|
శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘ఐఐఎస్‌ఎఫ్-2025’లో ఏఐ చోదిత వికసిత భారత్ దిశగా ప్రధానమంత్రి దార్శనికతపై పరిశ్రమ అగ్రగాముల ప్రశంసలు
· ‘ఏఐ-ఏజీఐ’పై చర్చలో వికసిత భారత్-2047 దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతపై పలుమార్లు ప్రస్తావన · ‘ఐఐఎస్‌ఎఫ్-2025’లో ‘ఏఐ-ఏజీఐ’పై బృంద గోష్ఠి సందర్భంగా భవిష్యత్తులో మానవ-యంత్ర సహకారంపై నిపుణుల సమగ్ర విశ్లేషణ
प्रविष्टि तिथि:
08 DEC 2025 5:10PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో డిసెంబరు 6న ప్రారంభమైన ‘భారత అంతర్జాతీయ విజ్ఞానోత్సవం-2025’ (ఐఐఎస్‌ఎఫ్) ఈ ఏడాది నిర్వహించిన అత్యంత ప్రభావశీల విజ్ఞానోత్సవాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మేరకు వికసిత భారత్-2047 దిశగా దేశం కృషిని బలోపేతం చేయడంపై ఇది యువ మేధకు స్ఫూర్తినిచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ 3వ రోజు కార్యక్రమాల్లో భాగంగా “కృత్రిమ మేధ-సార్వజనీన కృత్రిమ మేధ: భవిష్యత్ మేధా శక్తి” ఇతివృత్తంగా ఉన్నతస్థాయి బృంద గోష్ఠి సాగింది. విద్యా, పారిశ్రామిక, పరిశోధన రంగాల నుంచి ప్రముఖులను ఇది ఒకే వేదికపైకి చేర్చింది. కృత్రిమ మేధ నుంచి సార్వజనీన కృత్రిమ మేధ వైపు పరిణామం శాస్త్రవిజ్ఞానం-ఆవిష్కరణలు-మానవాళి భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంపై గోష్ఠిలో నిపుణులు ప్రధానంగా చర్చించారు.
ఈ గోష్ఠిలో ఐఐటీ-రోపార్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజీవ్ ఆహుజా, ఇంటెల్ డేటా సెంటర్ కస్టమర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ గోపాల్ కృష్ణ భట్, ఎన్‌విడియా హెచ్‌పీసీ-ఏఐ స్ట్రాటజిక్ బిజినెస్ హెడ్ వివేక్ కుమార్ రాయ్, సర్వం ఏఐ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ వంటి ప్రముఖులు కీలక వక్తలుగా పాల్గొన్నారు.
వికసిత భారత్‌పై ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఏఐ మిషన్
ఐఐటీ-రోపార్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజీవ్ ఆహుజా మొదట పాఠశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. యువతరం ప్రతిభ, సుసంపన్న దేశీయ సమాచార వ్యవస్థ అండగా 2035 కల్లా ప్రపంచ ఏఐ అగ్రగామిగా రూపొందడానికి భారత్ సిద్ధమవుతోందని చెప్పారు. ప్రధానమంత్రి ప్రకటించిన ‘ఇండియా ఏఐ మిషన్’ దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ‘ఏఐ’లో శిక్షణ ఇవ్వడానికి వీలుగా రూపొందిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం జాతీయ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ ఏఐ నమూనాల రూపకల్పనతోపాటు బాధ్యతాయుత-నైతిక కృత్రిమ మేధను ప్రోత్సహిస్తుందని ఆయన వివరించారు.
డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్ సిటీలు, అగ్రిటెక్ తదితర ప్రాధాన్య రంగాల్లో ఏఐ సాంకేతికతల అమలుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమం అమలు చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా దేశంలోని మూడు జాతీయ రంగాల ఏఐ కేంద్రాలు వ్యవసాయంపై దృష్టి సారిస్తాయని, వీటిలో ఒక కేంద్రాన్ని ఐఐటీ-రోపార్ నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు.
మానవశక్తి, డేటా, శాస్త్ర విజ్ఞానాసక్తిలో భారత్ సామర్థ్యమే దేశాన్ని సెమీకండక్టర్ తయారీకి ప్రపంచ కూడలిగా మార్చగలదని ప్రొఫెసర్ ఆహుజా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నిర్దేశిత సాంకేతిక స్వావలంబన, వికసిత భారత్ దార్శనికతకు ఇది మూల స్తంభమని తెలిపారు.
భారత్లో ‘డీప్-టెక్’ సామర్థ్యం ఇనుమడిస్తోంది: పారిశ్రామికవేత్తలు
ఇంటెల్ డేటా సెంటర్ కస్టమర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ గోపాల్ కృష్ణ భట్ ప్రసంగిస్తూ- సర్వర్ డిజైన్, చిప్ల రూపకల్పన, హైపెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ హార్డ్ వేర్‌లో భారత్ వేగంగా పురోగమిస్తున్న తీరును వివరించారు. చిప్ దిగుమతి పరాధీనత స్థాయి నుంచి స్వదేశీ సిస్టమ్ డిజైన్-తయారీ స్థాయికి చేరుతున్న తీరును వివరిస్తూ- ‘రుద్ర’ సర్వర్ ప్లాట్‌ఫామ్‌లో సిడాక్‌తో ఇంటెల్ భాగస్వామ్యం వంటి భాగస్వామ్యాలను ఆయన ఉదాహరించారు.
డజన్ల కొద్దీ దేశీయ సర్వర్, డేటా-సెంటర్ హార్డ్ వేర్ డిజైన్లు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ సెమీకండక్టర్, డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా లభించిన ప్రోత్సాహం సృష్టించిన వేగాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. ఆవిష్కరణకు పునాది ఉత్సుకతేనని స్పష్టం చేస్తూ- శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచుకోవాల్సిందిగా విద్యార్థులకు ఉద్బోధించారు.
విజ్ఞాన శాస్త్ర.. సామాజిక రంగాల్లో ఏఐ వినియోగాన్ని ప్రదర్శించిన ఎన్‌విడియా
ఎన్‌విడియా హెచ్‌పీసీ-ఏఐ స్ట్రాటజిక్ బిజినెస్ హెడ్ వివేక్ కుమార్ రాయ్ మాట్లాడుతూ- ఔషధ రూపకల్పన, వాతావరణ మోడలింగ్, మెటీరియల్ సైన్స్, ఆటోమోటివ్ డిజైన్ సహా శాస్త్రీయ ఆవిష్కరణలు ‘ఏఐ’తో ఎలా రూపాంతరం చెందుతున్నాయో స్పష్టం చేశారు.
వాతావరణ అంచనాల నుంచి సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల దాకా జాతీయ మిషన్లను జీపీయూ ఆధారిత కంప్యూటింగ్ వేగవంతం చేసే తీరును కూడా ఆయన వివరించారు. కాగా, దీనికి సంబంధించి భారత పరిశోధన సంస్థలు, మంత్రిత్వ శాఖలతో సన్నిహితంగా ఎన్‌విడియా సంస్థ కృషి చేస్తోంది.
‘ప్రతి పౌరుడికీ ప్రయోజనం చేకూర్చే ప్రజాస్వామిక శక్తిగా సాంకేతికత’పై ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఏఐ నేడు భాషాపరమైన అవరోధాలను అధిగమించి, వైవిధ్యభరిత దేశ జనాభాకు మద్దతిస్తోందని ఆయన వివరించారు.
డిజిటల్ సార్వజనీనతకు కేంద్రకంగా భారతీయ భాషా ఏఐ
‘సర్వం ఏఐ’ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ తన ప్రసంగంలో భాగంగా- ఇండియా ఏఐ మిషన్ కింద రూపొందుతున్న బహుభాషా ఏఐ వ్యవస్థలను ప్రదర్శించారు. ఇందులో ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో భారతీయ భాషల కోసం ఎంపిక చేసిన తొలి భారత ప్రాథమిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‌ఎల్‌ఎం) కూడా ఉంది.
వ్యవసాయం, ఆర్థిక శాస్త్రం, వాతావరణ వ్యవస్థ సంబంధిత అనువర్తనాలు సహా శాస్త్రీయ విశ్లేషణ, నిర్ణయాత్మకత, ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో ఏఐ పాత్రను చర్చాగోష్ఠి ఇతివృత్తం “విజ్ఞానంతో సత్ఫలితం”తో సంధానిస్తూ వివరణ ఇచ్చారు.
నేడు ప్రతి వృత్తిలో ఏఐ అంతర్భాగంగా మారుతోందని ఆయన చెప్పారు. అందరికీ సౌభాగ్యం దిశగా భారత-కేంద్రీకృత డేటా, నమూనాలు, భాషా సాంకేతికతల అవసరాన్ని స్పష్టం చేశారు. ఇది సమ్మిళిత వృద్ధి, సాంకేతికత చోదిత అభివృద్ధిపై ప్రధానమంత్రి దృక్కోణాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
ఏఐ.. ఏజీఐ - ఉజ్వల భవిత: బృంద గోష్ఠి
కీలక వక్తల ప్రసంగాల తర్వాత జేవియర్ కురియన్ (నీసా), గణేష్ గోపాలన్ (జ్ఞాని.ఏఐ), డాక్టర్ మనీష్ మోదాని (ఎన్‌విడియా)ల బృందగోష్ఠి ఆసక్తికరంగా సాగింది. భారత్‌లో ఎంటర్‌ప్రైజ్ ఏఐ అనుసరణ నేడు ప్రయోగానికన్నా అవసరంగా మారిందని జేవియర్ కురియన్ వ్యాఖ్యానించారు. అలాగే బీఎఫ్‌ఎస్‌ఐ, తయారీ, ఆరోగ్య సంరక్షణ, పౌర సేవలలో ఏఐ ఆధారిత సాంకేతికతల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఆవిష్కరణ చోదిత ఆలోచనల ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా ‘ఇండియా ఏఐ మిషన్’ ద్వారా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రశంసించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వ సరైన మార్గంలో పయనిస్తున్నదని గణేష్ గోపాలన్ పేర్కొన్నారు. ఈ మేరకు వికసిత భారత్ రూపకల్పనలో ‘ఏఐ’ని జాతీయ వైవిధ్య సాంకేతికతగా అభివర్ణించారు. ‘ఇండియాఏఐ మిషన్’ కింద స్వతంత్ర డేటాసెట్‌లు, ఫౌండేషన్ మోడళ్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లు, జ్ఞాని.ఏఐ వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్త విశిష్ట భారతీయ నమూనాల రూపకల్పనకు వీలు కల్పిస్తున్న తీరును ఆయన వివరించారు. ప్రభుత్వ విభాగాలు ఎన్నడూలేని స్థాయిలో ‘ఏఐ’ని అనుసరిస్తున్నాయని, స్వయంచలిత బహుభాషా గళ వ్యవస్థ నిత్యం బిలియన్ల కొద్దీ టోకెన్లను నిర్వహిస్తున్నదని చెపపారు. మొత్తం మీద ఏఐ విస్తరణలో భారత్ నేడు అనేక అభివృద్ధి చెందిన దేశాలకన్నా ముందంజ వేసిందని చెప్పారు.
దేశంలో వేగంగా విస్తరిస్తున్న హెచ్‌పీసీ, జీపీయూ ఆధారిత మౌలిక సదుపాయాలు, వాతావరణ మోడలింగ్ నుంచి భాషా సాంకేతికతల వరకు ఆయా రంగాల్లో పరిశోధన ఫలితాలను ద్విగుణీకృతం చేస్తున్నాయని డాక్టర్ మనీష్ మోదానీ వివరించారు. ‘ఏఐ’ నుంచి ‘ఏజీఐ’ వైపు ప్రపంచ పరిణామానికి మార్గనిర్దేశం చేయడంలో భారత డేటా స్థాయి, భాషా వైవిధ్యం, శాస్త్ర విజ్ఞాన ప్రతిభ మన దేశాన్ని అగ్ర స్థానాన నిలుపుతాయని ఆయన అన్నారు.
నేటి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అన్ని చర్చా గోష్ఠులలో గౌరవనీయ ప్రధానమంత్రి నాయకత్వాన ప్రభుత్వం వైపు నుంచి విధానపరంగా లభిస్తున్న బలమైన మద్దతును వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికితోడు దేశ యువజన బలం ‘ఏఐ-ఏజీఐ’లలో భారత్‌ను ప్రపంచ అగ్రస్థానం వైపు నిర్ణయాత్మక పథాన నడిపిస్తుందని పలుమార్లు స్పష్టం చేశారు.
చివరగా- ఏఐ ఉపకరణాల వినియోగం ప్రారంభించాలని, డీప్ టెక్ సాంకేతికతలను అనుసరించాలని, అంతేకాకుండా దేశం 2047 నాటికి శాస్త్రజ్ఞానం, ఆవిష్కరణల చోదిత వికసిత భారత్‌గా రూపొందాలనే సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో తమ వంతు పాత్ర పోషించాలని విద్యార్థులకు ఉద్బోధించారు.
***
(रिलीज़ आईडी: 2200654)
|