనీయుల జ్ఞాపకాలు 'సంవిధాన్ సదన్' పిలుపుతో ముడిపడి ఉంటాయి. అందువల్ల భవిష్యత్ తరాలకు ఈ బహుమతిని అందించే అవకాశాన్ని మనం వదులుకోకూడదు.
ఈ పవిత్ర భూమికి మరోసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేసిన కఠోర కృషి, ప్రజల సంక్షేమానికి చేసిన సంకల్పాలు, వాటిని నెరవేర్చటానికి ఏడు దశాబ్దాలకు పైగా జరిగిన ప్రయత్నాలకు వందనం చేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నూతన భవనంలోకి వెళ్తున్న అందరికీ అభినందనలు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2201208)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam