రైల్వే మంత్రిత్వ శాఖ
తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన శ్రీ వీ సోమన్న
ఈ కొత్త రైలు ఆధ్యాత్మిక పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలు, ప్రాంతీయాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది
ప్రాంతాలను, సంస్కృతులను అనుసంధానిస్తూ.. దేశానికి జీవనాడిగా భారతీయ రైల్వేలు పనిచేస్తున్నాయి: వీ సోమన్న
प्रविष्टि तिथि:
09 DEC 2025 1:57PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని రైల్ భవన్ నుంచి తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వీ సోమన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు ప్రారంభించారు.
తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంతో నాలుగు రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో రైలు సౌకర్యం గణనీయంగా మెరుగుపడి, దూర ప్రాంతాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతం నుంచి షిర్డీ చేరుకొనేలా భక్తుల కోసం ప్రారంభించిన మొదటి రైలు. భారత్లో రెండు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలైన తిరుపతి, షిర్డీలను నేరుగా అనుసంధానించడం ద్వారా భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచింది.
ఈ కొత్త రైలు.. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందిస్తుందని, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని, ప్రాంతీయాభివృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. అదనంగా ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఎలాంటి అవరోధాలు లేని అంతరాష్ట్ర ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. అలాగే భక్తులకు యాత్రానుభవాన్ని మెరుగుపరుస్తుంది. వారానికోసారి నడిచే ఈ రైలు ఇరువైపులా దాదాపు 30 గంటల ప్రయాణించి.. భక్తులకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుంది.
తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవడం నాలుగు రాష్ట్రాల భక్తులకు చరిత్రాత్మక రోజని శ్రీ వీ సోమన్న అన్నారు. భారతీయ రైల్వేలు రవాణా మాధ్యమంగా మాత్రమే తన పరిధిని పరిమితం చేసుకోలేదని, ప్రాంతాలను, సంస్కృతులను అనుసంధానిస్తూ.. దేశానికి జీవనాడిగా పనిచేస్తున్నాయని తెలియజేశారు.
తిరుపతి, షిర్డీ లను నేరుగా అనుసంధానించే ఈ రైలు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్ సహా 31 ముఖ్యమైన స్టాపుల్లో ఆగుతుందని శ్రీ వీ సోమన్న తెలిపారు. ఈ మార్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని, రవాణా సదుపాయాన్ని, ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, సికింద్రాబాద్కు నేరుగా ప్రయాణ సౌకర్యాన్ని ఈ రైలు అందిస్తుంది. వీటితో పాటుగా, ప్రముఖ శైవ క్షేత్రం పర్లి వైజనాథ్‌ను కూడా కలుపుతుంది.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని కేంద్ర మంత్రి అన్నారు. 2009 -14 మధ్య కాలంలో ఏపీ, తెలంగాణల సరాసరి రైలు బడ్జెట్ రూ.886 కోట్లు ఉండగా, 2025-26 నాటికి రూ. 9,417 కోట్లకు అంటే పదకొండు రెట్లు పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల విలువ రూ. 93,000 కోట్లకు పైగా ఉంది. 2014 నుంచి, 100 శాతం విద్యుద్దీకరణ పూర్తయిన 1,580 కి.మీ.ల రైల్వే ట్రాకులను ఆంధ్రప్రదేశ్ జోడించింది. ఈ రాష్ట్రంలో 73 అమృత్ స్టేషన్లు (రూ.3,125 కోట్లు) ఉన్నాయి. 800 ఫ్లైఓవర్లను, బ్రిడ్జిలను నిర్మించామని, 110 లిఫ్టులు, 40 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వీటితో పాటుగా 16 వందే భారత్ (8 జతలు), 6 అమృత్ భారత్ (3 జతలు) రైలు సర్వీసులను ప్రారంభించామని వెల్లడించారు.
తిరుపతిలో రూ. 312 కోట్ల విలువైన అమృత్ స్టేషన్‌తో సహా వివిధ ప్రాజెక్టులను భారతీయ రైల్వే చేపడుతోందని వీ సోమన్న వెల్లడించారు. పనులు జరుగుతున్న ప్రాజెక్టుల్లో రూ.1,215 కోట్ల విలువైన 105 కి.మీ.ల తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్, రూ. 875 కోట్ల వ్యయంతో 83 కి.మీ.ల గూడూరు-రేణిగుంట మూడో లైను, రూ.5,900 కోట్ల వ్యయంతో 310 కి.మీ.ల నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైను ఉన్నాయి. అదనంగా రూ. 6,235 కోట్ల ఖర్చయ్యే 287 కి.మీ.ల విజయవాడ-గూడూరు మూడో లైను, రూ. 490 కోట్ల విలువైన 25 కి.మీ.ల ఏర్పేడు-పూడి బైపాస్ లైన్ పనులు కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మద్దిల గురుమూర్తి, శాసనమండలి సభ్యుడు శ్రీ బీ కల్యాణ చక్రవర్తి, తిరుపతి శాసనసభ సభ్యులు శ్రీ ఏ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాశ్ రెడ్డి, ఇతర అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2201194)
आगंतुक पटल : 10